ఆధునిక భీష్మా చార్యుడలు ,అభినవ కౌటిల్యులు ,రాజ నీతి శాస్త్ర బోధనలో మహా మహోపాధ్యాయులు పద్మభూషణ్ ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారు
అవును ఇది అక్షరాలా నిజం .ప్రజాస్వామ్యంపై అత్యంత అభిమానమున్నవారు ,విద్యాబోధన సక్రమంగా జరగాలని కోరుకున్నవారు ,ప్రజాస్వామ్య విలువలు లుప్తమౌతుంటే మౌనంగా ఉండక తన అభిప్రాయాలను బయటికి చెప్పి మార్గదర్శనం చేసిన వారు ,వయసు మీద పడుతున్నా ,విద్యా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మార్గదర్శనం చేస్తూ ,పాఠ్య ప్రణాలికలు రూపొందిస్తూ ,ఉన్నతవిద్యకు పాఠ్యగ్రందాలు రచిస్తూ ,ఒకకంటికి చూపు లేకపోయినా ,పూర్తిగా కనిపించకపోయినా ,’’వర్టిగో ‘’ అనే వింత వ్యాధి ఇబ్బంది పెడుతున్నా ,మొక్కవోని దీక్షతో మంచం మీద నుంచే తన రచనా వ్యాసంగం సాగిస్తూ అడిగిన వారికి లేదనకుండా వ్యాస పరంపరలను రిసెర్చ్ గ్రంధాలను క్షుణ్ణంగా చదివి సంపూర్ణమైన సాధికారమైన ప్రసంగాలు అన్ని మాధ్యమాలలో చేస్తూ ,గంపెడు సంసారాన్ని ఈదుతూ ఎప్పుడు అది భారం అని భావించక ,కర్తవ్యంగా నిర్వహిస్తూ ,కూతుళ్ళకు ,కొడుకులకు మనుమరాల్లకు కూడా పొద్దు వాలిపోతున్న ఆవయసులో వారి విద్యా వ్యాసంగానికి తోడ్పడుతూ ,,కుటుంబంలోని వారందర్నీ తన అక్కున చేర్చుకొని ,అందరి యోగక్షేమాలకు అభ్యుదయానికి కారణ భూతులౌతూ ,కర్తవ్య దీక్ష ,సహాయం ఊపిరిగా జీవించిన వారు ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్యగారు .ఆదర్శ జీవి అన్ని వర్గాలవారికి ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులకు .దేశ విదేశీ పత్రికలకు కోరిందే తడవుగా సాధికార వ్యాసాలూ రాసి పంపిస్తూ ఏదో ప్రతిఫలం వస్తుందని ఆశలేకుండా ,తన అక్షర ప్రేమను చాటి చెప్పినవారు .విద్యార్దిలోకం చదువు తప్ప మిగిలిన వ్యవహారాలలో మునిగిపోవటం చూసి స్వాతంత్ర్యం మనం సాధించింది ఇందుకా అని ఆవేదన చందిన మహానుభావులు .
ఆంద్ర విశ్వవిద్యాలయంలో పదమూడేళ్ళు అధ్యాపకులుగా ,ఉన్నా ,మంచి తెలియని కట్టమంచి వారి ఈర్ష్య అసూయలకు లోని ,తనకు తక్కాల్సినవి దక్కకపోయినా ,సహించి భరించిన ఆచార్యులు .బొంబాయి యూనివర్సిటి లో రాజనీతి శాస్త్రం లో అత్యుత్తమ బోధ చేసి తన అనుభవాన్ని సార్ధకం చేసుకొని ,తగినంత గుర్తింపు పొంది ఖ్యాతి విదేశాలకూ ప్రాకి లబ్ధ ప్రతిష్టులైన వారు మామిడిపూడి వారు .ఇన్ని వ్యాపకాలున్నా నెల్లూరుజిల్లా గ్రామం లో దాదాపు యాభై ఎకరాల సుక్షేత్రమైన మాగాణి సంపాదించి కౌలుకు ఇచ్చి ఆదాయం జాగ్రత్త చేసి,కాలక్రమంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక చట్టాల వలన వాటిని ఆ రైతులకే కారు చౌకగా అమ్మిన ఉదారులు .స్వాతంత్ర్యోద్యమం లో పాల్గొనకపోయినా ,ఉద్యమ వ్యాప్తి తీరు తెన్నులను చక్కగా గమని౦చినవారు ,,విశ్లేషించిన వారు ఆంధ్రరాష్ట్ర సాధనకోసం కృషి చేసినవారు .గ్రామీణ వ్యవస్థ ప్రజాస్వామికంగా పాలి౦పబడాలని ,మన దేశమే గ్రామ స్వపరిపాలనకు ఆదర్శంగా ఉండేదని ఇకపై కూడా ఉండాలని ఆశించిన వారు ఆచార్య మామిడిపూడి . కుటుంబంతో పుణ్య క్షేత్ర దర్శనాలు చేస్తూ ,,కంచి మహాస్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఆస్తికతను కాపాడుకోన్నవారు .కాలం లో వచ్చిన మార్పులను గమనిస్తూ అవి తమ కుటుంబాల్లోనూ ఎలా ప్రవేశించాయో దాపరికం లేకుండా వివరించి అలాంటి మార్పును ఆపలేమని చెప్పిన విశాలహృదయులు .శాఖాంతర వివాహాలు ,,కులాంతర వివాహాలు తమ కుటుంబంలోనే జరిగితే ,మొదట తట్టుకోలేకపోయినా ,తర్వాత అండగా నిలిచి ఆహ్వానించి అక్కున చేర్చుకొన్న వారు .తమ సోదరీమణుల జీవితాలు అడవి గాచిన వెన్నెల అయిందని సోదాహరణంగా వివరించి మిగిలిన వారు జాగ్రత్త పడటానికి మార్గదర్శనం చేసినవారు .చదువుతక్కువ కుమారులు ఉద్యోగం లేని కుమారులు ఉన్నా వారి విద్యా ఉద్యోగాల కోసం ఉమ్మడి కుటుంబ బాధ్యతా సక్రమంగా నెరవేర్చిన వారు ఆతర్వాత వారంతా విద్యావంతులై సంఘంలో ఉన్నత విద్యా ఉద్యోగాలలో స్థిరపడి రాణించి నందుకు నిండుగా ఆశీర్వదించిన వారు .కష్టాల్లో ధైర్యం కోల్పోక ,మనస్సును స్థిరంగా ఉంచుకొని ,చలించని స్థిర సంకల్పంతో అనుకొన్నది సాధించాలని మామిడి పూడి వారి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం .వారి సతీమణి వారికి అన్ని విధాలుగా కర్తవ్య పరాయనతకు సహకరించిన సాధ్వీ మణి .అంటే ఆయన జీవిత చరిత్ర ,కుటుంబ చరిత్ర అందరికీ ఆదర్శ ప్రాయం .కనుక అందులో తేదీలు ,విద్య ఉద్యోగాలు కంటే ఇవే ప్రాముఖ్యం .ఎంత విద్యున్నా వినయం మూర్తీభవించిన వారుఎదతివారిలో కించిత్ ప్రతిభ ఉన్నా ,గుర్తించి ప్రోత్సహించినవారు ,ఉదారహృదయులతో ఉన్నత భావాలతో ఉన్న వ్యక్తులతో జీవితాంతం మైత్రిని బాంధవ్యాన్ని కొనసాగి౦చినవారు .విద్యకు దేశ ప్రాంత రేఖలు అడ్డుకావు అని నిరూపించిన వారు .అందుకే మామిడిపూడి వారు రసం మామిడి పండు వంటి వారు .వారి హృదయం మనసు బుద్ధి అన్నీ రసప్లావిటాలే బహుశా అలాంటి ఉన్నతులు ఉన్నారు అంటే ఆశ్చర్యపోతారు .ఉన్నారు మన మధ్య జీవించారు .మనకు బోధించారు .మనల్ని తమ రచనలద్వారా తీర్చి దిద్దారు .మారుతున్న సమాజాన్ని అర్ధం అవగాహన చేసుకొని అందులో తన జ్ఞాపకాలను నిక్షిప్తం చేశారు పద్మ భూషణ్ ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్యగారు .మన మరో కణ్వా మహర్షి .మరో సా౦దీప మహర్షి ,మరో అర్ధ శాస్త్ర వేత్త కౌటిల్యులు.
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -5-4-23-ఉయ్యూరు