గీర్వణకవుల కవితా గీర్వాణం -3
411-శతావధాని శేఖర శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
3-10-1957న గుంటూరు జిల్లా పొన్నూరులో పూర్నాంబ ,వెంకట సుబ్బా రావు దంపతులకు జన్మించిన ‘’అవధాని శేఖర ‘’శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,కృష్ణాజిల్లా అవనిగడ్డలో ప్రాధమిక మాధ్యమిక విద్య నేర్చారు .వీరి సహాధ్యాయి ప్రస్తుత ఆంద్ర రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ .పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలో చదివారు.శ్రీమతి భానుమతి ని అర్ధాంగిని చేసుకున్నారు . తెలుగులోనూ ,సంస్కృతం లోను ఏం .ఏ .పాసై ఈ రెంటిలోనూ పి.హెచ్ .డి. సాధించారు సంస్కృతం లో విశ్వనాధ రాసిన రూపకాలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు .విజయవాడ సయ్యద్ అప్పలస్వామి సంస్కృత కళాశాలలో సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేస్తున్నారు .విజయవాడలో వీరు పాల్గొనని సాహిత్య సభ లేదు .రేడియోలో ప్రసంగించని విషయం లేదు .
తెలుగు రచనలు
మనస్సాక్షి మహా భారతం ,పద్మ వంశి ,తల్లా పిచ్చయ్య ప్రకాశం ,ధర్మ భిక్ష పద్య కావ్యం జైన ధర్మ శతకం ,వెంకయ్యస్వామి జీవిత చరిత్ర ,శంకరాచార్య స్వామి కృతికి అనువాదంగా ‘’కాశీ సారం ‘’ రాశారు .
సంస్కృత రచనలు
సంస్కృతం లో’’ శ్రీ షిర్డీ సాయి సహస్ర నామ స్తోత్రం ,శాంతి సూక్తం ,కాశీ లోని శ్రీ విశ్వేశ్వర స్వామిపై సుప్రభాతం’’ రాశారు .దీనిని స్వామికి సమర్పిస్తే అక్కడి పూజారులు ,ఆలయ నిర్వాహకులు ఆశ్చర్యపడి లక్ష కాపీలు ప్రచురించి అందరికి ఉచితంగా అందజేశారు .’’పంచారామ పంచ భూత లింగ సుప్రభాతం’’ రాసి భక్తీ రచనలో మేటి అనిపించారు .ప్రసిద్ధ సంస్క్రుతకవులపై వీరు ‘’ఉత్తరా శ్లోకాలు’’రాశారు .
‘’కకపాలీ ,ధునీ పాత్రీ ,ధూమ నాళీ,విభూతి మాన్ –శ్రీ మాన్ షిర్డీ వాసశ్చ సాయి దేవో భి రక్షతు ‘’అని’’ శ్రీ షిర్డీ సాయి సహస్ర నామ స్తోత్రం ‘’లో అన్నారు .
అవధాన ప్రక్రియ
2013 డల్లాస్ లో జరిగిన 19వతానా సభల్లో’’అవధాన ప్రక్రియ ‘’పై వివరించారు . శ్రీ గరికపాటి నరసింహా రావు గారితో కలిసి అవధానం చేశారు .న్యూయార్క్ లో తెలుగు లిటరేచర్ అండ్ కల్చర్ అసోసియేషన్ వారి ఆహ్వానంపై ‘అష్టావధానం ‘’చేశారు లండన్ నగరం లో ‘’అచ్చతెలుగు అవధానం ‘’నిర్వహించారు . 25-12-1995లో విజయవాడలో ‘’ఏకదిన సంపూర్ణ సంస్కృతాంధ్ర శతావధానం ‘’చేశారు .తాడికొండ గోగినేని కనకయ్య సంస్కృత కళాశాలలో సంస్క్రుతావధానం చేశారు .చిత్రాక్షరి ని ‘’సంస్కృతాంధ్ర కళానందైఃపండి తైః పరి శోభితం –కానకీం తాం కళాశాలాం వందే విజ్ఞాన రూపిణిం’’అని పూరించారు .
మొత్తం మీద 500 అష్టావధానాలు, మూడు శతావధానాలు చేసిన అవధాన సరస్వతి శ్రీ శ్యామలానంద .
.భక్తీ టి వి లో ధర్మసందేహాలు తీర్చారు .అనేక భువన విజయాలలో నటించి మెప్పుపొందారు .రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి ఆధ్వర్యం లో జరిగిన ‘’ఆధునిక గిరీశం –వెంకటేశం ‘’రూపకం లో ఆదిత్య ప్రసాద్ ఆనంద గజపతి వేషం వేస్తే సర్వశ్రీ ధారా రామనాధ శాస్త్రి ,పింగళి కృష్ణా రావు ,పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,జంధ్యాల మహాతీశంకర్,పువ్వాడ తిక్కన సోమయాజి మొదలైన వారు గురజాడ అప్పారావు ఆదిభట్ల నారాయణ దాసు మొదలైన వారి వేషాలు ధరించి రక్తి కట్టించారు .భారత దేశ స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భం గా విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజిలో 2008ఆగస్ట్ 11,12తేదీలలో యు జి సి వారు నిర్వహించిన జాతీయ సంస్కృత సెమినార్ లో కృష్ణా జిల్లా సంస్కృత రచయితల గురించి పత్ర సమర్పణ చేశారు .కృష్ణాజిల్లా రచయితల సంఘ కార్యక్రమాలలన్నిటికి పండితునిగా వ్యవహర్తగా ,విశ్లేషకునిగా కార్య కర్తగా పని చేసి విజయాలకు తోడ్పడుతారు .
బిరుదులూ సత్కారాలు
‘’ అవధాన కళా సరస్వతి ,’’అవధాన శారద ,’’శతావధాని శేఖర ‘’,బిరుదులను పాలపర్తి వారు వారి అవధాన ప్రక్రియా ప్రదర్శనకు అందుకున్నారు .చతుర్గుణిత అవధానం చేసి మెప్పుపొంది ‘’అవధాన చతురానన ‘’,అనే బిరుదుతో సార్ధక నామదేయులయ్యారు .
శ్యామలానంద ప్రసాద్ ప్రతిభకు తగిన పురస్కారాలెన్నో అందుకున్నారు .మొదటగా తెలుగు విశ్వ విద్యాలయ పురస్కారం పొందారు .అధికార భాషా సంఘం పురస్కారాన్ని అందుకున్నారు. నూతన ఆంద్ర రాష్ట్ర ప్రభుత్వ౦ ఉగాది పురస్కారాన్నిఇచ్చి సత్కరించింది .
ఎన్ని బిరుదులూ ఉన్నా పురస్కారాలు పొందినా ,గీర్వాణ,ఆంధ్రాలలో ఏంతో విద్వత్తు ,ప్రతిభా ,కవితా సామర్ధ్యం ఉన్నా అతి నిరాడంబరంగా అత్యంత వినయం తో ,భేషజం లేకుండా అందరికి తలలో నాలుకగా ప్రవర్తించే వ్యక్తిత్వం శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాదావ దాని గారిది .
సశేషం
మరో ప్రముఖుంతో కలుద్దాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-9-15 –ఉయ్యూరు

