గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 406-వర్షోత్సవ కీర్తనలు రాసిన శ్రీ కొలచిన యజ్న నారాయణ సోమయాజి (1835-1899)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

406-వర్షోత్సవ కీర్తనలు రాసిన శ్రీ కొలచిన యజ్న నారాయణ సోమయాజి (1835-1899)

1835 లో గుంటూరు జిల్లాలో జన్మించిన శ్రీ కొలచిన యజ్న నారాయణ సోమయాజు గారి జీవిత చరిత్ర పెద్దగా తెలియలేదు .భార్య శ్రీమతి జగదీశ్వరమ్మ గారు .వారు నిత్య దేవీ ప్రసన్నుఅని ,పాదు కాంత శ్రీ విద్యా దీక్షాపరులని,సన్యాసాశ్రమం స్వీకరించి కల్యానంద స్వామి గా ఆశ్రమ నామ దేయం పొందారని వారి దౌహిత్రుడు కొలచిన అద్వైత పరబ్రహ్మ శాస్త్రి గారు తెలియ జేశారు .దీక్షితులుగారు ‘’శ్రీ విశ్వనాధ మానస పూజా స్తవం ,వర్షోత్సవ ఏకాన్తోత్సవ ,చూర్నోత్సవ కీర్తనలు రాశారని ,వాటిని తాను  పునర్ముద్రించానని చెప్పారు .ఇవి సుమారు వందఏళ్ళనాటి రచనలు .అందులో దీక్షితులుగారు చేసిన విజ్ఞప్తి ని సంక్షిప్తంగా తెలియ జేస్తున్నాను ‘’అప్పయ్య హవిర్యాజి ,మహా లక్ష్మమ్మ దంపతులకు గుంటూరులో రామచంద్ర పురాగ్రహారం లో జన్మించాను  .కామకాయనస గోత్రీకుల౦ . .నేను రాసిన శ్రీ కాశీ విశ్వనాధ మానస పూజా స్తవం ,శ్రీ కాశీ విశ్వనాధ వర్షోత్సవ కీర్తనలు ,ఏకాన్తోత్సవ కీర్తనలను వ్యాకరణ కేసరి బ్రహ్మశ్రీ ఉపద్రష్ట లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు పరిష్కరించారు .రాజ మండ్రిలోని శ్రీ  వీరేశ లింగం గారి వివేక వర్దినీ ముద్ర ణశాలలో ,ఆ పట్టణ శివ భక్తాగ్రగన్యుడు  బ్రాహ్మణ పూజా దురంధరుడు ,వాసవా౦బా  వర ప్రసాదుడు పైదికుల గోత్రానికి చెందిన నడుపల్లి సత్య లింగం శ్రేష్టి గారి రెండవ కుమారుడు సూర్య నారాయణ శ్రేష్టి ,ఆర్య వంశ కుల గోత్రం వాడు అయిన మల్లయ్య శ్రేష్టి కుమారుడు బాపిరాజు ధన సాయం చేసి ముద్రించారు ‘.అది 11-8-1889-విరోధి నామ శ్రావణ శుక్ల పౌర్ణమి ఆదివారం .’’

ఈ కీర్తనలను కొన్నింటిని గుంటూరు రామచంద్ర పురాగ్రహారం లో గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లెశ్వర  స్వామి పైనా ,మరి కొన్ని ఎడ్లపాడు దగ్గరున్నవిశ్వనాధ ఖండ్రిక లోని  గంగా అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వ నాధుని పేరా ,ఇంకొన్ని వినుకొండ తాలూకా చేజెర్ల గ్రామంలో పార్వతీ  సహిత శ్రీ కపోతేశ్వర స్వామి పైనా  వ్రాయ బడినాయి.ద దీక్షితులుగారు  ఇవి కాక అనేక స్తోత్రాలు అష్టకాలు ,కీర్తనలు వందకు పైగానే రాశారు .వీటిని అన్నిటిని ముద్రించే శక్తి లేక దౌహిత్రుడు దీన్ని మాత్రమె అచ్చు వేసి ఆస్తిక జనులకు అందించారు .రామ చంద్రపురాగ్రహార శివాలయం లో ప్రతి ఏడాది జరిగే కల్యాణోత్సవం లో ఈ కీర్తనలను ఇప్పటికి గానం చేస్తూ దీక్షితులగారిని స్మరిస్తూనే ఉంటారు .ఈ మలి ముద్రణకు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి మహోదయులు తొలిపలుకులు రాశారు .kydikshitulu 001

శ్రీ శాస్త్రిగారు ‘’మా తండ్రిగారు వెంకటప్పయ్య శాస్త్రి గారు తమ రచనలలో కొలచిన యజ్న నారాయణ దీక్షితుల వారిని గురువు గా చెప్పుకొన్నారు .ఆశ్రమ స్వీకారం తర్వాత ‘’కల్యానానంద స్వామి ‘’అయ్యారు .మా తండ్రిగారి శ్రీ రామ కదామృతం మొదలైన వాటిలో ఆశ్వాసాంత పద్యాలలో ‘’యజ్న నారాయణాఖ్య అని ‘’కల్యాణానంద నాదా హృదయ గురు కరుణా ‘’అని కీర్తించారు .మా తండ్రిగారితో చిన్న బుట్టెడు తుమ్మి పూలు పూజకు కోయించి ,పేకాడే తనను దేవీ కృపకు పాత్రుడిని చేశారని మా నాన్న గారెప్పుడూ కృతజ్ఞత తో చెప్పు కొనే వారు . తన గురువులలో దీక్షితులుగారు అగ్రగణ్యులు అని భావించేవారు .గురువుగారికి మా తండ్రిగారు ఎప్పుడూ తర్పణం వదిలేవారు. వారి తదనంతరం నన్ను కూడా వదలమని ఆదేశిస్తే అలానే వదులుతున్నాను .దీక్షితుల గారి కృతులలో భక్తీ పరాకాష్ట గా ఉంది .అద్వైతం గారు మళ్ళీ దీన్ని ముద్రించటం ఋణం తీర్చుకోవటమే .’’అని ౩-6-1974 లో రాశారు .

దీక్షితులగారి గీర్వాణ కవితా దీక్షితీయం

మానస పూజ

‘’శ్రీ విశ్వనాధ గిరి మూర్ధ్ని నివేశ సంస్థం-విశ్వేశ్వరం విధి ముఖార్చిత పాద పద్మం

శ్రీమద్విశాల నయనా ,వినయాంత రంగం –ధ్యాయామి సంతత మహం శశి ఖండ మౌళిం’’ శ్రీకాశీ విశ్వనాధ స్వామినేనమః –ధ్యాయామి ..నాలుగవ శ్లోకం లో

‘’కనక రంజిత శుమ్భ స్తంభ గుమ్భత్సు ముక్తా-ఫలమణి, నికురుమ్బై ర్నిర్మితే భాసమానే

దివిజ ముని కదంబై స్సేవితే మంట పేస్మిన్ –శశిధర హర దాస్యే రత్న సింహాసనం తే ‘’నవ రత్న ఖచిత దివ్య సింహాసనం సమర్పయామి .తొమ్మిదవ శ్లోకం లో

‘’నమకస్చామకస్చైవ సూక్టైశ్చ వివిధై స్తదా –అరుణై రౌపనిష దై,రానద లహరీస్తవై

శ్రీ రుద్రజాపైరామ్నాయై ర్మహిమ్నాది మహా స్తవై ‘’ఆభిషేకం కరిష్యామి –స్వీకరిష్వ మమ ప్రభో  -పూర్నాభిషేకం సమర్పయామి .ఇలా ఇరవై నాలుగు స్తోత్రాలతోనైవేద్యం ధూపం దీపం తాంబూలం ,నీరాజనం ,మంత్రపుష్పం ప్రదక్షిణ మొదలైనవన్నిటితో  పూజా విధానం అంతా చెప్పారు .చివరికి ఫల శృతి కూడా చెప్పారు .అప్పుడు తననుగురించి

‘’ఇతి శ్రీ చిదానంద నాద చరణార  బిందు సందోహ మరందాస్వాదనిష్టా గరిష్టశ్రీమత్కాళ్యాణానంద నాద భూసుర విరచితం శ్రీ మత్కాశీ విశ్వనాధ మానస పూజా స్తవం సంపూర్ణం ‘’అన్నారు .

శివుడిని పెళ్లి కొడుకును చేసేప్పుడు తెలుగులో ‘’నగ రెల్ల పందిళ్ళు వైచిరి –వాటికి సొగసైన చాన్ద్నీలు గట్టిరి –భగవంతు డైన శివుని శుభ లగ్నమునకు’’ 18 చరణాల పాట రాశారు .నలుగు పాటను పదమూడు చరణాలలో రాశారు .

‘’మంగళా పరదా సర్వా మంగళా హిత శర్వా –అన్గాజా మదగర్వా –హరనుతా సుపర్వా ‘’అని మొదలెట్టి ‘’చేజేర్లా పుర వాసా –రాజ రాజేశ్వరా –రాజశేఖర శైలా రాజరాజాహితా ‘’అని ముగించారు .

మంగళహారతి –‘’విశ్వనాదాయ సకల –విశ్వ సంరక్షణాయ –శాశ్వ తైశ్వర్య దాయ కాయ మంగళం ‘’అని ప్రారంభించి ‘’సోమ శేఖరాయ త్రిపుర సుందరీ మనోహరాయ –కామితార్ధ దాయకాయ ధీమ మంగళం .అని అంటూ  ‘’యజ్న నారాయనాస్వ విజ్ఞానదాయ కాయ –యసుజ్ఞాన కోశ శుభద మంగళం ‘’అని ముగించారు .

వసంతోత్సవం రాశారు –‘’సువ్వి శ్రీ విశ్వనాధ సువ్వి శ్రీ మల్లినాద –సువ్వి శ్రీ రామనాధ సువ్విలాలీ ‘’అని ప్రారంభించి 24 చరణాలు రాశారు

శ్రీ యజ్ఞనారాయణ  దీక్షితుల వారి గురువులైన శ్రీ తుంగ తుర్తి బుచ్చి లింగ శివ యోగి రాసిన ‘’కొట్నాలపాట ‘’చూర్నోత్సవ కీర్తన వగైరాలనుకూడా  ఈ పుస్తకం లో  ప్రచురించారు

దీక్షితులవారి ఫోటో జత చేశాను చూడండి

.    మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-9-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.