చ౦పకోత్పలాలతో వృషాధిపునికి శతకం
తూగోజి రామ చంద్రపురం తాలూకా ఆలమూరు నివాసి శ్రీ పెనుమత్స మహాదేవ కవి చంపకమాలిక ,ఉత్పలమాలికా పద్యాలతో వృషాధిపతి శతకం రాసి ,అమలాపురం తాలూకా గెద్దనపల్లి నివాసి శ్రీ బుద్ధరాజు రంగరాజా వారి ద్రవ్య సాయంతో రామ చంద్రాపురం లో పళ్ళే సేతునారాయణ రావుగారి శ్రీ ఆనంద తీర్ధ ముద్రాశాల యందు 1939లో ప్రచురించారు .వెల-రెండు అణాలు .బుద్ధరాజు రంగరాజు వంశాన్ని చక్కని పద్యాలతో వర్ణించాడు కవి .’’రాక్షస హరనంబు రామాయణ౦ బన్న ,బంధు హరణమన్న భారతంబు-పాప హరణ మన్న బసవ పురాణంబు –విశ్వదాభిరామ వినుర వేమ’’అనే జనకవి వేమన పద్యాన్ని ఉదాహరించి ,కేవల భ్రున్గీశ్వర అవతారం అయిన పాల్కురికి సోమనాధకవి ద్విపద కావ్యంగా రాసిన బసవ పురాణం లోని మహా భక్తుల చరిత్రనే తాను ఈ వృషాధిప శతకం గా కూర్చానని చెప్పాడు .ఈ శతకం పరమార్ధ దాయకం అన్నాడు . ’బసవా బసవా బసవా వృషాధిపా’’అనేది శతక మకుటం.
శతకాన్ని ఉత్పలమాల పద్యంతో –‘’శ్రీ గిరిజాధవాయ ఘన ,జిహ్మగచిత్ర విభూష ణాయ నా-నాగమ సేవితాయ,నయ ,నాధికవి శ్రుత మూర్తయే నమ –స్తే గప వైరిణేపశుపతే ద్విప చర్మ భ్రుతేశివాయ శుభ్రాగ విభో యటంచు ‘’బసవా బసవా బసవా వృషాధిపా ‘’ శివ ధ్యానం చేసి రెండవ చంపకమాల పద్యం లో మల్లికార్జునకవికి కైమోడ్పు లొసగి,తర్వాత పాల్కురికి సోమన ను భజించి ,శతకం అంటే పాల్కురికి వారిదే శతకం అని భక్త్యంజలి ఘటించి ,’’అసమ విలోచనుడవు,మహామహిమాన్విత మూర్తివి ,ఆర్తిచే మసలు సకల చరాచర మును మన్నన చేస్తూ అసదృశ సత యశస్కరుడవు ‘’అని లింగని కీర్తించాడు .బిజ్జల మహా భక్తుని మహారాజును చేశావు .బసవ పురాణ శతకం చదివి పరవశంతో ఈ శతకం రాస్తున్నాను .జైన బౌద్ధ చార్వాకాలను శమించి శర్వుడే సర్వులకు దిక్కు అని చాటాడు సాంఖ్య తొ౦డడు .అసమ విలోచనుడు ,అసమ పురాన్తకుడు ,అసమసుతోజ్వలుడు ,అసమ మహావతారుడు శివుడు అని చక్కని పద్యం అసమానంగా చెప్పాడు కవి .;;ఓ త్రిపురాంతకా అంటే ,ఓ యని వెంటనే పలికే భోళా శంకరుడివి .భక్తితో అన్నీ వండి పెట్టిన నిమ్మవ్వ నీకు పరమ భక్తురాలు .కలలో తనను బౌద్ధుడు ఒకడు తాకాడని ,పెనం కాల్చి హాటకేశ్వరుడు చూస్తుండగా ,దానిపైన నిలుచున్న వీర శంకరుడు నీ వీర భక్తుడు .
శివునికి నమస్కారం చేయ కుండా భోజనం చేయని నియమం ఉన్న సోమన అంధుడవటం వలన జైన ప్రతిమకు మొక్కి౦ప చేస్తే ,శివుడు జిన స్వరూపాన్ని చీల్చి నిజాకృతి తొ ప్రత్యక్షమై మోక్షమిచ్చిన కథ చెప్పాడు కవి .బిజ్జల మహారాజు నీకు భక్తితో పూజలు చేస్తే మాదమా౦బా గర్భం లో నువ్వు జన్మించి సంతోషం కలిగించావు .వెంకటాఖ్యుడు ,మడివాలు మాచయ ల ఉదంతాలను గుర్తుకు తెచ్చాడు .నూనె వత్తులు కొనే డబ్బులేక తన శిరోజాలనే వత్తిగా చేసి పూజించిన లింగామాది కి కైవల్యమిచ్చావు .కపిలేశ్వర పురంలో ఒక భక్తుడు శివునికి క్షీరాభి షేకం చేస్తుంటే ,ఆపాలదారలో కాలుజారి పడిన ఒక గొల్లపిల్ల’’ బసవా ‘’ అని ఆర్తిగా అంటే ,ఆమెకు ఊతమిచ్చి నీ సన్నిధికి చేర్చుకొన్నావు .నందీశ్వరుని మూడేళ్ళు భక్తితో కొలిచిన మాదమామ్బకు సంగమేశుడు ఉపదేశమివ్వగా ప్రసన్నుడవై కాపాడి రక్షించావు .
పరమేశ్వర నామాలను గుదిగుచ్చి రాసిన పద్యరాజం చూడండి –‘’శ్రీ మహిత ప్రభావ ,జిత చిత్తభవ ,స్తవ సక్త భావ ,దు-ష్కామఖ లాళి భైరవ ప్రశస్త ,సుధీజిత జీవగాన –విద్యా మహిమానుభావ నుత ,హైమవతీ ధవ ,శైవ భావన -స్వామి వి నీవ దేవ దేవ బసవా బసవ బసవా వృషాధిపా ‘’ కోరి నిన్ను భజిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది.ఇంకో విధంగా రానే రాదు . శివునికి నమస్కరింపక పోవటం వలన రంగడు అనే వాడికి రెండు కళ్ళూ పొతే ,శివధ్యానం చేసి ఒకకన్ను పీకి రెండవది రాకపోతే శివ సముడైన పాల్కురికి ,శిష్ట కులాగ్రణి సోముడిచ్చేసద్భవసంబు నిన్ను దలంచి ‘’అని మరో శివగాధ చెప్పాడు కవి .కంచికి వచ్చి తాండవ వికారుడైన శివుని చూసి,పక్షవాతం వచ్చిందేమో అనుకొని ,డబ్బు అంతా ఖర్చు చేసి ప్రయోజనం కనిపించక ,చచ్చిపోతాను అన్న భక్తుడి మాటకు నాట్యమాడి సంతోషంకలిగించావు పరమ భక్తాగ్రేసరుడవు నువ్వే అని కీర్తిన్చావు .
మరో అద్భుత పద్యం –‘’ఉపల జిన స్వరూపమున నుక్కును బోసియు ,దాని ము౦గ లన్ – ద్రిపుర హరుం జలింపకకయ ,నిల్పు మన౦గ ,మహోగ్ర మూర్తియై –శపధము జేసే కట్టెదుట ,శంకర దాసి నశింప జేసే నీ-కపర శివుండు అతడు ‘’.103 వ ఉత్పలమాల పద్యంలో –‘’ఈతరి గూర్చితీ శతక మీశ్వర కార్తిక శుద్ధ పౌర్నమిన్ –ఖ్యాతిగ శాలివాహన శతాబ్దము లెన్నగ రత్న బాణ ది-గ్ర్వాత మృగాంక 1859 సంఖ్య యయి ,రాజిల నాహిమధామ భార్కమై –పాతక తూల వహ్ని బసవాబసవా బసవా వృషాధిపా’’.105 చివరి చంపక మాల లో –‘’బసవ కులుండనే బసవ ,భక్తుడనే ,బసవ ప్రియుండనే-బసవ సుతుండనే ,బసవ పాలితుడన్ ,బసవాప్త బంధుడన్ –బసవ సమాఖ్యుడన్ ,బసవ పాద రజః కలితోత్తమా౦గుడన్ –బసవ నినున్ స్మరియించి బసవా బసవా బసవా వృషాధిపా’’అని అంతా బసవమయంగా శతకం పూర్తి చేశాడు కవి .వీర శైవ వాజ్మయం లో మహామహ కవులకు దీటైన కవిగా ఈ శతక కర్త పెనుమత్స మహాదేవ కవి అనిపిస్తాడు .కవిత్వం ధారగా భక్తీ గా ప్రవహించింది .ప్రతి భక్తుని కథను ఆసక్తికరంగా వర్ణించాడు .మంచి శతకాన్నీ మహా భక్త శిఖామణి అయిన కవినీ పరిచయం చేసే మహద్భాగ్యం నాకు కలిగింది ధన్యుడిని .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-23-ఉయ్యూరు