మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు -405

మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు -405

405-సినిమా పిచ్చితో గడిపి ,ట్రీట్ మెంట్ ప్రాధాన్యమున్న ‘’మాసంతా నువ్వే ‘’మనసుమాట వినదు’’,రెయిన్బో సినీ దర్శక నిర్మాత –వి .ఎన్ .ఆదిత్య

వి. ఎన్. ఆదిత్య ఒక తెలుగు సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత. ఇతడు పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించాడు.[1

నేపథ్యము

1972 ఏప్రిల్ 30న ఏలూరులో జన్మించాడు. ఇతడి చిన్నతనంలో వీరి నాన్నగారి ఉద్యోగరీత్యా చాలా వూళ్ళు తిరిగారు, నాన్నగారు స్టేట్ బాంక్ లో పనిచేసే వారు. ఇతడికి చాలా కాలం తెలీనిదీ, ఇతడు సినిమా రంగంలోకి వచ్చాకనే తెలిసిందీ ఏమిటంటే.. ఇతడి నాన్న గారికి ఆయన చిన్నతనంలోనే ఆదుర్తి సుబ్బారావు గారి వద్ద అసిస్టెంటుగా పనిచేసే అవకాశం వచ్చిందనీ, కానీ వీరి తాత గారు ఒప్పుకోకపోవడం వల్ల ఆయన సినిమా రంగానికి వెళ్ళలేక పోయారనీ! అలానే ఇతడి అమ్మ వాళ్ళు భీమవరంలో ఉండగా, సింగీతం శ్రీనివాసరావు గారి మరదలు (ఆయన భార్య చెల్లెలు) గారింట్లో అద్దెకి వుండేవారట. వాళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్ అట. అలానే సింగీతం గారి పెళ్ళికూడా భీమవరంలోనే జరిగిందట. అంటే ఇతడు పుట్టకముందే అమ్మకీ నాన్నకీ కొద్లో గొప్పో సినిమా రంగానికి చెందిన వాళ్ళతో పరిచయాలున్నాయన్న మాట. మరి ఇతడికి తెలీకుండానే ఆ ఆసక్తి చిన్నతనం నుంచీ కలిగిందేమో చెప్పలేడు కానీ బాగా బాల్యం నుంచే సినిమాలంటే విపరీతమైన ఆసక్తి వుండేది.

అప్పట్లో అంటే 1980 దశకం మొదట్లో సినిమా తప్ప వేరే వినోద సాధనమేమీ ఉండేది కాదు. సాయంకాలం ఆరు దాటిందంటే సినిమా చూడడం ఒక్కటే పెద్ద వినోద కార్యక్రమం. చిన్నప్పటినుంచే సినిమాలు విపరీతంగా చూసే వాడు. నాన్న గారు బేంకు ఆఫీసర్ అవడం మూలాన, ఏ ఊరు వెళ్ళినా సినిమా హాలు వాళ్ళకి లోను ఇవ్వడం మూలానో, మరే విధంగానో వాళ్ళతో మంచి పరిచయాలుండేవి. ఇంక వీరికి సినిమా చూడడం అతి సులభమయ్యేది. ఒకే థియేటర్లో ప్రతి రోజూ అదే అటని అదే సీటులో కూర్చుని చూసిన సంఘటనలు కోకొల్లలు. జంగారెడ్డి గూడెం అనే వూళ్ళో ఐతే వరుసగా 18 రోజులు లవకుశసినిమాని, ప్రతిరోజూ మొదటి ఆటని ఒకే సీటులో కూర్చొని చూశాడు, దానికి వరుసనే అల్లుడు పట్టిన భరతం మరో 4 రోజులు. మొత్తం 22 రోజులు వరుసగా ప్రతి ఫస్ట్ షోకీ ఆ హాలు దగ్గరే వున్నాడన్నమాట. అమ్మ ఏదైనా పనిమీద వూరెళ్లే ఇంక నాన్న గారు వీరిని (ఇతడూ, అన్నయ్యలిద్దరూ) హేండిల్ చెయ్యలేక సినిమా హాలుకి తీసుకెళ్ళి కూర్చో బెట్టేవారు.

ఇలా సినిమాలు చూసీ, చూసీ సినిమాలు తప్ప మరో ప్రపంచం వున్నట్లు తెలిసేది కాదు. పోలిక చెప్పాలంటే ఆటలో చిన్నప్పటి సిద్దార్థ కేరక్టరే ఇతడిది. నోరు తెరిస్తే సినిమా మాటలు, కూని రాగం తీస్తే సినిమా పాటలు.ఏడవ తరగతిలో ఉండగా నాగభూషణం గారనే మాస్టారి వద్ద ట్యూషన్ చదువుతుండేవాడు. ఆయనే వీరి స్కూల్లో మాస్టారు కూడా. సాధారణంగా స్కూలు మాస్టారి వద్దనే ట్యూషన్ కూడా చదివితే కాస్త చనువుగా ఉంటారు కదా. ఒకసారి లెక్కలు ట్యూషన్ క్లాసులో, మధ్యలో ఖాళీ వస్తే, నోట్ బుక్ లో ఒక బొమ్మగీశాడు. అమ్మా, నాన్నా పేరు పెట్టి అటూ ఇటూ పార్వతీ పరమేశ్వరుల బొమ్మలు గీసి, కింద పూలూ, కొబ్బరిచిప్పలూ, పండు.వెండితెరా.గీసి ఒక బేనర్ లాగా గీశాడు. మేస్టారు చూసి ఇదేమిట్రా అంటే ఇది నా సినిమా బేనర్ మాస్టారు.. అన్నాడు. సినిమాలంటే అంత పిచ్చి ఏమిట్రా..ఏం చేస్తావు సినిమాల్లోకి వెళ్ళీ?’ అన్నారు. ఏమిటేమిటి సార్.సినిమా తీస్తాను. అన్నాడు రెట్టిస్తూ, సినిమా తీయడమంటే ఏమిట్రా అంటే.. అదే మాస్టారు..సినిమా తియ్యడమంటే తీసెయ్యడమే. అన్నాడు. ఏడవ తరగతిలో అంతకంటే ఏం తెలుస్తుంది. ‘ఒరేయ్..సరే పద. నిన్ను సినిమాకి తీసుకెళ్ళి సినిమా తియ్యడమంటే ఏమిటో చెప్తాను ‘ అని ఇతడిని ఆయన సైకిల్ మీదనే కోర్చోబెట్టి ‘అప్పుచేసి పప్పుకూడు‘ సినిమాకి తీసుకెళ్ళారు. (అఫ్కోర్స్. ఆ తరువాత వీళ్ళ అమ్మచేతిలో చివాటు కూడా తిన్నారనుకోండీ..) టైటిల్స్ వచ్చేప్పుడు ఒక్కో పేరే ఫాలో అవుతూ..ఒక్కో విభాగము ఏమి చేస్తుందో వివరంగా చెప్పారు. అప్పుడు డిసైడై పోయాడు..ఎప్పటికైనా సినిమా దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని ఈ విధంగా మొదలైన సినిమా పిచ్చి, వయసుతో బాటు పెరిగిందే తప్ప ఎక్కడా తగ్గుముఖం చూపించలేదు.[1]

విద్యాభ్యాసము

ఇంటర్మీడియట్, బి.ఎస్సీ విజయవాడలోని సిద్దార్థ కాలేజీలో చదివాడు. ఇంటర్మీడియట్ అయ్యాక ఎంసెట్ పరీక్షకి ముందు రోజు రాత్రి సెకండ్ షో బేటా సినిమా చూసి పరీక్షలు కూడా డుమ్మా కొట్టేశాడు. బి.ఎస్సీలో ఉండగా కూడా వ్యాస రచన, డిబేటింగ్ కాంపిటీషన్స్, నాటకాలు వెయ్యడం.అన్నింటిలోనూ ముందే ఉండేవాడు. వందలాది ట్రోఫీలు గెలుచుకున్నాడు. బి.ఎస్సీ చివరి సంవత్సరంలో ఉండగా.. ఇంక ఏమైనా సరే సినిమా రంగంలోకి దూకెయ్యాల్ని నిర్ణయించుకున్నాడు[1].

సినీరంగ ప్రవేశము

వీళ్ళ నాన్నగారి పాత ఫ్రెండ్ రావి కొండలరావు గారిని కలిసి దాదాపు ఏడెనిమిది నెలల పాటూ స్వాతి ముత్యంలో కమల్ హసన్ లాగా వెంటపడి బతిమాలాడు, ఎలాగైనా సినిమాల్లో దర్శకత్వ శాఖలో అవకాశం కల్పించమని. చివరికి బి.ఎస్సీ ఫైనల్ పరీక్షలు రాశాక, ఆయన సిఫారసుతో, బృందావనం సినిమాకి సింగీతం శ్రీనివాస రావుగారి వద్ద శిక్షణకు చేరాడు. విజయా పిక్చర్స్ వారు మళ్ళీ సినిమాలు తీద్దామని నిర్ణయించాక మొదలైన బృందావనం ఇతడికి సినీ పరిశ్రమని పరిచయం చేసిన మొదటి సినిమా. ఆ సినిమా నిర్మాణంలో ఎప్పుడూ కెమేరా వెనకాలే ఉండి, సింగీతంగారు ఏ షాట్ ఎలా తీస్తున్నారో పరిశీలించేవాడు. ఇతడి ఆసక్తికి, కష్టపడే మనస్తత్వానికీ ఆయన చాలా అభినందించి ఇతడి మీద ప్రత్యేక అభిమానం చూపించేవారు. ఆ సినిమా అయ్యాక విజయవాడ వచ్చేశాడు[1].

బి.ఎస్సీ పరీక్షలు తెలిసే రోజు వచ్చింది. పరీక్షలో పాసైతే ఇంట్లో వాళ్ళని ఒప్పించీ, లేదంటే ఇంట్లో చెప్పకుండానూ మద్రాసు వెళ్ళిపోదామని బ్యాగులో అన్నీ సర్దుకుని కాలేజీకి వెళ్తే, ఫసుక్లాసులో పాసయ్యాడని తెలిసింది. ఇంటికి వచ్చేసి, అమ్మకీ నాన్నకీ తన నిర్ణయం చెప్పాడు, సినిమాల్లో దర్శకత్వ శాఖలో సెటిలవ్వాలని ఉందని. నాన్నగారైతే నీ భవిష్యత్తు.నీ ఇష్టం.’ అన్నారు కానీ అమ్మకి ఇతడిని సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ గా చూడాలని ఉండేది. ఎలాగైనా సివిల్ సర్సీసెస్ పరీక్షలు రాయమని నచ్చజెప్ప చూసింది.ఈ సినిమాలు అనేవి మనకేమీ తెలీదు. మనకెవరూ గాడ్ ఫాదర్స్ కానీలోతుపాతులు తెలిసి త్రోవ చూపించే వాళ్ళు కానీ ఎవరూ లేరు. పైగా అక్కడ బోలెడన్ని రాజకీయాలు ఉంటాయంటారు. నువ్వు ఎంత వరకూ సక్సెస్ ఔతావో తెలీదు. అక్కడ సక్సెస్ ఔతాడనడానికి ఆధారాలేమీ లేవు. అదే సివిల్ సర్వీసెస్ రాస్తే ఒకటి కాకపోతే మరోటి ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది. నీ భవిషత్తుకి భరోసా ఉంటుందీ‘ అని అమ్మ ఇతడిని ఒప్పించాలని చూసింది. కానీ ఇతడి నిర్ణయం మారలేదు. ఎంతమంది చెప్పినా ఇతడి మనసు మాత్రం వాళ్ళ మాట వినలేదు. చివరికి అమ్మతో ఒక ఒప్పందానికి వచ్చాడు అమ్మా నా కిప్పుడు 20 ఏళ్ళు కదా. కచ్చితంగా 5 సంవత్సరాలు నన్నొదిలెయ్. నాకు 25 సంవత్సరాలు వచ్చే సరికి డైరెక్టర్ని కాలేకపోతే, వెనక్కి వచ్చేసి నువ్వన్నట్లే సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తాను. అప్పటికి ఇంకా మూడేళ్ళు ఛాన్సు ఉంటుంది కాబట్టి ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోగలను అని చెప్పి మద్రాసు వెళ్ళిపోయాడు.

మళ్ళీ సింగీతంగారి వద్దనే భైరవద్వీపానికి సహాయకుడుగా చేరాడు. 1993 లో అసిస్టెంట్ డైరెక్టర్గా తెరమీద ఇతడి పేరు పడిన మొదటి సినిమా భైరవద్వీపం. అక్కడినుంచీ ఐదు సంవత్సరాలపాటు వివిధ దర్శకుల వద్ద దర్శకత్వశాఖలో సహాయకుడిగా చేశాడు. కె.ఎస్. సేతుమాధవన్ గారి వద్ద కమల్ హసన్ నమ్మవారు సినిమాకి అసోసియేట్ గానూ , పి.వాసు వద్ద రజనీ కాంత్ ఉబైపాళి కి అపెంటిస్ గానూ, చేశాను. తరువాత జయంత్ సి.పరన్ది గారి వద్ద ప్రేమించుకుందాం రాబావగారూ బాగున్నారాప్రేమంటే ఇదేరా సినిమాలకీ పనిచేశాడు.

మొదటి సినిమా

చివరికి 1998 లో సరిగ్గా అమ్మకి మాట ఇచ్చిన ప్రకారం సొంతంగా దర్శకత్వం వహించే అవకాశం తెచ్చుకోగలిగాడు. మొట్టమొదటగా ఇతడి దర్శకత్వంలో మొదలు కావాల్సిన సినిమా పేరు నువ్వంటే నాకిష్టం (ఇ.వి.వి.గారి సినిమాకీ, అప్పట్లో ఇతడు ప్లాన్ చేసిన సినిమాకీ ఏమీ పోలికలు లేవు). అప్పట్లో సీతారాముల కల్యాణం సినిమాలో హీరో గా చేసిన వెంకట్ హీరోగానూ, కన్నడ, మళయాళీ సినిమాల్లో నటిగా స్థిరపడిన మాన్య హీరోయిన్గా సిన్మా ప్లానింగ్ జరిగింది. లో బడ్జెట్ లో, సింగిల్ షెడ్యూల్ లో, 50 లక్షలకి సినిమా పూర్తి చేసి, 30 లక్షలు పబ్లిసిటీకి ఖర్చు పెట్టి సిన్నా ఎలాగైనా సూపర్ హిట్ అయేలా చూసే బాధ్యత నాదీ అని నిర్మాత కి భరోసా ఇచ్చాడు. కథని పరుచూరి సోదరులకీ , త్రివిక్రమ్ శ్రీనివాస్కి కూడా చెప్పి వారి సలహాలతో మెరుగులుదిద్ది పకడ్బందీగా తయారు చేసుకున్నాడు. మొదటి సినిమా చిన్నదే ఐనా నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టేలా తీస్తే దర్శకుడిగా నేను తొందరగా నిలదొక్కుకోగలను అని ఇతడి అంచనా. ఆర్.పి. పట్నాయక్ కి అదే మొదటి సినిమా కావల్సింది. చక్కటి ట్యూన్స్ కూడా సిద్దంచేసుకున్నారు (దానికోసం చేసిన నువ్వంటే నా కిష్టమనీ.. అనే పాటను తరుణ్ హీరోగా వొచ్చిన నువ్వు లేక నేను లేను అనే చిత్రంలో ఉపయోగించడం జరిగింది).అన్నింటికీ ముందు సరేనన్న నిర్మాత షూటింగ్ వారం రోజులున్నందనగా కొత్త షరతు పెట్టాడు. అదేమిటంటే ‘ముందుగా ఒక వారం షూటింగ్ చెయ్యండి. ఎలావస్తుందో చూసి, బాగా ఆడుతుందనుకుంటే కంటిన్యూ చేస్తాను ‘ అన్నారు. సినిమా పూర్తయ్యాక చూస్తేనే విడుదల ఐతే తప్ప ఎలా ఆడుతుందో ముందుగా ఎవ్వరూ అంచనా వెయ్యలేరు. అలాంటిది వారం రోజుల షూటింగ్తో బాగుందో లేదో ఎలా చెప్పగలరు? పైగా చిన్న సినిమాల లైఫ్ ఎలా ఉంటుందో గమనిస్తున్నాడు. ఒకసారి ఆగిందంటే మళ్ళీ మొదలు కావడం కష్టం. అందుకే ఆ ప్రోజెక్ట్ తో ముందుకి వెళ్ళలేదు. ఆ విధంగా మొదలు కాకుండానే ఆగిపోయింది, ఇతడి మొదటి సినిమా ఔతుందనుకున్న నువ్వంటే నాకిష్టం ! ఆగిపోయినా కానీ సినిమాకి ముందుగానే సినిమా న్యూస్ పత్రికల్లో వచ్చింది. అమ్మకిచ్చిన మాట ప్రకారం 5 సంవత్సరాల్లో (1993–1998) దర్శకుడిగా పేపర్లలో పేరు చూసుకోగలిగాడు. ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మకి ఇదే చెప్పి అన్నమాట నిలబెట్టుకున్నానని సమర్థించుకున్నాడు. అప్పటికే ఇంక ఇతడిని సినిమా వాడిగా జమ కట్టేశారు కాబట్టి ఇంట్లో వాళ్ళు ఇతడేం చెప్పినా విని ఊరుకున్నారే తప్ప అంత సీరియస్ గా తీసుకోలేదు. మళ్ళీ సంవత్సరంన్నర గాప్ వచ్చింది. హైదరాబాదులోనే ఉంటూ కథలు తయారు చేసుకోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో దాదాపు ఒక డజన్ మంది నిర్మాతలకి తను తయారు చేసిన కథలు వినిపించడం జరిగింది. మధ్యలో పరిశ్రమతో టచ్ పోకుండా వుంటుందని రావోయి చందమామ సినిమాకి మధ్యలో నుంచీ జయంత్ గారి వద్ద జాయిన్ అయ్యూడు. అలానే అమెరికా ఆంధ్రులు తీసిన అటు అమెరికా ఇటు ఇండియా అనే సినిమాకి కూడా సిరివెన్నెల గారి సిఫారసు మీద సహాయకుడిగా గుమ్మలూరి శాస్త్రి గారి వద్ద చేశాడు. ఆ సినిమాకి అమెరికాలో పనిచేయడం ఒకమంచి అనుభవం. కెమేరా మేన్ టామ్ ఏంజలోతో కలిసి సినిమా స్కోప్ సినిమాకి యాంగిల్స్ సెట్ చేయడం, లైటింగ్ సెన్స్ లాంటివన్నీ సరిగా వుండేలా చూడడం..అదొక గొప్ప అనుభవం. ఆ సినిమా ఐపోయాక తిరిగి ఇండియా వచ్చేశాడు. అప్పటికి ఎమ్. ఎస్ రాజు దేవీపుత్రుడు సినిమా తీసి, కొత్తగా ఫేమిలీ ఓరియెంటెడ్ ప్రేమకథ తియ్యాలని చూస్తున్నారు. లోగడ మహేష్ బాబు, వెంకటేష్ల కోసం కథలు తయారుచేసేప్పుడు ఎస్.గోపాల రెడ్డి గారితో మంచి అనుబంధం ఏర్పడింది. దానివల్ల ఆయన ఇతడిని ఎమ్.ఎస్ రాజు గారికి సిఫారసు చేయడం, ఆయనతో కలిసి మనసంతా నువ్వే సినిమా చేయడంజరిగింది. కథకంటే ట్రీట్మెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత వున్న మొదటి సినిమాని ఇతడు ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. ఆ సినిమా ఘనవిజయం సాధించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఇతడి స్థానాన్ని సుస్థిరం చేసింది [1].

దర్శకత్వం వహించిన చిత్రాలు

1.    మనసంతా నువ్వే (2001) – మొదటి సినిమా

2.    శ్రీరామ్ (2002)

3.    నేనున్నాను (2004)

4.    మనసు మాటవినదు (2005)

5.    బాస్ (2006)

6.    ఆట (2007)

7.    రెయిన్‌బో (2008)

8.    రాజ్ (2011)

9.    ముగ్గురు (2011)

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-4-23-ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.