వినాయక చవితి నాడు’’ విశ్వనాధ హాస్యాయణం ‘’
విశ్వనాధ సత్యనారాయణ తాను చేసిన ఉద్యోగాల గురించి ‘’అనేక ఉద్యోగాలు చేశాను .అవి గోచీకి పెద్దవి ,గావంచాకు చిన్నవి .నేను కృత్తికా నక్షత్రం లోపుట్టాను ఆకలి ఎక్కువ ఆరగించుకోవటం తక్కువ ‘’అని చమత్కరించారు .’’మాగాణి పల్లెటూరిలో పుట్టని వాడు ,లేక మెట్ట పల్లెటూరిలో పుట్టిపెరగని వాడు మహాకవి కాలేడు’’అన్నాడు .’’ఈదేశం లో బ్రిటిష్ వాడు నాటిన విష వృక్షాలలో విద్యా విధానం ఒకటి .ఆ’’ముశి పళ్ళు’’తినటానికి మనజాతి అలవాటు పడింది ‘’.’’నా నోరు మంచిది కాదు తగాదాలు కొని తెచ్చుకోనేవాడిని చిన్నతనం లో ‘’.కూచి పూడివారు గ్రామాలకు వచ్చి యక్షగానాలతో మైమరపించేవారు చివరి రోజున’’ శారదా వేషం ‘’కట్టేవారు .ఈ వేషం స్త్రీ కాదు ,పురుషుడుకాడు. విచిత్ర వేషం .రమ్యంగా ఉండేది .వారి విద్య తమాషాగా ఉండేది .స్త్రీలు వడ్లు దంచగా వచ్చే రోకటి ధ్వని ,ఒకే రోకలితో దంపటం ,రెండు ,మూడు నాలుగు అయిదు రోకల్లతో దంచటం ఈ ధనులన్నీ ఒక మగాడు కాళ్ళతో తొక్కి చూపించేవాడు .అదొక ధ్వని అనుకరణ విద్య .ఇప్పుడు దాన్ని మిమిక్రీ అంటున్నాం .శారద వేషధారి దారి వడ్లు దంపటం చూపిస్తూ ఉంటె గ్రామం లో ఆడా ,మగా ఆశ్చర్యం గా చూసేవారు ‘’అని తన ఊరు నందమూరువిశేషాలను విశ్వనాధ చెప్పాడు .

విశ్వనాధ బందరులో ఎస్ ఎస్ ఎల్సి వరకు చదివాడు అప్పడాయన వేషం ఆయన మాటల్లోనే ‘’ఒక లాగు చొక్కా .చేతులకు మురుగులు ,కాళ్ళకు కడియాలు ,నెత్తిమీద జుట్టు ,ముందు సాదా గొరిగింపు ,జుట్టు ముడి వెనక గిరజాలు ‘ ఇదీ ఆయన వేషం .ఇప్పుడా వేషం లో ఉంటె ‘’ఏదో ‘’తేడా గాడు ‘’ అను కొంటాం కదూ .’’మాకు హిందూ హైస్కూల్ లో బేత పూడి ప్రకాశం గారు వ్యాకరణం చెప్పేవారు .వృద్దు .’’తెల్లటి పొడుగాటి ఎలుగు బంటి’’లాగా ఉండేవాడు వ్యాకరణ సూత్రాలు రాకపోతే చెవి పట్టుకొని పిండేవాడు పాము కాటు లాగా ఉండేది నల్లమందు వేసుకొని స్కూలుకు వచ్చేవాడు ‘’.అన్నాడు
విశ్వనాధ పెద తల్లి విధవ రాలు .బందర్లో వీరికి వండి పెట్టేది. కటిక పిసిని గొట్టు .రాత్రి పూట వండిన అన్నమే పొద్దున్న పెట్టేది తినక పొతే మధ్యాహం మళ్ళీ రాత్రికి అదే పెట్ట్టేది.తినలేక చావు వచ్చేది ‘’అని రాసుకొన్నారు .విశ్వనాధకు కారం వస్తువులు ఇష్టం .కారపు వస్తువుల్లో కారం నంజుకొని తినే అలవాటు ఆయనది .అప్పుడుకాని కారం నషాళానికి అంటేదికాదు . .బందర్లో పెసర పునుకులు స్పెషల్. అవి ఉంటె ఈయనకు ఇంకేమీ అక్కర్లేదు .అవి తింటే స్వర్గానికి బెత్తెడు దూరం కాదు బెత్తెడు పైనే ఉన్నట్లు ఉండేదట .పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్ అని గిరీశం అంటే ‘’పునుగులు తినని వాడు పురుగులు పడిపోతాడు ‘’అన్నట్లు చెప్పారు .అణాకు పన్నెండు పునుకులు పెట్టేవారు .అవి తిని వారందాకా అన్నం తినే వాడు కాదు .
విశ్వనాధ హెడ్ మాస్టారు ‘’వెంపటి నరసింహం గారు ‘’మొహం మినహాయిస్తే అంతా జాంబ వంతుడే ‘’అన్నాడు విశ్వనాధ .ఆయన అంటే అందరికి భయం .ఇంగ్లీష్ లో గొప్ప పండితుడు .’’బియ్యపు గొట్టం కంది పప్పు ఒక్కడే తినేవాడాయన ‘’అన్నాడు విశ్వనాధ .విశ్వనాధ కు సంగీతం బాగానే వచ్చు పాతిక ముప్ఫై రాగాలు బాగా పాడేవాడు .ప్రముఖ సంగీత విద్వాంసుడు .’’హరినాగాభూషణం గారు అపర త్యాగ రాజు ‘’అన్నాడు విశ్వనాధ .ఆయనవి వందకచేరీలు విన్నాడీయన. ఆ నాటి నాటకాలలో సంగీతం ‘’అచ్చంగా ఉండేది ‘’‘’తరువాత్తర్వాత ‘’సంగీతం పేర అరుస్తున్నారు రుబ్బుతున్నారు ‘’అన్నారు .
విశ్వనాధ గురువు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గాఋ చదువు చెప్పే పద్ధతిని వివరిస్తూ ‘’శాస్త్రిగారు చామన చాయకు మించి నల్లని మేను . కాళ్ళకు పాంకోళ్లు.ధోవతి .లోన తెల్లని చొక్కా ..పైన ఒక కోటు .అవిమాయనివికావు మాసినవి కావు ..ఒక తలగుడ్డ .మొగాన విభూతి గంధం .నుదుట పెద్ద కుంకుమ బొట్టు .ఎప్పుడూపక్కన ఒక గొడుగు .ఊరిలో తిరిగినా ఇదే వేషం .క్లాసు కు గంటలో అరగంట దాటిన తర్వాత రావటం ఆయన అలవాటు ఆయన్ను ఎవరూ ఏమీ అనే వారు కాదు. ఆయన ఇక్కడ పని చేయటం ఒక మహా భాగ్యం .ఆలస్యంగా ఎందుకోస్తున్నారు అని అడిగితే ‘’ఏం చేయమంటారు .బడి ఉన్న రోజుల్లో నేను అన్నం కూడా సరిగ్గా తినను ‘’అని ఏదో ‘’హరికధ’’ చెప్పేవారు .చంకలో కాగితాలకట్ట దాన్ని బల్లపై పెట్టి రాసుకొంటూ కూర్చునే వారు .చెప్పులు కింద వదిలి గొడుగు కుర్చీకి ఆనించి ,కాళ్ళు బల్ల మీద పెట్టి రాసుకొంటూ ఉండటమే ఆయన పని .తర్వాతపీరియడు మేస్టారు వచ్చి బయట నుంచొని ఈయన బయటికోచ్చేదాకా ఉండేవాడు. అదీ తీరు .కాని ఆయనతో తిరగటం సభలకు వెళ్ళడం తో అబ్బిన విద్య తప్ప ఆయన క్లాసులో చెప్పింది ఏదీ లేదు ‘’అన్నాడు విశ్వనాధ .
గురు శిష్యులిద్దరూ చమత్కార ప్రియులే .ఒక సారిగురువు సన్మాన సభలో శిష్యుడు మాట్లాడుతూ ఏదో వేసవికాలం చెలమ నీరు గురించి చెబుతుంటే ,గురువు గారు ‘ఏరా మా ఊళ్లు చెలమలలో నీరు పడటం లేదే ‘’అన్నాడు చమత్కారం గా .వెంటనే విశ్వనాధ ‘’ఎలా ఉంటాయండీ ఆ నీళ్లన్నీ మన కవిత్వం లోకి ఎక్కిపోతే ‘’అని రిపార్టీ ఇచ్చాడు .కిక్కురు మనలేదు గురువు ..పింగళి లక్ష్మీ కాంతం గారికి ,విశ్వనాధకు’’ షస్టాస్టకం ‘’గా ఉండేది .పడేదికాదు .ఒక సారి పింగళి పురాణం సుబ్రహ్మణ్య శర్మతో ‘’మీ మేస్టారేమిటోయ్ ,ఆడ వాళ్ళు ముట్టు అయినట్లు నెలకో నవల రాస్తాడు ?’’అనగా పురాణం ‘’మీ కదీ చేతకాదు గా ‘’అని తిప్పికొట్టాడు .
ఆరేళ్ళు విశ్వనాధ ఉద్యోగం లేకండా తన కుటుంబాన్ని ,తమ్ముడి కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది .తల్లి కూడా జీవించే ఉంది .సంచీలో పుస్తకాలు వేసుకొని ఊళ్లకు వెళ్లి అమ్ముకొని వచ్చి జీవించేవాడు .అంత దరిద్రం అనుభవించాడు .అయినా ఆయనలో ఎదుటివాడు బాధలో ఉంటె సహాయం చేసే మానవీయత మాత్రం పోలేదు .ఒక సారి జ్ఞానానందకవి వస్తే రెండు వందల రూపాయలు ఇచ్చి పంపి ,మర్నాడు ఒక స్నేహితుడిని ఒక రూపాయి అప్పు అడిగాడట .మరో సారి బెజ వాడ రేడియో స్టేషన్ లో పింగళి ,తెన్నేటి లత ఏదో ప్రోగ్రాం గురించి చర్చి౦చు కొంటూ ఉంటె, ఒకాయన సరాసరి లోపలి వెళ్లి శిష్యుడైన పింగళి తో ‘’ఒరే లక్ష్మీ కాంతం! అన్నం తిని నాలుగు రోజులయింది. రెండు రూపాయలు ఇప్పించు ‘’అని అడిగాడట జేబులు తడిమి లేవన్నాడట’’లక్ష్మీ కాంతుడు ‘’. లత ఇద్దామనుకోన్నదికాని పింగళి ఏమనుకొంటాడోనని భయమేసి మాట్లాడలేదు .ఇంతలో విశ్వనాధ లోపలి వస్తున్నట్లు గమనించిన లత వచ్చిన పెద్దాయనను బయటికి తీసుకొని వెళ్లి విశ్వనాధకు విషయం అంతా చెప్పింది .ఆయన క్షణం ఆలస్యం చేయకుండా ఆయన్ను వెంట పెట్టుకొని మోడరన్ కేఫ్ కు తీసుకొని వెళ్లి నెల రోజులకు సరిపడా భోజనం టికెట్లు కొనిచ్చి హోటల్ మేనేజర్ తో ఆ పెద్దమనిషి ఎపుడు వచ్చినా భోజనం పెట్టమని తాను డబ్బు కడతానని అన్నాడట అదీ విశ్వనాదీయం .
చెళ్ళపిళ్ళ వారి సన్మాన సభలో దేశం లోని కవులందరూ వచ్చారు. దీన్ని చమత్కరిస్తూ కట్టమంచి రామ లింగా రెడ్డి ‘’ఇక్కడి నుంచి నేనొక రాయి విసరితే అది ఏదోఒక కవికి తగుల్తుంది ‘’అన్నాడట .తన గురించి చెప్పుకుంటూ ‘’నేను తగలేస్తే తగల బడే వాడిని కాదు పాతేస్తే పాతి పెట్ట బడే వాడిని కాదు ‘’అన్నాడు విశ్వనాధ .విశ్వనాధ అంటే భారత దేశం ఆత్మ .అయన విద్యకే ఒక వ్యాఖ్యానం
.సురవరం ప్రతాప రెడ్డిగారు విశ్వనాధకు ఏదో ఆర్ధిక సాయం చేయించాలి అనే ఉద్దేశ్యం తో నిజాం లోని ఒక జమీన్ కు తీసుకొని వెళ్ళాడు .జమీందార్ చనిపోయాడు భార్య జమీ చూస్తోంది. పరదా చాటున ఉంది .పరిచయాలైన తర్వాత ఆవిడ ‘’మీరు విజ్ఞులు కదా సాని మీద పాట రాశారేమిటండి ?అంది నిస్టూరంగా అదొక వాగు పేరుకనుక కిన్నెర సాని పేరుతొ రాశాను అన్నాడు ఈయన .ఆవిడ అహం దెబ్బ తిని ‘’ఏమైనా సాని సానే కదా! ’అని రెట్ట్టించింది .కోపం నషాళానికి అంటి ,’’అమ్మా మిమ్మల్ని మీ పరిచారికలు ‘’దొరసాని గారు దొర సానిగారు ‘’అని పిలుస్తున్నారు .అంటే ఏమిటో అనుకొన్నాను ‘’అని, అని విసా విసా లేచి బయటికి వచ్చేశారు. రెడ్డిగారు లబో దిబో .నూటపదహార్లు చేజారిపోయాయే.నిన్ను అరెస్ట్ చేయి౦చె దికదయ్యా ‘’ అన్నాడు.విశ్వనాధ ‘’ఏం చేస్తుంది చంపుతుందా ?అదే నయం .యదార్ధం చెప్పటానికి భయ పడటం కన్నా అది నయం శబ్దానికి అర్ధం తెలియని ప్రతి వాడూ విమర్శకుడైతే చచ్చే చావు కదండీ. ఆమె మహా పతివ్రత .కాని తెలుగు పలుకుబడిలో ఆమె దొరసాని .సందర్భం నుండి పదాలను విడగొట్టి కవుల తప్పులను ఎన్నే వాళ్ళు అంటే నాకు మహా మంట ‘’అన్నాడు. ఆత్మాభిమానం కల విశ్వనాధ .దటీజ్ విశ్వనాధ .
ఆధారం –‘’విశ్వ నాద ఒక కల్ప వృక్షం ‘’పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ప్రచురణ
శ్రీ గణేష్ చతుర్ధి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-9-15-ఉయ్యూరు

