శ్రీ సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలలో అద్వైతా మృతం —–7
ఆత్మ బోధ
ఇంత వరకు శ్రీ సదాశివ బ్రమ్హేంద్ర కీర్తనల లో రామ రసాయనం ,క్రిష్ణామ్రుతం చవి చూశాం .ఇప్పుడు అద్వైత బోధ ను తెలుసు కుందాం .ఇందులో మొదటికీర్తన ” ‘చింతా నాస్తి కిలా ”.ను గురించి తెలుసు కుందాం.
01 — పల్లవి —చింతా నాస్తి కిలా తేషాం —చింతా నాస్తి కిలా ||
చరణాలు —-01 -శమ దమ కరుణా సంపూర్ణానాం —సాదు సమాగమ సంకీర్తానాం ||
02 —కాలత్రయ జిత కందర్పానాం —ఖండిత సర్వేంద్రియ దర్పానాం ||
03 —పరమహంస గురు పద చిత్తానాం –బ్రహ్మానందామ్రుత మత్తానాం ||
భావం —–ఇది ఆత్మ బోధ లో మొదటి కీర్తన .మానసిక పరిణతి కి మార్గోప దేశం చేశారు బ్రహ్మేన్ద్రులు .”మనో నిగ్రహం ,ఇంద్రియ నిగ్రహం వుండి ,కరుణా పూర్ణులై ,నిరంతరం సత్పురుష సాంగత్యం లో వుండే వారికి ,కామాన్ని ,ఇంద్రియ దర్పాన్ని అన్ని కాలాల్లోను జయించిన వారికి ,పరమ హంసలైన గురు పాదాల మీద ధ్యాస వున్న వారికి ,బ్రహ్మానందం అనే అమృతాన్ని గ్రోలి మత్తెక్కిన వారికి చింత అనేది లేదు -లేదు -లేదు ”
విశేషం —–లోక విషయాల నుంచే చింతలు వస్తాయి .వీటిని చూసేవి ఇంద్రియాలు .,ప్రేమించేది మనసు .వీటి వల్ల స్వార్ధం ,ద్వేషం కలుగు తాయి ..ప్రేమ తగ్గి పోతుంది .జితేన్ద్రియులకు,కామాన్ని జయించిన వారికి ప్రాపంచిక , వాంచలు వుండవు . వాటి పై అర్రులు చాచే వారిపై జాలి కలుగు తుందే కాని ,కోపం రాదు .మనసు చంచల మైంది .ఎప్పుడూ స్థిరం గా వుండదు .స్థిర చిత్తం కావాలంటే సజ్జన సాంగత్యం నిరంతరం కావాలి .మహాత్ముడైన గురువు ను చేరి ,ఆత్మార్పణ చేసు కుంటే ,గురువు అనుగ్రహం తో ,చెడు భావనలు దగ్గరకు చేరావు .బ్రహ్మ పదార్ధాన్ని అందుకొని ,ఆ ఆనందం లో నిలిచి పోయిన వారికి మనస్సు అంతరిస్తుంది .మనస్సు నాశనం అయితే ,చింతలు అసలు ఉండనే వుండవు ..శాస్వతానందానికి ఇదే మార్గం అని సదాశివులు బోధించారు .
ఇప్పుడు రెండో కీర్తన లోకి వెళ్దాం
02 —పల్లవి —-స్థిరతా నహి నహి రే ,మానస —స్థిరతా నహి నహి రే ||
చరణాలు —-01 -తాపత్రయ సాగర మగ్నానాం —దర్పాహన్కార విలగ్నానాం ||
02 –విషయ పాశ వేష్టిత చిత్తానాం –విపరీత జ్ఞాన విమత్తానాం ||
03 –పరమ హంస యోగ విరుద్దానాం —బహు చంచలతర సుఖ సిద్ధానాం ||
భావం ——ఈ కీర్తన లో మనసుకు స్థిరత్వం అనేది లేదు అని రూధిగా తెలియ జేశారు .ఎవరికి లేదు ?అని విచారించారు .”మనసా !తాపత్ర్యాలలో మునిగిన వారికి ,అహంకార దర్పాన్ని పట్టుకొని వ్రేలాడే వారికి ,విషయ వాంచలు అనే తాళ్ళతో బద్ధులైన మనసు కల వారికి ,చంచల మైన సుఖాల కోసం అర్రులు చాచే వారికి ఎన్నడు మనశ్శాంతి లభించదు ”అని నిర్ద్వందంగా చెప్పారు .
విశేషం —-తాపత్రయాలు మూడు .ఆది దైవిక ,ఆది భౌతిక ,ఆధ్యాత్మిక బాధలు .ఇతరుల పట్ల ప్రదర్శించేది దర్పం .తనలో వుండేది అహంకారం .ప్రపంచమే నిజం,దేవుడు అబద్ధమనుకునే జ్ఞానమే విపరీత జ్ఞానం .దర్పము ,అహంకారము పరమాత్మకుదూరం చేస్తాయి .విషయ వ్యామోహం కూడా పరమాత్మను చేర నివ్వదు .స్థిరత అంటే శాశ్వత మైన దానిలో స్థానం .చలించే విషయాలపై వచ్చే జ్ఞానం కూడా చంచలమైనదే .దాని వల్ల శాంతి ,స్థైర్యం లభించవు .కనుక స్థిరమై ,శాశ్వతమై ,అఖండమై ,అక్షరమైన పరబ్రహ్మం లోనే స్థిరత్వం ,శాంతి లభిస్తాయని సందేశం .
మూడవ కీర్తన లోకి ప్రవేశిద్దాం
03 –పల్లవి —-తత్త్వజ్జీవత్వం బ్రహ్మణి–తత్త్వజ్జీవత్వం ||
చరణాలు -01 –యద్వాత్తోయే చంద్ర ద్విత్వం —-యద్వాన్ముకురే ప్రతి బిమ్బత్వ ||
02 -స్థానౌ యద్వత్ నర రూపత్వం —భాను కరే యద్వత్ తోయత్వం ||
03 —శుక్తౌ యద్వత్ రజతమయత్వం —రాజ్జౌ యద్వత్ ఫణి దేహత్వం ||
— 04 – పరమ హంస గురునాద్వైత విద్యా —భనితా ధిక్క్రుత మాయా విద్యా |\
భావం —–ఈకీర్తన లో ఉపనిషత్ రహశ్యం అంతా ,గాన రూపం లో వెన్న లా అందించారు .మాయ ఎలా భ్రమింప జేస్తుందో ,దాన్ని ఎలా తొలగించుకోవాలో ,బహు చక్కగా వివరించారు బ్రహ్మేన్ద్రులు .”నీటి లో రెండవ చంద్రునిలా ,అద్దం లోని ప్రతి బింబం లా ,మ్రోడు వారిన చెట్టు లో మానవ రూపం గా ,ఎడారిలో ఎండ మావి లా ,ముత్యపు చిప్ప లో మెరిసే వెండి లా,త్రాడు లో కనబడే పాము లా,బ్రహ్మం లో జీవత్వం అనేది భ్రమ వల్ల కని పిస్తోంది .పరమహంస వరేన్యులైన గురు అనుగ్రహం వల్ల ,అద్వైత విద్య తో అజ్ఞానం అనే మాయ తొలగి ,జ్ఞాన ప్రకాశం లభిస్తుంది .
విశేషం —-దీనికి కొంత వివరణ ఇవ్వాలి .నీటి లో చంద్ర బింబం ,మరుభూమి లో ఎండ మావి ,ముత్యపు చిప్ప లో వెండి కనిపించటం లోక సహజం .కొద్దిగా విచారించి చూస్తే ,అసలు రూపం బయట పడుతుంది .అదంతా భ్రమ అని తెలిసి పోతుంది .తర్వాత కూడా అవి కనబడు తున్నా ,భ్రాంతి మాత్రం తొలగి పోతుంది చెట్టు లో అందరు మనిషి ని చూడ లేరు .అజ్ఞానం పొరలు తొలగితే భ్రాంతి దూరమవు తుంది .రెండు రకాల భ్రాంతులు .భ్రాంతికి కారణం అజ్ఞానమే .ప్రపంచము ,అందు లోని అనుభవాలు రెండు రకాల భ్రాంతులు అసలు సమష్టి వాసనలే మూల అజ్ఞానం అంటారు విజ్ఞులు .వాటి వల్లే మనకు కని పించే ప్రపంచం ఏర్పడింది .అందరికీ చెందిన ఈ ప్రపంచం లో ఎవరి స్వంత వాసనల తో వారు వెలుగు తూంటారు .అందుకే వ్యక్తి గతమైన దుఖాలు ,కష్టాలు ,అనుభూతులు కలుగు తాయి .గురు ముఖతా అద్వైత విద్య పొందితే భ్రమ నాశనం అవుతుంది .సమష్టిప్రపంచం జనానికి కనిపిస్తున్నా ,వ్యక్తిగత భ్రాంతి నశించటం వల్ల ,ఆ మహాత్ముడు ప్రపంచాన్ని ఒక ఖేలగా అంటే ఆటగా భావిస్తాడు .ఇదే ఇందులో వున్న పరమార్ధం
సశేషం
మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —29 -10 -11 .

