ఆదర్శ స్వాతంత్ర్యోద్యమ దంపతులు –జయంతి వెంకట నారాయణ ,సూరమ్మ .
శ్రీమతి సూరమ్మ 1887లో శ్రీకాకుళం జిల్లా కవిట అగ్రహారం లో శ్రీకొండూరి సీతారామయ్య ,శ్రీమతి నరసమ్మ దంపతులకు అయిదవ కూతురుగా జన్మించింది .ఆమె ఎనిమిదవ ఏట బరంపురం వాస్తవ్యుడు జయంతి వెంకట నారాయణ తో వివాహం జరిగింది .వెంకట నారాయణ బ్రహ్మ సమాజ ప్రభావితుడయ్యాడు .ప్రభుత్వోద్యోగం మానేశాడు .అలాంటి భర్త తో కాపురానికి సూరమ్మ గారు రాజమండ్రి వచ్చింది .వీరేశ లింగంగారి వితంతు శరణాలయం లో భర్త టీచర్ గా చేరాడు .దంపతులు ఉత్తమ సంస్కారాలను జీర్ణిప జేసుకొన్నారు .అక్కడే బ్రహ్మర్షి రఘుపతి వెంకట రత్నం నాయుడు గారితో పరిచయం కలిగింది .ఈ దంపతులు కలకత్తా వెళ్లి సాధన ఆశ్రమం లో పండిత శివ నాథ శాస్త్రి వద్ద మిషనరి ట్రెయినింగ్ పొందారు .కాకినాడ తిరిగివచ్చి పిఠా పురం రాజా స్థాపించిన బ్రహ్మసమాజ అనాధాశ్రమ నిర్వహణ చేబట్టారు .వేశ్యావృత్తి నిర్మూలనకు కృషి చేశారు .హరిజన సేవ ,వారి లో విద్యావ్యాప్తి చేశారు .ఇక్కడనుండి మద్రాస్ వెళ్లి అక్కడ బ్రహ్మ సమాజ ప్రచారం చేశారు .
మద్రాస్ లో భజనలు రాత్రి బడి నిర్వహించారు .రామ మోహన్ రాయ్ పేరిట ఒక లాడ్జి కూడా నడిపారుసూరమ్మ దంపతులు .బ్రహ్మసమాజ యువతక్రమశిక్షణ , వసతికోసం అక్కడే ఉండేవారు .సంఘ సంస్కర్త సేవా పరాయణురాలు శ్రీమతి ముత్తులక్ష్మి రెడ్డి తో మంచి పరిచయమేర్పడింది .అప్పుడే అనీబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభించింది .ఆసభలకు సూరమ్మ పిల్లలతో తో కలిసి వెళ్ళేది .బ్రహ్మ ధర్మ సభలు జాతీయోద్యమ సభలకు హాజరవటం తప్పని సరి అయి౦దామెకు .పరోపకారం సహాయ సానుభూతులు ఆమెకు బాగా అలవడినాయి.
పిల్లల చదువుకోసం సూరమ్మ దంపతులు బరంపురం చేరారు .బాలగంగాధర తిలక్ మరణం తో ,విదేశీ చదువుల ఉద్యోగాల పట్ల ప్రజలు అసహ్యభావంతో స్కూళ్ళు కాలేజిలు బహిష్కరించారు .సూరమ్మ తన పిల్లలను స్కూల్ మాన్పించి హిందీ నేర్పించింది .నూలు వడికించి జాతీయోద్యమం లో చేర్చింది .1921లో గాంధీ ప్రకటించిన సహాయ నిరాకరణ ఉద్యమం లో ఉత్సాహంగా పాల్గొన్నది. దేశభక్త కొండా వెంకటప్పయ్య డా పట్టాభి సీతారామయ్య ,టంగుటూరి ప్రకాశం ఉన్నవ లక్ష్మీ నారాయణ పేర్లు వింటే జనం పులకించి పోయేవారు .ఉన్నవ వారి నవల ‘’మాలపల్లి ‘’ప్రతి ఇంటా గీతా పారాయనగా మారు మోగింది .సూరమ్మ భర్త వెంకట నారాయణ ‘’హ్యుమానిటి’’అనే పత్రిక ప్రారంభించాడు .ఆయనా ఆయన సోదరులు దేశ భక్తీ బోధిస్తూ అనేక వ్యాసాలూ అ౦దులోరాసి ప్రజలలో చైతన్యం తెచ్చారు .వారిపెద్దబ్బాయి బ్రహ్మానందం నూలుడకంలో ,హిందీలో నిష్ణాతుడయ్యాడు .కుటుంబంలోని అందరి విదేశీ బట్టలను సూరమ్మ స్వయంగా తగలబెట్టింది .ఇంటింటా రాట్నాలు కొనిపించి నూలు వడికి౦చింది.బరంపురం లోని ఇజ్జరపు ,ఇమ్మిడి శెట్టి కుటుంబాలవారు లెక్కకు మించి ఏకులు ఊరంతా పంచారు .ఊరిలోని సాలీలు కూడా పట్టు బట్టలు నేయటం మాని నూలు వస్త్రాలు విరివిగా నేసి దేశభక్తి చాటుకున్నారు .
సూరమ్మ అతి నాజూకు సన్నని నూలు తీసేది .ఇంటింటికి తిరిగి ఖద్దరు ప్రచారం చేసింది .1922లో బరంపురం లో కాంగ్రెస్ సభలు జరిగాక భర్త, సోదరులు అరెస్ట్ అయ్యారు .అయినా జంకలేదు .ఖద్దరు అమ్మింది .కల్లు దుకాణాల వద్ద పికెటింగ్ చేసింది .తాగుడు చెడు ఫలితాలను పాటలద్వారా ప్రచారం చేసింది .ముందు ఎవరూ వినేవారుకాదు. క్రమంగా వింటూ ఆమెను అపహాస్యం చేసేవారు తూగుతూ ఊగుతూ .చివరికి కల్లు ముంతలు కింద పెట్టి ‘’ఇంక ఎప్పుడూ తాగం ‘’అని శపధాలు చేసేవారు .అంతదాకా ఆమె శ్రమించేవారు .
బరంపురం లో వచ్చిన జాతీయ విద్యాలయంలో తన పిల్లని చేర్పించి చదివించారు దంపతులు .వరాహగిరి వారింట్లో ,దిగుమర్తి వారి ఇళ్లలో స్త్రీ సమావేశాలు జరిపించేది .ఇంట్లో తొమ్మిది మంది పిల్లలు. భర్త జైల్లో ఉన్నాడు .కాంగ్రెస్ వాలంటీర్లకు జీత భత్యాలు లేవు .అయినా అన్నిటిని సమర్ధించు కొంటూ దేశ సేవలో ప్రధాన పాత్ర పోషించింది సూరమ్మ రాష్ట్ర సభలలో దువ్వూరి సుబ్బమ్మ ,ఉన్నవ లక్ష్మీ బాయమ్మగార్లను కలుసుకొంటూ స్పూర్తిపొంది జనానికి ప్రేరణ కలిగించేది .1922లో గాంధి బరంపురం వస్తే ఖద్దరుటోపీ తిరగేసి పట్టి విరాళాలు వసూలు చేసింది.క్షణాలమీద నోట్లకట్టలు నాణాలు ఆభరణాలు బంగారం కుప్పలు తెప్పలుగా పడిపోతున్నాయి .ఇవన్నీ ఎప్పటికప్పుడు గాంధీజీకి అందజేసింది .ఇదంతా చూస్తున్న బోసినవ్వులాయన అక్కడికి వచ్చి స్వయంగా పరిచయం చేసుకొన్నాడు .అక్కడే భర్త కూడా ఉన్నారు వందలకొద్దీ జనాలను పావలా సభ్యులుగా చేర్చారు ఆ దంపతులు .
1923కాకినాడ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మదాలీ .పిల్లలతోసహా వెళ్లి వాలంటీర్ దళం లో ఉత్సాహంగా పని చేసింది .వాడ వాడలా తిరిగి ఉపన్యాసాలిచ్చింది .’’మాకొద్దీ తెల్లదొరతనం –పన్నెండు దేశాలు పండు చున్నవికాని –పట్టడన్నము మాకు లోప మండీ –- ఉప్పు ముట్టుకొంటే దోషమండీ-నోట మట్టీ గొట్టి పోతాడండి –అయ్యో –కుక్కలతోపోరాడి కూడు తి౦టా డండీ –మాకొద్దీ తెల్ల దొరతనము ‘’’’అచ్చరలోచ్చీ అచ్చనగాయ లాడు కొండే రాజ్యములో అయ్యో అయ్యయ్యో కోయ్యోడా ‘’’’స్వేచ్ఛా పతాకం బిదే’’అనే పాటలు గొంతెత్తి పాడితే ,పల్లెలు పల్లెలే కార్య రంగంలో దూకేవి .
1930లో నౌపడా ఉప్పు సత్యాగ్రహం లో శాసనోల్లంఘనం చేసినందుకు 1930 జూన్ 19నా సూరమ్మగారిని అరెస్ట్ చేసి రాయవేల్లూరులో ఆరుననెలలలు బిక్లాస్ శిక్ష విధించారు .1930 డిసెంబర్ 21 శిక్ష పూర్తయి ఇంటికి వచ్చారు . జైలులో పరిస్థితులు దారుణంగా ఉండేవి .ఖైదీలనందర్నీ ఒక్క త్రాటిపై నడిపారు సూరమ్మ .తర్వాత కన్ననూరు జైలుకు మార్చారు .విడుదల అయినవారందర్నీ దేశోద్ధారక తన ఇంటికి ఆహ్వానించి నూతన వస్త్రాలు సమర్పించి ఆతిధ్యమిచ్చి పంపారు .ఈమె బరం పురం చేరారు .గంపెడు సంసారం ను అత్యంత ఓపికతో సమర్ధతతో సహనంతో సాకి౦ది ఆమె .ఆమె అల్లుళ్ళు గరిమెళ్ళ వీరభద్రరావు ,ధరణీ ప్రగడ శేషగిరి రావు సుప్రసిద్ధ దేశభక్తులే జైలుకు వెళ్ళినవారే .సూరమ్మ దంపతులు స్వాతంత్ర్యాన్ని కనులారా చూశారు .10-2-1969 న జయంతి సుందరమ్మ గారు 72వ ఏట తనువూ చాలించిన ధన్యజీవి .హైదరాబాద్ ఆంధ్ర మహిళాసభ నిర్వహిస్తున్న నర్సింగ్ హోమ్ లో ఒక వార్డుకు ‘’జయంతి సూరమ్మ వార్డు ‘’అని పేరుపెట్టి గౌరవించారు .ఆమె ఆప్యాయత ఆదరం సేవాభావం ధైర్యం అక్కడి ఆమె ఫోటోలో ప్రతిబింబిస్తాయి .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-4-23- ఉయ్యూరు