త్యాగ రాజ కృతుల్లో సామాజిక ఆకృతి –1
త్యాగ రాజు బహు భాషా పండితుడు .సకల పురాణ శాస్త్ర పారంగతుడు .సంగీత ప్రజ్ఞా నిధి .నిరంతర రామ నామ జప మహిమతో ఉత్తెజితుడు .ఆయన బుద్ధి ,వాక్కు మహిమను పొందాయి .అందుకే పలికిన పలుకేల్లా ,కలకండ పలుకైంది .దివ్య దీప్తి తో శోభించింది .శ్రోతలను రంజించింది .చిరస్తాయిని పొందింది .సంస్కృత గాంభీర్యం ,తెలుగు తియ్య దనం ,అందులోను జాను తెలుగు తీపి ,సంగీత శాస్త్ర పాండిత్యం ఆయన రచనలకు కవితా శిల్ప గుణం ,కావ్య గౌరవం కల్గించాయి .తాను ఒక అంతస్సంనిధిని కల్పించు కొన్నాడు .అలౌకిక దృశ్యాలను కళ్ళకు కట్టి నట్లు ,శబ్ద చిత్రాలు గా చూపాడు .పద గుంభన ,శ్లేష ,మ్రుదులత్వం ,అను ప్రాసల రామణీయ కత్వం ,ఆయన్ను ఆరితేరిన వాగ్గేయ కారుని గా చేశాయి .భక్తీ యోగ ప్రచారకుని గా కీర్తిని పొందాడు .దక్షిణ భారత దేశానికి ”సద్గురువు ”అని పించుకొన్నాడు .ఆయన శిష్ట వ్యావహారిక భాష చేవ,పదును కలిగి మనసును గిలి గింతలు పెడుతుంది .లోకజ్నత తో మరపిస్తాడు .ఉపమానాలను నిత్య జీవితం లోంచే ఎన్ను కొన్నాడు .అందుకే వాటికి సామెతల గౌరవం దక్కింది . ఆధ్యాత్మిక శక్తి ,సంగీతానికి ,కవిత్వానికి ప్రాణ శక్తినిచ్చింది .వేదాంత సారాన్ని పుడిసిలి పట్టి బ్రాహ్మీ భూతుడయాడు .భక్తీ ఏ జీవన్ముక్తి సాధనం గా ఆత్మాను భవం తో చెప్పాడు .విప్లవ మత ప్రవక్త గా ,ధర్మావేశం తో ,విశ్వాసం తో ,యాగాదులను ,అంధ విశ్వాసాలను ఖండించాడు .నిర్మల మైన భక్తీ మాత్రమే పర మాత్మను చేరే మార్గం అన్నాడు .
త్యాగయ్య ది సమన్వయ మార్గం .ఈ సమన్వయము భగవద్గీతా మార్గమే .మత సంస్కర్త గా కని పిస్తాడు .వేమన లా ఒక్కొక్క చోట దర్శనమిస్తాడు .కుమారిల భట్టు అద్వైతం ,వల్లభాచార్యుల భక్తినీ జీర్ణించుకొన్నాడు .వాటిని సంగీతం తో పెంచి పోషించిన దర్శన చక్ర వర్తి అని పిస్తాడు .చేదు వేదాంతాన్ని ”,మధుర సంగీత అను పానం” తో ,తాగించిన గాన భిషగ్వరుడు .ఒక విధం గా రాజ యోగి .హేతువాదిగా కని పిస్తాడు .హరిహరాద్వైత మతం ,ఏకేశ్వరో పాసన ఆయన భావం .”దర్శనంబు లారు దైవంబు ఒక్కటి ”అన్న తత్వ వేత్త .సంగీతం తో భక్తీ ,వేదాన్తాలను ప్రచారం చేసి ,ప్రజలను భక్తి సామ్రాజ్య పౌరులు గా చేశాడు .పామర జనానికి త్యాగయ్య బాగా దగ్గరయాడు .ఆయన పాటలు అర్ధమైనట్లు ఇంకోరివి వారికి అర్ధం కావు .తన గీతాలను ఆయన ”కృతులు ”అన్నాడు .వేదం లోని ఛందస్సులు 26 .అందులో 20 వ ఛందస్సు ను” కృతి” అంటారు .
అంటే తన సంగీతాన్ని ”గాన వేదం ”గా భావించాడు ఆ” నాద బ్రహ్మ” .
అన్ని రకాల రామాయణ,పురాణ సారం తెలిసిన వాడు త్యాగ బ్రహ్మ .శ్రీ రాముని లో సకల దేవతలను దర్శించి ,ధన్యుదయాడు .జర్మన్ సంగీతా సార్వ భౌముడు ”బీతొవెన్ ”లాగా ,మనకు త్యాగ రాజ స్వామి ఆరాధ్యుడు .త్యాగ రాజ స్వామి వార్ల కృతుల్లో వున్న ,సాంఘిక ఆకృతిని ముందు గా తెలుసు కొందాం .ఆ తర్వాత వారి కవితా ప్రౌధిమ ,భాష ,భావ వైదుష్యం ,శయ్యా సౌభాగ్యం ,సర్వమత సమ ధర్మం ,భక్తి సామ్రాజ్య వైభవం ,అలంకార ప్రౌధి ,జాతీయాల ఇంపు ,నుడికారపు సోంపు ,నూత్న భావా విష్కరణ ,వినూత్న పద ప్రయోగం ,పద చిత్ర రచన ,వేదాంత దర్శనం ,ఆత్మానందం ,సామీప్య ,సారూప్య మైన మధుర భక్తీ ,శరణాగాతత్వం ,నిందా ,వ్యాజ స్తుతి ,మొదలైన అద్భుత ప్రక్రియా దర్శన భాగ్యం చవి చూద్దాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

