Search for:
కేథరీన్ వాన్ బోరా (వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్
‘’విటెన్ బెర్గ్ ఉదయ తార ‘’కేథరీన్ వాన్ బోరా
‘’ఆకాశం లో సగం ‘’అని పించుకోనే మహిళ ,జనాభాలో సగం ఉన్నా హక్కులను పూర్తిగా దక్కించుకోలేక పోయింది చాలాకాలం .ఇదేదో మన దేశం లోనే అనుకొంటే పొరబాటే .యూరప్ దేశాలలోనూ ఇదే తీరు .తమహక్కుల కోసం, సంఘ సంస్కరణల కోసం యూరప్ మహిళ ఎన్నో కస్టాలు ఎదుర్కొన్నది .మధ్య యుగాలలో ఆమె పరిస్తితి మరీ దారుణం .మత వ్యవస్థలను ఎదుర్కొని పోరాటం చేసి తమకు కావలసినవాటిని సాదించుకొన్నారు యూరప్ మహిళలు .ఉద్యమాలు నడిపారరు ,జైలు పాలయ్యారు ,కఠినదండనలు అనుభవించారు .అంతిమ విజయం సాధించారు .చరిత్రలో నిలిచి ఆదర్శ ప్రాణులయ్యారు .అలాంటి మహిళా మాణిక్యమే కెథరీన్ వాన్ బోరా .ఆమె రోజూ ఉదయం 4గంటలకే లేచి నిత్యా కృత్యాలు మొదలు పెట్టేది. అందుకనే ఆమె భర్త కేథరీన్ ను ‘’విటెన్ బెర్గ్ ఉదయ తార ‘’అని ముద్దుగా పిలిచేవాడు .
కేథరిన్ వాన్ బోరా 1499 జనవరి లో జన్మించింది .పదేళ్ల వయసులో తండ్రి రెండో పెళ్లి చేసుకోవటం తో ఆమెనుగ్రిమ్మా దగ్గరున్న నిమ్ షెన్ కాన్వెంట్ లో చేర్చారు .అక్కడ రాయటం చదవటం లాటిన్ లను నేర్చుకొన్నది .వయసు పెరిగిన కొద్దీ ఆమెలో సంఘ సంస్కరణ భావాలు బలీయమై కాన్వెంట్ జీవితం పై విరక్తి కలిగింది .అక్కడి ఇతర నన్స్ తో కలిసి కాన్వెంట్ నుంచి పారిపోవాలని ఎత్తు వేసింది .కాని అలాచేస్తే చట్ట వ్యతిరేకమై మరణ దండన కు గురి కావాల్సి వస్తుందని విరమించు కొన్నది .లూధర్ అనే ఆయన సాయాన్ని రహస్యం గా కోరింది .ఆయన చెప్పిన చిట్కా ననుసరించి చేపల వాన్ లో కేథరీన్ తో పాటు మిగిలిన నన్స్ కూడా కలిసి కాన్వెంట్ నుంచి పారిపోయి విటెన్ బెర్గ్ చేరారు .రెండేళ్లలో లూధర్ కేథరిన్ కు తప్ప మిగిలిన అందరు నన్స్ కు తగిన వరులను వెదకి వివాహాలు జరిపించి ఉద్యోగాలు ఇప్పించి వారి జీవితాలకు దారి, వెలుగు చూపి పుణ్యం మూట కట్టుకొన్నాడు .
కేథరీన్ ను పెళ్లి చేసుకోవటానికి చాలామంది ఉన్నత కులాలవారు ,హోదాలున్నవారు ఉబలాట పడుతున్నారు .చివరికిలూధర్ తోనే ఆమె ఎంగేజ్ మెంట్ 13-6-1525న జరిగి,27వ తేదీ పెళ్లి జరిగింది .అప్పుడు ఆమె వయసు ఇరవై ఆరు అతని వయసు నలభై రెండు .పెద్ద మొనాస్టరికి అధిపతి ,సాక్సని ఎలక్టార్ అయిన ఫ్రెడరిక్ గొప్ప సంస్కరణాభి లాషి .ఈయన కొత్త దంపతులకు విటెన్ బెర్గ్ లో లాక్ కాయిస్టర్లో అన్ని వసతులు ఉన్న భవనాన్ని కానుకగా ఇచ్చాడు .అందులో ఉంటూ జీవిత మాధుర్యాన్ని నవ దంపతులు అనుభవించారు .కేథరీన్ ఇంటిని గొప్పగా తీర్చి దిద్దుకోనేది .చాలీ చాలని ఆదాయం తో ,వచ్చే పోయే అతిధులకు అన్ని రకాల సేవలు చేస్తూ ,భర్త చదువు, రాత, మినిస్టరి పనులకు ఏ ఆటంకం కలుగకుండా ఉత్తమా ఇల్లాలు గా మసిలేది .
కొంతకాలం తర్వాత మొనాస్టరినిర్వహణ బాధ్యతలను కూడా చూడటం ప్రారంభించింది .అందులో ఉన్న కాయ గూరల క్షేత్రాలు, ఫలోద్యానవనాలు ,చేపల చెరువులు ,పశువుల పెంపకం అన్నిటినీ తానె చక్కగా పర్య వేక్షించి తీర్చి దిద్దేది. అవసరమైతే పశు మాంసమూ తానే కొట్టేది .సారా తయారీ ఆమె పనే .ఎందరో విద్యార్ధులు మొనాస్టరి కి అతిధులుగా వచ్చేవారు. లూథర్ బోధనలు వినే వారు. వారందరికీ వసతి సౌకర్యాలకు ఏ లోటూలేకుండా చూసేది .ఎప్పుడూ ముప్ఫై మందికి తక్కువ కాకుండా విద్యార్ధులు, అతిధులు ,బోర్డర్లు ఉండేవారు వారందరి అజమాయిషీ ఆమెదే .అందరికి అన్నీ సమకూర్చటం లో గొప్ప ఆనందాన్ని పొందేది .భర్త లూధర్ తరచూ జబ్బు తో బాధ పడేవాడు .అతన్నీ కంటికి రెప్పలా కాపాడుకోనేది .వ్యాధి గ్రస్తులకు ఆమె దేవత .అక్కడే వారికి ఒక డాక్టర్ లాగా సేవ చేసేది నర్సుల సాయం తో అవసరమైన వైద్య సేవలు చేయ గలిగేది .అప్పుడు అదొక వైద్యాలయమే అని పించేది .కేథరీన్ ప్రతి రోజూ ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి సేవాకార్య క్రమాలలో పాల్గొనేది అందుకనే భర్త లూధర్ ఆమెను ‘’విటెన్ బెర్గ్ ఉదయ తార ‘’అని పిలిచేవాడు .
అలసట లేకుండా మొనాస్తరి లో ఇన్ని పనులు చేస్తూ వ్యవసాయ పనులను అజమాయిషీ చేస్తూనేక్షణం తీరిక లేని జీవితం గడుపుతూనే ఆమె ఆరుగురు పిల్లలను ప్రసవించింది .వీరుకాక లూధర్ మరో నలుగురు అనాధలను చేర దీసి పెంచాడు .వీరందరికీ అమ్మ అయింది కేధరీన్ .భర్త లూధర్ 1546లో మరణించాడు .ఆ తర్వాత ఆరేళ్ళు జీవించింది .
1546లో స్మాల్కాల్డియాన్ యుద్ధం నుండి’’ దాసూ’’ కు ,అక్కడి నుండి మాగ్డబర్గ్ కు పారి పోయింది .విటెన్ బర్గ్ లో ప్రబలిన ప్లేగు వ్యాధి నుండి రక్షించుకోవటానికి’’ టార్గూ ‘’కు చేరి అక్కడే 20-12-1552న నలభై ఏడేళ్ళకే కెధరీన్ మరణించింది .
15,16శతాబ్దాలలో యూరప్ లో ప్రొటెస్టెంట్ సంస్కరణలకు ఊపిరులూదిన మొదటి తరం మహిళా మాణిక్యాలలో కేధరీన్ వాన్ బోరా మొట్ట మొదటి మాణిక్యమై తరతరాలకు వెలుగులనిచ్చి ధన్య జీవి అయింది .
-గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


