శ్రీ భల్లం సూర్యనారాయణ రాజు అనే ఎస్. ఆర్. భల్లం భాషా ప్రవీణ ,తెలుగు ఏం ఏ .పశ్చిమ గోదావరి జిల్లా బాదం పూడి జి ప.ప. ఉన్నత పాఠశాల లో తెలుగు పండితులు .తాడేపల్లి గూడెం నివాసం .’’నీటి భూమి ‘’,గూడు వదిలిన గువ్వలు ,చిగురు కేక ,కొల్లేరు, కొల్లేరు జీల్ ,జ్ఞాన దర్శిని ,వేకువ పిట్ట ‘’మొదలైన రచనలు చేశారు .ఉగాది కవితాపురస్కారం ,తెలుగు భాషా వికాసం పురస్కారం ,రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ ,ధిల్లీ తెలుగు అకాడెమి సత్కార్ ,ఆంద్ర మహాసభ కవితా పురస్కార్ ,శాంతినికేతన్ పురస్కార్ అందుకొన్నారు .పశ్చిమ గోదావరిజిల్లా అధికార భాషా సంఘ కన్వీనర్ ,రచన సాహితీ గృహం –వ్యవస్థాపక అధ్యక్షులు .శ్రీ నారాయణ రెడ్డి కవితా యాత్ర ను పల్లె నుండి ధిల్లీ దాకా శత ప్రసంగాలతో చేశారు .అలాగే సి నా రే కవితా ప్రసంగాలతో ఆంధ్రా నుండి అమెరికా వరకు ప్రయాణించారు .తిరుమల స్వామి వారి నిత్య కళ్యాణోత్సవ ప్రత్యక్ష వ్యాఖ్యాతలు .అమెరికా తెలుగు వెబ్ సైట్ లో వీరి రచనలు అనేకం చోటు చేసుకొన్నాయి .వీరి కవితలు బహుభాషలలోకి అనువాదం పొందాయి .ఇంతటి లబ్ధ ప్రతిస్స్టితుడైన శ్రీ భల్లం తన ప్రచురణలను నాకు ఎప్పటికప్పుడు పంపుతున్నారు .ఈ నెలలో వేకువ పిట్ట ,జ్ఞాన దర్శిని హిందీ రచన కొల్లేరు జీల్ పంపారు .జీల్ హిందీ కనుక నాకు అందులో ప్రవేశం లేదుకనుక మొదటి రెండు పుస్తకాలపై నా భావాలను మీతో పంచుకొంటున్నాను .
1- జ్ఞాన దర్శిని
యాభై విభిన్న విషయాలపై రాసి జ్ఞాన బోధ చేశారు .’’ఆనందో బ్రహ్మ’’ తో ప్రారంభించి ‘’అనుభవ సారం ‘’తో పూర్తి చేశారు .ఏ విషయం తీసుకొన్నా లోతైన చర్చ చేసి నిగ్గు తేల్చారు .వేదోపనిషత్తులు ,మను స్మ్రుతి ,పురాణాలు మొదలైన మన పూర్వ గ్రంధాలనుండి అనేక ఉదాహరణలిచ్చారు వీరి ఆధ్యాత్మిక జ్ఞానానికి ఓహో అని అనుకొంటాం చక్కని భాష మధురమైన పదాలు తేట తెల్లనైన భావాలతో గ్రంధం ఆద్యంతం రక్తి కట్టి శిఖరారోహణం చేయిస్తుంది భల్లంగారి ప్రతిభ శత పత్ర వికసనం గా పరిమళ భరితమై అలరిస్తుంది .ఎన్నో అనర్ఘ రత్నాలను జాలువార్చారు ఏరుకొనే వారికి ఎరుకోన్నంత .అందులో అతి ముఖ్యమైన వాటి గురించి మాత్రమె నేను తెలియ జేస్తాను .మిగిలినవి మీరే చదివి గ్రహించగలరు .
‘’సంతోషం శరీరానికి ,మనసుకు వావలసిన శక్తి సామర్ధ్యాలను సాధించి పెడుతుంది .సంతోషం గా ఉండే వారి వద్దకు ఉత్సాహం ఆసక్తి ,శ్రద్ధ ,పట్టుదల ,ఆరోగ్యం వగైరా గుణాలు వచ్చి చేరుతాయి .సుఖం శరీరానిది .సంతోషం మనసుది ,ఆనందం మనిషి చైతన్యానిది ‘’అంటూ సుఖ సంతోష ఆనందలలోని భేదాలను వివరించారు .ఆనందం భౌతికమైనదికాడు .ఆత్మీయకమైనది అన్నారు .
‘’కార్య సాధకులకు సంకల్పమే చక్కని సాధనం .అదే మొక్కవోని ఆయుధం .విశ్వాసం విజయ సాధనకు పునాది .’’ ‘’ప్రకృతిలో ప్రతిదీ నిస్వార్ధంగా తన పనిని నిబద్ధతతో చేసుకొంటూ పోతుంది .ప్రక్రుతి పంచ భూతాత్మికం అయితే విశ్వం ఏక పదార్ధ నిర్మితం .ప్రక్రుతి సామరస్యకతకు ,సాయుజ్యానికి ప్రతీక .ఇందులో పరస్పర ఆధారం పరస్పర సహకారం ఉన్నాయి .మానవుడిలో మహిషి ప్రవ్రుత్తి ,మనిషి ప్రవ్రుత్తి ఉన్నాయి .జంతు ప్రవ్రుత్తి మనిషి ప్రవ్రుత్తిలోకి మారాలి. అదే సమాజ హితం .ప్రక్రుతి అందరిదీ ఏ ఒక్కరిదోకాడు .
‘’శరీరం ఒక సముద్రం లాంటిది .ఇంద్రియాలు అనే ఉత్తుంగ తరంగాలు ఇందులో పడి లేస్తూ కల్లోలం చేస్తాయి వాటికి కామ క్రోధ లోభాది అరిషడ్వర్గాలు ప్రభువులు .వీటిని జయిస్తేనే ఈ సముద్రాన్ని దాటి జ్ఞానం వైపుకు నడక సాగించగలం .శరీరానికి మనసు మన్సుకుశారీరం అవసరం .
‘’అయం నిజః పరోవేతి ,గణనా లఘు చేతసాం –ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం ‘’వీడు నా వాడు వాడు పరాయి వాడు అనే భావం అల్ప బుద్ధులకే ఉంటుంది .ఉదార చిత్తులకు లోకం అంటా తన కుటుంబం గానే ఉంటుంది .’’మన జీవితం మనకు నచ్చినట్టే కాదు ,పది మంది మెచ్చేట్టు ఉండాలి ‘’..’’క్షీరం అనే ఈ విశ్వంలో బ్రహ్మ జ్ఞానం అనే కవ్వం తో చిలికి నవనీతం లాంటి భగవంతుడిని సొంతం చేసుకోవచ్చు .’’చెరువు నీటికి రక్షణ దానికి ఉన్న తూము .అలాగే దాచి పెట్టిన దనానికి రక్షణ దానం ధర్మం దయా గుణం .
‘’తర్కం చంచలం .శ్రుతి అనేక విధాలు .ఏ ఒక్కరుషి చెప్పిన ప్రవచనమో ప్రమాణం కాదు. ధర్మం యొక్క మూల తత్త్వం అవగాహనకు అందనిది .ఉత్తమ పురుషుల మార్గమే శరణ్యం .’’’’దానం ఇవ్వటం మనిషి వ్యక్తీ గత బాధ్యత’’అన్నది ఋగ్వేదం .
‘’మను ధర్మ శాస్త్రం కేవలం చట్టాలను మాత్రమే చెప్పే గ్రంధం కాదు .మనుషులను గుణ శీలురు గా మార్చే గ్రంధం .’’’’మనకు కనిపించని పరమాత్మను ఉపనిషత్తులు హృదయం లో ఆవిష్కరింప జేస్తాయి .ధర్మ లక్షణాలను చెబుతూ మనుస్మృతి –
‘’వేదః స్మృతిః సదాచారః స్వస్వచ ప్రియమాత్మనః ఏత చ్చతుర్విధం ప్రాహుః-సాక్షాద్ధర్మ స్య లక్షణం ‘’
వేద ప్రమాణం ,స్మ్రుతి వాక్యం ,సత్పురుషుల నడవడి కి అనుగుణమైంది ,తన ఆత్మకు ఇ౦పైనది అనే నాలుగు ధర్మానికున్న లక్షణాలు .
అర్ధ నారీశ్వర తత్వాన్ని వివరిస్తూ చెప్పిన ఒక శ్లోకం అద్భుతం
‘’రుద్రో ముండ దరో భుజంగ సహితో గౌరీతు సద్భూషణా-స్కన్దః శంభు సుతః షడానన యుతస్తుం డీ చ లంబోదరః
సింహ క్రేలిమ మూషకం చ వృష భాస్తేషాం నిజం వాహన –మిత్ధంశంభు గృహే విభిన్న మతిషు చైక్యం సదా వర్తతే ‘’
ఈశ్వరుడు కపాలాన్ని పాముల్ని ,పార్వతి సుందర ఆభరణాలను ధరిస్తారు .కుమారస్వామికి ఆరు ముఖాలు .వినాయకుడికి ఏనుగు తొండం .మరి వీళ్ళ వాహనాలేమో –ఎద్దు సింహం ,నెమలి ,మూషికం .ఇవన్నీ పరస్పర విరోధ స్వభావం కలవి .ఇలా విరుద్ధ స్వభావం గల శివ పరివారం నిత్యం భిన్నత్వం లో ఏకత్వాన్ని కలిగి సహజీవనం చేస్తున్నారు .అలాగే ఒక కుటుంబం లోని సభ్యులు విభిన్న మనస్తత్వాలు కల వారైనా ఏక భావనతో ఉండాలి .అప్పుడే ఆ కుటుంబానికి సమాజం లో గౌరవం .
‘’మాట అనేది తూటా కాదు ,తత్వమూకాడు .అదొక మహా మార్గం .అన్నిటికన్నా భిన్నమైనది. అది బహిరంగ ప్రదేశం లాంటిది .విశాలమైన రహదారి లాటిది ..మాట నిర్మలంగా ,నిస్వార్ధంగా ,నిష్కలంకంగా ఉండాలి .
‘’సత్యం మృదు ప్రియం ధీరో ,వాక్యం హితకరం వదేత్ –ఆత్మోత్కర్ష స్తదా నిందం పరేషాంపరి వర్జయేత్ ‘’అని ధర్మ శాస్త్రం .మృదువుగా ప్రియంగా ,ధైర్యంగా ,హితం గా ,సత్యవాక్యాన్నే పలకాలి .ఆత్మ స్తుతి ,పరనింద మాటలలో దోర్లరాదు అని అర్ధం .
‘’మనం అంతా నిమిత్తమాత్రులం .దేవుడు తనకు ఇష్టమైన పనినే మనతో చేయిస్తాడు ‘’ఇదే మాటను కృష్ణా పత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరి కృష్ణా రావు గారు చెప్పారు .
‘’సంసార విష వృక్షస్య ద్వే ఫలే అమ్రుతోపమే –కావ్యామృత రాసాస్వాదః సంగమస్సజ్జనై స్సహః ‘’
సంసారం అనే విష వృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు ఉంటాయి .మొదటిది కావ్యామృత రసాస్వాదనం రెండవది సత్పురుష సహవాసం .
‘’ఎవరిలో ఎటు వంటి స్వచ్చతను కోరుకొంతున్నావో ,నీలో దాన్ని పెంపొందించుకో ‘’అన్నారు శంకర భగవత్పాదులు
ఈ విధంగా శ్రీ భల్లం గారు తమ అనుభవ సారాన్ని విద్యా విజ్ఞాన సంపదను రంగ రించి చెప్పిన సూక్తి ముక్తావళి .ఇది చదివి ఆనంద సోపానాన్ని అధిరోహించాలి .ఒక సద్గురువు చేసే ఉపదేశంగా, ఒక మహా మనిషి పలికే అమృత బిందువులుగా ,.ఈ వ్యాస పరంపర ఉంది .చదివిన వారు ఆనందామ్రుతాన్ని అనుభవిస్తారు .
100 రూపాయలు ఖరీదైన ఈ పుస్తకం కోటి విలువైన మాటల సముదాయం .ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలో లభిస్తుంది.ఈ పుస్తక ముఖ చిత్రాన్ని జత చేశాను చూడండి .
భల్లంగారి ‘’వేకువ పిట్ట ‘’కువకువలు మరోమారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-15-ఉయ్యూరు
.


