భక్త త్రాణ పరాయణ శతకం
ఆంధ్ర గీర్వాణ కవిత్వ కావ్య నాటకా లంకార సాహిత్య పండిత సార్వ భౌమ ,అద్వైత సార వేద ,శ్రీ కోదండ రామ చరణార వింద ధ్యాన పరాయణ శ్రీ లింగం జగన్నాధ కవిరాయలు ‘’భక్త త్రాణ పరాయణ శతకం ‘’రచించగా ,పౌత్రుడు శ్రీ మాధవ ,లక్ష్మీ నారయణాది శతకకర్త ,భక్త జన చరణ రేణువు ,పీఠికాపుర వాసి ,రిటైర్ద్ డిప్యూటీ తాసిల్దార్ శ్రీ లింగం లక్ష్మీ జగన్నాధ రావు చే ఆంధ్రీకరి౦పబడి ,కిం కవీంద్ర ఘంటా పంచానన మొదలైన బిరుదాంకితులు శతావధాని శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి చే సరిచూడ బడి ,1941లో పిఠాపురం శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలయందు ప్రచురింప బడింది .వెల తెలుపలేదు కనుక అమూల్యం అని భావించ వచ్చు నేమో ?తాతగారి సంస్కృత శ్లోకం ,మనుమడి గారి తెలుగు అనువాద పద్యం కలిపి ఉండి’’టు ఇన్ వన్’’గా వున్న శతక రాజమిది .సంస్కృతంలో ‘’భక్త త్రాణ పరాయణత్వ మధునా మయ్యాశు సత్యం కురు ‘’అని తాత గారు మకుటం పెడితే ,మనవడు ‘’భక్త రక్షణ పరత్వంబున్ ప్రదర్శి౦పుమా ‘’ అని మార్చారు .తాత శార్దూల౦పైఊరేగిస్తే , తెలుగులో శార్దూల,మత్తేభాలపై పౌత్రకవి ఆత్రత్రాణుడిని ఊరేగించారు . తాతా, మనవల కవిత్వ సౌభాగ్యం దర్శిద్దాం.
మొదటి శ్లోకం –శ్రీ కారుణ్య పయోనిధే ,,రఘుపతే ,కోదండ రామార్తి హన్ –త్వత్పాదాబ్జే నిషేవయా త కవితా గీర్వాణ వాణ్యా శతం –శ్లోకానాం నిజభక్త సూచన పరం శార్దూల నామా౦కితం –దాస్యే హం విరచయ్య తుభ్యమమలం సంగృహ్యతా మాదరం’’
తెలుగు –‘’శ్రీ కారుణ్య పయోనిధీ !రఘుపతీ!శ్రీ రామ చంద్ర ప్రభూ !నీ కారుణ్యమునన్ జెలంగు కవితన్ గీర్వాణ భాషన్ మద-స్తోకంబై తగు భక్తి గన్బరచు శార్దూలంబు లౌ నూరును –శ్లోకంబులు ల్ రచయించి యిచ్చితి దయన్ జూపించి గైకొ గదే ‘’అంటూ మక్కీకి మక్కీ దింపేశారు పౌత్రులు .మూడవ పద్యం లో తన దేశికుడైన సోమనకు నతులొనర్చారు .గురు దేవునికి ఆత్మ ను తప్ప ఏమివ్వగలను అన్నారు తాతామనవలు .లక్కవరం అనే పల్లెలో పుష్పగిరిలో ఉన్న రఘునాధా వేగమే కాపాడమన్నారు.దేహం ఉన్నంతకాలం అహర్నిశం నా హృదయంలో ఉండు.నా ఆశ్రయం సర్వమూ నువ్వే .’’త్వత్కార్యం నిజ సంసితార్ధి హరణం ముఖ్యం త్వమే వోక్తవాన్ –త్వద్భక్తాస్తు ఖలైహ్కిలార్దితతమా స్సీదంత నన్యాశ్రయాః’’అని తాత అంటే ‘’సిత సంత్రాణము ముఖ్యకార్యమని కూర్మిన్నీవు వాక్రుచ్చవే ?గతి లేకిప్పుడు నీదు భక్తులు ఖలుల్ గారింప దుఖి౦త్రు’’అని మనవడు వాక్రుచ్చాడు .
70 వ శార్దూల పద్యంలో ‘’జగముల్ సృష్టి యొనర్చు నీకిదే నమస్కారంబు జ్యోతిర్మయా !జగముం జొచ్చి ప్రపూర్ణుడౌచు నిజ చిచ్ఛక్తిన్ సమస్తంబు నొం-దంగ జైతన్యము నిర్వికారుడగు నీ తత్వంబు కన్బట్టేగా ‘’అంటూ తాతగారి హృదయాన్ని ఆవిష్కరిచారు మనవడుకవి .80లో ధ్రువ చరిత్ర గానం చేశారిద్దరూ .ఆతర్వాత దశావతార వర్ణన క్రమంగా వర్ణించారు ..’’ఓంకారాది సమస్త వేద నివహం హృత్వాంబుధే రంతరం –ప్రాప్తం సోమకనామ ఘోర దనుజం హత్వా తదన్తర్గతం ‘’అని పెద్దాయన మొదలుపెడితే చిన్నాయన ‘’సోమకాఖ్య దనుజున్ ఖండించి వేద౦బులన్ –మిగులన్ బ్రేమను వేధ కిచ్చిన భవన్మీనాకృతిన్ గొల్తు ‘’అని ముగించారు .క్షీరసాగర మాధనాన్ని అద్భుతంగా యువకవి వర్ణించిన వైనం –‘’కలశా౦బోనిధి యందు మంధర గిరిన్ గవ్వంబుగా నుంచి ,వాసుకి ని త్రాడు చేసి,దేవారాతులు దేవతలు చిలుకగా ,కుంగిన కొండ నెత్తి’’అంటే తాతగారు –‘’త్వం మకరో స్త్వత్కూర్మ రూపం భజే ‘’అని జేజేలు పలికారు .’’దంతాగ్రేణ భువం దధాణ మనఘం త్వద్ఘ్రోణి రూపం భజే ‘’అంటే –పిల్లకవి –‘’అవనిన్ బట్టి రసాతలాన్తర్గాతుం డౌ నా హిరణ్యాక్షు చంపి ,వెసన్ స్థావర జంగమ ప్రకరముల మేలంద శృంగంబు నందు –అవలీలన్ ధర దాల్చు నీదగు వరాహాకారమున్ గొల్చెదన్ ‘’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు .అలాగే ‘అమరార్యర్భకు భక్తవర్యు గుణి బ్రహ్లాదుని’’రక్షించి ‘’సర్వ వ్యాప్తి నిదర్శకం నరహరే త్వన్మిశ్రరూపం భజే ‘’అన్నారు నృసింహ వరదుని తాతగారు .’’మూడు పదముల్ భిక్షించి ముల్లోకముల్ గలయ బ్రాకిన ఆ త్రివిక్ర పరబ్రహ్మాన్ని ‘’త్రివిక్ర మాహ్వాయ జుషోతద్రూపిణ౦ త్వం భజే ‘’అన్నారు తాత కవి . . సరసీజాత భవుండు కోరగా రఘు వంశం లో పుట్టి ,సచ్చరిత్ర ,పితృ వాక్యపాలనతో ధన్యత్వంపొంది రావణ సంహారం చేసిన శ్రీరాముని’’హత్వా ఖిలా నత్యయే స్వస్థానం గమితో సి భక్త నివహం మర్త్యాది కీటా౦తకమ్ ‘’అని స్తుతించారు తాత .ఇలా దశావతార వర్ణన అయ్యాక –‘’పాతాళం నీ పదం జాను,జన్ఘువులు సుతలం , తొడలు వితలం ,భూమి కటి ,ఆకాశం నీ నాభి ముఖం మహజ్జగం ,శీర్షం సత్యం అని మునులు కీర్తిస్తారు అన్నారు .నిన్ను పరమాణువు అని ,ప్రజ్ఞానం అనీ ,సర్వ సాక్షి చైతన్యం అని ఎవరికీ తోచినట్లు వారు భావిస్తారు .
111 లో –‘’యోవా స్తోత్ర మిదం పఠేదహరహర్ భక్తాగ్రణీ స్స స్వయం –త్యక్త్వా ఘోర దురంత నైజ కలుషం శుద్దాత్మనా వస్తుతః ‘’అని తాత కవి రాస్తే ,పౌత్రకవి –ఈ శతకం చదివితే ఆగడాలన్నీ పోయి ‘’ఇష్టా వాప్తి చేకూరి శ్రీయుతుడై ,,దేహము బాసి శ్రీ శుక రుణోద్యోగంబు నన్ పొందు –ఉన్నత సాలోక్య ముఖాత్మమోక్షము ‘’అని భరోసా ఇచ్చారు .112లో తాతమనవలు ఏకవాక్యంగా –లోహిత గోత్రజుడు విబుదాశీస్తోత్ర సత్ప్రాప్యుడు ,ఉద్దమ నరసింహ సూరి తనయుడు ,ధన్యుడు ,అవిశ్రాంత శ్రీ మన్మాధవ పాదారవింద సేవకుడు శ్రీ జగన్నాధామాత్య కవి ఈ శతకాన్ని పండితులకు ఆహ్లాదం కలిగేట్లు రాశారు అని పూర్తి చేశారు –‘’శ్రీ నారాయణ పాద సేవ రతినా ,భవ్యాత్మనా ,శ్రీ జగన్నాధా ఖ్యేన సమర్పితం స్తుతి శతం విద్వద్ముదే కల్పతాం’’.
నిజంగానే ఇది భక్త త్రాణ పరాయణ శతకం .భక్తులకు కొంగు బంగారం .చక్కని సంస్కృతం సుసంపన్నమైన తెనుగు సేత కలిసి శతకానికి వన్నె ,సౌందర్యం మాధుర్యం చేకూర్చాయి .తాతా,మనవలైన ఆకవి పు౦గవులకు మనం ఎన్ని రకాల ధన్యవాదాలు చెప్పినా తనివి తీరదు .చదివి ఆనందామృతాన్ని గ్రోలి మోక్షం పొందాలి మనమందరం.ఈ కవులను శతకాన్ని పరిచయం చేసే మహద్భాగ్యం నా పుణ్య వశాన కలిగింది. ధన్యోహం.
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-5-23-ఉయ్యూరు