సంగీత సద్గురు త్యాగ రాజ స్వామి –1

               సంగీత సద్గురు త్యాగ రాజ స్వామి –1

             సంగీత త్రేతాగ్నులుగా ,దాక్షిణాత్య సంగీత మూర్తి త్రయం గా పేరొందిన వారు శ్యామ   శాస్త్రి ,ముత్తు స్వామి దీక్షితులు ,త్యాగ రాజు .వీరు ప్రసిద్ధవాగ్గేయ కారులు .  .ముగ్గురు సమకాలికులవటం ఆశ్చర్యం . వీరితో  టైరు వాన్కూర్ మహా  రాజా స్వాతి తిరునాళ్ళు చేరితే” సంగీత మూర్తి చతుష్టయం” ఏర్పడుతుంది .స్వాతి తిరుణాల్ ఆస్థానం లో అన్ని ప్రాంతాల సంగీత విద్వాంసులు సన్మానం పొందిన వారే .శ్యామ శాస్త్రి తెలుగు ,సంస్కృతం ,దీక్షితులు సంస్కృతం ,త్యాగయ్య తెలుగు లోను ఎక్కువ గా కీర్తనలు రాశారు .మూర్తిత్రయం లో ముగ్గురూ, తిరువాన్కూర్ పరిసరాలలో ”తిరు ఆరూర్ ”(ఆరు పల్లెల కూడలి )లోనే జన్మించారు .ముగ్గురు ,దగ్గర లోని ”తిరువయ్యార్ ” (అయిదు నదుల కూడలి )అంటే పంచ నదీ తీరం చేరారు .కావేరి నదిని ”సహ్యజ ”అంటారు .ఆ నీటిలో అవ్యక్త మాధుర్యం వీరి కవితలలో పొంగి పొర్లింది .సంగీతం లో నాయక స్థానం పొందింది .అంతకు ముందు  700 ఏళ్ళ క్రితం ,పురందర దాసు ,  ,అన్నమయ్య ,క్షేత్రయ్య ,నారాయణ తీర్ధులు వున్నా ,సంగీత కళకు పునర్వికాసం ఈ మూర్తి త్రయం వల్లనే కల్గింది .ఆ కళ  రసానందాన్ని ,ప్రజాదరాన్ని పొందింది ఈ ముగ్గురి వల్లనే .ఇప్పుడు  మన  త్యాగయ్య  గారి  జీవిత  విశేషాలను  తెలుసు  కొందాం .
                                 త్యాగ రాజు జననం 
         త్యాగరాజు గారి పూర్వీకులు ప్రకాశం జిల్లా ”కంభం ”తాలూకా ”కాకర్ల ”అనే గ్రామానికి చెందిన వారు .తండ్రి రామ బ్రహ్మం .తల్లి సీతమ్మ .వారే త్యాగయ్య గారి ”సీతా రాములు ”.అందుకే ఆయన ”సీతమ్మ మా యమ్మ ,శ్రీ రాముడు మాకు తండ్రి ”అని సభక్తి కం గా గానం చేశారు .తల్లి తంజావూర్  ఆస్థాన విద్వాంశులు” వీణ  కాళ హస్తీశ్వర అయ్యర్ ”గారి కుమార్తె .కాకర్ల వారు ములికి నాటి బ్రాహ్మణులు .భారద్వాజస గోత్రీకులు .ఆపస్థంభ సూత్రులు .ప్రముఖ ఇంజినీర్ ,భారత రత్న మోక్ష గుండం విశ్వేశ్వరయ్య గారు ఈ ప్రాంతం వారే .త్యాగ రాజు గారి కుటుంబం ,కాకర్ల నుంచి తిరువారూర్ చేరి స్థిర పడింది .త్యాగయ్య తాత గారు ”గిరి రాజ బ్రహ్మ ”,తంజావూర్ మహా రాజు ”శాహజి ”ఆస్థాన కవి .యక్ష గానాలు ,వేదాంత గ్రంధాలను రాశారు .సీతమ్మ ,రామ బ్రహ్మం దంపతులకు ,తిరువారూర్ లోని” శ్రీ త్యాగ రాజ స్వామి” అంటే అక్కడి శివుని భక్తులు .ఆయన దయ వల్లనే మన త్యాగయ్య 1767 వ సంవత్సరం మే నెల నాలుగవ తేదీన జన్మించారు .అదే శ్రీ సర్వజిత్ నామ సంవత్సర ,వైశాఖ శుద్ధ షష్టి సోమ వారం ఆయన జన్మ దినం .సంగీతం లో సర్వులను జయించి నట్లుగా ,”సర్వ జిత్ ”లో జన్మించారన్న మాట.స్వరాలను జయించటం వల్ల ”స్వర జిత్ ”అయ్యారు .అక్కడి అమ్మ వారి పేరు ”కమల ”.తిరువారూర్ లో జన్మించటమే ,ముక్తి గా భావిస్తారు .అక్కడి నుంచి ,త్యాగయ్య గారి అయిదవ ఏట ,”తిరువైయార్ ”చేరింది త్యాగయ్య గారి కుటుంబం .
                                  బాల్యం 
           త్యాగయ్య గారి తండ్రి రామ బ్రహ్మం గారు తంజావూర్ రాజాస్థానం లో రామాయణ ప్రవచనం చేసే వారు .తల్లి సీతమ్మ గారు వందలాది భక్తి కీర్తనలు ,గానం చేస్తుండే వారు .ఆ దంపతులు ”శ్రీ రామ పంచాయతనం ”ను భక్తీ తో పూజించే వారు .ఈ వాతావరణం లో పెరిగిన త్యాగయ్య గారికి ,సంగీతా ,సాహిత్య విద్యలు వెన్నతో బెట్టినవి అయాయి .రాజాస్తానం లో త్యాగయ్య ,వాల్మీకి శ్లోకాలు చదువుతుంటే ,తండ్రి ప్రవచనం చేసే వారు .భక్తీ ,రక్తి ,కావ్యసౌందర్యం   ,సంస్కారం ఆయనకు అబ్బిన సద్గుణాలు .సంగీత  ,సాహిత్య కిశోరమైనారు .బాల త్యాగ రాజు నోట ,గానం ,కవిత్వం ,ఆశువుగా జాలు వారుతున్దేవి .వాటిని గోడలపై బొగ్గు తో రాసే వారు .”నమో రాఘ వాయ అనిశం -నమో నమో రాఘ వాయ –శుక నుతాయ ,దీన బాన్ధవే –సకల లోక దయా సిన్ధవే  త్యాగ రాజ పాల కాయ -నాగ రాజ సేవితాయ ”అనే కీర్తన ను  తోడి రాగం లో రాశారు .అందులోని సమాస రచన ,అను ప్రాస ,భావ గాంభీర్యం ,ధారా శుద్ధి ,తలి దండ్రులకు ఆశ్చర్యం వేసింది .ఎనిమిదవ ఏట త్యాగయ్య కు ఉపనయం చేసి ,వెద శాస్త్ర  పాథ  శాల లో చేర్పించారు .
           ఆ నాటి తంజావూర్ ఆస్థాన ప్రధాన ,సంగీతవిద్వాంసుడు   ,అర్ధాసనం అలంకరించిన వాడు అయిన ”శోం ఠి  వెంకట రమణయ్య ”గారి వద్ద సంగీత శిక్షణ పొందాడు .గురు సన్నిధి లో సంగీత సభ చేశాడు .త్యాగయ్య విద్వత్తు కు మెచ్చి ,పొంగి పోయి ,తన స్వర్ణ కంకణాన్ని శిష్యుని చేతికి తొడిగి ఉప్పొంగి పోయారు గురువు శోం ఠి వెంకట రమణయ్య గారు .తంజావూర్ సరస్వతి మహల్ లో త్యాగ రాజు సంగీత కచేరి చేశారు .”మరి మరి నిన్నే మొరలిడ -నీ మనసు దయ రాదు ”అనే కాంభోజ రాజ కీర్తనను విసువు పుట్టించకుండా ,పాడి దిగ్దంతులైన సంగీత పండితుల్ని ,ఆనందాబ్ధి లో ఓల లాడించారు .బాల మేధావి త్యాగయ్య” child prodigy ” అయాడు .ఆ సంగీత పాండిత్యం తో వాగ్గేయ కారుడై కీర్తి పొందాడు .శరభోజి మహా రాజు త్యాగయ్య ప్రతిభను తెలుసుకొని ,తన ఆస్థాన సంగీతవిద్వాంసుని గా   చేయాలని భావించారు .అందుకే త్యాగాయను ”పుట్టు కవి ”అన్నారు విశ్లేషకులు .
                 సశేషం 
            మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -01 -12 .
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.