కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –5
కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –5
కరటక శాస్త్రి తక్కువ వాడు కాదు .తాను వచ్చిన కార్యాన్ని దీనితో సంధించి బాణం గురి తప్పకుండా కొట్టాడు .తన డబ్బు అవసరం ఎంత వుందో తెలపటానికి ”అంత అదృష్టవా అండీ .అల్లాంటి పిల్లే నాకుంటే ,మూడు ,నాలుగు వేలకు అమ్ముకుని ,రుణాలు ,పాణాలు ,లేకుండా ,కాలక్షేపం చేసి ఉండును ”అని మళ్ళీ తన దీన గాధ చెవిని వేస్తాడు .కరిగిన పంతులు తన సహాయ లోపం ఉండదని హామీ ఇవ్వ గానే ”అయితే కార్యవయిందే ”అని ,పంతులు చేతిలో పడితే తిమ్మిని బ్రహ్మిని చేస్తాడని ,లౌక్య ప్రభువు చాక చక్యం తెలుసు కనుక కార్యం సానుకూలం అవుతుందని ఘట్టిగా నమ్ముతాడు .”డబ్బుకు లోకం దాసోహం ”అయినందుకు సంతోషిస్తాడు .మళ్ళీ కరటక శాస్త్రి నాల్గవ అంకం లో మధుర వాణి ఇంట్లో బేరం ఫైసలు చేసుకొనేందుకు కన్పిస్తాడు .అప్పటికే మధుర వాణి పంతులు నెత్తి మీద నీళ్ళ చెంబు కుమ్మరిస్తుంది .తలంతా తడిసి వుంది .మంచి హాశ్యం ,చమత్కారం వున్న వాడు కదా కరట కుడు.”గంగా జలం శిరస్సున పోసుకున్నారా ఏమిటి పంతులు గారు” ?అంటాడు .సుబ్బి పెళ్ళికి ముందే శిష్యుడికి లుబ్ధావధాన్లతో పెళ్లి అయిపోవాలి .దీని కోసం సిద్ధాంతి జాతకం ,ముహూర్తం సిద్ధం చేశాడు .ఆ రోజుల్లో అయిదు రోజుల పెళ్లి .అలా చెయ్యక పొతే అది పెళ్లి అనిపించు కోదు .పైగా పరువు తక్కువ కూడా .”ఏక రాత్రి వివాహం చాలు ”అంటాడు శాస్త్రి . ”దివ్య స్థలాల్లోనే ఆ రోజుల్లో ఏక రాత్రి వివాహాలు జరిగేవి ఈ విషయం అల్లుడు లుబ్ధుడు బయట పెట్టాడు .మామ తక్కువ వాడా /ఏదో మతలబు చేసి ”ఎకరాత్రానికి ఒప్పించాలి ”లేక పొతే ”ఆబోరు ”దక్కదు .చాలా మంది ఎకరాత్రాలే చేస్తున్నారని చెప్తూ ”మీ వూళ్ళో కోదండరామస్వామి స్వయం వ్యక్తవూ ,హనుమత్ ప్రతిష్టా అయినపుడు దివ్య స్థలం కాదని ఎవడనగలడు ? అని దబాయిస్తాడు .స్థల మహాత్య్మం అంట గట్టేశాడు .ఇంక దీనికి తిరుగేముంది ?”అయినా ఇక్కడ ఇంతవరకు అలా ఎవరు చేయ లేదండీ ”?అని సందేహిస్తాడు .ఇక శాస్త్రి దబాయింపు సెక్షన్ లోకి వస్తాడు .”దివ్య స్థలం అయింతర్వాత ఎవడేమంటే మనకేం పోయింది ?”అంటాడు .ఎందుకైనా మంచిది పంతులు తో చేబ్దామంటాడు లుబ్ధుడు . ..పంతుల్తో చెబ్తే కొంప మునుగు తుంది .మధుర వాణి వేసిన ఎత్తు పారదు .అభాసు పాలవుతుంది .అంతా అంతర్నాటకం .ఒకళ్ళకి తెలీకుండా ఒకళ్ళ ఎత్తు .జిత్తు .పంతులు పై కొంత అసహ్యం కలగటానికి పాచిక వేస్తాడు శాస్త్రి .మిత్ర భేదం ప్రయోగిస్తాడు .అఘటన ఘటనా సమర్ధుడు కరటకం ..”ఈ పెళ్లి లో నాలుగు డబ్బులు సంపాదించా లనుకొనే పంతులు ,పోలి శెట్టి ఏక రాత్రి వివాహానికి అంగీకరిస్తారా ?పుస్తె కట్టిందాకా ఆ మాట వాళ్ళతో చెప్పకండి ”అంటాడు .”అయిదు రోజుల పెళ్లి అయితే నీ కొంప గుండమే” ”.’కొంప కొల్లేరు చేస్తారనట్లుగా చెప్పాడు .చెప్పక పొతే ”ఏం జట్టీ తెస్తాడో ”అని లుబ్దుడికి లోపల భయం .ఇక గట్టిగా బాదక పొతే కధ అడ్డం తిరుగు తుంది ..”అతగాడు మీకు యజ మానా ?జట్టీ ,గిట్టీ పెడితే ‘పెణ తూడ గొడతాను”’ అని భరోసా ఇస్తాడు .”పావంటి దానికి విరుగుడు వుంది .పంతులు కుండదా ?”అని ఒక సామెత చెప్పి ఒప్పిస్తాడు .ఇక్కడ కధ మంచి రస పట్టు లో జరిగింది .ఎవరు ఎవరికి వెన్ను పోటు పోడుస్తున్నారో మనకు అర్ధ మై పోతుంది .డబ్బు తో సాధించ లేదని ఏదీ లేదని నిర్ధారణ అయింది .పెళ్లి అయి పోయింది .అంపకాల శీను లో కరటక శాస్త్రి ”అపర కన్వుడి” లాగ విలపిస్తాడు .లుబ్ధుని కూతురు మీనాక్షి చేతి లో శిష్యుణ్ణి పెట్టి ,”కడుపు కదా అమ్మా !అంచేత పదే పదే చెప్తున్నాను .”అని భోరున ఏడుస్తాడు .”విషాదం ”మంచి పాకాన పడింది .సిద్ధాంతి వచ్చే లోపలే శాస్త్రి ఉడాయించేస్తాడు .కొంప మునుగు తుందనే భయం .మళ్ళీ చాలా కాలానికి కాని కనపడ్డు . .పోలీసులు గుంటూరు శాస్త్రి కోసం వెతుకు తుంటారు .తన తెలివీ ,పంతులు తెలివే ,మధుర వాణి అతి గొప్ప చాక చక్యం కలిసి ”మగాడి ”తో మగాడి పెళ్లి జరగటం తమాషా పెళ్లి అని పించింది .లుబ్దుడికి ఇంక పెళ్లి మీద విరక్తి కల్గెట్లు చేస్తాడు శాస్త్రి .”సుబ్బి పెళ్లి ”తప్పి పోవటానికి యెంత కష్ట పడ వలసి వచ్చిందో పాపం కరటక శాస్త్రికి .నిందలు మోశాడు .వేషాలు వేశాడు .కేసులో ఇరుక్కున్నాడు .ఇదంతా ఒక మంచి పనికే .అతి బాల్య వివాహాలు ఆప టానికి ,కన్యా శుల్కాన్ని నిరోధించటం ,ముసలాడికి మళ్ళీ పెళ్లి ఆశ లేకుండా చేయటం .ఇవన్నీ ఈ అంతర్నాటకం లో కరటక శాస్త్రి సాధించిన విజయాలు .వెయ్యి అబద్ధాల తో ఒక Homo sexual ”మారేజీ చాలా ఈజీ గా చేయించిన ఘటికుడు .గుంటూరు శాస్త్రి .కరటక శాస్త్రి పూర్తి నిజస్వరూపం ,ఇంకా అతని లో నిగూఢ౦ గా వున్న భావాలు ,సామాజిక స్పృహ మనకు ఆరవ అంకం లో విశాఖ పట్నం లో మధుర వాణి ఇంటి దగ్గర తెలుస్తాయి .సశేషం మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -11 -11
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

