మమతానురాగాలు ,ఆపేక్ష,బంధుత్వ బలం తో పల్లె మట్టి లో విరబూసిన శత పత్ర మందారం –బలగం
ఏమండీ! అప్పుడెప్పుడో 70 ఏళ్ళ క్రితం ‘’రోజులు మారాయి ‘’సినిమా వస్తే బళ్ళు కట్టుకొని తీర్ధ ప్రజలా ఆసినిమా చూసి అది తమ ఊరి కద అని మురిసిపోయారు .మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో అలాంటి ఆదరణ అటు ధియేటర్లలో ,గ్రామాల సెంటర్లలో చిన్న తెరలు కట్టుకొని సినిమా వేయించి చూస్తూ మురిసి పోతున్నారు జనం .ఈ విజయం కోట్లు కుమ్మరించి చేసిన ప్రచారం వలన రాలేదు .బిరుదులూ తగిలించుకొన్న స్టార్ హీరోలు ఉన్నారని స్టార్ డైరెక్టర్లు ,మెలోడి సంగీత దర్శకులు ఉన్నారని రాలేదు .సహజ సుందరంగా వికసించిన పుష్పంలా వచ్చింది .అందులోని నేటివిటికి పట్ట౦ కట్టటం వలన లభించింది .ఏఆస్కార్ ఇవ్వలేని గొప్ప రివార్డ్ ఇది .ఇవ్వాల్సి వస్తే అందులోని ప్రతి ఆర్టిస్ట్ కు ,ప్రతిపాటకు,ప్రతి సంగీతస్వరానికి ,అంతగా గుండెలను తాకెట్లు పాడిన ప్రతి గాయనీ గాయకునికి ,రచయిత రాసిన ప్రతిమాటకు ,చిత్రించిన ప్రతి దృశ్యానికి ,దర్శకుడు శిల్పించిన ప్రతి సన్ని వేశానికి ,గట్ తొ ప్రజలు ఇచ్చి ‘’దిల్’’ తో నిర్మించిన నిర్మాతకు, అంతటి నిబద్ధతతో దర్శకత్వం వహించి తాదాత్మ్యం చెందించిన దర్శకుడు ఎల్దంటి వేణుకు ,ప్రేక్షక దేవుళ్ళకు ఇవ్వాలి .ఎవరిచ్చినా ఇవ్వకపోయినా ఇది ప్రజాతీర్పు .శిరసా వహించాల్సిందే .పిండ ప్రదానం అనే పల్లె టూరి సెంటి మెంట్ అని తేలికగా తీసి పారేయ్యరాదు .ఇలాంటి సినిమాలు మట్టి మనుషుల జీవిత వ్యధల సుఖ సంతోషాల ఆపేక్ష మయ జీవితాలకు దర్పణాలు .క్షణికావేశ కావేశాలకు బందుత్వాన్నీ బలగాన్నీ దూరం పెట్టుకోవటం మూర్ఖత్వమని ఎలుగెత్తి చాటిన సందేశమిందులో ఉండి .చక్కని ప్రకృతి వాతావరణం లో పుట్టిన చిత్రం .అదే దాని బలం .మనమందరం దాని బలగమే.అదంతా మన సినిమానే .
పుట్టింటి ఆడ పిల్ల అత్తారింటికి వెళ్ళినా ఆమె మనసంతా ఇక్కడే భ్రమిస్తూ ఉంటుంది .ఆమె కోరుకొనేది అన్నదమ్ముల సౌభాగ్యం తనకు అప్పుడప్పుడు గౌరవంగా పిలిచి పెట్టె చీర సారే .ఇంతకూ మించి కోరికలు ఉండవా అంటే ఉండచ్చు కానీ వాటికేమీ ఆమె ఆశపడదు .పుట్టింటి పచ్చదనం ,ప్రేమ అనురాగం ఆపేక్షా మమత మాదుర్యాలే .అవి లేనప్పుడు భర్త బంగారు ఉయ్యాలలో ఊగ చేసినా తృప్తి పడదు .ఈ చిన్న విషయం పై ఎన్నెన్నో సినిమాలు వచ్చాయి .కానీ ఇంతగా ప్రజలకు కనెక్ట్ అయిన సినిమా లేదేమో .ఎవరికీ వారికి అది తమ కుటుంబం లోని విషయం అనే తాదాత్మ్యత కలిగింది .కదిలించింది కన్నీరు కార్పించింది గుండెలను పిండించింది .అంతటి విషాదం లోనూ ఒక ఆదర్శ భావం ఉదయించింది ఒక వెలుగు రేఖ తోచింది .సంకుచితత్వం నిలువెల్లా పాతరైపోయింది హృదయాలు తేలికయ్యాయి కోర్టుల కేక్కకుండా గ్రామ పెద్దలమధ్య పరిష్కారాలు చేయించుకోవటం పెద్దలమాటలకు తీర్పు లకు అత్యంత విలువ నివ్వటమే .కర్రలు విరగలేదు కత్తులు బాంబుల ఊసులేదు సుమోలు గాల్లో ఎగరలేదు .రక్తం పారలేదు .కన్నీరు మాత్రం కాల్వలై పారింది హృదయ ప్రక్షాళనం చేయించింది .పోయిన పట్టింపులు బలాదూరైనాయి .ఆప్యాయతల కౌగిలి౦పులు ఊరట నిచ్చాయి . ఏమై పోతుందో ఆ కుటుంబం అని తల్ల డీల్లిన కుటుంబ స్త్రీలు ,పెద్దలు మౌనంగా రోదించి మనసులోని మంచి బయట పెట్టి తామంతా ఒక్కటే అని నిరూపించారు .ఈచిత్ర విజయం వీరందరిది .
రంగ మార్తాండ లో ఆటో డ్రైవర్ గా కనిపించే కనిపించని వేణు ఈ సినిమా దర్శకత్వం తో విరాట్ స్వరూపాన్ని చూపాడు .చక్కని టీం ను ఎన్నుకొన్నాడు .ఒక్క మాటలో చెప్పాలంటే మార్తాండ లో రంగ మార్తా డు లున్నా ,వాళ్ళు నటించారు ఆపాత్రలుగా .కానీ బలగంలో ప్రతి ఒక్కస్త్రీ పురుషుడు ముసలి ముతక ,పిల్లా జెల్లా కాకి అన్నీ జీవించాయి .అందుకే సినిమా జీవంతో జవంతో తొణికిసలాడింది .పల్లె మట్టి వాసన గుబాలించింది .మార్తాండ లో మార్తాండులు తాగి తందనాలాడు తుంటే కంపుకొట్టింది అసహ్యం పుట్టింది .ఇక్కడ దినవారాల్లో అందరూ ఆపని చేసినా ఎవరూ తప్పుపట్టలేదు అది వారి కల్చర్ అనుకొన్నారు .పిండం సెంటి మెంట్ లాంటివి మనకే కాదు లాటిన్ అమెరికా సాహిత్యమంతా దెయ్యాలు భూతాలూ జాతకాలు ప్రశ్నలు సమాధానాలే. వాటికే ఆరచనలకే నోబెల్ సాహిత్య ప్రైజులు పొందారు అక్కడ స్త్రీ పురుష రచయితలు .
ఇందులో ఊరు పల్లెటూరు ,పోట్టిపిల్లో ,బలరామ నరసయ్యో ,తోడుగా మా తోడుండి పాటలు అక్షరలక్షలు చేసేవి .
మంచి చిత్రం నిర్మించటానికి సహకరించిన దిల్ రాజుకు ,మొదటి చిత్రంతో ఉన్నత ప్రమాణాలాతో అర్ధ వంతమైన దర్శకత్వం తొ తన ప్రతిభా విశ్వ రూపాన్ని చూపిన వేణు కు ఒకరేమిటి మొత్తం అందరికి ఆనందంతో తడికన్నులతో ఆర్ద్రత నిండిన హృదయంతో అభినందనలు అందిస్తున్నాను .నిన్న రాత్రే అమెజాన్ ప్రిం లో బలగం చూసి ఉప్పొంగిన హృదయంతో రాసిన మాటలివి .చివరగా మా వూళ్ళో బలగం ఇంటి పేరున్న వారున్నారు .బలగం సింహాచలం అని స్వీట్ షాప్ ఓనర్ నాకు బాగా తెలుసు .అలాగా బలగం పీతాంబరం అనే ఒక ప్రసిద్ధ రాజకీయ నాయకుడు ఉన్నట్లు ఎక్కడో చదివిన గుర్తు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-11-4-23-ఉయ్యూరు