బైరాగి సంశయాత్మకతే అతడిని ‘మాస్టర్స్ ఆఫ్ సస్పిషన్’ గా పిలువబడే ఫ్రాయిడ్, మార్క్స్, నీషేల త్రోవన నడిపించింది. ఇన్నేళ్ళు గడిచాక కూడా బైరాగి ఈ తరం పాఠకులలో కూడా ఆసక్తి కలిగించడానికి ఈ సంశయాత్మకతే కారణం. బైరాగి తాత్త్విక మూలాలు అస్తిత్వవాదం లో ఉన్నాయి. అది కూడా కీర్క్ గార్డ్, దోస్తయెవ్‌స్కీల అస్తిత్వవాదం. వేదన ద్వారా మాత్రమే ఒక దివ్యస్ఫురణకు పాత్రులం కాగలమనేది ఈ మార్గంలోని ముఖ్యాంశం. ఇది సార్ర్త్, హైడెగ్గర్, హుస్సెర్ల్ వంటి వారి అస్తిత్వవాదం కన్నా భిన్నమైనది.
‘ప్రేమను కనుగొనటం లాగా, సముద్రాన్ని కనుగొనటంలాగా దోస్తెయెవ్‌స్కిని కనుగొనటం జీవితంలో ఒక ముఖ్య ఘట్టం’ అని హోర్హె లూయీ బొర్హెస్ ఒక వ్యాసంలో అంటాడు. ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ నవలలో చిత్రితమైన రాస్కల్నికోవ్ అవస్థ మొత్తాన్నీ ‘త్రోవ ఎక్కడ సోనియా!’ అన్న ఒక్క కవితావాక్యంతో సూచించిన కవి బైరాగిని కనుగొనడం కూడా అటువంటి ముఖ్యఘట్టమే. అప్పటిదాకా అనుభవిస్తూ వచ్చిన ‘నీరస తథ్యాల’ సుఖాలు మనవి కాకుండా పోవచ్చు. బైరాగిని రెండు కోణాలనుంచి లోతుగా చర్చించవలసి ఉంది. ఒకటి- సాహిత్య చరిత్ర, రెండు- తాత్త్విక చింతన. సాహిత్య చరిత్ర కొన్ని అనుక్రమాల్ని తయారు చేసి పెట్టుకుంటుంది. తన పరిధికవతల ఉన్న అన్ని సవాళ్ళని, వైపరీత్యాల్ని చదును చేసివేస్తుంది. ప్రత్యేకించి, తెలుగు సాహిత్య చరిత్ర మనకు మన సాహిత్యాన్ని గురించి ఒక అతి సరళ కథనాన్ని వినిపిస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు విస్మరణకు గురైన రాజకీయ-సామాజిక సమూహాలు దీన్ని విమర్శకు పెడుతూ కొత్త చేర్పులకు దోహదం చేస్తూనే ఉన్నాయి. ఈ సమూహాలకు చెందకుండా ‘విడిగా, పెడగా’ నిల్చున్న రచయితల్ని సాహిత్యచరిత్ర తను నిర్మించుకున్న చట్రాల్లోనే బలవంతంగా ఇరికిస్తుంది. ఆమేరకు, ఆయా రచయితల సాహిత్యకృషిని అర్థం చేసుకోవడానికి అవసరమైన విమర్శనా పద్ధతుల్ని అన్వేషించాల్సిన బాధ్యతనుండి తప్పించుకుంటుంది. పైగా, ఇటువంటి బాధ్యతను కనీసం గుర్తించనైనా గుర్తించదు.
ప్రస్తుత సమస్యని తులనాత్మక సాహిత్య దృక్పథం తో సమీపించవచ్చు. కన్నడ సాహిత్యం లో ‘నవోదయ’ ఉద్యమం మన భావకవిత్వంతో పోల్చదగిందే అయినా, ఆ తరువాత వచ్చిన ‘నవ్య’ సాహిత్యోద్యమం మన అభ్యుదయోద్యమం కన్నా భిన్నమైనది. ‘నవ్య’ సాహిత్యం అభ్యుదయ లక్షణాలు కలిగివుండటంతో పాటుగా అభ్యుదయాదర్శాల్ని, ఆధునికతనీ కూడా విమర్శించింది. హిందీలో కూడా ఛాయావాదం, ప్రగతివాదం రెంటినీ తిరస్కరిస్తూ నయీ కహాని (నవీన కథ), నయీ కవిత (నవీన కవిత) వచ్చాయి. గోపాలకృష్ణ అడిగ, ముక్తిబోధ్, బి.ఎ్‌స.మర్ధేకర్, అయ్యప్ప పణ్ణిక్కర్‌ల కవిత్వాన్ని గాని, రామచంద్ర శర్మ, యు.ఆర్.అనంతమూర్తి, నిర్మల్ వర్మ, ఓ.వి.విజయన్ ల కథల్ని గాని అభ్యుదయవాద/ప్రగతిశీల రచనలనలేము. అలాగే, శ్రీశ్రీ ’చరమ రాత్రి’ కథల్లో కూడా ఆధునిక అనుభవాల్ని వాస్తవికవాద పద్ధతిలోకాక కొత్త శైలీవిశేషాలతో (ఉదాహరణకి, ‘డ్రమాటిక్ మోనోలోగ్’, ‘మెటాఫిక్షన్’) వ్యాఖ్యానించడం కనిపిస్తుంది.
బైరాగిని అభ్యుదయ కవి అనడమూ, అభ్యుదయ వ్యతిరేక కవి అనడమూ రెండు తప్పే. ఆయనను సాహిత్య పరంపరలో స్థాపించడానికి ‘ఆధునికవాదం’ (మోడర్నిజం) అన్న చట్రం ఉపయుక్తమూ, ఉచితమూ కూడా. ఇది యురోపియన్ సాహిత్యచరిత్రలలో నుంచి తీసుకున్న మాటే అయినా కొన్ని మార్పులతో భారతీయ సాహిత్య సందర్భానికీ అన్వయిస్తుంది. ఆధునికవాదం మానవాత్మ ‘ఊసర క్షేత్రంగా’ మారడాన్ని చిత్రిస్తుంది. ఆధునిక జీవితం మనిషిని ఎన్ని విధాలుగా అమానవీకరణకు (డీహ్యుమనైజేషన్), పరాయీకరణ (ఏలియనేషన్)కు గురిచేస్తోందో గుర్తించడం స్థూలంగా ఆధునికవాద సాహిత్య ముఖ్యలక్షణం. ఆధునికత మీద విమర్శగా ఆధునికవాదాన్ని అర్థం చేసుకోవలసివుంటుంది. వీటితో పాటు, బైరాగి రచనల్లో మరికొన్ని ప్రత్యేక గుణాలున్నాయి.
బుద్ధికీ, హృదయానికి మధ్య కృత్రిమ వైరుధ్యాన్ని బైరాగి కవిత్వం నిరాకరిస్తుంది. ‘డిస్కర్సివిటి’ని శిల్పవిశేషంగా చేసుకుని కావ్యం నిర్మించడం, అది కావ్యత్వానికి భంగం కలిగించకపోవడం ‘నూతిలో గొంతుకలు’ లోని విశిష్టత. అందుకే, రాచమల్లు రామచంద్రారెడ్డి అంటారు- ‘నూతిలో గొంతుకలు తెలుగు కవిత్వంలోని ఏకైక తాత్త్విక కావ్యం. అందులోని సిద్ధాంతాలు, తాత్త్విక సూత్రాలు, మానవ హృదయాంతరాళంలోని గాఢమైన ఆరాటం నుండి, తపన నుండి ఉద్భవిస్తాయి. జిజ్ఞాసువు హృదయంలోని తపన, అన్వేషకుని గుండెలోని ఆర్తి -అవే తాత్త్విక చర్చల రూపం ధరిస్తాయి. అందుకే అది (సిద్ధాంతపు మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా) తెలుగు సాహిత్యంలో ఒక అపురూప కావ్యమయింది.’’ (సారస్వత వివేచన, 1976, పు.56) అలాగే బైరాగి ప్రేమకవితల్లో కూడా ‘ప్రణయం’ అనే భావన వెనుక దాగున్న అంతర్గత కల్పనల్ని విశ్లేషిస్తారు. ప్రేమ నెపంగా శాశ్వతం/నశ్వరం, యౌవనం/వృద్ధాప్యం, సౌందర్యం/విరూపం వంటి ద్వంద్వాల్ని అస్థిరం చేయడం ఈ ప్రేమకవితల వైశిష్ట్యం.
ఒక సాహిత్యకృతిని ఇతర సాహిత్యకృతుల స్ఫురణలతో, వాసనలతో ప్రయత్నపూర్వకంగా నిర్మించడాన్ని Intertextuality అని అంటారు. బైరాగి కవిత్వంలో ‘ఇంటర్టెక్స్టువాలిటి’ ఒక ప్రత్యేక, ప్రధాన నిర్మాణ వ్యూహం. అది ప్రస్ఫుటంగా ‘నూతిలో గొంతుకలు’ లోని మూడు ‘స్వగతాలలోనూ’, ప్రచ్ఛన్నంగా ‘ఆగమగీతి’లోని చాల కవితలలోనూ కనిపిస్తుంది. ‘దివ్యభవనం’ కథాసంపుటిలోని ‘ఒక గంట జీవితం’ కథనైతే బైరాగి వివిధ సాహిత్యకృతులనుంచి తీసుకున్న ఉటంకింపుల అల్లికగా (Roland Barthes అన్నట్టు tissue quotations గా) ‘క్యూరేట్’ చేసాడని చెప్పవచ్చు. హామ్లెట్ నాటకాన్ని, భగవద్గీతనీ, క్రైమ్ అండ్ పనిష్మెంట్‌ని ఎంచుకుని, కావ్యప్రణాళికలో ఒక క్రమంలో అమర్చడం, ఈ మూలకృతులను చదివే దృష్టికోణాల్లో సైతం మౌలికమైన మార్పుకు దోహదం చేసేదిగా ఉంది. సాహిత్యాన్ని సాహిత్య విమర్శగా, ప్రశంసగా సృజించిన కవి బైరాగి.
బైరాగి కావ్యజగత్తులో ప్రతి ఎత్తుగడలోనూ, ప్రతి చలనంలోనూ నీడల్లా వెన్నాడే భావనలు కొన్ని ఉన్నాయి. ఒకటి, అనిత్యత. ఈ అనిత్యతని సూచించేందుకు ‘పద్మపత్రమివాంభసా’, ‘స్మృతి పటలపు సౌదామిని’ వంటి పదచిత్రాలు వేరువేరు రూపాల్లో ‘వేరియేషన్స్ ఆన్ ఎ థీమ్’ లాగా అనేక కవితల్లో దర్శనమిస్తాయి. (దేశం,కాలం) గడచిపోవటం, మాసిపోవటం, అందకపోవటం, ఓడిపోవటం కవిత్వవిషయమవ్వడం అనే ఆధునికవాద లక్షణం బైరాగి కవితలన్నిటా కనిపిస్తుంది. ఆధునికవాదులైన వర్జీనియా వుల్ఫ్, జాయిస్, ఇలియట్ వారి రచనల్లో ‘క్షణాలకు’ ప్రాధాన్యతనిస్తారు. బైరాగి ‘త్రిశంకు స్వర్గం’ అనే దీర్ఘకవితలోని, ‘చావు పుట్టుకల బ్రతుకుల విషమబాహు త్రిభుజంలో/మధ్యనున్న ఒక అదృశ్యబిందువులా/ ఘనీభూత వాస్తవ కేంద్రీకరణం, ఒక్క క్షణం!’ వంటి పంక్తుల్లో ఇటువంటి సాక్షాత్కార క్షణాలు (‘ఎపిఫనిక్ మొమెంట్స్’) మాత్రమే ‘మనుష్యుని దేవతుల్యుణ్ణిగా’ చేయగలవనే విశ్వాసం కనిపిస్తుంది. ఇక మరొక భావన, మృత్యువు. బైరాగి కవితల్లో మృత్యువు కామరూపి. మృత్యువు (బైరాగి వాడే పదం ‘మిత్తవ’) మంత్రసానిగా, నర్తకిగా, మహాఫణి గా జీవితపు ప్రతి మలుపులో పొంచి ఉపహసిస్తుంది. ’పాప పోయింది’ నవలలో అధికభాగం మృత్యువు గురించిన సువిస్తారమైన తాత్త్విక వివేచనే.
వాడ్రేవు చినవీరభద్రుడు బైరాగి గురించిన ఒక విమర్శా వ్యాసంలో అన్నట్టుగా, ‘బైరాగిని మనకు దగ్గర చేసేది అతడి సందేహాలే’. ఆధునికత, ఆధునిక విజ్ఞానశాసా్త్రలు, హేతువు మనిషిని విముక్తుణ్ణి చేయగలవని వికాసయుగం నమ్మకం. వికాసయుగపు విలువలనే కాక, అన్ని విలువల్ని పునర్మూల్యాంకనం చేయవలసి ఉంటుందని నీషే ప్రతిపాదించాడు. అభ్యుదయ కవికి ఈ స్పృహ ఉండదు. అతడికి బైరాగే అన్నట్టుగా సౌందర్యంలో విరూపాన్ని, విరూపంలో సౌందర్యాన్ని చూడగలిగే సామర్థ్యం లేదు. బైరాగి సంశయాత్మకతే (దీన్ని బైరాగి వైయక్తిక స్వభావంగా కాక అతడి కావ్యస్వభావంగా చూడాలి) అతడిని ‘మాస్టర్స్ ఆఫ్ సస్పిషన్’ గా పిలువబడే ఫ్రాయిడ్, మార్క్స్, నీషేల త్రోవన నడిపించింది. ఇన్నేళ్ళు గడిచాక కూడా, బైరాగి ఈ తరం పాఠకులలో కూడా ఆసక్తి కలిగించడానికి ఈ సంశయాత్మకతే కారణం. ఇక, బైరాగి తాత్త్విక మూలాలు అస్తిత్వవాదం (ఎక్సిస్టెన్షలిజం) లో ఉన్నాయనవచ్చు. అది కూడా కీర్క్ గార్డ్, దోస్తయెవ్‌స్కీల అస్తిత్వవాదం. వేదన ద్వారా మాత్రమే ఒక దివ్యస్ఫురణకు పాత్రులం కాగలమనేది ఈ మార్గంలోని ముఖ్యాంశం. ఇది సార్ర్త్, హైడెగ్గర్, హుస్సెర్ల్ వంటి వారి అస్తిత్వవాదం కన్నా భిన్నమైనది. ‘ఎర్రక్రీస్తు’, ‘రెండు క్రిస్మస్ గీతాలు’, ‘కామ్రేడ్ రాయ్ స్మృత్యర్థం’ లాంటి ఆధ్యాత్మిక అనుభవాల గాఢతని చిత్రించే కవితల్లో విశ్వసనీయత, తాదాత్మ్యం బైరాగి లోని దివ్యశ్రద్ధ – సందేహాల కలయికవల్లే సాధ్యమయ్యాయనిపిస్తుంది. ‘నమ్మిక లేని తరంవారు’ అని ఆయన అంటున్నప్పుడు, అది ఏకకాలం లో ఆశనీ, నిస్పృహని సూచించే వాక్యం అని గమనించాల్సివుంటుంది.
బైరాగి సంభావ్యతల కవి. మన దృష్టి, పఠనం, అనుభవం విశాలమయ్యే కొలదీ కొత్త అర్థాలతో మనల్ని తిరిగి తన రంగుల తోటలోకి లాక్కుపోయే కవి. ‘అప్రసవిత ప్రసవాలను, అసంభవ నవలభవాలను పిలుస్తాను’ అన్న కవిని, ‘నేను వ్రాసిన కవితల కన్నా వ్రాయదలచి వ్రాయనివే అందమైనవి’ అన్న కవిని ఆయన వ్రాసిన కవితల ‘నైశ్శబ్ద్యాలలో’ దాగున్న సంభావ్య కావ్యాల్లోనే వెతుకవలసివుంటుంది. ఆయన ‘సూక్ష్మశ్రవణుడు’ (బిరుదురాజు రామరాజు గారి మాట). బైరాగి కవిత్వానికి మరింత చేరువవ్వడానికి మనం ‘జాగ్రత్తగా ఆలించే’ విద్యని సాధన చేయవలసి ఉంటుంది.
ఆదిత్య కొర్రపాటి
8978863234
(సెప్టెంబరు 5 ఆలూరి బైరాగి 90వ జయంతి. 9వ తేదీన వర్థంతి)