మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి
హాయిగా కాలుమీద కాలేసుకుని వార్ధక్యాన్ని అనుభవిస్తూ కూర్చోకుండా ,తన చుట్టూ జరిగిన, జరుగుతున్న, జరుగబోయే చారిత్రిక రాజకీయాలకు వివరమైన విలువైన భాష్యం చెప్పిన వారు ఆచార్య మామిడిపూడి .మనం ఉత్తమ మైన మార్గంలో నడవాలన్నదే ఆయన ఆశయం, తపన .అందుకే ఖాళీగా కూర్చోలేక పోయారు .స్తంభించి పోయిన సమాజం సజీవంగా చూడగలిగారు .ఆధునిక శాస్త్ర సాంకేతికాల ప్రాధాన్యత గుర్తించారు .జీవితాలు వాటిని అనుభవిస్తున్నా అందులో యువత బందీ కారాదని ఆరాట పడ్డారు .ఆఖరి ఊపిరి వరకు అంపశయ్యపై భీష్మా చార్యునిలా సంఘనీతి రాజనీతి పౌర బాధ్యతా ప్రభుత్వ బాధ్యతా బోధించి చైతన్య పరచారు .కుమారుడు ఆనందంగారి షష్టిపూర్తి అత్యుత్సాహంగా కన్నుల పండువుగా చూసి ఆనందించారు ఆ వృద్ధ దంపతులు .మరదలు గారి ఇద్దరబ్బాయిలు అకస్మాత్తు గా చనిపోవటం రెండవ ఆయన యాక్సిడెంట్ లో పోవటం ఆకుటు౦బ పెద్ద గా ఆయనకు ఆశనిపాతమే అయినా తట్టుకు నిలబడ్డారు .
తన తొంభై సంవత్సరాల జీవితయానం లో సమాజంలో జరిగిన ప్రతిమార్పును అక్షర బద్ధం చేశారు .1945 నుంచి నిత్యం డైరీ రాస్తూ మార్గదర్శి అయ్యారు.రాయలేని స్థితిలో భార్య చేత రాయించారు .బంధుమిత్రుల బలవంతంతో స్వీయ చరిత్ర అక్షర బద్ధం చేశారు .దీనినే నేను ఫేస్ బుక్ లో సరసభారతి ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాను 23 ఎపి సోడ్ లలో .1978 అంటే 89ఏళ్ళ వయసులో కూడా గ్రంధ సమీక్షలు త్రివేణి,తెలుగు విద్యార్ధి పత్రికలకు వ్యాసాలూ రాశారు .రెండు రేడియో ప్రసంగాలు చేశారు .రెండు గ్రంధాలకు ముందుమాట రాశారు ఆ ఓపికకు ఆ ఉత్సాహానికి మనం చేతులు జోడి౦చాల్సిందే . ఇతిహాస్ పత్రిక వారికోరికపై ‘’చారిత్రిక దృష్ట్యా ఇందిరాగాంధి ప్రకటించిన అత్యవసర పరిస్థతి ,అప్పుడామె అనుసరించిన పాలనా విధానం ‘’పై వ్యాసం రాయమనికోరితే అది ప్రభుత్వానికి వ్యతిరేక౦ ప్రచురించేసాహసముందా అని ముందే అడిగి తెలుసుకొని,వేస్తాం అని భరోసా ఇస్తే అన్ని కోణాలలోనూ ఆలోచించి ఇతరదేశాల నియంతలు అవలంబించిన మార్గాలను విశ్లేషిస్తూ ఆచార్య మామిడిపూడి రాశారు .ఇలా రాయకపోతే చారిత్రిక సత్యాలు బయట పడేవికావేమో ?కానీ ఆయన అనుమానిన్చినట్లే దాన్ని ఆపత్రిక ప్రచురించలేదు .భద్రంగా వారి వద్దే ఉండి పోయింది .ఎమర్జన్సిలో మాధ్యమాలపై నిషేధం ,ప్రముఖ నాయకుల అరెస్ట్ లు ,ఆమె గారాల కూచి రాజకీయాన్ని బంతాట ఆడినట్లు ఆడటం ,నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు మొదలైనవన్నీ అందులో పొందు పరచారు .
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి పదేళ్లలో ఇరవై సంపుటాలలో ‘’సమగ్ర ఆంధ్రుల చరిత్ర ‘’రాయించాలని సంకల్పించి ,అంతర్జాతీయ తెలుగు సంస్థకు బాధ్యత అప్పగిస్తే ,ఆ డైరెక్టర్ మామిడిపూడి వారి సలహా కోరితే ,అర్హులైన రచయితల జాబితా ముందు తయారు చేయమని చెప్పగా ఏదో జాబితా వారు తయారుచేసినా అందులో సమర్దులున్నట్లు కనిపించక పోయే సరికి ,గత రెండు వందల ఏళ్లుగా వచ్చిన రాజకీయ ఆర్ధిక సామాజిక ,సాంఘిక సంస్కృతుల మార్పులు తెలియ జేసే చరిత్ర అయితేనే సమగ్రం అని భావించి మంత్రిగారికి చెప్పారు అది కార్యరూపం దాల్చలేదు కానీ ఆచార్యులవారు వీటన్నిటిపై రాసిన విశేష వ్యాసాలు కరదీపికలుగా ఉన్నాయి .
1977మార్చి లోక సభ ఎన్నికలగురించి ‘’త్రివేణి ‘’కి ఒకవ్యాసం ,ఆంధ్రాయూనివర్సిటి వారికి ‘’ఆంధ్రలో స్వాతంత్రోద్యమ లక్షణాలు ‘’పై వ్యాసం ,’’మన విద్యా విధానంలో భాషలకున్న ప్రాధాన్యం ‘’పై తెలుగు విద్యార్ధికి ,ఆంద్ర విశ్వ విద్యాలయం వారు ప్రకటింప తలబెట్టిన ‘’ఆంధ్రుల చరిత్ర ‘’కు రెండు వ్యాసాలూ రాశారు .ఇందులో క్రీ.శ . .1600నుంచి 1950 వరకు 350 సంవత్సరాలకాలం లో ఆంధ్రదేశ ఆర్ధిక పరిస్థితులు ,1858 తర్వాత రాష్ట్రంలో పరిపాలనా విధానం చర్చించారు .ఎన్నెన్నో ప్రామాణిక గ్రంధాల అధ్యయన సారంగా రాసిన అతి విలువైన వ్యాసాలివి .అంతటి నిశిత సూక్ష్మ పరిశీలనా దృష్టి ఆచార్యులవారిది .ఇవి రాయటానికి మూడు నెలలు పట్టింది వారికి .
1976-77 లో భారత స్వాతంత్రోద్యమ చరిత్ర ‘’మూడు భాగాలుగా ఆచార్యవర్యులు రచించారు .తెలుగు అకాడెమి ప్రచురిస్తానని వాగ్దానం చేసినా ,కార్యరూపం దాల్చలేదు .ప్రూఫులు దిద్దే సామర్ధ్యం తనకు లేదని నిర్మొహమాటంగా చెబుతూ ఆయనే తంటాలు పడి రెండుభాగాలు తామే ప్రచురించి మూడవ భాగాన్ని ఎం శేషాచలం కంపెనీకి అప్పగిస్తే వారు తప్పుల తడకలతో విపరీతమైన ఆలస్యంగా ముద్రించి అసంతృప్తి కలిగించారు .దీనితో మనశ్శాంతి లేక ఆసంవత్సరం చాలా భాగం గడపాల్సి వచ్చింది.1976లో 87 ఏళ్ళ వయసులో అతి తక్కువ నాలుగే వ్యాసాలురాశారు .నిజామాబాద్ గ్రంధాలయం లో ‘’నేను ఇదివరకు చూసినవి ‘’అంశంపై ప్రసంగం చేస్తూ ఇటీవలికాలం లో సమాజంలో వచ్చిన మార్పుల్ని సవివరంగా తెలియజేశారు .’’ఫ్రీడం ఎట్ మిడ్నైట్ ‘’గ్రంధం ఫ్రెంచ్ అమెరికన్ గ్రంధకర్తలిద్దరుకలిసి రాసి అందులో ,బ్రిటీష వారి ఆఖరు రాజప్రతినిది మౌంట్ బాటెన్ చేసిన పనులు వగైరాలను వివరిస్తే మామిడిపూదివారు వివాదాస్పదమైన ఆ పుస్తకాన్ని నిర్మొహమాటంగా సమీక్షించి హైదరాబాద్ స్టేట్ ఆర్కైవ్స్ వారి ‘’ఇతిహాస్ ‘’పత్రికకు పంపారు .
1975లో ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో జరపాలని భావించి దేశ విదేశాలలోనివివిధ రంగాలలో తెలుగు ప్రముఖులను ఆహ్వానించి సన్మానించింది .మామిడిపూడి వారికీమొదటిరోజే సన్మానం చేయాలని భావించారు ,అప్పుడు మంచం నుంచి లేచే పరిస్థితి లేనందున అర్ధాంగి ని పంపి గౌరవ సత్కారాలు పొందారు .తన గౌరవ సత్కారాలకు ఆమె కూడా కారణం కనుక ఆమెను పంపానని చెప్పుకొన్న సంస్కారం ఆచార్యులవారిది .ఈ కార్యక్రమానికి ముఖ్యప్రేరకులు విజయనగరం దగ్గరున్న గ్రామ వాసి,అప్పుడు హైదరాబాద్ నివాసి శ్రీ దేవ గుప్తాపు విశ్వేశ్వరరావు గారు .వీరికీ సత్కారం జరిపారు తమిళనాడులో ఇలాంటివి ప్రభుత్వాలే ఖర్చులు భరించి చేస్తాయి .రంగయ్యగారికుమారుడు శ్రీ ఆనందం మొదలైన వారంతా విరాళాలు సేకరించి కార్యక్రమం ఘనంగా వారం రోజులపాటు విద్యామంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు .ఖర్చులు పోను మిగిలిన 9వేల రూపాయలను ప్రభుత్వానికి ఇచ్చేసి, తృప్తి చెందిన నిజాయితీ వారిది .
సశేషం