కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి 120 వజయంతి సందర్భం గా కృష్ణా జిల్లా రచయితాల సంఘం ,విజయవాడ సిద్ధార్ధ కళాశాల ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యం లో నిర్వహించిన
విశ్వనాధ వారి సాహితీ వైభవం –జాతీయ సదస్సు -10-9-15-సిద్ధార్ధ కళాశాల –విజయవాడ
‘’తెలుగు భాషోద్యమం –విశ్వనాధ ప్రేరణ ‘’పై
పత్ర సమర్పణ– గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు
శ్రీ మన్మధ నామ సంవత్సరం లో జన్మించిన విశ్వనాధ వారి నూట ఇరవై వ జన్మదినోత్సవాన్ని శ్రీ మన్మధ నామ సంవత్సరంలో ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 10 న నిర్వహించటం చారిత్రాత్మక విషయం . అనుభూతికవి స్వర్గీయ తిలక్ మాటలలో ఇది ‘’అద్వైత మాన్మదం ‘’.
‘. ప్రపంచవ్యాప్తంగా 21నాగరకతలు వర్ధిల్లితే అందులో 19రూపు రేఖల్లేకుండా నశించిపోయాయి .కారణం విదేశీ దండయాత్రకాదు ’ఎప్పుడైతే ఒక జాతి తన మూలాలను ,గత చరిత్రను మరచిపోతుందో అప్పుడు ఆ సంస్కృతీ దేశమూ నశించిపోతాయి ‘’అన్నాడు ఆర్నాల్డ్ టోయన్బీ.అదే నేడు భాషావిషయం లోనూ జరిగిపోతోంది .ప్రపంచ వ్యాప్తంగా భాషలు అంతరించి పోయి ఆ సంస్కృతులు కనుమరుగవుతున్నాయని యునెస్కో ఆవేదనే మన రాష్ట్రం లో తెలుగును బతికి౦చుకోవటానికి ‘’తెలుగు భాషోద్యమం ‘’వచ్చింది .కార్పోరేట్ సంస్కృతిలో ఆంగ్ల మాధ్యమ ప్రభావ వ్యామోహం లో పడి మాత్రుభాషనే మర్చి పోయే విపరీత వింత పరిణామం వచ్చింది. దీని నుండి బయటపడటానికి మేదావి వర్గం సాంఘిక ఆలోచనా పరులు భాషాభిమానులు నడుం కట్టి కదిలి కొంత మార్పు తెచ్చారు .అయినా జరగాల్సింది ఇంకా ఎంతో ఉంది .
ఈ ప్రభావాన్ని సుమారు డెబ్భై ఎనభై ఏళ్ళ క్రిందటే గుర్తించిన కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ తెలుగు క్లాసిక్ నవల ‘’వేయి పడగలు ‘’లో ఈ విద్యా విధానం పై తీవ్రంగా పాత్రల చేత చర్చి౦పజేసి తన మనోభావాలను వారి నోటితో చెప్పించాడు .హరప్పకు ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పే ఈట్సన్ దొరకు నెలకు పన్నెండు వందల జీతం ఇస్తే తెలుగు ,సంస్కృతాలు బోధించే ధర్మారావు కు జీతం అ౦దు తోందో లేదో కనుక్కొనే అతీగతీ లేదు .సుబ్బన్న పేటలో కేశవ రావు జాతీయ కళాశాల పెట్టి తెలుగు హిందీ సంస్కృతం రాట్నం వడకటం నేర్పిస్తుంటే ,జమీందార్ ఇంగ్లీష్ కాలేజి పెట్టి పాశ్చాత్య వ్యామోహం పెంచాడు .దీనికి ఎక్కినట్లు జనం జాతీయ కళాశాలలో చేరక ,లుకలుకలతో అవినీతితో ద్వంద్వ ప్రవృత్తుల పాలనలో క్రమంగా క్షీణించి , జమీందార్ కాలేజి దిన దిన ప్రవర్ధమానమైంది .అందులో జీతాలకు కటకట.ఇందులో పుష్కలం .యూరోపియన్ అధికారి చేతిలో జమీందార్ కాలేజి నడిపించాడు .జాతీయకళాశాల’’ పాలక సంఘం’’ ఆధ్వర్యం లో నడిచింది .
ఇంగ్లీష్ రాకుండా మనకు సాగదు అంటాడు వేయిపడగలలో శఠ గోపాచారి.కళాశాల కనుమరుగైపోతోంది .అది ఆనాటి పరిస్తితి .నేడు ప్రభుత్వ విద్యాలయాలు బక్క చిక్కి పోయాయి చేరేవారు లేకుండా పోతున్నారు . .కాన్వెంట్లు బలిసి పు౦జు కున్నాయి .ఆదర్శం గా ఉండి కళాశాలలో పనిచేసిన ధర్మా రావు సతీష్కే పోట్టగడవటం.లేదు .రాజా గారి కాలేజిలో తెలుగు పండితుడవ్వాల్సిన పరిస్తితి వచ్చింది .మన చరిత్ర సంస్కృతీ పై అవగాహన ఈ విద్యా వ్యవస్థ ఇవ్వటం లేదు .చదువు జ్ఞానాన్ని పెంచటం లేదు .’’టెక్కుల’’వరవడిలో కొట్టుకు పోతోంది జాతి .దీని నుంచి బయట పడాలి .అందుకే విశ్వనాధ ధర్మా రావు తో ‘’వందేళ్ళు బానిస చదువులు చదివి భావనా శక్తి దరిద్రమై పోయింది .ఇది నశి౦చటానికే ఈ విద్య నేర్పిస్తున్నారు డిగ్రీ పొందినా ప్రపంచ జ్ఞానం రావటం లేదు ‘’.మరి దీనికి పరిష్కారం కూడా విశ్వనాధ అతనితోనే పశుపతికి చెప్పించాడు .’’తెలుగు చక్కగా వచ్చిన తర్వాత ఇంగ్లీష్ నేర్పించు .బుద్ధి వికసించిన తర్వాత ఏ భాష అయినా త్వరగానే వస్తుంది .16ఏళ్ళ వరకు తెలుగులో చెప్పి ,,ఆ తర్వాత ఒక ఏడాది ఇంగ్లీష్ నేర్పిస్తే వ్యవహార జ్ఞానం వస్తుంది . మొదటి నుంచి ఇంగ్లీష్ చెప్పి చెడ గొడుతున్నారు. .మనం ఇంగ్లీష్ మానస పుత్రులం కాకూడదు .పరీక్షలు పాసై పోతున్నారుకాని అందులోని విషయాలు తెలియవు,అనుభవం లోకి రావు .పనికి మాలిన పుస్తకాలు ఎన్నో నేర్పించటం కంటే ఒక మంచి పుస్తకం నేర్పించు .’’పెద్ద బాల శిక్ష’’ చెబితే తెలుగు రాక పోవటం ఉండదు .’’అంటాడు ఇప్పుడు మన పరిస్తితి అలాగే ఉంది .అందుకే జ్ఞానోదయమై మళ్ళీ పెద్ద బాల శిక్షకు గిరాకీ పెరిగింది .
గుమాస్తాలుగా ,విదేశీయులకు బానిసలుగా చేసే విదేశీ విద్యనూ గాంధీజీ బహిష్కరించమని ఇచ్చిన పిలుపునే వేయి పడగలలో విశ్వనాధ నిక్షిప్తం చేశాడు .సుబ్బన్న పేటలో కరెంటు ,మిల్లులుఆధునిక సౌకర్యాలు అన్నీ వచ్చాయి.విశ్వనాధ వీటికి వ్యతిరేకం కాదు .’’మనిషిలో మానసిక వికాసానికి అవసరమైన విలువల్ని ,సంస్కారాన్ని మర్చి పోనంతవరకు ఏ ఆధునిక మార్పునైనా పరిగ్రహించ వలసిందే ‘’అన్నాడు విశ్వనాధ .ఎక్కడా ఏమనిషీ ప్రేమలేనివాడు ,నిష్కరణుడు కాకూడదు ‘’అన్నదే ఆయన ధ్యేయం .జుగుప్స లేని కరుణా ,సానుభూతి మానవాళి పై ఉన్నవాడు .’’continuation with the past ‘’తో నిలబడ్డ యుగకర్త విశ్వనాద .కాలం కంటే యాభై ఏళ్ళు ము౦దున్నవాడు .శిల్ప సాహిత్యాదు లు జాతీయమై ఉండాలి.రాసిన వాడికి ముక్తి ,చదివిన వాడికి రక్తి ,ముక్తి .’’ఎంతసముద్రం మీద ఎగిరినా పక్షి రాత్రికి గూడు చేరుతుంది .ఇదీ జాతీయత ,ఇదే సంప్రదాయం ‘’..ప్రాచీన ,ఆధునిక సాహిత్యానికి ఏకైక ప్రతినిధి విశ్వనాధ .భారతీయ సంప్రదాయ పరి రక్షణకు జీవితం అంకితం చేసిన విరాణ్మూర్తి .అందుకే ‘’ఒకడు విశ్వనాధ ‘’ అన్నారు ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారు .’’That is Visva Nadha ‘’Unique one .’
పి. జి .వుడ్ హౌస్ ‘’your spine is made of tooth paste ,your veins flow water’’అని ఎద్దేవా చేశాడు .అలాంటి జాతిగా మనం మారిపోయాం దీనిని ఉద్ధరించటానికే విశ్వనాధ సాహితీ అవతారం ఎత్తాడు . సాహిత్యం,శిల్పం విజాతీయం కాకుండా జాతీయం కావాలి అనే ఆలోచన వచ్చిన కాలం లో ఆ సమకాలిక చైతన్యానికి సృజనాత్మక సాహిత్య శక్తి అయ్యాడువిశ్వనాధ ‘అంటారు ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం .ఈ దేశం లో పుట్టిన ప్రక్రియల్లో పాశ్చాత్య ప్రక్రియలు లీనం కావాలి అనికోరాడు ఆపనే చేశాడు .మానవ జీవితం అర్ధ వంతం కావాలని కోరుకున్నాడు .రాజకీయ దాస్యం కంటే సాంస్కృతిక దాస్య౦ ఎక్కువ ఆవేదన కలిగించింది . .అందులో నుంచిజాతి బయట పడాలి . అప్పుడే వ్యక్తిత్వం గల జాతి అవుతుంది అంటాడు . ఆంద్ర పౌరుషం ఆంద్ర ప్రశస్తి లతో సకల చరాచారాలను కలుప్తూ ప్రబోధించాడు చైతన్యం తెచ్చాడు .’’తెలుగు తల్లి ,మానేల ,ఆంద్ర రాష్ట్రం, ఉరిత్రాళ్ళు ,బానిసల సముద్రం ‘’ మొదలైన వాటిలో తెలుగు జాతి గౌరవాన్ని నిలిపాడు .స్వదేశీ అభిమానాన్ని చాటటానికే ‘’కిన్నెర సాని పాటలు’’ రాశాడు. ‘’తనకాలం నాటి తెలుగు నాట సామాజిక ,రాజకీయ ,పాలనా పరంగా వస్తున్న పాశ్చాత్య ధోరణుల పెనుగాలులకు రాక్షముఖంగా ప్రాతి నిధ్యం కల్పించి ఎడుర్కొన్నవాడు విశ్వనాధ ‘’అన్న ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారి మాట యదార్ధం .
విశ్వనాధ చెప్పినట్లే డాక్టర్ కొఠారి’’విద్యలో జ్ఞానం లోపించింది .దీనివలన యువతకు గుణాత్మక జీవన విధానం తెలియ కుండా పోయింది .మంచి వ్యక్తిగా పోరుడుగా నైపుణ్య కారుడుగా తీర్చి దిద్దే విద్య నేర్పాలి ‘’అని యాభై ఏళ్ళ కిందటే చెప్పాడు .ఇప్పుడు మనం భాషోద్యమం లో అదే అంటున్నాం చరిత్ర మొదలైన హ్యుమానిటీస్ చేర్పించాలనికోరుతున్నాం .భారత రత్న ,మిసైల్ పితామహుడు అబుల్ కలాం కూడా ‘’విజ్ఞాన సముపార్జనకు పనికొచ్చేది అమ్మ భాష మాత్రమే . మాతృ భాషలో చదివితే మెదడు లోని ‘’నియో కోర్టే క్స్ ‘’బాగా స్పందించి ,సూక్ష్మ బుద్ధి ,కొత్త ఆలోచన ,వ్యక్తీకరణ సామర్ధ్యం పెరుగుతాయి . మాతృ భాష కు ఇంతటి మహత్తర శక్తి ఉంది .కలాం కూడా పదవ తరగతి వరకు తమిళ మాతృభాషలోనే చదువుకొన్నాడు .కలాం మాటలు మనకు శిరోధార్యం కారణం ఆయన మట్టి మనిషి .’’రామేశ్వరం నుండి రాష్ట్ర పతి భవనానికి దూసుకెళ్లిన రాకెట్ ‘’..’’విజ్ఞాన సాంకేతిక శాస్త్రాల మీద నవతరానికి ఆసక్తి పెరగాలంటే అమ్మ భాష లోనే బోధించాలి .అప్పుడే సృజనాత్మకత పెరుగుతుంది ‘’అన్నాడు కలాం దీన్ని ఇస్రో చంద్రయాన ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ అన్నాదురై కూడా సమర్ధించాడు ఇంగ్లీష్ వాళ్ళు తప్ప, మిగిలిన ప్రపంచ శాస్త్ర వేత్తలందరూ సైన్స్ ను వాళ్ళ భాషలోనే రాస్తారు మాట్లాడతారు .మాతృ భాషలో విద్య నేర్పిస్తే వైజ్ఞానిక సాంకేతిక రంగాలకు అవసరమైన స్వంత ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది .సహజ మేధస్సును పదును పెడుతుంది .’’వైజ్ఞానిక సాధనకు అమ్మభాషే పెట్టు బడి’’అన్నాడు డాక్టర్ కలాం .’’కన్న పేగుతో అనుబంధం లేని ఇంగ్లీష్ అవసరాన్ని మాత్రమే తీరుస్తుంది .చదువుపై ఆసక్తి పెంచలేదు ‘’అన్నాడు రాకెట్ వీరుడు కలాం .మద్రాస్ ఇన్ ష్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కలాం చదివేటప్పుడు తమిళం లో రాసిన ‘’మన విమానాన్ని మనమే తయారు చేసుకొందాం ‘’వ్యాసానికి మొదటి బహుమతి వచ్చింది .’’జీవద్భాషలో చెబితే హృదయం స్పందిస్తుంది .ఎంతా పెద్ద ఉద్యోగానికైనా తెలుగే అర్హతకావాలి .వృత్తి, సాంకేతిక విద్యలలో కూడా తెలుగుకు ప్రాధాన్యమిచ్చి అందులో వచ్చిన మార్కులు అంతిమ ఫలితాలకు కలపాలి .అప్పుడే భాష బాగుపడుతుంది ‘’అని శ్రీ తిరుమల శ్రీనివాసాచార్య ఈ మధ్య చెప్పిన దాన్ని, వందేళ్ళ క్రితమే గిడుగు రామమూర్తిగారు ‘’అన్ని శాస్త్రాలూ మాత్రు భాషలో బోధిస్తేనే స్పష్టంగా అర్ధమవుతుంది .ఉగ్గుపాలనుండి తల్లిభాష లోనే అంటా నేర్పాలి ‘’అన్నారు .అందుకే ‘’అమ్మనుడి’’ సహజమైనది .దీనికోసం ప్రభుత్వానికి సరైన భాషా విధానం ఉండాలి దాన్ని నిర్దుష్టంగా అమలు చేయాలి .చట్టాలు న్యాయ వ్యవహారాలూ పాలనా అ౦తా తెలుగులోనే జరగాలి.తెలుగు మూలాల మీద పరిశోధన జరగాలి .మాధ్యమాలలో ఆంద్ర పద ధోరణి తగ్గాలి . ఇవన్నీ విశ్వనాధా ప్రేరణలే
. ఒక జాతి గొప్పదనం ఆ జాతి యొక్క భాష, ఆచారవ్యవహారముల వల్లనూ, ఆ జాతిలో పుట్టిన మహాత్ముల వల్లనూ, ఆ జాతికి సంబంధించిన సార్వజనీన గ్రంధముల వల్లనూ విలసిల్లుతూ ఉంటుంది. జ్ఞానవైరాగ్యముల పుట్టినిల్లయిన భారతావనిలో భాషాపరంగా జాతులను చూడగోరితే అందులో తెలుగు జాతికి ఒక విలక్షణమైన స్థానమున్నది. సంస్కృతం తరువాత అందునుండే పుట్టిన భాషలలో అత్యంత సంస్కరింపబడిన భాష తెలుగు భాష. మనకు అమ్మమ్మ సంస్కృతమైతే, తెలుగు అమ్మ; అమ్మమ్మ సంతానంలోకెల్లా మన అమ్మ అత్యంత సౌందర్యరాశి, సంస్కారశీలి. అటువంటి భాష ఇప్పుడు సొంత పిల్లల చేతిలో నిరాదరణకు గురిఅవుతోంది. పరభాషాప్రియత్వంలో పడి బుద్ధివికాశాన్ని, మనోవైశాల్యాన్ని కలిగించగల భాషను తోసిరాజంటున్నాం. ఒక జాతిపాశ్చాత్య సామ్రాజ్య వాద దురాక్రమణకు వ్యతిరేకంగా రాజకీయ స్థాయిలో దేశ స్వాతంత్య్రం కోసం తీవ్రంగా ఒకవైపు జాతీయోద్యమం సాగుతున్న కాలంలో పాశ్చాత్య సాంస్కృతిక సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా, సాంస్కృతిక స్థాయిలో తన సాహిత్య శక్తులను ఎదురొడ్డి తెలుగునాట తీవ్రంగా పోరాటం నిర్వహించిన సాహిత్య సమరయోధుడు విశ్వనాధ సత్యనారాయణ. ‘ ‘జాతీయతకు సంప్రదాయమ్ము, ప్రాణభూతిమ్మది ప్రాణశక్తి’’అన్న మహనీయుడు
ఈ పోరాటం దిశగా, తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఒకే ఒక రచన ‘విశ్వనాధ‘ గారి ‘వేయి పడగలు‘ మాత్రమే. భారతీ యాత్మను ఆధునికంగా ఆవిష్కరిస్తూ దేశీయమయిన ఉదాత్తజీవితపు విలువలను ఆత్మోత్తరణ కోసం అవశ్యంగా కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తింప జేస్తూ ఇంకా ఈ జాతి చైతన్యశక్తి చావలేదని, అది సనాతనమని ఎలుగెత్తి చాటిన ఒకే ఒక గొప్ప నవలేతిహాసం‘వేయిపడగలు‘. అది మరింత విస్తరించి ఆయా భాషల వారు స్వీయ రాష్ట్రాన్ని మాతృదేశంగా దేశమాతగా పరిగణింపజేసింది. ‘’నేను చదవ వలసిన వాడినేకాని చూడవలసిన వాడిని కాదు ‘’ అని చెప్పగల సత్తా ఉన్నవాడు .ఈనాటి భారతీయ సాహిత్యానికే కాదు సార్వకాలీన భారతీయ సాహిత్యంలోనే ఒక ఉజ్వల శిఖరం. శ్రీ విశ్వనాథ, సాహితీ కల్పవృక్షం .
గబ్బిట దుర్గా ప్రసాద్ .
విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు
2-405 శివాలయం వీధి– ఉయ్యూరు -521165-కృష్ణా జిల్లా
చరవాణి-9989066375 ,o8676-232 797

