వీక్లీ అమెరికా -19-1(31-7-17 నుండి 6-8-17 వరకు )
సుందరకాండ పూర్తి ,వరలక్ష్మీ వ్రత ,సరసభారతి 106 వ సమావేశవారం
31-7-17 సోమవారం -ఉదయం సంధ్యావందనం ,నిత్యపూజ ,ఆంజనేయ అష్టోత్తర,సహస్ర నామ ,సువర్చలాఅష్టోత్తరపూజ తర్వాత తొమ్మిదిరోజుల సుందరకాండ శ్రీ సువర్చ లాన్జనేయ శతక పారాయణలో 5 వ రోజు పారాయణ ఉదయం పూర్తి చేశాను .. మా అమ్మాయి కొత్త ఉద్యోగం లో చేరింది .. మధ్యాహ్నం యు ట్యూబ్ జయ టివి లో మార్గశిర సంగీత ఉత్సవం చూశాను . చాలా అద్భుతంగా ఉంది . తమిళ తెలుగు కన్నడ మళయాళ హిందీ భాషలో గొప్ప సంగీత కచేరీలు కర్ణానందంగా ఉన్నాయి .. అలంకారిక ఆనంద నందనం -8 ,9 ఎపిసోడ్స్ రాశాను . రాత్రి ‘’గొట్టం ‘’లో విశ్వనాధ్ సినిమా ‘’స్వరాభి షేకం ‘’చూశాము . ఆనందం తో గుండె కరిగి ఆనంద బాష్పాలు అడుగడుక్కీ కారి మహదానందమేసింది . ధన్యుడు విశ్వనాధ్ .మనల్నీ ధన్యులను చేశాడు . అందులో రైల్వే కంపార్ట్ మెంట్ లో శివాజీ రాజా భార్యప్రసవం సీను సెంటిమెంట్ కు ,మానవత్వానికి ,సంగీత ప్రభావానికి ,హోమియో మందు ప్రయోజనానికి అద్దం పట్టింది . గుండెలు కరిగి ఆనంద తాండవమే చేయిస్తుంది . మొత్తం సినిమాలో ఒక పావుగంట సినిమా ఎడిటింగ్ లో తీసేసి ఉంటె శిఖరాగ్రాన నిలిచేది అని పించింది .
ట్యూబ్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ -లక్ష్మణ్ కవల సోదరుల ఇంటర్వ్యూ చాలా ఇంటరెస్టింగ్ గా రియలిస్టిక్ గా వాళ్ళ నిజాయితీకి నిదర్శనంగా ఉంది . పల్లె టూరు నుంచి సినీ పరిశ్రమకు వచ్చి ఎన్నో కస్టాలు పడి ,ఏ దశలోనూ తమ నాయనమ్మ కు సిగరెట్ మద్యం జోలికి వెళ్ళమని చేతిలో చెయ్యేసి పెట్టిన ఒట్టును ,ఇచ్చిన మాట జవదాటకుండా ,అంచెలంచెలుగా ఎదిగి ఫైట్ మాస్టర్లు అయి సిగరెట్ ,మద్యం లేకుండా పైకొచ్చిన సోదరద్వయం వీరు .హీరోలుగానూ చేసి శెభాష్ అనిపించారు .అందులో వాళ్ళు ‘’మేము మంచివాళ్ళం అని అనుకునేవాళ్లం .ఇది కూడా గర్వానికి దారి తీస్తుందని మేమె గ్రహించి ఆ మాట చెప్పుకోవటం మానేసాం .ప్రతి స్టేజ్ లోనూ మా అంతటికీ మేము చెక్ చేసుకొని చేసిన తప్పులు తెలుసుకొని పురోగమించాం ‘’అని వారిద్దరూ ఏకకంఠం తో చెప్పట0 నాకు బాగా నచ్చింది ..
1-8-17 మంగళవారం -పారాయణ ఆరవ రోజు బాగానే జరిగింది ..ఆలంకారికులు 10 ,11 రాసి పూర్తి చేశా .
బుధవారం -7 వ రోజు పారాయణ . .గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 లో 382,383 ఎపిసోడ్ లు రాశాను .
గురువారం -పారాయణ 8 వ రోజు ..గీర్వాణం -3 లో 384 నుండి 387వరకు కవుల గురించి రాశాను .రాత్రి యు ట్యూబ్ లో హాస్య చిత్ర దర్శకుడు రాజా వన్నేం రెడ్డి ఇంటర్వ్యూ చూశాను .’’క్షేమంగా వెళ్లి లాభంగా రండి ‘’ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా సూపర్ సక్సెస్ .ఆయనే డైరెక్ట్ చేసిన ఒక కుక్క పై తీసిన ‘’టామీ ‘’సినిమా అవార్డు లను పొందింది .రాజేంద్ర ప్రసాద్ అందులో హీరో .ఎక్కడో దారిలో ఒక కుక్క ఆయన వెంటపడి ఇంటికి వస్తే దాన్ని అల్లారుముద్దుగా పెంచుకొంటూ అదే సర్వస్వ0 గా గడుపుతాడు .రోజూ అతను రైల్ లో వేరే చోటుకు వెళ్లి ఉద్యోగం చేసి ,సాయంత్రం ఇంటికి వస్తాడు. కుక్క ఆయనతో స్టేషన్ కు వెళ్లి మళ్ళీ సాయంత్రం ఆ ట్రెయిన్ వచ్చేసమయానికి అక్కడికి వెళ్లి వెంట తీసుకు వస్తుంది .అంత బాంధవ్యం ఏర్పడుతుంది వాళ్ళిద్దరికీ .ఒక రోజు యధా ప్రకారం ఆయన వెళ్ళాడు కానీ ,తిరిగి రాలేదు .ఆ విశ్వాసపు కుక్క ఏళ్ళ తరబడిరైల్వే స్టేషన్ దగ్గర అలాగే ఎదురు చూస్తూ తిండీ నీరు లేక చనిపోయింది అతను కూడా ఎక్కడో చనిపోయాడన్నమాట .విశ్వసానికి ప్రతీక గా టామీ కుక్క నిలిచి పోయింది .ఈకథ జపాన్ లో యదార్ధంగా జరిగింది .ఆ కుక్క విగ్రహం స్థాపించి దాన్ని చిరస్మరణీయం చేశారట .ఆ కధకు ప్రేరణ పొందిన వన్నేం రెడ్డి మనవాతావరాణానికి తగిన మార్పులు చేసి తీశానని చెప్పాడు .అందులో రాజేంద్ర ప్రసాద్ నటన అద్వితీయమని ,కుక్క నాలుకను తన నాలుకతో తాకటం తన నాలుకను కుక్క తాకి నాలుకపై ఉన్నది తినటం దృశ్యాలలో ఏ మాత్రం సంకోచం ,అసహ్యం పడకుండా రాజేంద్ర చేయటం అతని నిబద్ధతకు నిదర్శనం అన్నాడు .అలా చేసిన నటుడు ఎవరూ ఉన్నట్లు తనకు తెలియదనీ రాజేంద్రను మెచ్చాడు . హాట్స్ ఆఫ్ రాజేంద్ర .
మదర్స్ డే సందర్భంగా ఎప్పటిదో -రాజీవ్ కనకాల ,వాళ్ళ అమ్మగారి తో ఇంటర్వ్యూ అతని చెల్లెలు శ్రీ లక్ష్మితో ముఖాముఖీ బాగున్నాయి అందరికీ ఆదర్శంగా కనకాల కుటుంబం నిలిచింది .సుమారు 20 ఏళ్ళక్రితం వేటూరి సుందర రామ మూర్తిగారి స్వగ్రామం కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి లో ఆయన తన ఇంట్లో ఆతిధ్యమిచ్చి జరిపించిన రెండు రోజుల సభలో కనకాల దేవదాస్ ద0పతులను ,విశ్వనాధ్ , బాలు, సప్తపది సినీ హీరోయిన్ సబితా వగైరాలను మేమిద్దరం చూసి మాట్లాడిన విషయాలు గుర్తుకొచ్చాయి .
4-8-17 శుక్రవారం -సుందర కాండ పారాయణం పూర్తి వరలక్ష్మీ వ్రతం
శ్రావణ మాసం రెండవ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం .ఉదయం 4 గంటలకే లేచి కాలకృత్యాలు తీర్చుకొని 5 గంటలకు నిత్యపూజా ,శ్రీ సువర్చలాన్జనేయ అష్టోత్తర ,శతనామ పూజ చేసేసరికి ఉదయం 6-30 అయింది .రాత్రి తల్లీ కూతుళ్లు అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి గొప్ప శోభ చేకూర్చారు . అమ్మవారికి కట్టిన చీర చాలా శోభస్కరంగా ఉంది . అప్పటికే మా అమ్మాయి వాళ్ళమ్మ లేచి వంట సగం పైనే చేసేశారు . 6-30 నుండి 7-45 వరకు వాళ్ళిద్దరికీ వరలక్ష్మీ వ్రతం యధా ప్రకారం చేయించి తోరపూజ తోరాధారణ మంత్రాలు చెప్పి కథ చెప్పి వాయినాలు ఇప్పించేశాను .మా అమ్మాయి 8 గంటలకు బయల్దేరి ఆఫీస్ కు వెళ్ళింది .నేను తొమ్మది రోజులలో చివరి రోజు సుందరకాండ ,శ్రీ సువర్చలాన్జనేయ శతక పారాయణ పూర్తి చేసేసరికి .ఉదయం -8-45 అయింది .నైవేద్యంగా పూర్ణం బూరెలు గారెలు పులిహోర ,పాయసం ,పప్పు వంకాయ కూర కొబ్బరి చట్నీ . ఇంతలో శ్రీమతి ప్రక్కి అరుణ దంపతులు వచ్చారు . నైవేద్య హారతి మంత్రపుష్పం పూర్తయ్యేసరికి 9-15 అయింది . అరుణ దంపతులు మా దంపతులకు వస్త్రాలు అందజేసి వాయనం ఇచ్చుకున్నారు . ఆమెకూ మా వాళ్ళు కొత్త చీర జాకెట్ పేటి వాయనం ఇచ్చారు .
తర్వాత టిఫిన్ చేశాను .
సుమారు 11 గంటలకు ప్రముఖ మృదంగ విద్వాన్ శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారి అల్లుడు వచ్చి వాళ్ళ ఇంటికి కారులో తీసుకువెళ్లాడు .ఎల్లా వారమ్మాయి 5 ఏళ్ళ క్రితం ఇక్కడే పరిచయం అప్పుడే వాళ్ళనాన్నగారితో ఫోన్ లో మాట్లాడుతుంటే మేమూ ఆయనకు నమస్కారాలు చెప్పాం . అయిదేళ్ల క్రితం వారు మా అమ్మాయిగారింటికి రావటం ఆయనను నేను ‘’టోరీ రేడియో ‘’కు ఇంటర్వ్యూ చేయటం ఆయన మా ఇంట్లో భోజనం చేయటం జ్ఞాపకం వచ్చాయి .ఆయన మర్చి పోలేదు . ఏడాది క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు నాతో ఉయ్యూరుకు ఫోన్ లో మాట్లాడారు . విజయ మా ఇద్దరికీ బట్టలు పెట్టి వాయనమిచ్చి టిఫిన్ పెట్టింది.మేము వాళ్ళఇంటికి వెళ్ళటం ఆమె ఆనందానికి అవధులు లేవని పించింది . .
ఇంటికి రాగానే శ్రీమతి గోసుకోండ అరుణ కారులో వాళ్ళింటికి తీసుకు వెళ్లి ఆదంపతులు మాకు బట్టలు పెట్టారు . వాయనం ఇచ్చారు . ఈ రెండు ఇళ్లకు మాతోపాటు మా ప్రక్కనున్న శ్రీ మతి సుగుణ కామాక్షిగారు కూడా వచ్చారు . ఇంటికి వచ్చి భోజనం చేసి సరికి మధ్యాహ్నం 1-30 అయింది .. మధ్యాహ్నం 3 గంటలకు పవన్ భార్య శ్రీమతి రాధ మా ఆవిడను కారులో ఇంటికి తీసుకు వెళ్లి వాయనం ఇచ్చి ,చీర జాకెట్ పెట్టింది .
సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మా అమ్మాయి ,వాళ్ళమ్మ కలిసి పిలిచిన వాళ్ళ ఇంటికి పేరంటానికి వెళ్లి వచ్చారు ఇంటికి వచ్చిన వారికి వాయనమిచ్చారు . రాత్రి 9 గంటలకు రాంకీ తమ్ముడు పవన్ భార్య శ్రీమతి పద్మశ్రీ వచ్చారు . పద్మశ్రీ అమ్మవారిపై శ్రావ్యంగా పాట పాడింది . తర్వాత రాంకీ భార్య శ్రీమతిఉషా ,వాళ్ళ పెద్దమ్మ దంపతులు శ్రీమతి బులుసు పద్మజ వచ్చి పాటలుపాడి వాయనం తీసుకొన్నారు .పద్మ శనివారం సాయంత్రం వాళ్ళ ఇంట్లో టిఫిన్ కు రమ్మని ఆహ్వానించింది . ఆతర్వాత డా శ్రీమతి ఉపాధ్యాయుల శ్రావ్య ,వాళ్ళ అమ్మగారు వచ్చారు . ఆమె తలిదండ్రుల షష్ఠిపూర్తికి మమ్మల్ని పిలిస్తే వెళ్లాం . ఆమె అమ్మమ్మ మా గురువుగారు స్వర్గీయ మహం కాళి సుబ్బరామయ్యగారి తమ్ముడి భార్య అని అప్పుడు తెలిసింది .మళ్ళీ ఒక సారి జ్ఞాపకం చేసుకున్నాం . డా శ్రావ్య ఎంతో సాదా సీదాగా ఉంటారు . మంచి సంస్కారి .మళ్ళీ మనం కలుద్దాం అండీ అన్నారు . వీళ్ళ0దరికి మా అమ్మాయి వాయినాలు ఇచ్చింది అందరికి సరసభారతి పుస్తకాలు ఇచ్చాను చాలా సంతోషించారు .
శనివారం -విజ్జీ వాళ్ళు తెలిసిన అమ్మాయి సీమంతానికి వెళ్లారు .మధ్యాహ్నం సాయి సెంటర్ నిరాహాహకురాలు శ్రీమతి జయ్ వాళ్ళ అత్తగారు ,లక్ష్మి పిల్లల డాక్టర్ నృత్య కళాకారిణి శ్రీమతి సాయి లక్ష్మి మొదలైనవారు వస్తే అందరికీ వాయినాలు ఇచ్చింది మా అమ్మాయి . డాక్టర్ గారికి మహిళా మాణిక్యాలు ఇచ్చాను ఆమె పొంగి పోయారు
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

