గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
393- ఆంగ్ల సామ్రాజ్యం మహాకావ్య కర్త -ఏ.ఆర్. రాజరాజ వర్మ( 1863-1918 )
ఆంగ్ల సామ్రాజ్య సంస్కృత మహా కావ్యం రాసిన ఏ .ఆర్. రాజరాజ వర్మ కోయి తంపురన్ కేరళ దేశీయుడు .తల్లి కుంజి కావు తంబురాట్టి ,తండ్రి వాసుదేవన్ నంబూద్రి . ఆయన రాసిన 30 గ్రంధాలలో దీనికి అత్యధిక ప్రాధాన్యం ఉంది .ఇది 23 సర్గలలో 1910శ్లోకాల కావ్యం .లండన్ నగర వైభవ వర్ణన తో కావ్యం ప్రారంభమై క్రమంగా ఆంగ్ల సామ్రాజ్య చరిత్ర ను ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు ను రాశాడు కవి . ప్రతిశ్లోకం కావ్య గౌరవాన్ని పెంచేట్లు గా రాయటం కవి ప్రతిభకు నిదర్శనం .దీనిని 1901 లో టి గణపతి శాస్త్రి సంక్షిప్తంగా ముందుమాట రాసి ప్రచురించాడు .ఈ కవి ఇతర రచనలో విటవిభావరి లేక రాధా మాధవం నాలుగు భాగాలైన ‘’యమ’’లతో అలరారే చిన్నకావ్యం . తిరువనంత పురం లో సంస్కృత బోధపై ‘’గైర్వాణి విజయం ‘’రాశాడు .ఉద్దాలక చరిత వచన రచన ,తులాభారం ప్రబంధం ,ఋగ్వేదకారిక .పాణిని అష్టాధ్యాయికి దీటుగా సంస్కృత వ్యాకరణం ‘’లఘుపాణినీయం ‘’. ఈ గ్రంథం ఆయనను ‘’కేరళ పాణిని ‘’చేసింది .
294-కేరళోదయకర్త -డా .కె యెన్ .ఎళుత్తచ్చన్ (1911-1981)
సంస్కృత ,మళయాళ భాషలలో విస్తృత రచనలు చేసిన కేరళ పండితుడు డా .కె యెన్ ఎళుత్తచ్చన్ .పాలకాడు జిల్లా చెరుపుల సెఱి లో 21-5-1911 న జన్మించాడు .విద్వాన్ పరీక్ష పాసై ,రెండు పాఠశాలలో పని చేసి బొంబాయి వెళ్లి తిరిగొచ్చి సంస్కృత ,మళయాళ ,ఇంగ్లిష్ లలో మాస్టర్స్ డిగ్రీ 1953 లో పొందాడు .మద్రాస్ యూనివర్సిటీలో లెక్చరర్ గాచేరి ‘’భాషా కౌతళీయం ‘’లో పరిశోధన చేసి పిహెచ్ డి పొంది ,కాలికట్ యూనివర్సిటీ లెక్చరర్ అయ్యాడు .కేరళ స్టేట్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ లో సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ అయ్యాడు .ద్రవిడియన్ లింగ్విస్టిక్ అసోసియేషన్ ఫెలోషిప్ పొంది ,కాలికట్ యుని వర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్ చేశాడు .మళయాళ వ్యాకరణం పై విస్తృత పరిశోధన చేసి మళయాళ వ్యాకరణ చరిత్ర రాశాడు .మూడు చిన్నకథా సంపుటాలు ,మూడు కవితా సంపుటాలు ప్రచురించాడు మళయాళ భాషా సేవకు సాహిత్య అకాడెమి అవార్డు పొందాడు .
సంస్కృతం లో రాసిన కేరళోదయాచారిత్రిక కావ్యం 21 సర్గలలో 2,500శ్లోకాలతో ఉన్నది .ఇది 1977 లో ప్రచురితమైంది .చరిత్రకావ్యాలలో ఇది అగ్రభాగాన నిలిచింది .కవి సృజన శక్తికి ,కవితాప్రతిభకు, శైలికి ఇది గొప్ప నిదర్శనంగా నిలిచింది .ఈ మహాకావ్యం లో జాతీయ సమైక్యతను చక్కగా చాటి చెప్పాడు .కావ్యాన్ని స్వప్నమంజరి స్మృతిమంజరి ,ఐతిహ్య మంజరి ,బోధామంజరి చిత్ర మంజరి అనే అయిదు గుచ్చాలుగా విభజించాడు .కేరళ దేశం పరశురామ మహర్షి వలన ఏర్పడిందనే ఐతిహ్యం తో మొదలు పెట్టి చేర రాజుల ,జామోరీ రాజుల పాలన పోర్చుగీసుల రాక ,ఆధునిక కేరళ చరిత్ర అంతా సవివరంగా వర్ణనాత్మకముగా రాశాడు .మహాత్మా గాంధీ ,బాలగంగాధర తిలక్ వంటి జాతీయ నాయకుల చరిత్రనూ కలిపాడు .ఆధునిక భావాలను కూడా హాయిగా సుందరంగా సరళమైన సంస్కృతం లో రాయవచ్చునని కవి రుజువు చేసి చూపాడు . 28–10-1981 న 70 వ ఏట మరణించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా
![]()

