గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 382-శ్రీ స్వాతి తిరుణాల్ రామ వర్మ కులశేఖర్ (1813-1846)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

382-శ్రీ స్వాతి తిరుణాల్ రామ వర్మ కులశేఖర్ (1813-1846)

తిరువాన్కూర్ మహారాజు స్వాతి రామవర్మ కులశేఖరుడు 1812-1847కాలపు రాజు . అసలు పేరు’’ శ్రీ పద్మనాభ దాసశ్రీ స్వాతి తిరుణాల్ రామవర్మ కులశేఖర పెరుమాళ్ ‘’తల్లి కడుపులో ఉండగానే రాజ్యానిki  రాజుగా ప్రకటించారు .అందుకని ఆయన్ను ‘’ఆగర్భ శ్రీమంతుడు ‘’అన్నారు .16-4-1813న జన్మించాడు .1829లో పదహారవ ఏట మేజర్ అయి మహారాజుగా అభిషిక్తుడయ్యాడు .ఈయన పుట్టినప్పుడు ఇరయమాన్ తంబి అనే ప్రముఖ కవి ‘’ఒమాన్దిన్కాల్ కిదావో ‘’అనే జోలపాటమలయాళం లో రాసి  రాసిపాడాడు.. .తండ్రి రాజ రాజ వర్మ గొప్ప సంగీత ,సంస్కృత విద్వాంసుడు .తల్లి గౌరీ లక్ష్మి బాయి .ఆరవ ఏట మళయాళ సంస్కృతాలను, ఏడవ ఏట ఇంగ్లీష్ ను నేర్వటం ప్రారంభించాడు .ఇంగ్లీష్ ,పర్షియన్ తమిళం తెలుగు కన్నడం ,మరాఠి,హిందీ భాషలపై గొప్ప పట్టు సాధించాడు .

ప్రజలకు ఉపయోగపడే చట్టాలను శాసనాలను చేసి అమలు పరచాడు .ప్రభుత్వ విషయాలన్నీ తెలుసుకొని జనరంజకం గా పాలించాడు .కేరళలో ఆంగ్ల విద్య ప్రవేశ పెట్టాడు .మొట్టమొదటి ప్రభుత్వ ప్రెస్ ను నెలకొల్పాడు ఖగోళ పరిశోధనలకు అబ్సర్వేటరి ఏర్పాటు చేశాడు .ప్రాచీన గ్రందాల వ్రాతప్రతులను సేకరించి గ్రంధాలయం లో భద్ర పరచాడు .అనితర సాధ్యమైన సంగీత విద్య నేర్చాడు .అందుకే ’’మోనార్క్ మ్యుజీషియన్ ‘’అని పేరుపొందాడు .

’’యయాతి చరిత ‘’అనే ప్రబంధాన్ని ,పదమూడు సంగీత వివరణలు కల ‘’కుచేలోపాఖ్యానాన్ని ‘’,రాశాడు త్యాగ రాజులాగా సంగీత కీర్తనలనే కృతులు రాశాడు .అవన్నీ అనంత పద్మనాభ స్వామికే అంకితం .తనకాలపు పతన సంగీత విద్వాంసులను గురించి వాపోయాడు –

‘’అక్ర౦ తా కలినేవ హంతా జగతీ పాపీయశా గాయకః –వ్యాహేనక్షితిపాలసంసద ఖిలాక్రాంతా సమంతా దపి

నృత్య  త్పంకజ  సంభవ ప్రణయినీ లీలా రావీ౦దోదరా-మందశ్యంది మరందసుందర గిరాం కుత్రా వికాసో స్టు నః ‘’

స్వాతి తిరుణాల్ సంస్కృత కృతులు –‘మాయా మాళవ గౌడ రాగం లో ‘’దేవ దేవకలయామి తే ‘’, సారంగ రాగం లో ‘’జయజయ పద్మనాభ మురారే  ‘’,వాగదీశ్వరి రాగం లో ‘’కమల నయన జగదీశ్వర ‘’హంసధ్వని రాగం లో ‘’పాహి శ్రీపతే ‘’,పంతు వరాళి లో ‘’సారసాక్ష పరిపాలయ మామయి ‘’చాలా ప్రసిద్ధమైనవి

స్వాతి తిరుణాల్ తన ప్రభుత్వాన్ని తిరువనంతపురం లో ఉన్న పద్మ నాభ స్వామికి దారపోసి తాను ‘’పద్మనాభుని సేవకుడి’’గా ఉండిపోయి ఆయన తరఫున పాలించి ‘’పద్మనాభ దాసు ‘’అయ్యాడు .జనరల్ కల్లెన్ ను తంజావూర్ రెసిడెంట్ గా నియమించాడు .వాడు క్రమంగా బలిసి రాజ్య వ్యవహారాలన్నిటిలోను జోక్యం కలిగించుకొనే వాడు .స్వాతి తిరుణాల్ దీన్ని భరించలేక పోయాడు .చివరికి ఒంటరి గా మౌనం గా ఉండిపోయి శారీరక మానసికం గా  బలహీనుడై 33ఏళ్ళకే 27-12-1846స్వర్గస్తుడయ్యాడు మహా రాజ కవి స్వాతి తిరుణాల్ .

త్రివేండ్రం లో ప్రతి ఏడాది జనవరి 6నుండి  12వరకు వారం రోజులు ‘’స్వాతి సంగీతోత్సవం ‘’నిర్వహించి ఆ సంగీత మహారాజుకు ఘనం గా నివాళులర్పిస్తారు .స్వాతి తిరుణాల్ వారసుడిగా ఇప్పుడు రాజా రామవర్మ ఉన్నాడు .ఈయనా అసాధారణ సంగీత పాండిత్యం ఉన్నవాడే .ఈయన ఆధ్వర్యం లోనే స్వాతి ఉత్సవాలు జరుగుతున్నాయి .త్యాగరాజ స్వామిని కలుసుకోవాలని కలలుగన్న స్వాతి తిరుణాల్ కు ఆ అవకాశం  రానేలేదు .’’ఇద్దరం పైనే కలుసుకొందాం ‘’అని త్యాగయ్య గారి జవాబుతో .స్వాతి తో కూడా కలిపితే కర్నాటక సంగీతం లో ‘’సంగీత చతుస్టయం.’అవుతారు .ఎందరో మహాను భావులు అందరికి వందనాలు

383-అయిల్లం తిరుణాల్ రామ వర్మ (1860-1880)

రామవర్మ తిరువనంతపురం మహా రాజు .1860-1880లో పాలించాడు .’’వృత్త రత్నాకరం ‘’గ్రంధాన్ని రచించాడు .దీనితో బాటు ‘’శ్రీ కృష్ణ విలాస కావ్యం ‘’,’’జలన్ధరాసుర వధ ‘’అనే కదాకళీకి వ్యాఖ్యలు రాశాడు .

384-సాహిత్య సమ్రాట్- రాజా విక్రమ దేవ వర్మ (1869-1951)

1869లో జూన్ ఇరవై ఎనిమిదిన విక్రమదేవ వర్మ శ్రీ కృష్ణ చంద్ర దేవ మహా రాజు ,రేఖా దేవి దంపతులకు జన్మించాడు .1931లో గద్దెనెక్కి పాలన సాగించాడు .సాహిత్యం లో డి.లిట్.పొందాడు సాహిత్య సమ్రాట్ ,కళా ప్రపూర్ణ బిరుదాంకితుడు .జైపూర్ సంస్థానాదీశుడు .సాహిత్య పోషకుడు ప్రతి ఏటా ఒక లక్ష రూపాయలను ఆంద్ర విశ్వ విద్యాల అభివృద్ధికి అంద జేసేవాడు.అనేక సంస్థలకు ఉదారం గా విరాళాలు అందించి పోషించి అభివృద్ధికి తోడ్పడే వాడు .విక్రమ దేవ వర్మ సంస్కృతం లో ఉద్దండుడు .తెలుగు ,ఒరియా ఇంగ్లీష్ లలో నిష్ణాతుడు . సంస్కృత కవికూడా .గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు ‘’.అభినవ భోజుడు ‘’అనే బిరుదున్నవాడు . ఆస్థానం లో మహా గొప్ప కవి పండితులను పోషించాడు .సంస్కృతం లో అనేక స్తుతులను రాశాడు .అలాగే గీతాలూ అల్లాడు .

జైపూర్ లో విక్రం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్కూల్ నిర్మించాడు .ఆంద్ర విశ్వవిద్యాలయానికి ‘’ప్రో చాన్సెలర్ ‘’గా ఉండేవాడు .ఎనభై రెండవ ఏట 14-4-1951న జైపూర్ లో మరణించాడు .

385-మార్గ దర్శి –శేష అయ్యంగార్

దక్షిణ భారత సంగీతానికి గొప్ప దారి ,వెలుగు చూపించిన శేష అయ్యంగార్ ను ‘’మార్గ దర్శి’’ అన్నారు .అయోధ్య వాసి తరువాత శ్రీరంగం వచ్చి స్థిర పడ్డాడు .శ్రీరంగనాధుని సేవలో తరించాడు .ఆయన సంతకం లేక ముద్ర ‘’కోసలాపురి ‘’.ఈయన సంస్కృత కృతులను రంగనాధ స్వామి విని మెచ్చాడని కధనం .

1830-1900కాలం లో ఉన్న శివరామ యతి ఆధ్యాత్మిక కీర్తనలు రాసి ‘’నిజభజన సుఖ పధ్ధతి ‘’అని పేరు పెట్టాడు .

స్వర్ణ స్వర అనే పేరున్న మహా వైద్య నాద శివ దక్షిణ భారత సంగీతవిద్వా౦సు లలో ‘’ టాప్’’..’’మేళ రాగ మాలిక ‘’రాశాడు .

386-అష్టావధానం అనంతా చార్య

ఆశువుగా కవిత్వం చెప్పగల నేర్పున్న అష్టావధానం అనంతా చార్య గూడార్ధం లోను సమస్యలలోను ప్రశ్నలు వేస్తె సంగీత రాగాలనాదారంగా ఆశువుగా సంస్కృతం లో పూరించేవాడు .ఒక ఉదాహరణ –‘’చికురాళీ తు వరాళీ వదనం తవభాతి శంకరాభరణం ‘’

బెజవాడ దగ్గరున్న ఉల్లిపాలెం జమీందార్ ఆస్థాన కవులు కాండూరి రామానుజా చార్య ,నరసింహా చార్య లు సంస్కృతం లో కీర్తనలు రాశారు .’’సంగీత యయాటం ‘’,’’అభినవ గోపాల పులిందుని చరిత్ర ‘’లను కీర్తనలో చొప్పించి సంగీత రూపకాలు రాశారు .

387-కీర్తనా చార్య –సి ఆర్ శ్రీనివాసా చార్య (1867-1936)

1867-1936కాలం వాడైన శ్రీనివాసా చార్య  తంజావూర్ జిల్లాలో పుట్టి సగీత విమర్శలలో గొప్ప పాండిత్యాన్ని సంపాదించాడు .జీవిత చివరికాలం లో దక్షిణ దేశ సంగీతాన్ని సంగీతా ఎకాడమీల ద్వారా సెమినార్ లద్వారా సంస్కరించే  ప్రయత్నం చేశాడు . సంగీతం లోని సాంకేతిక అంశాలలో వచ్చిన విభేదాలను పరిష్కరించ టానికి ఏంతో  శ్రమపడ్డాడు . రాగాలను గాయకులు  ఎవరిష్టం వచ్చినట్లు పాడుతుంటే క్రమపద్ధతిలో పాడే ఏర్పాటు చేశాడు .త్యాగ రాజస్వామి కృతులపై సాధికారత ఉన్నవాడు .అందుకే ఆయన్ను ‘’అభినవ త్యాగ బ్రహ్మం  ‘’అంటారు.  ఆధునికకాలం లో సంగీత విమర్శకు మార్గ దర్శి ఆయన .భారతీయ ,పాశ్చాత్య సంగీతాలను బేరీజు వేస్తూ ‘’మనది స్వర సంగీతం వాళ్ళది వాద్య ఘోష’’ .అన్నాడు ‘’డెబ్భై రెండు మేళకర్తలలో మూడింటిని మాత్రమే వారు ఉపయోగిస్తున్నారు .అన్నాడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-15 –ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

1 Response to గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 382-శ్రీ స్వాతి తిరుణాల్ రామ వర్మ కులశేఖర్ (1813-1846)

  1. చెరుకూరి విశ్వనాథ శర్మ's avatar చెరుకూరి విశ్వనాథ శర్మ says:

    చాలా విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు, ధన్యవాదములు!!

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.