విశ్వనాధ వర్షం కురిపించగలడా !
ఎస్ .కురిపించగలడు .అనే ప్రత్యక్ష సాక్షులు చెప్పారు .ఆవివరాలు తెలుసుకొందాం .విశ్వనాధ నిగ్రహానుగ్రహ సమర్ధులు .ఒక సారి తోటి తెలుగు లెక్చరర్ డా.ధూళిపాళ శ్రీరామ మూర్తి గారు తోడురాగా గుంటూరుజిల్లా వేటపాలేమో ,మున్నంగో ఆ గ్రామస్తుల అభ్యర్ధనపై వెళ్లారట .అప్పటికే కల్పవృక్ష రచనలో మునిగి ఉన్నారు .ఆ ఊరివారు ‘’రామాయణం రాస్తున్నారు కదా ! వాన కురిపిస్తారా ?’’అని సడన్ గా అడిగారట .’’సరే చూద్దాం ‘’అనితాను రాసిన ‘’ఋష్యశృంగ ‘’చరిత్ర చదివారట .అందులో ‘’ఆ రధ మేగు త్రోవ జలదావళి మింట’’అనే పద్యం చదవటం మొదలెట్ట గానే మేఘాలు క్రమ్ముకుని ఆ రాత్రి ‘’కుంభ ద్రోణం ‘’గా వర్షం కురిసిందని ఆ వూరి వారు శ్రీరామ మూర్తిగారికి చెప్పారట .
ధూళిపాళ వారే ప్రత్యక్ష సాక్షం గా ఉన్న రెండు మూడు సంఘటనలున్నాయి .ఒక వేసవిలో బెజవాడ లో సత్యనారాయణ గారుంటున్న మాచవరం లో సాయంత్రం మూడింటికి శ్రీరామ మూర్తిగారు వెళ్ళారు .వేడి బాగా ఉండటం తో విశ్వనాధ లోపల పడుకున్నారు. తాను వచ్చానని చెప్పగానే లోపలి రమ్మన్నారు .’’ఎండ బాగా ఉందయ్యా .ఏ కోశానా చల్లదనం లేదు .ప్రాణం ఆగేట్టు లేదు .కనుక ఇక్కడే కూర్చో అని భారతం లో ఋష్యశృంగ చరిత్ర చదివావా ‘?అని అడిగారు .’’చదవ లేదని ‘’చెప్పారు .’’సరే విను వాన కురుస్తుందేమో చూడు ‘.వ్యాసుడు యెంత బాగానో రాశాడు .’’అని చదవటం మొదలు పెట్టారు .’’ఇప్పుడు మనం పడవలు అంటామే అట్లాంటి పడవలు కలిసి కట్టి వాటి మీద మట్టి పోసి ,మామూలు నేల మీద పెరిగినట్లుగా ఒక కృత్రిమ వృక్షాన్ని తయారు చేశారట .దాన్ని ఆ పక్కనే ఉన్న నదిలో కలిపి వేశ్యలు ఋష్య శ్రుంగుడున్న వనానికి తెచ్చి అతనికి తెలియ కుండా రోమ పాదుని వనానికి తీసుకు వెళ్లారట .ఎంతత చమత్కారంగా వ్యాసుడు రాశాడో చూడు ‘’అన్నారట .ఇలా వ్యాఖ్యానం చేస్తుండగానే గాలి కొంత చల్ల బడింది .’’బయట కూర్చుందాం పద ‘’అని ఇద్దరూ బయట కుర్చీల్లో కూచున్నారు .మళ్ళీ కద మొదలెట్టారు .కద నడిచిన కొద్దీ వాతావరం బాగా చల్లబడింది .ఒక పావుగంట ఒక మాదిరి జల్లు పడింది .అంటే ‘’బట్ట తడుపు జల్లు’’ అన్నమాట .’’ఇవాల్టికి ప్రాణం నిలిచి౦దయ్యా ‘’అన్నారు విశ్వనాధ .
మర్నాడు ముందురోజు చల్లదనాన్ని కాదని ఎండ మండిపోయింది .శ్రీరామ మూర్తిగారు మేష్టారు ఎలా ఉన్నారో చూడటానికి వచ్చారు అంత ఎండలో .’’ఇవాళ కూడా మీరు వాన కురిపిస్తారేమో ననే ఆశతో వచ్చాను ‘’అన్నారు ధూళిపాళ..’’సరే అయితే కూర్చో .చూద్దాం ‘’అంటూ నన్నయ్యగారి ‘’ఋష్యశృంగ చరిత్ర ‘’చదివారు .ఆ రోజునా కిందటి రోజు మాదిరిగానే అంతే వర్షం పడింది .శ్రీరామ మూర్తిగారికి ఆశ్చర్యమేసింది .
అ మర్నాడు సుమారు మూడింటికి మేస్టారి భార్య వరలక్ష్మిగారు ధూళిపాళ గారింటికి ఆదరా బాదరా వచ్చి ‘’అదేమిటి అన్నయ్యగారూ అక్కడ కొ౦పలంటుకొని పోతుంటే నిమ్మకు నీరెత్తి నట్లున్నారేమిటి పాకలో ఉన్నారాయే సామాను సర్దుకొని బయటికి రండి ‘’అన్నారు కంగారుగా .’’అక్కడెక్కడో చుట్టూ గుంట దగ్గర తగలడుతుంటే ఇప్పుడే కంగారు ఎందుకు అక్కయ్య గారూ .మాస్టారెలా ఉన్నారు?అని అడిగారు ‘’ఆయన ఆపసోపాలు పడుతున్నారండీ ‘’అన్నారు .శ్రీరామ మూర్తిగారు ఆగలేక మాస్టారింటికి ఉరికారు .ఫైర్ ఇంజన్లోచ్చి హడావిడి చేస్తున్నాయి .కాని నీళ్ళు అక్కడ లేనేలేవు .’’మాస్టరుగారూ ! ఇవాళ కూడా వర్షం కురిపించండి ఇళ్ళు తగలడుతున్నాయ్ .నాది తాటాకు కొంప కూడా ‘’అన్నారు .’’ఏమయ్యా ! నేనేమైనా దేవుడినా .మనం కురవ మంటే కురుస్తుందా ?అన్నారు .’’కురవమని మీరు అనండి కురిస్తే మీ మహిమ లేకపోతె దేవుడి మహిమ అనుకుందాం ‘’అన్నారు వీరు .’’అయితే ఇవాళ వాల్మీకం చదువుదాం ‘’అని చదువుతూ వ్యాఖ్యానిస్తున్నారు ‘’దాని దుంప తెగ ఇవాళ కూడా వాన పడింది ‘’అన్నారు దూ .శ్రీ .తర్వాత విశ్వనాధ రాసి౦ది కూడా చదివారు .’’ఇక్కడ మాకూ ఉపశాంతి .అక్కడ అగ్ని హోత్రుడికి తాప శాంతి కలిగింది ‘’అన్నారు శ్రీరామమూర్తిగారు .ఇదీ ‘’విశ్వనాధ –వాన ‘’కద
ఆధారం –‘’విశ్వనాధ ఒక కల్ప వృక్షం ‘’పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ప్రచురణ
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-15 –ఉయ్యూరు

