గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
392-కందర్ప చూడామణి వ్యాఖ్యాత -వీర భద్ర దేవుడు (1577)
రామచంద్రుని కొడుకు వీరభద్ర దేవుడు వాఘెలా వంశ రాజు .ఇది శాలివాహనుల కు చెందిన వంశం .ఇతని ‘’కందర్ప చూడామణి ‘’విమర్శనా గ్రంధం .దీన్ని 1577లో రాసినట్లు చెప్పుకొన్నాడు .
భాస్కర నరసింహ శర్మ అనే కాశీ కవి వ్రజాలిఅనే ఆయన కోరికపై ఒక కామ గ్రంధం రాసినట్లుంది .శంకరుడు ‘’మనసిజ సూత్రాలు ‘’రాసినట్లు ,ఉన్నది .జ్యోతిశ్వర్మ ఈశ్వరుడు రాసిన ‘’మన్మధ తంత్రం ‘’ను తాను చూసి నట్లు రాశాడు .రంతిదేవుని ‘’యోగాదికారిక ‘’లో కొన్ని ఔషధాల విషయం ఉంది .’’మాహేంద్ర ముష్కం శకలందూతేన స సైన్ధవం గావ్య పాయ రస్తు సిద్ధం –తద్రక్ష యిత్వా రతి సంగారషు జయత్య కస్మా ద్రువతీ మహాస్త్వం ‘’
ఆచార్య సిద్ధ నాగార్జునుడు కూడా ‘ వశీకరతంత్రం ‘’రాశాడు .అలభ్యం .ద్రువపాలుడు ‘’నాగార్జున యోగ శతకం ‘’రాశాడు .క్షేమేంద్రుడు ‘’వాత్సాయన సూత్ర సారం ‘’రాసినట్లు తన ‘’ఔచిత్య విచార చర్చ ‘’లో పేర్కొన్నాడు .
393 –నాగర సర్వస్వం కర్త-పద్మశ్రీ (1000)
పద్మశ్రీజ్ఞానుడు అనే పద్మశ్రీ బౌద్ధ సన్యాసి .తన’’ సారంగ ధర పధ్ధతి’’లో కుట్టిని మఠం గురించి చెప్పాడు కనుక కాలం 1000 అని ఊహ .పద్దెనిమిది అధ్యాయాలలో రాసిన ‘’నాగర సర్వస్వం ‘’లో రసవంతమైన ధారాపాత మైన శ్లోకాలలో మనిషి సుఖ సంతోష జీవితాన్ని ఎలాగడపాలో చెప్పాడు .గృహానికి పరిమితమైనా మానవుడు అన్ని ఆనందాలను పొందాలి అన్నాడు .తన గ్రంధం లో ప్రేమ ,వలచటం వలపింప జేయటం ,గర్భ ధారణ వీటికి కావలసిన చిట్కాలు మందులూ రాశాడు .దీనిపై ‘’తను సుఖ రాముడు ,జ్యోతిర్మల్లుడు వ్యాఖ్యలు రాస్తే ,నగరి దాసుడు ‘’నగర సముచ్చయం ‘’రచించాడు .
394—అనంగ రనగం రంగ రించిన -కళ్యాణ మల్ల
‘’ అనంగ రంగం ‘’ను రంగ రించి కళ్యాణ మల్ల ఔద్ రాజు అహ్మద్ ఖాన్ కొడుకు లాడా ఖాన్ లోడి ని సంతృప్తి పరచాడు .పది అధ్యాలలో ఇంద్రియ సుఖాలను ,స్త్రీలలోని జాతులను గురించి ముఖ్య విషయాలను సంక్షిప్త పరచి రాశాడు .’’సులోమత్ చరిత్ర ‘’నులో’’ఓల్డ్ టేస్టమెంట్ ‘’లోని డేవిడ్ కొడుకు’’ సాల్మన్ రాజు ‘’ గురించి సంస్కృతం లో రచించాడు .
395-‘’సహజ సారస్వత చంద్ర ‘’-హరిహరుడు (1450)
రామ విద్వత్ కొడుకు హరిహరుడు ‘’సహజ సారస్వత చంద్ర ‘’బిరుదాంకితుడు .’’రతి రహస్యం లేక ‘’శృంగార భేదప దీపికలేక శృంగార దీపిక ‘’రాశాడు . నాలుగు అధ్యాయాలున్న దీనిలో మంత్రం ,యంత్ర మందుల గురించి వివరించాడు .ఇతను తెలుగుకవే .’భాగవత౦ ‘’రాశాడు.1450 వాడు
.విద్యాధరుడు హరిహరుని’’బింద్వాలంకారం ‘’గ్రంధం గురించి చెప్పాడు .దీనికి రాజు అర్జునుడు అనంత సంపదనిచ్చాడు కవికి .ఈ రాజు మాల్వ రాజు అర్జున వర్మ అయి ఉండచ్చు .కనుక కాలం పదమూడవ శతాబ్దం అనిభావిస్తారు.
396-కామ సంహిత కర్త –అనంతుడు (1457)
కామ సంహిత కర్త అనంతుడు తన గ్రంధం లో ప్రేమ ను గురించి చాలా విషయాలు మనోహరంగా చెప్పాడు .ముందుగా ఋతు వర్ణన చేశాడు తర్వాత స్త్రీజాతుల గురించి ,ప్రేమలో సోపానాలు వాటిని దాటి అభివృద్ధి సాధించటం గురించి రాశాడు .1457కాలం రచన ఇది .’’శుభాషిత రత్నావళి ‘’లో ఇందులోని శ్లోకాలు ఉదహరింప బడటం వలన ఇది విషయ సేకరణ గ్రంధం అంటారు .
397-రతి రత్న ప్రదీపిక కర్త -ఇమ్మడి ప్రౌఢ దేవరాయలు (-1422-48)
విజయనగర సామ్రాజ్య రాజు ప్రౌఢ దేవరాయలు 1422-48కాలం లో పాలించాడు .శృంగార విలాసుడు .ఏడు అధ్యాయాలలో సులభ శైలిలో ‘’రతి రత్న ప్రదీపిక ‘’రాశాడు –ప్రేమికులు వారి వినోదం ఆనందం భోగం అందులో సుఖం గురించి వివరించాడు .
సాసాలి వీర నారాధ్యాయుడు పదిహేనవ శతాబ్ది చివరివాడు .’’పంచ రత్న ‘’రాశాడు .రెండవ నారపాధ్యాయుడు దీనికి వ్యాఖ్య రాశాడు .
398-పంచ సాయక రాసిన -కవిశేఖర జ్యోతిరీశ్వరుడు
కవిశేఖర బిరుదు పొందిన జ్యోతిరీశ్వరుడు ‘’పంచ సాయకం’’ రాశాడు .నాలుగు భాగాలు .స్త్రీ జాతులు ,ఆనంద ధాతువులు ,వశీకరణ మంత్రాలు ,వీర్య వృద్ధి సాధకాల గురించి చెప్పాడు .
తంజావూర్ షాహాజీ రాజు’’ శృంగార మంజరి ‘’రాసి అందులో సాహిత్యం తో బాటు కామ శాస్త్రాన్నీ దట్టించాడు .మిన్మధుడు ‘’’’స్మరదీపిక ‘’(రతి రత్న ప్రదీపిక )రాశాడు .
శ్రీనాధ భట్టు కామశృంగార విషయాలపై పదహారు అధ్యాయాల గ్రంధాన్ని తంత్ర శాస్త్రం ఆధారం గా రాశాడు .
ఇంకొక అజ్ఞాత కర్త ‘’కామ తంత్ర ‘’ను పద్నాలుగు అధ్యాలలో రాశాడు .
399-శృంగార సారం కర్త-చిత్ర ధరుడు
‘’శృంగార సారం ‘’రాసిన చిత్ర ధరుడు ఏడు ‘’పద్ధతులు ‘’లో లోపలి భావోద్వేగాలను వాటి అభివృద్ధిని,సంపూర్ణ ప్రేమ ను దానికి సంగీతం నృత్యం తోడుపడే విధానాన్ని గురించి విపులంగా వివరించాడు .
400-రస చంద్రిక రచయిత -విశ్వేశ్వరుడు
రస చంద్రిక రాసిన విశ్వేశ్వ రుడు నాయక నాయిక భేదాలను తెలిపాడు ‘’విట వ్రుత్తి ‘’లో వేశ్యలు వారి ప్రేమికుల మధ్య సంబంధాలను తెలియ జేశాడు దీనికర్త ‘’సౌమ దత్తుడు ‘’అయి ఉండాలి .మాధవుడు ‘’జడ వ్రుత్తి ‘’లో నాట్య గత్తెల కపట నాటకాలు ,ధూర్త విటుల సల్లాపాల గూర్చి వివరించాడు .’’దూర్తానందం ‘’లో విటుల విచ్చల విడి తనం వర్ణింప బడింది
వైద్య నాధుని ‘’రసిక రంజనం ‘’అతని తండ్రి కామ రాజ దీక్షితుని ‘’రసిక బోధిని ‘’కాళిదాసు ని ‘’శృంగార తిలకం ‘’లలో ప్రేమ ,శృంగారం ,జారత్వం .పొంగి ప్రవహించాయి .
కౌతుక దేవుని ‘’అన౦గ దీపిక ‘’,వచన కావ్యం ,’’రతిసారం ‘’,రతి చంద్రిక ‘’,శృంగార కౌతూహలం ‘’త్ర్రుతీయ పురుషార్ధకా సరణి ‘’,ప్రణయ చింత ‘’మొదలైనవన్నీ శృంగార కామ కేళీ విలాసాలపై వచ్చినవే .దీనికి తోదు ‘’బంధోదయం ‘’అనే తాటాకులపై చిత్రించిన బంధాలలో ని అనేక భంగిమలు వాటికింద శ్లోకాలు ఉన్న బొమ్మల పుస్తకం సంచలనం గా నిలిచింది .రెండు భాగాలలో ఉన్న ’’శృంగార క౦దుకం ‘’’’జార పంచాశతి’’ శ్రీకృష్ణ ,గోపికల మధ్య శృంగారాన్ని రంగరించి రాసింది .
‘’వేశ్యా గణక కల్పద్రుమం ‘’రాజుల ఆస్థాన నర్తకి లపై రాసినది .’’రఘుపతి రహస్య దీపిక ‘’సంభోగ శృంగారం దగ్గర ఆగింది .
ఇప్పటికే మదన సామ్రాజ్యం లో విహరించి అలసి పోయాం కనుక మనం కూడా ఈ కామ శృంగార వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెడదాం .
మనవి – గీర్వాణ కవుల కవితా గీర్వాణం (2 )రెండవ భాగం లో 147నుంచి 400వరకు అంటే 254మంది కవుల గురించి తెలియ జేశాను .ఇందులో చాలామంది కవులు మనకు తెలియని వారే .వారందరి గురించి రాసే మహద్భాగ్యం నాకు కలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నాను .దీనివలన సంస్కృత సాహిత్య విభాగాలన్నిటిని స్పృశించటం జరిగింది .ఇదంతా నేను మొదటి నుంచీ చెబుతున్నట్లు ‘’తల స్పర్శ ‘’మాత్రమే .లోతులకు వెళ్లి అద్భుత విషయాలు ఆవిష్కరించాననినేను అనుకోలేదు ,అలా చెప్పను కూడా .అభిరుచి ఉన్నవారికి ఇదొక దారి దీపం మాత్రమె .లోతులు తరచాలను కొన్న వారికి కొద్ది చేతి సాయమే నని సవినయం గా మనవి చేస్తున్నాను .ఇవన్నీ వీలుని బట్టి రాసినవే కనుక క్రానలాజికల్ ఆర్డర్ లో ఉండవు గ్రంధ రూపం లోకి వస్తే అప్పుడా పని చేసి రూపం కల్పిస్తాను .ఇందులో రాసిన కవులందరూ శ్రీ ఏం క్రిష్ణమాచారియార్ గారు రాసిన ‘’హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’లోని వారే .ఆ ఉద్గ్రంధం లోని కవులనందరినీ దాదాపు స్ప్రుశించాను . దీనితో ప్రాచీన గీర్వాణ కవులు దాదాపు పూర్తీ అయినట్లే .ఎక్కడైనా కొద్ది మంది మిగిలి పోయి ఉండవచ్చు .వీలును బట్టి వారి గురించి రాస్తాను .ఈ ఉద్గ్రంధాన్ని నాకు అమెరికా నుంచి పంపి,చదివించి ,ప్రోత్సహించి నాతో ఇంతటి బృహత్తర రచన చేయించిన సరస భారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి మరొక్క సారి కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను .
మరో మనవి –ఇప్పుడు ఆంద్ర దేశం లో ఉన్న తెలుగు కవులు చేసిన సంస్కృత రచనల గురించి రాయాలి .దీనికి సంబంధించిన విషయ సేకరణ దాదాపు పూర్తీ అయింది వారి దగ్గరున్న సమాచారాన్ని నాకు అందజేసిన శ్రీ తూములూరి శ్రీ దక్షిణా మూర్తి ,శ్రీ రావిమోహనరావు ,శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారల ఔదార్యానికి కృతజ్ఞతలు .
గీర్వాణ కవుల కవితా గీర్వాణం (2 ) రెండవ భాగం లో 401నుంచి వీరి గురించి రాయటం ప్రారంభిస్తాను . చదివి నన్ను ఇప్పటిదాకా ప్రోత్సాహించిన సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు కృతజ్ఞతలు తెలియ జేస్తూ ,రాయ బోయే వాటినీ ఆస్వాదించి ప్రోత్సహించ వలసినదిగా విన్న వించు కొంటున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-15- ఉయ్యూరు

