నాట్య మయూరి ,దేశంకోసం ప్రాణత్యాగం చేసిన లకుమాదేవి – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాస పత్రిక -ఏప్రిల్

నాట్య మయూరి ,దేశంకోసం ప్రాణత్యాగం చేసిన లకుమాదేవి – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాస పత్రిక -ఏప్రిల్

క్రీశ .1383-1400 వరకు కొండ వీడు రాజధానిగా పాలించిన కుమార గిరి రెడ్డి విద్యావంతుడు విద్యాప్రియుడు ,భోగి కనుక ప్రతి సంవత్సర౦ వసంతోత్సవం భారీగా జరుపుతూ ‘’వసంతరాజు ‘’అనే సార్ధక నామ ధేయుడయ్యాడు .అతనికి నాట్యం ప్రాణం .సంస్కృతంలో ‘’వసంత రాజీవం ‘’అనే నాట్య శాస్త్ర గ్రంథం రాశాడు .తన ఆస్థానంలో నాట్యాంగనలకు స్థానం కల్పించి నిత్యం నాట్య వినోదం కల్పించేవాడు ..వారిలో ముఖ్యమైన నాట్య మయూరి లకుమాదేవి .ఆమెఅభినయ చాతుర్యం బాగా ప్రసిద్ధి చెంది లకుమ అంటే కుమారగిరికి వల్లమాలిన అభిమానం ఏర్పడింది .ఆంద్ర నాట్యా౦గనలలో లకుమ తలమానికం .ఆమె నాట్యానికి ప్రభువు మెచ్చి విశేషంగా ధనం, ఆభరణాలు కానుకగా అందించేవాడు .ఆమె వాటిని తన స్వంతం కోసం వాడుకోకుండా ఉదారంగా పేదప్రజల సంక్షేమం కోసం వినియోగించేది .లకుమ బాపట్ల వేణుగోపాలస్వామి దేవదాసి పల్లెమ కుమార్తె . అందాలరాణి, చక్కదనాల చుక్క, అపర నాట్య సరస్వతి, కుమారగిరి ఆస్థానంలో కవి, గాయక, శిల్పి., సామంతాదిమహాజనుల సమక్షంలో తన అభినయచాతుర్యంతో, అందచందాలతో అందర్నీ ముగ్దుల్ని చేస్తూ, ఆస్థానానికి ఒక నూతన శోభను చేకూరుస్తూ వుండేది. రాజ్యంలో శాంతి భద్రతల్ని నెలకొల్పిన కాటయ వేముని బావమరిది అయిన కుమారి గిరి రెడ్డి పరిపాలనా బాధ్యతల్నీ కాటయవేమనకు అప్పచెప్పి తాను మాత్రం వసంతోత్సవాల తోను, కవులతోనూ, కళాకారులతోను, నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా కొండ వీటి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు

కుమారగిరి ప్రధాని, బావ మరది కాటయ వేమారెడ్డి కాళిదాసు శాకు౦తల నాటకానికి వ్యాఖ్యానం రాశాడు .అందులోమొదట్లోనే లకుమాదేవి వైదుష్యాన్ని ,,ఔదార్యాన్ని వర్ణిస్తూ ఇలా రాశాడు – ‘’జయతి మహిమా లోకాతీతః కుమారగిరిప్రభొ-స్సదసి లకుమా దేవి యస్య శ్రియా సదృశీ ప్రియా –నవమభినయం ,నాట్యార్ధానాం తనోతి సహస్రధా –వితరతి బహూనర్ధా నర్ధి ప్రజాయ సహశ్రయః ‘’లకుమాదేవి త్యాగాన్ని గురించి ఒక కథ ప్రచారంలో ఉంది .లకుమ నాట్యాన్ని మొదటి సారి చూసిన రాజు ఆమె అందచందాలకు నాట్యకౌశలానికి ప్రభావితుడై ఆమె ఆకర్షణలో పడిపోయాడు .మనసంతా ఆమె నిండిపోయి అన్యమనస్కంగా శయన మందిరం చేరాడు .రాజు ముభావంగా ఉండటం ఎప్పుడూ చూడని రాణి కారణం అడిగింది .అతడు జరిగిన విషయం చెప్పగా ‘’ఇందులో బాధ పడటానికే ముంది ప్రభూ !లకుమాదేవిని ఆస్థాన నాట్య కత్తేగా నియమించి ,నాట్య మందిరంలో ఉండేట్లు ఏర్పాట్లు చేయండి ‘’అని విన్న వించింది .రాజు ముఖం వికసించి ఆమె చెప్పినట్లే ఏర్పాటు చేశాడు .

లకుమ అందానికి ,నాట్యానికి బానిస అయిపోయిన రాజు ,ఆ నాట్య మందిరమలోనే ,ఆమెతోనే ఉండిపోవటం మొదలుపెట్టాడు. రాణీ సంగతి ,పిల్లల సంగతి రాజ్య పరిపాలన సంగతి పట్టించుకోలేదు . .ఖుషీ విలాసాలలో ఇరవై నాలుగు గంటలు గడుపుతున్నాడు .మంత్రులు నెత్తీ నోరూ మొత్తుకొన్నా పెడ చెవిన పెట్టాడు .మధువు మగువ నాట్యమే అతడి సర్వస్వం అయిపొయింది .రాజుకుతనమీద అభిమానం ఉండట౦ చాలా ఆనందం కలిగిస్తున్నా ,లకుమాదేవికి రాజు రాజకార్యాలు మానేయటం భార్యాపిల్లల్ని పట్టించుకోకుండా ఉండటం విపరీతంగా బాధ కల్గించాయి. చాలా సార్లు చెప్పి చూసింది ప్రయోజనం లేక పోయింది .

రాజు ప్రజాపాలన పట్టించుకోక పోవటం తో అధికారులు బాధ్యత లేకుండా లంచ గొండులై ప్రజలను పీడిస్తున్నారు .ప్రజా పాలన కుంటు పడింది ప్రజా సంక్షేమం ఎవరికీ పట్ట.కుండా పోయింది .ప్రజల ఆలనా పాలనా పట్టించుకొనే నాధుడే లేకపోయాడు .దొంగతనాలు అరాచకాలు పెరిగిపోయాయి .న్యాయ వ్యవస్థ దెబ్బతిన్నది.కరువుకాటకాలతో ప్రజలు మలమల మాడిపోతున్నారు .రక్షణ వ్యవస్థ గాడి తప్పింది .తాగు సాగు నీరే కరువైపోయింది . దీనితో శత్రురాజులు అదే అదనుగా రాజ్యంపై దండెత్తే పన్నాగాలు ఎక్కువ చేస్తున్నారు .రాజ్యంలోని అల్లకల్లోల పరిస్థితిని మంత్రి మహారాణికి విన్నవించాడు .రాజు పాలన పై దృష్టిపెట్టకపోతే దేశం అల్లకల్లోలమై రాజ్యం కోల్పోయే పరిస్థితి వస్తుందని హితవు చెప్పాడు .ఇక లాభం లేదని కార్యరంగం లోకి దిగింది రాణి .తాను ఆనాడు రాజుకు ఇచ్చిన సలహా ఇంతగా విపరీత ప్రభావం చూపినందుకు కుమిలిపోయింది .రాజు తనను ,పిల్లల్ని పట్టించుకోకపోయినా ఫరవాలేదు ప్రజల్ని ,రాజ్యాన్ని పట్టించుకోకపోవటం ఆమెను సవిచలితురాల్ని చేసింది .మళ్ళీ తానె పూనుకోవాలి అనుకొన్నది .

మర్నాటి రాత్రి శాలువా కప్పుకొని రాజ దర్శనం కోసం నాట్య మందిరానికి వెళ్ళింది .అక్కడ రాజు గానాపీనా మజానా లో లకుమ సమక్షం లో మునిగి ఉన్నాడు..ఆ స్థితిలో అతడు ఏమి చెప్పినా వినిపించుకోడు అని గ్రహించి లకుమతో వొంటరిగా మాట్లాడాలని ,రాజుకు నిద్రాభంగంకాకుండా లకుమను బయటికి తీసుకురమ్మని చెలికత్తేకు చెప్పింది.లకుమ వచ్చింది .రాణిని చూసి ఆశ్చర్యపోయిన లకుమ నమస్కరించగా రాణి “”అమ్మా ! నాకు చెల్లెలిలాంటి దానవు .రాజు నీతో గడపటం నాకేమీ బాధగా లేదు .రాజ్యాన్ని ప్రజల్ని పరిపాలనను అశ్రద్ధ చేస్తున్నారనే నా బాధ .ఇలా పరిస్థితులు కొనసాగితే రాజ్యం మనకు దక్కదు చెల్లీ.నీ సాంగత్యం లో ఉన్నంత కాలం రాజు రాజ్యాన్ని పట్టించుకోరు .కనుక రాజ్యక్షేమం కోసం నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవటం శ్రేయస్కరం ‘’‘’అన్నది .కళ్ళనిండా నీరుకారుతున్న లకుమ ‘’అమ్మా !మీరు నన్ను చెల్లీ అనటం నాకు దక్కిన గొప్ప అదృష్టం .రాజుగారికి అనేక సార్లు రాజ్యపాలన పైదృష్టిపెట్టమని చెప్పాను. నా మాట వినడం లేదమ్మా .నాకు నా సౌఖ్యం కన్నా ప్రజా సంక్షేమమే ముఖ్యం .నేను ఇప్పుడే ఈ రాజ్యం నుంచి వెళ్ళిపోతాను ‘’అన్నది లకుమను ఆప్యాయంగా కౌగలించుకొని రాణి ‘’నీకు తగిన ఏర్పాటు చేస్తాను నీ క్షేమం నాకు ముఖ్యం చెల్లీ ‘’అన్నది భారం తగ్గిన మనసుతో రాణి వెళ్ళిపోయింది .

లకుమ తన మందిరం లోకి వెళ్లి మౌనంగా రోదించింది .తనకు దేవుడుఎందుకు అందం నాట్యం ఇచ్చాడు అనీ, రాజు అంతగా ఎందుకు వీటికి ఆకర్షితుడు అయ్యాడు అనీ ఏడ్చింది .తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆమెకు ఒక ఆలోచన వచ్చి తలారా స్నానం చేసి తెల్లచీర కట్టుకొని ,ని౦డుముత్తైదువుగా అలంకరించుకొని ,రాజుకు ఒక ఉత్తరం రాసిపెట్టి ఒకబాకును చేతితో పట్టుకొని ఉంది. రాజు నిద్రలేచి ఆమె అన్యమనస్కంగా ఉండటానికి కారణం అడిగితె ,ఉబికి వస్తున్న కన్నీటితో తృప్తిగా నాట్యం చేసి రాజును ఆనందం లో తేల్చి బాకుతో పొడుచు కోగా, రక్తం ఎగ జిమ్మగా రాజు మత్తు వదిలి లకుమను అప్యాయంగా ఒడిలోకి తీసుకొని రోదిస్తుంటే ‘’రాజా !ప్రజాను రంజకంగా పాలించండి.వ్యక్తిక్షేమం కంటే రాజ్యక్షేమం ముఖ్యం . .నాగుర్తుగా కర్పూర సుగంధాన్నిరోజూ ధరించండి ‘’అని చెప్పి ఆనాట్యమయూరి ,త్యాగమయి లకుమాదేవి కుమారగిరిరాజు ఒడిలో ప్రాణాలు వదిలింది. ఆమె రాసిన లేఖ చదివి ,తాను ప్రజాపాలన అశ్రద్ధ చేసినందుకు బాధపడి కర్తవ్యోన్ముఖుడయ్యాడు. రాణి వచ్చి లకుమ త్యాగానికి నివ్వెరపోయి,ఆమె త్యాగాన్ని ప్రశంసించింది . ఇద్దరు లకుమకు ఘన నివాళి అర్పించారు .లకుమ త్యాగం ప్రజలకు తెలిసి తమ హృదయాలలో ఆమెను పదిలంగా భద్ర పరచుకొన్నారు .రాజుతోపాటు రాణీ కూడా నిత్యం కర్పూర సుగంధాన్ని ధరించేది .వీధులలో కర్పూరం వెద జల్లెవారు .అప్పటినుంచి కమారగిరి ప్రభువును ‘’కర్పూర వసంత రాయలు ‘’అని ప్రజలు ఆప్యాయంగా పిలిచేవారు .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.