అలంకారిక ఆనంద నందనం -9-

అలంకారిక ఆనంద నందనం -9-

సరసభారతి నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ‘’అలంకారిక ఆనంద నందనం ‘’నాల్గవదైన చివరిభాగానికి సాహితీ పిపాసులకు స్వాగతం . ఈ రోజు నలుగురు సుప్రసిద్ధ ఆలంకారికులు మనకు తమ సిద్ధాంత వివరణ చేస్తారు .శ్రీ భోజ మహారాజులవారిని సభాధ్యక్షం వహించి తమ పాలనా వైభవాన్ని తెలియజేస్తూ సిద్ధాంత వివరణ నిస్తూ సభను నిర్వహించవలసినదిగా కోరుతున్నాను .నవరత్నకవులతో వారు నిర్వహించిన కవితా దర్బారు మనకు సుపరితమే .వారికిది నల్లేరు పై బండి … ఈ నాటి భోజాస్థానం లో స్థానం పొంది తమ తమ సిద్ధాంత ప్రతిపాదనలను వివరించవలసినదిగా రాజానక మహిమా భట్టు ,విశ్వ నాథ కవిరాజు ,మన ఆంద్ర దేశ జగన్నాథపండిత రాయలను వేదిక నలంకరించవలసినదిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను ..

భోజమహారాజు -నేను క్రీశ. 1010 నుంచి 1050 వరకు మాళవ రాజ్య  పాలన చేశాను . మా తండ్రి సింధురాజు ఐదేళ్లు లోపే రాజ్యపాలన చేశారు ./పెదనాన్న ముంజు పరమార వంశ మొదటి గొప్పరాజు . 20ఏళ్లకు పైగా పాలించారు .ఆయన మహాసేనాని కవి .కళాసాహిత్యాలను పోషించారు పారమారరాజులలో నా పాలన స్వర్ణయుగం గా భావిస్తారు .వారసత్వంగా విస్తారమైన సామ్రాజ్యం నాకు లభించినా రాజ్య విస్తరణకు కృషిచేసి ఒరిస్సా ,శాకాంబరీ ,లాట,కొంకణాదేశాలు జయించి మాళవ రాజ్యం లో కలిపాను .గజనీ మహమ్మద్ దండయాత్రలు యె దుర్కోవటానికి  ఆనంద  పాలుడికి, ఆయన తర్వాత కుమారుడు త్రిలోచన పాలునికి నా సైన్యాన్ని పంపి సహాయం చేశాను ..ఉత్తర భారతం లో ఘజనీకి ఎదురులేక పోయినా ,నా నాయకత్వం లో హిందూరాజులను  సంఘటిత పరచి అతని దురాక్రమణలకు అడ్డుతగలగా 1025 లో గజినీ సోమనాధ దేవాలయాన్ని దోచి ధ్వంసం చేశాక ,మమ్మల్ని తప్పించుకోవటానికి దారిమళ్లి  కచ్ ,సింధు ప్రాంతాలనుండి వెనక్కి పారిపోయాడు  .పశ్చిమ ప్రాంతం లో మా విజయానికిది నిదర్శనం ఒరిస్సా పాలకుడు రాజేంద్ర చోళుడితో మైత్రి కుదుర్చుకొని రాజ్యాన్ని సుస్థిరం చేశాను .. సుదీర్ఘంగా నా చరిత్ర చెప్పానేమో !ఇప్పుడు వరుసగా మహిమా భట్టు ,విశ్వనాథుడు జగన్నాథుడు ప్రసంగిస్తారు .

మహిమా భట్టు -నేను కాశ్మీర బ్రాహ్మణుడను .మాతండ్రి శ్రీ ధైర్యుడు .గురువు మహాకవి శ్యామల .అలంకార శాస్త్రంగా ‘’వ్యక్తి వివేకం ‘’రాశాను .ఇది ఆనంద వర్ధన ధ్వని సిదాంతానికి వ్యతిరేకం .నేను రాసిన మరో గ్రంధం ‘’తత్వోక్తి కోశం ‘’లో భావన యొక్క స్వభావాన్ని నిరూపించా .అయితే ఇది ప్రస్తుతం అలభ్యం అంటున్నారు ..నేను ‘’అనుమాన సిద్ధాంతం ‘’ప్రతిపాదించాను .పాండిత్యం అరుదైన రసాస్వాదం కలిపి దీన్ని రాశాను ..రుయ్యకుడు వ్యక్తివివేకానికి వ్యాఖ్య రాశాడు .ఇందులో రెండవ అధ్యాయమే లభించింది . అందులో నా సిద్ధాంతంపై విమర్శ ఉంది . వివేకం లో మొదటి అధ్యాయం లో ధ్వని నిర్వచనాన్ని విమర్శనాత్మక దృష్టితో పరిశీలించి ,అది అనుమానమే తప్ప వేరే  కాదని నిరూపించాను .కుంతకుని వక్రోక్తి కూడా అనుమాన పరిధిలోనిదే .రెండవ అధ్యాయం లో నా విమర్శనా ప్రాగల్భ్యం కనిపిస్తుంది ..చివరి అధ్యాయం లో అనుమాన సిద్ధాంతాన్ని వివరించాను .ఆనంద వర్ధనుడు ధ్వనికిచ్చిన ఉదాహరణలనే తీసుకొని అలంకార శాస్త్రం లో కొత్త మార్గం స్థాపించాను . విశ్వనాథుడు -ఒరిస్సా రాష్ట్రం లో పండిత కుటుంబం లో నేను పుట్టాను.  కపింజల గోత్రీకుడిని . తండ్రి చంద్ర శేఖరుడు కవి ,ఛ0దోవేత్త .14 భాషలలో దిట్ట . ఒరిస్సా గజపతి రాజుల ఆస్థానం లో మా తాత జయదేవుని అష్టపదులకు సర్వాంగ సుందరి వ్యాఖ్య రాసిన నారాయణ దాసు,   తండ్రీ  చంద్ర శేఖరుడు ,నేను కూడా ఉన్నవాళ్ళమే .నేను 18 భాషలలో ప్రావీణ్యం ఉన్నవాడిని .’’సాహిత్య దర్పణం ‘’అనే అలంకార  గ్రంథం  రాశాను .నాకుమారుడు అనంత దాసు నా సాహిత్య దర్పణానికి ‘’లోచన ‘’వ్యాఖ్య రాశాడు ..నేను త్రికళింగ  అమాత్యుడను ..నా రచనలు -చంద్రకళా  నాటిక ,ప్రభావతీ పరిణయ నాటకం ,రాఘవ విలాస కావ్యం ,కువలయాశ్వ చరిత్ర -ప్రాకృత కావ్యం ,ప్రశస్తి రత్నావళి ,నరసింహ విజయం ,కంస వధ  కావ్యం ,కావ్య ప్రకాశ దర్పణం , లక్ష్మీ స్తవం మొదలైనవి సాహిత్య దర్పణం తోపాటు రాశాను .

జగన్నాథుడు -ఆంధ్రదేశం లో కోనసీమలో ముంగండ గ్రామ లో ఉపద్రష్ట వారింట క్రీశ 1600 లో జన్మించాను .ఉపద్రష్ట అంటే యజ్ఞ పరివేక్షకుడు అని అర్ధం .తండ్రి  భట్టు సకల విద్యా ప్రవీణుడైన పండితుడు .  తల్లి లక్ష్మి. నేనుప్రసిద ఖండూర దేవుని వద్ద విద్యలు నేర్చాను .తండ్రిగారివద్దనే వ్యాకరణం తప్ప సకల శాస్త్రాలు అభ్యసించాను .శేష నీరీశ్వరులవద్ద వ్యాకరణం నేర్చాను . నా తండ్రిని నేను ‘’మహా గురువు ‘’ అని సంబోధించాను .నాకు తండ్రీ ,గురువూ ఒక్కటే ..నేను ఉత్తరభారతం చేరి మొగల్ చక్రవర్తి షాజహాన్ ఆస్థానకవినై పండిత రాయలు బిరుదుపొందాను.  ఆయనకుమారులూ నా శిష్యులే .చక్రవర్తి అనుమతిపొంది లవంగిని పెళ్లి చేసుకొన్నాను ..నా శిష్యులలో శ్రీకులపతి మిశ్రా ఆగ్రా మధుర చతుర్వేది వంశస్తుడైన మధురకవి . జయపూర్ రాజు మొదటి శ్రీరామ సింహాజీ ఆస్థానకవి .మరొక శిష్యుడు నారాయణ భట్టు ..నేను ‘’రస గంగాధర0 ‘’అనే అలంకార  గ్రంథం  రాశాను ఎందుకో కానీ నాకూ అప్పయ్య దీక్షితులుకు పడేదికాదు . ఎడ్డెమంటే తడ్డెం అనుకొనే వాళ్ళం  .గంగా లహరి యమునా లహరి అనే అమృత లహరి ,కరుణా లహరి ,లక్ష్మీ  లహరి ,సుధాలహరి రస గంగాధరం తోపాటు రాశాను .అందుకని నన్ను లహరికవి అన్నారు ..

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.