అధర్వ వేదం లో వ్రాత్య –3 –చివరి భాగం
నాల్గవ మంత్రం
”సో వర్ధత ,సమహాన భవత్ ,స మహా దేవో భవత్ ”అనేది నాల్గవ మంత్రం .దీని అర్ధం తెలుసు కొందాం
ఆయన పెరిగాడు .గొప్ప వాడయాడు .మహాదేవుడయాడని భావం .అంటే ,పెరిగి విరాట్ స్వరూపం పొందాడు .పృథ్వి ,ఆకాశాలను ,ఆక్త్రమించే ,మహా స్వరూపమే విరాట్ అని పురుష శూక్తం లో వుంది .”సృష్టి అంతా ఆయన లో ,నాల్గో వంతు మాత్రమే ”అని శృతి అంటుంది .దేవ అంటేనే భగవంతుడు .అన్నిటికి ప్రేరణ నిస్తూ ,ప్రకాశింప జేసే వాడు అని దేవుడు అన్న పదానికి అర్ధం .లోపల,బయటా,అంతటా ,ఆయన ప్రభావం వుంది .అందుకే దేవుళ్లకే దేవుడైన ”మహా దేవుడు ”అయ్యాడు .
అయిదవ మంత్రం
”స దేవానామీశాం పర్యేత్ ,స ఈశానో భవతి ”అనేది అయిదవ మంత్రం .దీని భావం అవగతం చేసు కొందాం
అతడు దేవతలకు ప్రభువు అయినాడు .అంటే ఈశానుడైనాడు అని అర్ధం .విశ్వాన్ని నడిపే శక్తులన్నీ ఆయన అధీనం లో వున్నాయి అని అర్ధం.”అతడు ఈశానుడు ,అన్ని విద్యలకు ,జీవులందరికీ ప్రభువు ”అని వేదం చెబుతోంది .విద్య అంటే దేవత,శక్తి స్వరూపం .భౌతిక ,ఆధ్యాత్మిక ,ఆది భౌతిక ,రసాయన శక్తులు అని అర్ధం .”ఆయన భయం వల్లనే ,వాయువు వీస్తాడు ,సూర్యుడు ప్రకాశిస్తాడు ,అగ్ని ,ఇంద్రాదులు ,ఆయన భయం వల్లనే పనులు చేస్తారు ”అన్నది శృతి కూడా .కనుక ఎదురు లేని అధికారి ఆయన .ఆయన ,రుత ,సత్యాలకు అడ్డు చెప్ప గలవారే లేరు .
ఆరవ మంత్రం
”స ఏక వ్రాత్యో భవత్ -స ధను రాధత్త –త దేవేంద్ర ధనుహ్ ”
అంటే ,అతను ఏక వ్రాత్యుడైనాడు .విల్లు అందుకున్నాడు .అది ఇంద్రునిది .అంటే ఇంద్ర చాపం అని భావం .అందర్నీ ఉన్నత మార్గం లో నడవ టానికి ,దివ్య మైన ఉపదేశాలు చేసే వారంతా వ్రాత్యులే .దేవుడు వీరికన్నా ఉన్నతుడు ,.అందుకే ”ఏక వ్రాత్యుడు ”అయాడు .”నిరుక్తం ”ప్రకారం ధనుస్సు బలానికి ప్రతీక .సర్వో త్కృష్ట మైంది . .అన్ని శక్తులకు నిలయమైనది ,ఆధార మైనదీ .”వేద శత్రువులను నాశనం చేయ టానికి రుద్రునికి వింటిని ఇచ్చాను ”.అని ఋగ్వేద శృతి చెబుతోంది .ఆ వింటి తో జగత్తును ,ఆయన శాసిస్తాడు .ఇంద్ర శక్తి ,రుద్ర శక్తి లో ఒక భాగం మాత్రమే .పనులు సక్రమంగా జరగటానికి ,దండ ప్రయోగం కూడా చేస్తాడు .అంటే న్యాయం ,చట్టం అని భావం .ఇంద్రాదులు ,”ఏక వ్రాత్య రుద్రుని ”నుంచే ,అధికారాలు పొంది ,తమ విధులను నిర్వహిస్తారని అర్ధం .రాష్ట్రాలపై కేంద్రానికి ఉన్న ఆధిపత్యం లాంటిది ఇది అని గమనించాలి .
తర్వాత మంత్రం లో ,అతని ఉదరం నీలం ,వీపు ఎరుపు అని వుంది .ఆది శక్తిలో త్రివిధ శక్తులు వున్నాయి .జ్ఞానం కోరిక ,చేతన (కర్మ ) త్రిగుణా దీనాలు .క్రింది స్తాయివి .నీలం ,ఎరుపు కోరికలను తెలియ జేస్తాయి .ఒకటి -తమోగుణం -కోరిక .రెండోది -రజోగుణం -పని చేసే శక్తి .మూడూ అభి భాజ్యాలే .”పుట్టనిది ఎరుపు .తెలుపు ,నలుపు ”అని శృతి .సత్వ గుణం బయట పడదు .నలుపు స్పష్టం గా కని పిస్తుంది .తరచుగా కన్పించేది నీలం .హిరణ్య గర్భుని శరీరం సగటు ప్రాణి కోటి శరీరమే .తర్వాతి మంత్రం లో జీవుల్లో వ్యతి రేక భావాలను నీలి రంగులో ,శత్రు భావాలను ఎరుపు రంగు లో నాశనం చేస్తాడని బ్రహ్మ వాదులు అంటారని వుంది .జీవులందరూ ,కోరికలతో సతమతమవు తారు .ఆయనకు ఎవరు శత్రువు కాదు మిత్రుడు కాదు .ధర్మ వ్యతి రేకులు శత్రువులు .ధర్మ పద గాములు మిత్రులు .దేవుని శక్తి ,స్వభావం తెలిపే వారే ”బ్రహ్మ వాదులు” .వాళ్ళు ,బహుజన హితం గా వుంటారు .
” వ్రాత ”అంటే సేకరణ .వ్రాత్య అనేది వ్రాత నుండి ఏర్పడిన పదం .జీవుల సమస్తమూ వ్రాత ఏ .వాటికి అధిపతి పరమాత్మ .బుద్ధిని శుద్ధి చేసే వాడు ”వ్రాత్యుడు ”.యోగ మార్గ దర్శకుడే గురువు .అతడే ,అహంకారం వల్ల వచ్చే మంచి ,చెడులను బట్టి ,సన్మార్గం లో నడి పిస్తాడు .అహంకారం ను వ్రాత్యుని గా భావిస్తే ,బుద్ధి లోని సమస్త కోరికలు ,భావాల సమా హారమే వ్రాత్యుడు .ఆయనే ప్రజా పతి .ఈ అహంకారం వల్ల సంస్కారం శుద్ధమవాలి .అప్పుడే శుద్ధ మైన బంగారం వస్తుంది .అదే హిరణ్య గర్భం .”బ్రహ్మనగరం తెలిసిన వాడు పురుషుడు .అయోధ్య అంటే దేవతల నగరం .దీనికి ఎనిమిది చక్రాలు,తొమ్మిది ద్వారాలు వున్నాయి .దానిలో స్వర్ణ భాండారం ,దివ్య కాంతీ వున్నాయి .దానికి మూడు ద్వారాలు .అదే ఆత్మ స్తితి .బ్రహ్మ ను తెలుసు కొన్న వాడికి ఇవన్నీ తెలుస్తాయి ”అని అధర్వ శృతి గట్టిగా చెబుతోంది .ఇవన్నీ యోగికి అనుభవైక వేద్యాలే .
అధర్వ వేదం లోని ”వ్రాత్య ఖండ ”లో మొదటి అను వాకం లో మొదటి శూక్తం లో ఎనిమిది మంత్రాలు ,రెండవ శూక్తం లో 28 మంత్రాలు ,.మూడవ శూక్తం లో 11 నాల్గవ శూక్తం లో 18 మంత్రాలు ,మంత్రాలు ,అయిదవ శూక్తం లో 16 మంత్రాలు ,ఆరవ శూక్తం లో 26 మంత్రాలు ,ఏడవ శూక్తం లో ,అయిదు మంత్రాలు వున్నాయి
రెండవ అనువాకం లో మొదటి శూక్తం లోమూడు ,రెండవ శూక్తం లో మూడు ,మూడవ శూక్తం లో పదకొండు ,నాల్గవ శోక్తం లో పదకొండు ,అయిదవ శూక్తం లో పదకొండు ,ఆరవ శూక్తం లో పద్నాలుగు ,ఏడవ శూక్తం లో ఇరవై నాలుగు ,ఎనిమిదవ శూక్తం లో తొమ్మిది ,తొమ్మిదవ శూక్తం లో ఏడు ,పడవ శూక్తం లో పది ,పదకొండవ శూక్తం లో అయిదు మంత్రాలు వున్నాయి .
మొత్తం మీద చివరగా చెప్పిందేమిటంటే వ్రాత్య కుడి కన్ను సూర్యుడు ,ఎడమ కన్ను చంద్రుడు .అగ్ని కుడి చెవి .గాలి ఎడమ చెవి .పగలు ,రాత్రి శ్వాస ద్వారాలు .దితి ,అదితి -ఉత్తర,దక్షిణ ఆయనాలు .సంవత్సరమే తల .అంటే కాల స్వరూపం .
”అన్హా ప్రత్యడ్ ,వ్రాత్యా రాత్ర్యా,ప్రాడ్ నమో వ్రాత్యాయ”
రాత్రి ,రాత్రి ముందు ,పగలు వ్రాత్యకు నమస్కారం .అన్ని వేళలా వ్రాత్యకు నమో వాకాలు .
సంపూర్ణం
ఆధారం –ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి ,రాజస్థాన్ మాజీ గవర్నర్ ,బహుభాషా వేత్త ,వేదోపనిషత్ సార సంగ్రహీత ,మహా పండితుడు ,విజ్ఞాని స్వర్గీయ డాక్టర్ సంపూర్ణానంద్ గారు ఆంగ్లం లో రాసిన ”Aadharva Veda -vraatya khanda ” ‘ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

