బాల బ్రహ్మ చారి ,సహజ కవి శ్రీ వెలగల సుబ్బారెడ్డి గారి ‘’శ్రీ రామచంద్ర శతకం ‘’
బాల బ్రహ్మ చారి ,సహజ కవి శ్రీ వెలగల సుబ్బారెడ్డి గారి ‘’శ్రీ రామచంద్ర శతకం ‘’ రచించి శ్రీ వేణు గోపాల భక్త లీలా లహరీ గ్రంథనిలయం తరఫున షష్టమ పుష్పంగా సమర్పించారు .దీన్ని మగటూరు నివాసి శ్రీ జినపనేని వెంకటరామరాజు ,ఈ సూర్యనారాయణ రాజు పరిష్కరించగా ,ఆరవిల్లి గ్రామవాసిని కీశే వెలగల వీరేడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి వెలగల వెంకమ్మ గారి ద్రవ్య సాయంతో ప.గొ.జి.నరసాపురం సీతారామా ముద్రాక్షర శాలలో 1930లో ప్రచురించారు .వెల-రెండు అణాలు .
కృతజ్ఞతలు అంటూ కవిగారు పద్యాలలో వెంకమ్మగారి దాన దయా దాత్రుత్వాలను ప్రశంసించారు .సూరమాంబ పెద్ద తటాకం త్రవ్విస్తే ,బంగారు రధాన్ని ఏర్పాటు చేశారు రంగరాణి .భార్తపేరుమీద దేవాలయాలు కట్టించి ,చిర యశస్సుపొందారు వెంకమ్మ గారు .చెల్లమాంబ బీదల పెళ్ళిళ్ళు చేయిస్తే ,అసహాయులకు అన్నవస్త్రాలు అందించారు బంగారంబ .అలాటివంశంలోని వెంకమ్మగారు శ్రీ రామ చంద్ర శతక ముద్రణకు సాయం చేశారు .భర్త వీరేడ్డి దానదయాధర్మగుణాలను కాపాడారు .ఆమెకు రామ చంద్రమూర్తి దీర్ఘాయురారోగ్యాలు ప్రసాదించాలని మార్టేరు పంచకం నుంచి కవి వెలగల సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు .సీసపద్య శతకం .సుబ్బరాడ్వరదా హరీ సుర నుతేంద్ర -రమ్యగుణ సాంద్ర మార్టేరు రామ చంద్ర ‘’అనేది శతకం మకుటం .
మొదటి సీసపద్యం –‘’శ్రీ రామావర సుర సేవితా సుర హర కరుణాలవాల శ్రీ –గానలోల సాకేతపురవాస ,సత్య వాక్పరిపూర్ణ పురహరాసుర హర
పూర్ణ నిపుణ తాటకి సంహార ,దానవాంతక మేటి సీతామనోహర –శ్రీ రమేశ అహల్యా రక్షణాయాశ్రిత పాలనా సద్గుణ జాల శ్రీ సారసాక్ష
గీ-తాపస స్తోత్ర ధరణీశ ధర్మ శీల-పు౦డరీకాక్ష రఘురామపూర్ణ చంద్ర –సుబ్బరాడ్వరదా హరీ సురనుతేంద్ర –రమ్య గుణ సాంద్ర మార్టేరు రామ చంద్ర ‘’
రెండవ పద్యంలో తనకు యతి ప్రాసలు తెలీవని ,సీసాలలో రాస్తున్నానని ,నిఘంటు పరిచయం నాస్తి ,పంచకావ్య,నీతిశాస్త్ర వాసనా లేదని ,స్వామికృపతో మొదలుపెట్టానని ,అన్నిటికీ ఆయనదే భారమనీ గడుసుగా చెప్పారు .రామమహిమలు ఎవరూ వర్ణించలేరనీ , సర్వ రోగాలు హరించి సంసార బంధాలను తెగగోడుతుందని ,దరిద్రం తొలగి శ్రేయ భద్రత రామనామ ఇస్తుందని మోక్షమార్గం చూపిస్తుందనీ చెప్పారు .రామ చంద్ర జపం అంటే అరచేతిలో మోక్షం ఉన్నట్లే .పాండవుల్ని వెన్నంటి కాపాడిన కృష్ణమూర్తివి ఉత్తర గర్భాన్ని రక్షించావు ,ధ్రువుడికి ఉన్నతోన్నత పదం ప్రసాదించావు ,ద్రౌపదిని నిండు సభలో కాపాడావు .రాక్షసుల ఆగడాలవలన యజ్ఞయాగాదులకు ఆపద కలిగి ప్రార్ధిస్తే రాముడివైపుట్టి దుష్ట రాక్షస సంహారం చేశావు .ఇంద్రుడు కోపంతో రాళ్లవర్షం కురిపిస్తే గో,గోపాలురను కాపాడిన దయా సముద్రుడవు .తండ్రి పెట్టిన అన్ని యమ నరక బాధల్ని తట్టుకోనేట్లు గా ప్రహ్లాదుని కాపాడి స్తంభంలో నృహరిగా అవతరించి హిరణ్యకశిపు ప్రాణాలు హరీ మనిపించావు .శరణు అన్నవాడిని కాపాడావు .పుంభావ మొహాన రూపంతో రాముడిగా ఉన్నప్పుడు నీ పరిష్వంగ సుఖం కోరిన తాపసులు మొదలైనవారికి కృష్ణావతారంలో ఆకోర్కే తీర్చావు .
గొల్ల ఇళ్ళల్లో పాలువెన్న దొంగిలించి తిని,ఆగమాగం చేసి .ఏమీ తెలీని నంగనాచిలా అమ్మకూచిలా యశోదను నమ్మించి ‘’బాపురే పదునాలుగు భాండాలు నోటిలో చూపించి ధన్య ను చేశావు .నిన్ను తప్ప ఎవర్నీ ఏదీ కోరలేదు నాపై ఉపేక్ష మాని ఆదుకొని కాపాడి మోక్షమివ్వు .’’నారద తుంబుర నంది వాహనులను నువ్వు రక్షించటం నిజమైతే ద్రౌపది దంతీన్ద్రుడు అంటే గజేంద్రుడు లను కాపాడినవాడివైతే అర్జున అహల్య ,అ౦బరీషాదులను రక్షించటమే నిజమైతే,ఉద్ధవ అక్రూరాది భక్త వరదుడవే నీవైతే వెంటనే వచ్చి నన్ను రక్షించు .ధర్మం నిల్పి అధర్మం బాపి అవతార పరమార్ధం చూపి ,సక్కుబాయి మీరాబాయి వంటి భక్త శిఖా మణులను కాచినట్లు నన్ను కూడా కాపాడు నువ్వే నాకు దిక్కు ఏడుగడ,ప్రాపు అని నూరవ పద్యం చెప్పి ,నూట ఒకటవ పద్యంలో పూర్తిగా భక్తిరంగరించి నైవేద్యం పెట్టారుకవి –
‘’శ్రీరామ జయరామ సీతామనోహరా-మారుతాత్మజ సేవ్య మంగళంబు –దశరదాత్మజ దుష్టదానవ సంహార మాత పిత్రులసేవ్య మంగళంబు
సాకేత పురవాస సాధు రక్షణ ,దుష్ట మదనాశనా నీకు మంగళంబు –అహల్యా రక్షణా యాశ్రితపాలనా మాధవా నీ కిదే మంగళం
గీ.-మదన జనకుండ నీకిదే మంగళంబు –మహి సుజన పాల,నీ కతి మంగళంబు –
సుబ్బరాడ్వరదా హరీ సుర నుతేంద్ర –రమ్య గుణ సాంద్ర మార్టేరు రామ చంద్ర ‘’అంటూ మంగళం తొ ముగించారు .
చివరగా ‘’సంసార సర్ప దష్టానాం జంతూనామ వివెకి నాం –శ్రీరామ పాదాబ్జం –స్మరణం పర మౌషధం -శ్రీ రామ చంద్ర శతకం సంపూర్ణం –శ్రీ వేణుగోపాల స్వామి పర బ్రాహ్మణా ర్పణమస్తు ‘’‘’అని శ్లోకంతో పరి సమాప్తి చేశారు .మరోశ్లోకం లో –గుణ దోషౌబుధౌ గృష్ణ -నిందుక్ష్యేళావివేశ్వరః –శిరసా శ్లాఘతే పూర్వం –పర కంఠే నియచ్చతి ‘’అని స్వస్తి పలికారు .
ఈశతకాన్ని ‘’1922-23 న్యాయ దీపిక ,1929-30 రెడ్డి రాణి పత్రికల నుంచి పునర్ముద్రితం అని పేర్కొన్నారు .అనుబంధంగా ‘’కవి వైరాగ్యం’’అనే సీసపద్య శతమాల ను జత చేశారు .శ్రీ వెలగల సుబ్బారెడ్డి కవిగారు –శ్రీ రంగనాధ నామ సంకీర్తనలు ,ప్రహ్లాద చరిత్ర హరికధ ,మదన గోపాల శతకం ,ధ్రువ చరిత్ర హరికధ ,కృష్ణలీలలు అనే దసరా పద్యాలు ,ముకుంద శతకం,జయదేవ చరిత్ర హరికధ ,సుబ్బరాడ్గాన రామాయణం ,గజదొంగ వైరాగ్యం అనే ప్రహసనం ,శ్రీ నమ్మాళ్వార్ చరిత్ర ,ప్రచ్చన్న క్షత్రియ (కమ్మ రెడ్డి కాపు,వెలమ )కుల ప్రబోధం ,పంచమ అనే ఆది ఆంధ్ర కుల ప్రబోధం ,భారత మాత స్తవం,వైకు౦ఠ ఏకాదశి వ్రాత ప్రశంస ,పరమార్ధ ప్రబోధం ,పుష్య శుద్ధ ఏకాదశి మహాత్మ్యం ,శార్దూల వృత్త వింశతి పద్యమాల ,నాలుగు భాగాలుగా కీర్తనలు రచించారు .ఇవన్నీ వెలలేని గ్రంధాలే .భక్తి మకరందాలే .కవిగారి ఇంటిపేరును అంటే ‘’వెలగల ‘’ను రుజువు చేసేవే .చక్కని ధార,మంచి ఎత్తుగడ ,భక్తీ జ్ఞాన వైరాగ్య త్రివేణీ సంగమంగా ఈ శతకాన్ని తీర్చి దిద్దారు .మహా మహా కవుల స్థాయికి తీసిపోని వైదుష్యం కనిపిస్తుంది .కానీ మన వాళ్ళు ఎవరూ ఎక్కడా ఈ కవి ఈ శతకం గురించి ఉదాహరించిన దాఖలాలు లేవు .అఖండ గోదావరీ ప్రవాహ సదృశం గా కవిత్వం పరిగెత్తింది అందులో మునిగి తేలి తన్మయులమై శ్రీ రామ చంద్ర దర్శన సౌభాగ్యమే కాదు మొక్షాన్నీ పొందగలం .ఇలాంటి గొప్ప శతకాన్నీ .దాన్ని తీర్చి దిద్దిన కవిని పరి చయటం నా మహాద్భాగ్య౦గా భావిస్తున్నాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-28-4-23-ఉయ్యూరు