వేకువ పిట్ట
శ్రీ ఎస్ .ఆర్.భల్లం గారి ‘’వేకువ పిట్ట ‘’56 కవితల సంపుటి .సందర్భాను సారంగా చెప్పినవి అనుభవం తో చేసినవి స్పందించి రాసినవి ,చెప్పాలని చెప్పిన కవితలివి .చాలా సాంద్రమైన కవిత్వం ఉంది. సుతిమెత్తగా చెప్పాల్సిన చోట చెబుతూ ,అవసరమైన ప్పుడు బల్లెం తో పోడిచినట్లూ చెప్పటం భల్లం వారి ప్రత్యేకత ‘ .ముందుగా మా ఉయ్యూరుకు సంబంధించిన కవితను గురించి తెలియ జేస్తాను .కొలచల సీతారామయ్యగారు అనే ఆయన 1917లో ఉన్నత చదువులకోసం మదారాస్ కు ఉయ్యూరు నుండి కాలినడకన వెళ్లి అక్కడ మదనపల్లి కాలేజిలో చదివి ,విద్యా తృష్ణ తీరక సైంటిస్ట్ అవ్వాలనే కోరికతో ఉండగా తండ్రి గారు చనిపోయారనే వార్త తెలిసి ఉయ్యూరు వచ్చి ఆ పది రోజులూ గడిపి అన్నగారు గాయత్రి అనంత రామయ్యగారికి మనసులో మాట చెప్పి ,ఆయన కాదనలేని పరిస్తితిలో అనుమతిపొంది తండ్రిగారు కూడ బెట్టి ఇచ్చిన రెండు వేల రూపాయలను అన్నగారివ్వ గా తీసుకొని మద్రాస్ వెళ్లి అక్కడి నుండి అమెరికా వెళ్ళే ఏర్పాటు చేసుకొన్నారు .పొగ వోడఎక్కి స్నేహితుడిగా నటించిన ఒక తమిళుడు డాలర్లుగా మార్చి డబ్బు తెస్తానని రెండు వేలు కాజేసి ఉడాఇంచగా బొగ్గు గదిలో కెప్టెన్ దయా దాక్షిన్యాలతో ప్రయాణం చేసి సింగపూర్ చేరి అక్కడ కొందరు సాయం చేయగా మళ్ళీ షిప్ లో ఎక్కి కెప్టెన్ చెప్పిన అరవ చాకిరీ అంతా చేస్తూ అమెరికా చేరాడు .అక్కడ నెమ్మదిగా చదువుపూర్తీ చేసి స్వంత కాళ్లమీద నిలబడి అనుకొన్నది సాధించాడు .
తనకు సరైన దేశం అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న సోవియట్ రష్యా అని భావించి అక్కడికి వెళ్లి మాస్కో నగరం లో ఉండి ఆయిల్ సైన్స్ లో అనేక పరిశోధనలు చేసి యుద్ధపు టాంక్ లలో ఉపయోగించే ఇంధనం సమర్ధ వంతంగా ,పని చేయటానికి కలుపవలసిన వాటినికనిపెట్టి సామర్ధ్యాన్ని పెంచి తేలిక రకమైన టాంక్ ల నిర్మాణానికి దారి చూపి ఆధునికకాలం లో ‘’కేమటాలజి’’గా పిలువ బడుతున్న శాస్త్రానికి ఆద్యుడై ‘’ఫాదర్ ఆఫ్ కేమటాలజి ‘’గా పేరు పొందిన సీతారామయ్యగారు ఉయ్యూరు వాడు కావటం మా అదృష్టం .ఆయన ఉయ్యూరు వదిలిన 46 ఏళ్ళకు రష్యానుండి ఇండియాకు 46 రోజులు ఉండటానికి వచ్చి ,ఇక్కడ పౌర సన్మానం పొంది బంధువులతో గడిపి క్షేత్ర సందర్శనం చేసి వెళ్లి పోయారు అప్పుడు1963లో ఆయన్ను చూసిన భాగ్యం మాకు కలిగింది .ఇక్కడి నుంచి వెళ్ళిన కొన్ని ఏళ్ళకే మాస్కోలో మరణించారు రష్యా యువతినే వివాహమాడి ఇద్దరు ఆడపిల్లలకు జన్మ నిచ్చి భారతీయ పేర్లే వారికి పెట్టి అక్కడ వారింట్లో అచ్చమైన తెలుగు భోజనమే అతిధులకు అందిస్తూ సంప్రదాయాన్ని lతెలుగుదనాన్ని కాపాడుకొన్న మహనీయుడు .
ఆయన పెద్ద కూతురి కూతురు ‘’అనస్తేషియా ‘’సుమారు పదేళ్ళక్రితం తాతగారు సీతారామయ్యగారి స్వగ్రామం దర్శించాలని అమెరికాలోని కాలి ఫోర్నియా నుండి ఉయ్యూరు వచ్చింది .’’హాం రేడియో’’ వ్యవస్తాపకుడు మా ఉయ్యూరు వాసి మాకు హైస్కూల్ లో జూనియర్ అయిన సూరి శ్రీరామ మూర్తి (సూరి)ఆమెను హైదరాబాద్ నుండి వెంబడి పెట్టుకొని ఉయ్యూరు తీసుకు వచ్చి ఆమె తాతగారి మూలాలను గుర్తింపజేసి ,సభ పెట్టి ఆమెను సత్కరించి మా బోటి వారితో మాట్లాడించాడు .ఆమె అచ్చమైన భారతీయ మహిళగా చీర జాకెట్ కట్టి బొట్టూకాటుక ,తలలో పూలుపెట్టుకొని గాజులు తొడుక్కుని వచ్చి అందర్నీ ఆశ్చర్య పరచింది .మా ఏం ఎల్ సి శ్రీ రాజేంద్ర ప్రసాద్ కూడా ఆసభలో పాల్గొన్నాడు . సీతారామయ్య గారి జీవితం పై ఆయన పెద్దల్లుడు బ్రేజేనేస్కి రష్యన్ భాషలో రాస్తే దాన్ని ఇంగ్లీష్ భాష లోకిశ్రీ ఎస్.పి.కే గుప్త ,శ్రీమతి అచలా జైన్ ‘’A wreath for doctor Ramayya ‘’గా రాస్తే నేను దాన్ని ఆధారం గా అనేక శీర్హికలతో అంతర్జాలం లో ‘’కేమటాలజి పిత కోలచల సీతా రామయ్య ‘’అని 32 ఎపిసోడ్ లు రాసి దానికి టాగ్ గా ‘’పుల్లేరు నుండి ఓల్గా వరకు ‘’అని పెట్ట్టాను .ఈ నెలలో 5-9-15ఉపాధ్యాయ దినోత్సవాన్ని సరసభారతి నిర్వహించిన కీ శే కోట సూర్యనారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవంగా శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల సౌజన్యం తో మా గురుపుత్రులు శ్రీ కోట సోదరులు ,గురువు గారి వర్ణ చిత్రాన్ని రచించిన ఆర్టిస్ట్ శ్రీ ఆనంద్ ,శ్రీ రాజేంద్ర మొదలైన వారి సమక్షం లో ఆవిష్కరింప జేశాం ఈ సందర్భం గా నేను రామయ్యగారిపై రాసిన దాన్ని తాను పుస్తక రూపం లో తెస్తానని రాజేంద్ర తెలియ జేశాడు .
ఎనస్తేషియా రాక సంఘటన ను చూసిన లేక తెలుసుకొన్న భల్లం గారు ‘’పడమటి సంధ్యారాగం ‘’కవితలో అక్షర బద్ధం చేసి చిరస్తాయి కల్పించారు .’’ఒక మెలకువ లాంటి కలలోంచి –పూర్వీకం పుడమి పుట్టిల్లని –ప్రేమ పూత రేకులుగా వత్తడానికి –పెంగ్విన్ పిట్టలా ఎగి రోచ్చావా ?అని మొదలు పెట్టి రాశారు .’’అనురాగ రహిత సంగీతపు అపశ్రుతుల్ని వినటానికి –అలవాటు పడ్డ మా కర్ణ పుటలపై –పడమటి సంధ్యా రాగం లో ఇమిడే ఆత్మీయ చరణానివి ‘’అన్నారు .ఆమె రాకలో ‘’చెలిమి చెరువు ,శిధిలమైన ప్రేమ కింద చిగురించిన ప్రియ బాంధవ్య స్పర్శ ‘’కనిపించింది కవికి .
‘’నీ రాకతో అమ్మా అనస్తీషియా—ఉయ్యూరు చెరుకు మరీ తియ్యగించింది –పగుళ్ళు బారిన గుడి ధ్వజ స్థంభం పై చిరు గంట –నీ కరస్పర్శ కై కొంగ జపం చేస్తోంది .’’అని మా కెసీపి షుగర్ కు మరింత తీయ దానాన్ని తెప్పించారు .
‘’అమెరికా ఆంధ్రాకి దూరా భారమైతేనేం –నీ ఆత్మీయతా రెక్క ఎగురుడు ముందు తక్కువేగా’’ ?’’అని ఆత్మీయత ముందు దూరం చిన్నబోతున్దన్నారు .
‘’ఉయ్యూరు కంటే కాలిఫోర్నియా పెద్దదైతేనేం –నీ ప్రేమ సంకల్పం ముందు చిన్నదేగా’’అంటూ
‘’ప్రియాతి ప్రియమైన అనాస్తేషియా-నువ్వీ మట్టిని స్పర్శించి వెల్లడ మంటే –పూర్వీకం పేగుల్లో –పట్టెడు ప్రేమ మెతుకుల్ని పదిల పరచుకోవడమే ‘’అని గుండెలోని ఆనందాన్ని వ్యక్తపరచారు భలేగా భల్లం గారు .
మరోకవిత బుజ్జాయి లో ‘’చిగురు ముందు చెట్టు శీర్షా సనమేయడం’’గా ఉందట .’’మరచెంబు ‘’తీపిజ్ఞాపకాలు నేమరేస్తూ ‘’బియ్యపు గింజ మీద తాజ్ మహల్ ని చిత్రించినట్లు –సంప్రదాయాన్ని వదులుకోలేని –ఈ మరచెంబు ఎన్నెన్ని రుచుల్ని గర్భీక రించు కొందో ‘’అన్నారు .’’
పల్లెటూరి లోని ‘’ఈతకొలను ,పూత రేకూ –గున్నమావీ ,గిలక బావి –గుడ్డ ఊయల ,బడి బంగాళా ‘’అన్నీ ఇప్పుడు ‘’రంగుల కరెన్సీ కంపే ‘’కొడుతున్నాయట .’’వంగడాల కోసం –లొంగ డాలు మొదలయ్యాక –పెంట ఎరువు సారం కంట కింపు ‘’అయిన్దంటారు ‘’పల్లె విత్తనం ‘’లో .’’ధింసా ‘’కవితలో ‘’ధింసా అంటే –నది మీద యెగిరి –మైదానం లో కురిసే వర్షం కాదు –పురాతనం మట్టి లోంచి –ప్రేమగా వీచే నాట్య సుగంధ సమీరం ‘’అనే అర్ధం చెప్పారు .తల్లికి జ్ఞాన బోధ చేస్తూ ‘’అమ్మాయీ !బుడ్డోడిని ఏడవ నివ్వకు-దేహం దేవిడీ లో –ధింసా స్వరాలు మటు మాయ మౌతాయేమో/అని సందేహం వెలిబుచ్చారు .సహజత్వానికి గొప్ప ఉదాహరణ ఈ కవిత . తండ్రి కవి సుధానిధి భల్లం తిరుపతి రాజుగారిని ‘’ను గుర్తుకు తెచ్చుకొంటూ ‘’నాయనా ‘’కవిత లో’’ మనిద్దరి మధ్య దివ్య భాష తప్ప –ద్రవ్య భాష ఎప్పుడూ స్పర్శించేదికాడు ‘’అనటం వారి ఆత్మీయ బంధానికి నిదర్శనం .పుస్తకం శీర్షిక అయిన ‘’వేకువ పిట్ట ‘’కవితలో రోడ్డు ప్రమాదం లో మరణించిన విలేకరి మిత్రునికి అశ్రుతర్పణం చేస్తూ అతడు ‘’గ్లోబల్ తోడేళ్ళ నోళ్ళకి –మానవీయ వలువల మాంస ఖండాల్ని అందించే –రాజకీయ ఋతువులలో కూడా –ఒక నులి వెచ్చని స్పర్శలా మెలగుతాడు ‘’అని మెచ్చుకొన్నారు .
పొలం భాష అయిన ‘’మునుం పాట ‘’లో ‘’కనుపాపా మనదే ,కను రేప్పా మనదే –చూపులే మనవికావు –బతుకు సరుకుగా మారినప్పుడే –మనిషి కలలు ఎప్పుడో చెదరి పోయాయి –మనసు పొరలు ఎప్పుడో చిరిగి పోయాయి ‘’అని ఆవేదన చెందాడుకవి .‘’ఆరుద్ర పురుగు తోల్వని మట్టి పుటలో –మునుం పాట చరణాలేమయ్యాయో-నాగేటి చాలులో రైతు నాటుకొన్న –ఆశల విత్తనాలేలా బుగిలి పోయాయో ‘’అని రైతు దయనీయ స్తితిని కవితాత్మకం చేశారు .అన్నం కారియర్లు అందించే అసిరిగాడిని ఆకలి కబలిస్తే స్పందించి ‘’అమ్మలాంటి అతడు ‘’రాశారు .’’ఆకలి బెబ్బుల్ని హతమార్చతానికి –ఆత్మీయ ఆహార ఆయుధం తెచ్చిన ఇతడిని –గౌరవించ కుండా ఎలా ఉండగలను ?’’అని సహవేదన చెందారు సానుభూతి వర్షించారు .’’పేగు ని౦పని పోగు ‘’కవితచేనేతి వ్రుత్తి వారి చావులు ,దుర్భర జీవిత చిత్రణ –
‘’గంజి నీళ్ళలో గుంజి ఆరేసిన పోగుల పేగుల మీద –బుటాలు బుటాలుగా జరీ పూలు ఎలా అందగిస్తాయో –అరిగిన రూపాయి అడుగు జాడలలో –ముడి నూలుకి అంటు కట్టిన చక్ర వడ్డీల చీడ పీడా ఎలా వదుల్తుందో?’’ఎవరి మూసల్లో కాదు –మాసాల్లో వాళ్ళు కార్చే –మొసలి కంటి తుడుపు వాగ్దానాల జలదారాలకి –చచ్చిపడిన పచ్చి పడుక్కి ప్రాణ మొస్తుందా ?’’అని వారిభాషలోనే గొప్ప కవిత్వం అల్లారు భల్లం .’’మనిషి చరిత్ర పుస్తకం అట్టమీద –చేనేత చెలికాని అసహజ మరణం మరకల్లేని –బొమ్మేపుడు ముద్రించ బడుతుందో ?’’అంటూ వారి చీకటి బతుకుల్లో వెలుగులేప్పుడు వస్తాయోనని ఆవేదన చెందారు .బొర్రా అంటే రంధ్రం –అవి గుహలు మాత్రమే కావు –అనంతానంత జల శిఖరాలు కూడా –పచ్చ మీగడ వంటి ప్రక్రుతి ఆకృతులు ‘’అని బొర్రా గుహల అండదచందాలను ప్రక్రుతి రామణీయకతను ప్రశంసించారు భల్లం .గీతకార్మికులపై ‘’తాటి ముంజే దీపం ‘’,పిల్లలు సరిగ్గా చూడని అనాధ వృద్ధులమరణాలపై ‘’పోలి కట్టే ‘’,అవినీతిపై ‘’ఆమ్యామ్యా ‘’,హాస్టల్ విద్యార్ధుల అవస్తలపై ‘’ఇలా ఎందరో ‘’కవితలు రాసి కదిలించారు .
మహా రాష్ట్రలో అదనపు కలెక్టర్ ‘’యశ్వంత్ సోనావానే’’ను సజీవ దహనం చేసినపుడు ‘’దేశం కన్నా దేహమూ –కర్తవ్యమ్ కన్నా కరెన్సీ ఎక్కువైన చోట –పెట్రో కొలిమిలో చిట్లిన మృత్యు సంగీతం సాక్షిగా –ఊదు కడ్డీ పొగ తీగలకు వేలాడ దీయ బడిన దుర్మరణం ‘’అని కన్నీరు కార్చాడుకవి .
రోడ్డుమీద బొగ్గుతో బొమ్మలేసే వాడి గురించి ‘’బొగ్గు బొమ్మ ‘’కవితలో –
‘’శిలనైనా చిరునవ్వు కుంచెతో –పగుల గొట్టగల నమ్మకం వాడిది –అవసరం ముందు అవనత చిత్ర మయ్యాడంతే ‘’-‘’గతుకుల బతుకు బాటలో –అతకని చిత్రాలు ఎపుడూ ప్రశ్నించవు –అరిగి అరిగి చెరిగిపోతాయ౦తే-రహదారి నుంచి విడివడని రంగుల వ్యామోహాల మధ్య –ఒక శూన్య చిత్రంగా నిర్జీవంగా నిలబడే ఉన్నాడు ‘’అని కాసులు రాల్చని వాడి కళకు నీరాజనమెత్తాడు కవి .
అనాలోచితంగా ఆత్మ హత్య చేసుకొనే వారికి ‘’ఎవరికోసం ‘’కవితలో ‘’అర్ధాంగి ఋణం తీర్చటమంటే –మరణానంతరం మౌనంగా దుఖించటం కాదు –ప్రతి రోజు ప్రేమ సామ్రాజ్యాన్ని –ఆమె పాదాల ముందు ప్రణమిల్ల చేయటం ‘’’’దహన దాహాల తదనంతరం –తనని పోగొట్టుకొన్న అతడు తప్ప –ఉసురు తీసిన –ఇన్ని దాహాలతో యెట్లా బతికేది ఆమె లేకుండా ?’’అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి జీవితాన్ని సరిదిద్దుకోవాలి కాని మరణమే శరణ్యం అనుకోరాదని హితవు .
‘తల్లి అంటే –అప్పుడప్పుడు గుర్తు చేసుకొనే గతం కాదు –పల్లె అంటే –అనేకానేక అభిమానాల మధ్య గుర్తు పట్టే వర్తమానం ‘’
ఇలా చాలా రసార్ద్ర్డంగా ,కమనీయం గా మూలాల లోకి వెళ్లి కవిత్వం చెప్పారు .ప్రతికవిత ‘’కదిలించేదే –కర్తవ్యమ్ బోధించేదే సానుభూతి కురిపించేదే సహవేదన తెలియ బరచేదే ,కకృతజ్ఞత చూపించేదే సెభాష్ అని మెప్పించేదే . జన జాగృతిని చేసేదే అందుకే ‘’వేకువ పిట్ట ‘’అయింది .అందమైన ముఖ చిత్రం క్వాలిటీ ముద్రణ అదనపు ఆకర్షణలు .2004-14 కాల వ్యవధిలో అంటే పదేళ్ళలో రాసిన చిక్కని చక్కని కవిత్వమేఇది . .పదబంధాలు పడభావ చిత్రాలు కోకొల్లలు . శబ్దం భల్లం గారి చేతిలో పల్లవమే అవుతుంది .సోగసులులతో సుగంధ భరితమౌతుంది .పదం కోసం వెతుకు లాట ఉండదు .సూటిగా హృదయానికి బల్లెంలా తాకేదే శ్రీ భల్లం కవిత .చదివి ఆస్వాదించి ఆనందం పొందండి .
ముఖ చిత్రం జత చేశాను చూడండి
100 రూపాయల ఈ అపురూప ‘’వేకువ పిట్ట ‘’లభించే స్థలం
భల్లం సామ్రాజ్య లక్ష్మి 4 -87—12 -ఇందిరా నగర్ –గాంధి బొమ్మ సెంటర్
తాడేపల్లి గూడెం -534 101
Email-sr.bhallam @gmail.com
Cell-98854 42642
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-15-ఉయ్యూరు

