కేరళ శాసన సభ కు ఎన్నికైన మొదటిస్త్రీ ,మొదటి ప్రోటెం స్పీకర్ ,ప్లాంటేషన్ కార్పోరేషన్ చైర్ పర్సన్ -రోసమ్మ పన్నూస్
సమ్మ పన్నూస్ ( 1913 మే 12 – 2013 డిసెంబరు 28) భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ వేత్త, న్యాయవాది. ఆమె కేరళ శాసనసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి వ్యక్తి . భారతదేశంలో కోర్టు ఉత్తర్వుల ద్వారా తన స్థానాన్ని కోల్పోయిన మొదటి ఎమ్మెల్యే, ఆమె 1958 లో అసెంబ్లీకి జరిగిన మొట్టమొదటి ఉప ఎన్నికలలో ఎన్నికైన మొదటి వ్యక్తి . రోసమ్మ పన్నూస్ కేరళ శాసనసభ మొదటి ప్రో టెమ్ స్పీకర్. [1]
ప్రారంభ జీవిత౦
రోసమ్మ 1913 మే 12న ట్రావెన్ కోర్ లోని కంజిరప్పల్లిలో ఒక క్యాథలిక్ కుటుంబానికి చెందిన కంజిరపల్లి కరిప్పరంబిల్ తోమ్మన్ చెరియన్, పాయిప్పడు పున్నక్కుడి అన్నమ్మ లకు నాల్గవ సంతానంగా జన్మించింది. [2]
ఆమె మద్రాసు లా కళాశాల నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీని పొందింది. [3]
కెరీర్
ఆమె తన అక్క అక్కమ్మ చెరియన్ చే ప్రభావితమై 1938లో ట్రావెన్ కోర్ స్టేట్ కాంగ్రెస్ లో చేరడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. [4] అక్కమ్మ చెరియన్ కూడా స్వాతంత్ర్య సమరయోధురాలు. సోదరీమణులిద్దరూ 1939లో బ్రిటిష్ వారిచే పూజాపురలోని సెంట్రల్ జైలులో ఖైదు చేయబడ్డారు. రోసమ్మ మూడు సంవత్సరాల తరువాత జైలు నుండి విడుదలచేయబడింది. [4]
రాజకీయం
రోసమ్మ 1946 లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకుడు పి.టి. పన్నూస్ ను వివాహం చేసుకుంది. రోసమ్మ కుటుంబం భారత జాతీయ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. ఇద్దరూ పోప్ నుండి ఒక ప్రత్యేక సమ్మతి లేఖతో కొచ్చిన్ లోని ఒక చర్చిలో వివాహం చేసుకున్నారు.
రోసమ్మ 1948లో సిపిఐలో చేరారు. 1957లో కేరళ రాష్ట్రంలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె దేవికులం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె భర్త 1952 సార్వత్రిక ఎన్నికలలో లోక్ సభకు ఎన్నికయ్యాడు, 1957 సార్వత్రిక ఎన్నికలలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రోసమ్మ అసెంబ్లీ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వ్యక్తి . [3] ఆమె అసెంబ్లీ మొదటి ప్రో టెమ్ స్పీకర్ అయ్యారు. అయితే కోర్టు జోక్యం తరువాత రోసమ్మ తన స్థానాన్ని కోల్పోయింది, కానీ 1958లో అసెంబ్లీకి జరిగిన మొట్టమొదటి ఉప ఎన్నికలలో తన స్థానాన్నితిరిగి పొందింది.
1964లో పార్టీ చీలిక కారణంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ఆవిర్భవించినప్పుడు రోసమ్మ సిపిఐతోనే ఉన్నారు. ఆమె 1982 అసెంబ్లీ ఎన్నికల్లో అలెపీ నియోజకవర్గం నుండి విజయవంతంగా పోటీ చేసింది. 1987 ఎన్నికలలో రోసమ్మ అదే నియోజకవర్గం నుండి రెండవసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. [5]
పదవులు
ఆమె కేరళ మహిళా సంఘం (1969-83) అధ్యక్షురాలిగా, ప్లాంటేషన్ కార్పొరేషన్ (1964-69) చైర్ పర్సన్ గా, హౌసింగ్ బోర్డు (1975-78) అధిపతిగా, 10 సంవత్సరాలు రబ్బర్ బోర్డు సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఆమె 1993 నుండి 1998 వరకు కేరళ మహిళా కమిషన్ కు చైర్ పర్సన్ గా ఉన్నారు. [3]
మరణం
రోసమ్మ తన కుమారుడు థామస్ పన్నూస్ తో నివసిస్తున్న ఒమన్ లోని సలాలాలో 2013 డిసెంబరు 28న మరణించింది. ఆమె మృతదేహాన్ని తిరువల్లాయ్ సమీపం లోగల పామలలోని ఆమె ఇంటికి తీసుకువచ్చారు, అంత్యక్రియలు 2013 డిసెంబరు 30 న తిరువల్లాయ్ సమీపంలోని వారిక్కాడ్ లోని సెహియోన్ మార్ తోమా చర్చిలో జరిగాయి. [4]
2-కేరళ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ,స్వాతంత్ర్య పోరాటం లో సర్వస్వాన్ని త్యజించిన త్యాగమూర్తి ,హరిజన సంక్షేమం ,ఖాదీ వ్యాప్తి కోసం కృషిచేసిన –చునంగత్ కుంజి కావమ్మ
చునంగత్ కుంజికావమ్మ (1894-1974) కేరళకు చెందిన రాజకీయవేత్త. 1938లో ఆమె కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైంది. అప్పుడు EMS నంబూద్రిపాద్ (తరువాతి కాలంలో కేరళ రాష్ట్రానికి మొదటి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి అయ్యారు) కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.
జీవిత విశేషాలు
చునంగత్ కుంజికావమ్మ పాలక్కాడ్ జిల్లా, ఒట్టపాలెంలోని చునంగత్‌లో ప్రముఖ నాయర్ కుటుంబానికి చెందిన వ్యక్తి. కుంజికావమ్మ 1894 మార్చిలో చునంగత్ అమ్ముణ్ణి అమ్మ, ధర్మోత్ పణిక్కర్ దంపతులకు ఐదవ సంతానంగా జన్మించింది. చునంగత్ యూపీ స్కూల్ నుంచి 8వ తరగతిలో ఉత్తీర్ణత సాధించింది. 1911లో ఆమె ప్రగతిశీల ఆలోచనాపరుడైన మతిలకత్ వెల్లితోడియిల్ మాధవ మీనన్‌ను పెళ్ళి చేసుకుంది. తరువాత మహాత్మా గాంధీకి అనుచరురాలు అయింది. ఆమెకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆమె బాగా చదివేది. జాతీయ ఉద్యమం లోని గొప్ప నాయకుల రచనలు చదివి భారతదేశాన్ని విదేశీయులు ఆక్రమించవడం గురించి చాలా అర్థం చేసుకుంది. తన మాతృభూమి స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటంలో తలదూర్చడానికి ఆమె తన కుటుంబ వారసత్వంగా వచ్చిన అన్ని భౌతిక సౌకర్యాలను వదులుకోవాలని నిర్ణయించుకుంది.
ఆమె 1930 ల చివరలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి మొదటి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసింది. బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రాంతీయ నాయకురాలిగా పావు శతాబ్దం పాటు ఆమె ముందుండి పోరాడింది.
కుంజికావమ్మ స్వాతంత్ర్యోద్యమానికి విరాళాలు అందించింది. ఒకసారి మహాత్మా గాంధీ కేరళ సందర్శించినప్పుడు ఆమె తన కొడుకు మెడలో ఉన్న బంగారు గొలుసును అతడి చేత మహాత్ముడి మెడలో వేయించింది. మరో సందర్భంలో గాంధీజీ జాతీయ మేల్కొలుపుపై ప్రసంగించినప్పుడు, ఆమె తన బంగారు ఆభరణాలను జాతీయ నిధికి విరాళంగా ఇచ్చింది. గాంధీజీ వెంటనే వాటిని హరిజన సంక్షేమ నిధి కోసం వేలం వేశాడు. గాంధీజీ సలహా మేరకు ఆమె కూడా ఆ రోజు నుంచి ఖాదీ ధరించడం ప్రారంభించింది.
మలబార్ ప్రాంతంలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి రాజకీయ సమావేశం 1921లో ఒట్టపాలెంలో జరిగినప్పుడు, కాంగ్రెస్ మహిళా విభాగాన్ని సమీకరించడం ద్వారా ఆమె తన ఆర్గనైజింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇది ఆమె క్రియాశీల రాజకీయ జీవితానికి నాంది. తరువాత ఆమె కాంగ్రెసు పార్టీకి పూర్తికాల కార్యకర్తగా మారింది. కాంగ్రెస్ ఆదర్శాల గురించి ప్రజలకు తెలిపేందుకు అనేక సమావేశాలను నిర్వహించింది. రాష్ట్ర సదస్సులతో పాటు కాంగ్రెస్ అఖిల భారత సదస్సులలో పాల్గొని తన ప్రాంతంలోని మహిళలను స్వాతంత్ర్య ఉద్యమంలో చేరేలా ప్రోత్సహించింది.
1930, 1932 లలో ఆమె జైలు శిక్ష అనుభవించింది. 1932లో, ఆమె విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ ఒక గొప్ప ప్రదర్శనకు నాయకత్వం వహించింది. ఆమెను అరెస్టు చేసి మూడేళ్లపాటు కన్నూర్ జైలులో ఉంచారు. విడుదలైన తర్వాత ఆమె స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా కొనసాగింది. మళ్లీ అరెస్టై, కుట్టిమాలు అమ్మ, సమువాల్ ఆరోన్, ఆషెర్ వంటి ఇతర గొప్ప మహిళా నాయకులతో పాటు వెల్లూరు జైలులో తదుపరి రెండు సంవత్సరాలు గడిపింది.
1940లో ఆమె భర్త మాధవ మీనన్ మరణించాడు. ఇది కుంజికావమ్మను ఛిన్నాభిన్నం చేసింది. స్వాతంత్ర్యం వచ్చే వరకు తగ్గిన సామర్థ్యంతో కొనసాగినప్పటికీ, ఆమె కాంగ్రెసు కార్యకలాపాల నుండి నెమ్మదిగా వైదొలగడం ప్రారంభించింది. తరువాత ఆమె హరిజనుల సంక్షేమం, ఖాదీ వ్యాప్తి కోసం సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంది. కుంజికావమ్మ తన స్వగ్రామమైన చునంగత్‌లో ఉన్నత పాఠశాల, కస్తూర్బా స్మారక కేంద్రం నిర్మాణానికి సహాయం చేసింది. ఆచార్య వినోబా భావే నేతృత్వంలోని భూదాన్ ఉద్యమానికి తన 8 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చింది.
స్వాతంత్ర్య పోరాటంలో ఆమె పోషించిన పాత్రకు గుర్తింపుగా 1972లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు తామ్ర పత్ర పురస్కారాన్ని అందించింది. జాతీయ ఉద్యమంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఆనాటి కేరళ ప్రభుత్వం వైనాడ్ జిల్లాలో ఆమెకు భూమిని కేటాయించబోగా ఆమె తిరస్కరించింది. తన జీవితంలో చివరి సంవత్సరాలను కుమార్తె వద్ద గడిపింది. 80 ఏళ్ల వయసులో 1974 ఆగస్టు 21న కుంజికావమ్మ మరణించింది.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-23-ఉయ్యూరు