సంగీత సద్గురు శ్రీత్యాగ రాజ స్వామి –7
‘ ”కుశ లవ జనక శ్రీ రామా ,కుశ లద చతుర శ్రీ రామా -”అంటాడు చతురం గా .కుశాలదా అంటే క్షేమాన్ని ఇచ్చే వాడా అని అర్ధం .దీన్నే అర్ధ శ్లేష అంటారు .అలాగే మాటలపై లలిత శ్లేషకు ఉదాహరణ -”పాహి రామ యనుచు ,నీదు పదము నమ్మితి -పాహి రామ యనుచు నీదు పదము పాడితి ”
యమకాలన్కారం ఆయనకు గమకమే . అందులో -శ్లేష యమక చక్ర వర్తి త్యాగయ్య . ఆ సొగసు చూడండి
” కువలయ దళ నేత్ర ,పాలిత కువలయ దళితామిత్ర (శత్రున్జయుడు )-కమలాహిత గుణ భరిత రామా ,కమలాహిత ధర వినుత ( కమలానికి శత్రువైన చంద్రుని ధరించిన శివుని చేత పొగడ బడే వాడా )త్యాగ రాజ నుత చరణ ,నిత్యాగ రాజ ధర సుగుణా (గోవర్ధన గిరి ని ధరించిన వాడా )
”పరమ దయాళు వని ,పాలన సేతు వని ,సరగునదేవ రాయా కొలచిన నాపై కరుణ లేదని ,కన్నీరాయె –చూచి నీ మనసు కరుగ దెందుకు రాయా ?”అని గట్టి గా అడిగే ధైర్యం కూడా ఆ భక్తుడైన త్యాగయ్యకు వుంది .”రాయ ”శబ్దాన్ని సాభిప్రాయం గా ప్రయోగించి,మధుర శ్లేష వైభవాన్ని ,ప్రదర్శించాడు .భాష శిష్ట వ్యావ హారికం కావటం మరీ అందాన్నిచ్చింది .
”మావర ,ఉమా వర ,సన్నుత ”అనేది మంచి ప్రయోగం గా కని పిస్తుంది .లక్ష్మీ దేవి భర్త అనీ ,ఉమా దేవి భర్త శివునిచే ఆరాధింప బడే వాడా అనీ చక్కని అర్ధాలతో సాభిప్రాయం గా ప్రయోగించాడు” శ్లేషయ్య అయిన త్యాగయ్య ‘.
”ఖిలా చిత్త లౌకిక ,మనే శ్రుమ్ఖల మందు దగలకనే -ఉలూఖల బద్ధుని కి ,నిజ దాసుడై ,విలసిల్లు త్యాగ రాజు మాట ”
అనే కీర్తన లో శృంఖల అంటే గొలుసు -లౌకిక విషయాలనే గొలుసు తో బందీ కాకుండా -రెండవ ఉలూఖల బద్ధుడు అంటే రాతికి కట్ట బడిన బాల కృష్ణుడు అని అర్ధం .అద్భుత ప్రయోగాలివి .చెవులకు ఇంపు ,మనసుకు సోంపు ,ఆనందానికి దరి దాపు .ఇందులో యమకం అనే అలంకారాన్ని ”యమహా ”గా వాడటమే కాదు ,కన్నయ్య బాల్య గాధ నూ జ్ఞప్తికి తేవటం గడుసు దనం .
”కనికరంముతో కని ,కరమిడి ,చిర కాలముసుఖ మను భవింప వేగము ” అంటాడు త్యాగయ్య .దయతో చూసి ,చెయ్యి పట్టు కొని అనే అర్ధాలతో ”కని కర ”అనే మాటను మాంచి ప్రాస తో భక్తి ప్రసాదం గా అందించాడు .అర్ధ గాంభీర్యం తో కీర్తన వన్నె కెక్కింది .
”నానార్ధం ,విరుద్దార్ధం తో శబ్దాలను ప్రయోగించే నేర్పు భలేగా వుంది త్యాగయ్య లో .భాష ,అర్ధ జ్ఞానం లతో యోగ విధానం గా నామ జప మార్గాన్ని ,అర్ధ వంతం చేయాలి అనే భావం తో చెప్పిన కృతిని కని, సుకృతిపొందుదాం .
”రామా యన చపలాక్షుల పేరు ,కామాదుల కోరు వారు వీరు
రామా యన బ్రహ్మమునకు పేరు ,ఆ మానవ జనార్తుల తీరు
అర్క మనుచు జిల్లేడు తరు పేరు ,మర్కట బుద్దు లెట్లు తీరు ?
అర్కుడన భాస్కరునకు పేరు ,కుతర్కమనే అంధ కారము తీరు
అజ మన ,మేషమునకు పేరు ,అజుడని వాగీశ్వరునికి పేరు
కనుక తెలిసి ,రామ చింతన తో,నామము సేయవే వో మనసా ”అని బోధిస్తాడు .
మొత్తం మీద తెలుసు కావాల్సింది ఏమిటి అంటే -తర్కం ,కుతర్కం వదిలేసి ,చేసే జప నామానికి పూర్తీ గా అర్ధం తెలుసు కొని ,ఆత్మ శుద్ధి తో ,జపించి ,తపించి ,ముక్తి ని పొందమని సద్బోధ చేశాడు త్యాగ రాజ సద్గురువు .ఇందులో ఎన్నో తత్వ విషయాలు వున్నా ,అతి తేలిక మాటలతో తేట తెల్లం గా చెప్పటం త్యాగయ్య ప్రతిభకు నిదర్శనం .
రచన ను వివిధ గతులలో నడి పించి ,పాండిత్య జ్యోతిని చూపించి ,ప్రకాశ వంతం చేస్తాడు త్యాగ రాజు .
”దాంత ,సరి రక్షణాగ మాంత చర ,భాగవతాంత రంగ చర ,శ్రీ కాంత కమనీయ -గుణాంత కాంతక
హితాంత రహిత ,ముని చింత నీయ ,వేదాంత వేద్య –సా మంత రాజ నుత ,యాంత భాంత
నిశాంత ,శాంత కరుణా స్వాంత –నీ కిది సమయమురా -బ్రోవరా ,నా పాలి దైవమా !’
ఈ కీర్తన శ్రీ రామ చంద్రుని గుణ నామాల అందాల మాల .సొగసైన ,మనోరంజనం చేసే వాన జల్లు .కుంటు పడని పద ధార.అన్వయ కాఠిన్యం లేని పద బంధం .యాన్తః -అంటే య అనే అక్ష రానికి తర్వాతి అక్షరం అయిన” ర ”అనే అక్షరం .భాంత అంటే భ అనే అక్ష రానికి తర్వాత ఉన్న”మ” అనే అక్షరం .ఈ రెండు కలిస్తే ”రామ ”అంటే భవ్యుడు అయిన వాడు .చిన్న మాట లో అనంతార్ధం పొది గాడు భక్తకవి .సరదా చేసి మాటల మాయ చూపి అందులో పడి పోకుండా తెర తీసి మాయ ను తొలగించి రామ దర్శనం చేయించాడు .రామ గుణ నామ సంకీర్తన చేసి.. ఈ కీర్తనను చిరస్మరణీయం చేశాడు ..
ఆ కీర్తన లోనే ”చందనారి హర ,నందనాయుధ ,సనందనాది నుత -కుందరదన వర
మందార ధర ,గోవింద ముకుంద ,సందేహము నీకెందుకు నాపై ?”అని నడక మార్చినా పట్టు చెడ లేదు .అదే త్యాగయ్య కవిత్వ మహిమ .భాషను ఎలా గైనా త్రిప్ప గల నేర్పున్న వాడు .”మల్లె మొగ్గల వంటి పలు వరుస ”అంటే త్యాగయ్య గారికి మహా ఇష్టం .అందుకే చాలా సార్లు శ్రీ రాముణ్ని” కుందరదన” అని ఆప్యాయం గా పిల్చుకొంటాడు .ఆ సొగసు చూసి మురిసి పోతాడు .అలాగే శివుడిని ”అమ్భోరుహ నయన ”అనటం ఆయన ప్రత్యేకత .”నీటి లో పుట్టిన అగ్ని నేత్రుడా “‘అని భావం .
”అహమను జడత్వ మణఛి ,బ్రోవ ,సహజమౌ నీ చేతి శరము లేవా?
జనన మరణము లను సూదిని నిల్ప ,ఘన మైన నీ యాజ్న గాదను వడిని
మద మత్సరములను గజములకు ,నీ కమలాంకుశ రేఖ అంకుశము ” అంటూ గొప్ప భావాన్ని చక్కని ఉప మానం తో రక్తి కట్టించాడు .
”తనయుని ఏ జాతి యైన బ్రోవని తల్లి ,భూమిని గలదా ?ఓ రామ
ఇలను ,నిశ్చయము గా నీవు లేని తావు ఎందైన గలదా ?”అని భగవంతుని సర్వ వ్యాప కత్వాన్ని మంచి పోలికతో వివ రించాడు .మాన వత్వానికి ప్రేమ మయ రూపం తల్లి మాత్రమె నని స్పష్టీ కరణ ఇందులో తళుక్కున మెరుస్తుంది .
”ముల్లోకము లల్లాడిన ,ఇల్లే గతి గాని ,–ఇల నంతట గల వాన కు, జలధే గతి గాని
గుణములలో నని గుంటే ,గుణియే గతి గాని ”అన్న నిత్య సత్యాన్ని ,చక్కని ఉప మానం తో బోధించాడు .భావుకుడైన మనో భావ కవి లా త్యాగయ్య భాసిస్తాడు .ఎన్ని రూపాలు దాల్చినా ,చివరికి పర బ్రహ్మ లో లయం పొందటమే జీవిత గమ్యం .అద్భుత మైన భావాన్ని ,అలతి ,అలతి పదాలో పొదిగి అలంకరాయుక్తం గా అభిషేకించాడు .ఆయన మనసు ”ఉరగములు పెనగి నట్లు ”ఉందట .”కల్ప భూజమున ,తీగ గట్టు రీతి మనసు ,కల్పము లేన్నైనా ,విడిచి కదలదు శ్రీ రామా !”అంటాడు .
”అద్వైత సామ్రాజ్యంము లు అబ్బి నట్లు రామా ,సద్వైరాగ్యము నిదియు సాయుజ్యమే రామా ”అని మంచి వైరాగ్య బుద్ధి సాయుజ్యానికి సమానమే అని సమర్ధించాడు .ఇందులో జాను తెనుగు ,నుడి కారం ,ఉపమల విన్యాసం ,అద్వైతంసద్వై రాగ్యం తోనే వస్తుందనే బోధ ,అదే సాయుజ్యమనే ధీమా తో ఆనందాబ్ధి లో ఓల లాడుతూ ,మనల్ని అందులో ముంచి తేలుస్తున్నాడు అద్వైత గాన బ్రహ్మ త్యాగ బ్రహ్మ .,
ఈ అలంకార శోభను ఇంకో సారి మళ్ళీ దర్శిద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


అయ్యా! చక్కని సమాచారమిచ్చారు. పైన చెప్పిన సంకీర్తనలో “యాంత భాంత నిశాంత” అనే పదబంధానికి ‘రామ’ తో పాటు “నిశాంత” (చీకటిని అంతం చేసేవాడు కనుక) చంద్రుడు అనే అర్థం వస్తుందని కాబట్టి యాంతభాంత నిశాంత అని అంటే రామచంద్రుడు అనీ కంచి పరమాచార్యవారు సూచించారట.
LikeLike