” ఆలోచనా లోచనం ” ” వినదగు నెవ్వరు చెప్పిన i”

      ”  ఆలోచనా లోచనం ”
                                                     ”  వినదగు నెవ్వరు చెప్పిన i” 
                                                     ఆలోచనా లోచనం శీర్షిక లో ఇది ఆకాశ వాణి విజయ వాడకేంద్రం నుండి 26 – 04 – 11 న ప్రసారమైంది

               రాచ కార్యాలలో తలమునకలైన రాజు కొన్ని సందర్భాలలో స్వార్ధం కోసం కొన్ని నిర్ణయాలు చేస్తాడు .అవి అతనికి మంచి గానే కన్పిస్తాయి .ఆ నిర్ణయం వల్ల రాజుకు ,రాజ్యానికి ప్రమాదకరం అయితె మంత్రి పురోహితుడు తప్పకుండా రాజుకు హితబోధ చేసి ఆ చెడు మార్గం నుంచి మల్లించాలి .రాజుకు భయపడి చెప్పక పొతే రాజ్య ద్రోహమే అవుతుంది .ఒక్కొక్క సారి రాజు దగ్గర పని చేసే కింకరులు కూడా తమ వంతు ధర్మం గా ధర్మ బోధ చేసి ఆ పాప కార్యం నుంచి రాజు మనసు మల్లించాలి వీరినేవరినీ లెక్క చేయకుండా ఆ రాజు ప్రవర్తిస్తే రామాయణం లోని రావణునికి పట్టిన గతే పడుతుంది .సీతాపహరణ సమయం లో మారీచునికి ,రావణునికి జరిగిన సంవాదం అందరు తెలుసుకో దగినదే .
                  రావణుడు సీతాదేవిని చేరబట్టతానికి మారీచుని సాయం కోరి వచ్చాడు .తన సోదరి శూర్పణఖ ముక్కు ,చెవులు రామ లక్ష్మణులు కోసారనీ ,రాముడికి తనపై సత్రత్వం లేకపోయినా యుద్ధానికి వచ్చాడని ,తన సోదరికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని రామ సతి సీతను జనస్థానం నుంచి అపహరించటానికి సహాయం చేయమనీ కోరాడు .బంగారు జింక వేషం వేసుకొని వారిని ఆకర్షించాలని ఉపాయము చెప్పాడు .సీతను అపహరిస్తే రాముని బాల పరాక్రమాలు తగ్గి విరహం తో క్రుసిస్తాడని ,అప్పుడు అతన్ని వోదించటం తనకు తేలిక అవుతుందనీ ముందే సిద్ధం చేసుకుని వచ్చిన ప్రణాళిక లోని ఆలోచనలను బయట పెట్టాడు .రావణ దుష్టపన్నాగం తెలిసిన మారీచుడు రావణుడు తనను పావుగా వాడు కుంటున్నాడని గ్రహించాడు .ప్రభు సేవ ముఖ్యమే అయినా దారి తప్పుతుంటే వుపెక్షించటం మంచిది కాదని ధైర్యం తో సూటిగా ,నిష్కర్ష గా ”రాజా/రాజుకు హితము చెప్పే వారి కంటే అప్రియాలు చెప్పే వారే ఎక్కువగా వుంటారు .మంచిమాటలు మొదట అహితం గా వున్నా ,దాని వల్ల మేలే జరుగు తుంది .రాజు గా నీ కర్తవ్యమ్ సరిగా లేదు .సరైన గూద చారులు నీకు లేరు .చపల బుద్ధి తో తప్పుడు నిర్ణయాలు చేయ వద్దు .”అన్నాడు .రావణుడు అతని మాటలను పెడ చెవిన పెట్టాడు .మారీచుడు తన స్వీయ అనుభవాన్ని వివరించి చెప్పాడు .రాముడు పన్నెండు సంవత్చరాల వయసు లోనే విశ్వామిత్ర మహర్షి యజ్న సంరక్షననం చేసాడని బాలుడే కదా అన్న గర్వం తో తాను యాగ ధ్వంసం చేయటానికి i ప్రయత్నించాననీ రామ బాణం తో తాను వంద యోజనాల దూరం లో వున్న సముద్రం లో పడిపోయానని చివరికి లంక చేరు కున్నాననీ ,వివరించాడు .పాము తో స్నేహం చేసే చేపలు కూడా గరుత్మంతునికి ఆహారం అయినట్లే పుణ్యాత్ములు కూడా పాపులవల్ల నసిస్తారని మనవి చేసాడు .రాక్షస కులం సర్వ నాశనం అవుతుందని హెచ్చరించాడు .తన రెండవ అనుభవం చెబితే నైనా రావణుడు మారు తాదేమో నని అదీ చెప్పాడు .దండకారణ్యం లో రాముడు వణ వాసం చేస్తుండగా తాను జింక రూపం ధరించి రాక్షస సాయం తో మునులను బాధించాననీ ,ఒక సారి తాను మృగ రూపం లో శ్రీరాముని పై ఒక్క సారిగా దాడి చేశాననీ ,రాముడు కోపం తో మూడు బాణాలు సంధించి మెరుపుల్లా వదిలాదనీ శ్రీరామ తత్త్వం తనకు ముందే తెలుసు కనుక పారి పోయానని మిగిలిన రాక్షసులు రామ బానాగ్నిలో మాది మసి అయ్యారని తెలియ జేశాడు .అప్పటి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈ ఆశ్రమం లో తపస్సు ,యోగ సాధనా చేస్తూ ప్రశాంత జీవనం సాగిస్తున్నాననీ ,చెప్పాడు .స్వప్నం లో కుడా ర అనే అక్షరం వినిపిస్తే రాముడే కనిపిస్తున్నాదనీ అన్నాడు .సుర్పానఖ విషయం లో రాముని తప్పు లేదనీ ఆత్మ రక్షణ చర్య గా దాన్ని భావించాలని సూచించాడు .
                        ఇవేవీ వినిపించుకోకుండా రావణ ప్రభువు ”నేను ప్రభువును .నాకు ఇష్టం లేని మాటలు చెప్పావు .సేవకుడు అలా చెప్పరాదు .నేను అడిగితేనే చెప్పాలి .రాజుకు ఇష్టం లేనిదైనా సుతిమెత్తగా ,మంచి మాటలతో చెప్పాలి .నువ్వు చాలా కర్కాసం గా చెప్పావు .రాజ ధర్మం తెలియని పామరుడివి .నీ దగ్గరకు వచ్చానని రాజు నైనా గౌరవించకుండా దుర్భాష లాదావు .నేను చెప్పినట్లు చేయటమే నీ కర్తవ్యమ్ .ఇది రాజాజ్న ”అని తీవ్రం గా మారీచుడిని భయ పెట్టాడురావణుడు రాజ దర్పంతో .చెప్పిన పని చేయక పొతే చంపేస్తానని బెదిరించాడు కుడా .మారీచుడు భయ పద లేదు .భ్రుత్యునిగా చివరి ప్రయత్నం గా ”లోక రీతికి విరుద్ధం గా ప్రవర్తిస్తున్నావు రాజా /నిన్ను నివారించలేని మంత్రులు వృధా .వారంతా మనస్పూర్తిగా నీ మనస్సు మార్చే ప్రయత్నం చేసినట్లు లేదు .రాజు సద్బుద్ధి తో ప్రవర్తిస్తే ఆ కీర్తి మంత్రులకు దక్కు తుంది .రాజు చెడ్డ వాడైతే మంత్రులకు అందులో భాగం వుంటుంది .ప్రజావ్యతిరేకి ,ఇంద్రియ జయం లేని రాజు పాలనార్హుడు కాదు .నా నాశనం దైవికం .నువ్వు బుద్ధిపూర్వకంగగా రాక్షస సర్వ నాశనం చేయబోతున్నావు .చావు దగ్గర పడితే మనుష్యులు శవాలు అవుతారు .అందుకే ఆ సమయం లో చెప్పిన మంచి మాటలు వినిపించు కోరు .నువ్వు చెప్పినట్లు చెయ్యక పొతే నీ చేతిలో నాకు చావు తప్పదు .చేస్తే శ్రీరాముని చేతిలో చస్తాను .మోక్షం పొందుతాను .”అని చివరి మాటగా చెప్పాడు .ఆయువు తీరే సమయం లో దీప గంధాన్ని వాసనచూడలేరనీ  మిత్ర వాక్యం వినరనీ  .,అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరనీ పెద్దలు అంటారు .అదే రావణుని విషయం లో జరిగి తన రాక్షస వంశ సర్వ  నాశనానికీ  కారణ భూతుడైనాడు .
                                                                                                  గబ్బిట దుర్గాప్రసాద్
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రేడియో లో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.