03.రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ అర్థ విశేషాలు ((25-10-2011 తేదీన మరికొంత విషయం కలుపబడింది.)

తిరుమల గర్భగుడి లోని శ్రీ రాముడు ఫట్నం సుబ్రమణ్య అయ్యర్
(చాయా చిత్రాలు:గూగుల్ సౌజన్యం)
తమిళనాడు తంజావూరు జిల్లాలో తిరువాయూర్ లో జన్మించిన ఫట్నం సుబ్రమణ్య అయ్యర్ (1845 – జూలై 31, 1902) చక్కటి స్వరకర్త. త్యాగరాజ ప్రభావితులు. వారి ప్రసిద్ధ కృతి “రఘువంశ సుధాంబుధి”. ఈ కీర్తన అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకొందాం.
పల్లవి:
1.రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ
రామ రామ రాజేశ్వర
అనుపల్లవి:
2.అఘ మేఘ మారుత శ్రీకర
అసురేంద్ర మృగేంద్ర వర జగన్నాథ
చరణం1:
3.జమదగ్నిజ గర్వ ఖండన జయ రుద్రాది విస్మిత భండన
కమలాప్తాన్వయ మండన అగణిత అ ద్భు త శౌర్య శ్రీ వేంకటేశ్వర
చరణం2:
4.భృగునందనా కవిభంజనా బృందారక బృందహితా
నిగమాంతవ సుబుధావనా నీరజాక్ష శ్రీ వేంకటేశ్వర
భావం
1.శ్రీరామా! రఘువంశము అనే అమృతసాగరమును వృద్ధి పొందించు చంద్రుడా! రాజులకు అధిపతీ !
2. పాపమనే మేఘాలను తరిమికొట్టే పెనుగాలివంటి వాడా! శుభాన్ని ఇచ్చేవాడా! , రాక్షస శ్రేష్ఠులకు సింహములాంటి వాడా! శ్రేష్ఠుడా ! జగత్ప్రభూ!
3.జమదగ్నికి జన్మించిన పరశురాముని గర్వము పోగొట్టిన వాడా! శివుడు మొదలైన వారికి యుద్ధంలో ఆశ్చర్యం కలిగించి విస్మయము కలిగించిన వాడా ! కమలాలకు ఇష్టుడైన సూర్యుని వంశంలో జన్మించి, ఆ వంశానికి అలంకారమైన వాడా ! లెక్కపెట్టడానికి వీలులేని అద్భుతమైన పరాక్రమము కలిగిన వాడా! , శ్రీ వేంకటేశా!
4. భార్గవరామా! , శుక్రునిజయించిన వాడా!, దేవతల బృందానికి రక్షకుడా! వేదాంతమునుచదువుకొనే గొప్ప గొప్ప పండితులనురక్షించే వాడా, కమలముల వంటి కన్నులు కలవాడా! శ్రీ వేంకటేశా!
అంతరార్థం
రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ
ఇక్ష్వాకు వంశంలో రఘువు అనే మహారాజు జన్మించి అత్యద్భుతమైన దాన పరాక్రమ విశేషాలు ప్రదర్శించాడు కనుక అతని పేరు మీదుగ ఇక్ష్వాకు వంశానికి రఘువంశమనే పేరు వచ్చింది.
పౌర్ణమినాడు చంద్రుని చూస్తే సముద్రం పొంగుతుంది. దీనిని వర్ణించటం మన కవులకు చాలా ఇష్టం.
రఘు మహారాజు పుట్టినప్పుడు , దిలీప మహారాజు మొట్ట మొదటిసారి చూసాడు. చంద్రోదయ కాలంలో సముద్రం అనందం పొంది ఒడ్డులని ఒరుసుకొన్నట్లు , పుత్రున్ని చూసిన ఆనందం దిలీప మహారాజులో ఇమడలేక బయటికి వచ్చిందని కాళిదాసు మనోహర వర్ణన. (రఘు వంశం-03-17 శ్లో)
శ్రీరాఘవం ధశరధాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుభాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం.. నమామి…
అనే శ్లోకం మనందరికీ తెలిసిందే. ఇందులో రఘుకులాన్వయ రత్నదీపం అనే సమాసానికి రాముడు రఘుకులమనే సముద్రానికి చంద్రుడిలాంటి వాడని పెద్దలు అర్థం చెబుతారు. ప్రాచీన కవులందరికీ ఇష్టమైన ఈ “సముద్ర చంద్ర” సమాసానికి “సుధ” అనే విశేషణం అదనంగా చేర్చి పట్నం వారు ఈ కీర్తనలో రాముని సంబోధించారు.
అఘ మేఘ మారుత శ్రీకర
పాపానికి ఇంకోపేరు అఘం. కర్తని పొందేది, దుఃఖాన్ని విడువనిది అఘం. ఈ అఘం మేఘంలాంటిదట. “మేహతీతి మేఘః” తడుపుతుంది కాబట్టి మబ్బుని మేఘమన్నారు.
పుణ్యపు వెలుగుకి అడ్డువచ్చి , బతుకును చీకటి చేసేది మేఘం. ఈ మేఘం- గాలివల్ల తొలిగితే మళ్ళీపుణ్యాల వెలుతురు. రామచంద్రమూర్తి మన పాపాల మేఘాలను తొలగించే శీతల స్పర్శ ..
అసురేంద్ర మృగేంద్ర వర జగన్నాథ
అసురులంటే రాక్షసులని సామాన్యార్థం.అసురులనే పేరు వాళ్ళకి మూడు కారణాల వల్ల వచ్చింది.
1.సుర(అమృతము ) లేనివారు కాబట్టి అసురులు.
2.దేవతలు (సురులు)కానివారు కనుక అసురులు.
3.అసువులంటే ప్రాణాలు. వీటిని గ్రహించేవారు కనుక అసురులు.
ఇటువంటి రాక్షసులలో మహా భయంకరులైన వారి పాలిటి సింహంగా రాముడిని పట్నం వారి వర్ణించారు.
అసురేంద్రుడంటే హిరణ్య కశిపునిగా , మృగేంద్ర అంటే నరసింహావతారంగా కూడా స్వీకరించవచ్చు.
“వర” శబ్దాన్ని కవులు శ్రేష్ఠమైన అనే అర్థంలో తరచుగా వాడుతుంటారు. ఉదాహరణకి త్యాగరాజ స్వామి వారు “మానస వనచర వర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగనే వారు’ (ఎందరో మహానుభావులు) ప్రయోగించారు. చిన్న త్యాగరాజుగా ప్రసిద్ధి పొందిన పట్నం వారు కూడా “‘శ్రేష్ఠుడైన జగన్నాథుడా'” అనే అర్థంలో రాముడిని “వరజగన్నాథా ” శబ్దంతో సంబోధించారు.
జమదగ్నిజ గర్వ ఖండన
ఋచీకుడు అనేవాని కుమారుడు జమదగ్ని. ఆ
ఆ జమదగ్ని కొడుకు పరశురాముడు. (జమదగ్నిజ) .ఆయన భార్య పేరు రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు.
పరశురాముడు .కూడా తక్కువ వాడు కాదు. దశావతారాలలో ఒకడు.
ఇరువదియొక్క మాఱు ధరణీశులనెల్ల వధించి తత్కళే
బర రుధిర ప్రవాహమున బైతృక తర్పణమొప్పజేసి భూ
సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసంగితీవు కద దాశరధీ కరుణా పయోనిధీ.(రామదాసు)
క్షత్రియ రుధిర మయే జగదపగతపాపమ్
స్నపయసి పయసి శమిత భవ తాపమ్
కేశవ! ధృత భృగుపతి రూప!
జయ జగదీశ ! హరే! (జయదేవుడు)
ఇలా మహాకవుల చేత స్తుతి పొందిన వాడు పరశురాముడు.
“పరాన్ శృణాతీతి పరశుః” శత్రువులను హింసించునది అనే అర్థంలో గండ గొడ్డలిని పరశువు అన్నారు. దానిని ధరించిన వాడు పరశురాముడు.
పరశురామునిది ఆవేశావతారం. ఒక పనికోసం జీవునిలో భగవంతుని తేజస్సు ఆవేశిస్తే దానిని ఆవేశావతారం అంటారు. ఇటువంటి ఆవేశావతారాలు పూజించదగినవి కావని పద్మ పురాణంలో ఉంది. (నోపాస్యహి భవేత్తస్మాత్ భక్త్యావేశాత్మహాత్మనః )పూర్ణావతారం,(రాముడు) ఆవేశావతారం(పరశురాముడు) రెండు కలుసుకొన్నప్పుడు పూర్ణావతారంలో ఆవేశావతారం కలుస్తుంది. పరశురాముని విషయంలో ఇదే జరిగింది. దీనినే గర్వ భంగం జరిగినట్లుగా పట్నం వారు పేర్కొన్నారు.
పరశురాముడు రామునితో అన్న మాటలు:
“ఓ రామా! నీకు శక్తి ఉంటే శత్రు పురాలను జయించే బాణాన్ని ఈ వైష్ణ వ ధనుస్సుకు సంధించు. అప్పుడు నాతో ద్వంద్వ యుద్ధం చేయటానికి నిన్ను అనుమతిస్తాను. (వాల్మీకి రామాయణం- 75వ సర్గ 28-29 శ్లోకాలు) శక్తి ఉంటే ( యది శక్నోషి ) అనే మాట గర్వంతో కూడుకొన్నది. ఆధునిక కాలంలో కూడా “నీకు దమ్ముంటే రా రా! చూసుకొందాం ! “అనే మాటలు వింటుంటాం కదా! ఇటువంటి గర్వోక్తులనే పరశురాముడు పలికాడు. “నాతో యుద్ధం చేయాలంటే ఒక అర్హత కావాలి.ఈ వైష్ణవ ధనుస్సు సంధిస్తే నాతో యుద్ధం చేసే అర్హత నీకు కల్పిస్తాను” అనే మాటలు కూడా ఇంకా గర్వంతో కూడుకొన్నవి. శ్రీ రాముడు ఆ వైష్ణవ ధనుస్సును ఎక్కు పెట్టగానే భార్గవ రాముడు తేజస్సు కోల్పోయాడు. (76వ సర్గ-11వశ్లోకం) ఇదే గర్వ భంగం .
(25-10-2011 సశేషం )
నాకు నచ్చినది – మీకోసం
http://tadepallipatanjali.hpage.in/

