‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -1
కేరళలో పుట్టి ,మద్రాస్ ,మైసూర్ లలో చదువు ఉద్యోగ0 చేసి ,పుట్టపర్తి చేరి శ్రీ సత్యసాయి బాబా ఆంతరంగికుడై ,మొట్టమొదటి బాబా జీవిత చరిత్రను ఆయన ప్రేరణతోనే రచించి ఆయనతో దేశమంతా పర్యటించి ఆయన ఆదేశం తో దేశాలు తిరిగి సాయి ప్రేమామృతాన్ని ప్రజలకు పంచి ,’’సనాతనసారధి ‘’కి రధ సారధియై ఆలిండియా రేడియోకి ‘’ఆకాశవాణి ‘’సార్ధక నామధేయాన్ని అందించి , ఉద్యోగకాలం లో ఎవరికీ తట్టని ఎన్నో సేవా కార్యక్రమ కస్తూరికా పరీమళాన్ని వెదజల్లిన పుణ్యమూర్తి ప్రొఫెసర్ నారాయణ కస్తూరి బహుభాషా కోవిదుడు .
అందరి చేతా ఆప్యాయంగా ‘’కస్తూరి ‘’అని పిలువబడే నారాయణ కస్తూరి కేరళలో కస్తూరి రంగనాథ శర్మగా నారాయణ శర్మ పుత్రుడిగా 25-12-1897న ఉత్తర తిరువాన్కూర్ లో ని త్రిపునిత్తూర లో జన్మించాడు. పుట్టిన11 వ రోజున తల్లి అర్జునుడు ప్రతిష్టించిన స్థానిక పార్ధసారధి దేవాలయానికి తీసుకువెళ్లి స్వామికి ఎదురుగా నేల మీద పడుకో బెట్టింది .ఆమెకు స్వామి ఏదో సందేశం ఇచ్చినట్లు భావన కలిగింది ..అలాగే రోజూ ఎత్తుకొని వెళ్లి స్వామి దర్శనం చేయించేది .అమ్మతండ్రి అంటే తాత దేవాలయ ఎక్సి క్యూటివ్ ఆఫిసర్ ..పెళ్లినాటికి తండ్రివయసు 18 ,తల్లికి 12 . .నామకరణం నాడు తండ్రి అకస్మాత్తుగా కొడుకుకు ‘’కస్తూరి రంగనాధ ‘’అని పేరుపెట్టారు .ఇంతవరకు కస్తూరి పేరు ఆ ఇంట ఎవరికీ లేదు . సంప్రదాయం ప్రకారం కస్తూరి రంగనాధ శర్మ అయ్యాడు . కేరళ ,తమిళనాడులలో తండ్రిపేరు ఇంటిపేరు అవుతుందికనుక తర్వాత నారాయణ కస్తూరి అని షార్ట్ నేమ్ పెట్టుకొన్నాడు . శ్రీరంగం లోని శ్రీ రంగనాధ స్వామి నుదుట ఉండే నిలువు బొట్టు కస్తూరితో పెడతారు .దాని సుగంధం ఎంతో దూరానికి వ్యాపిస్తుంది .అలాగే ఈ కస్తూరి సేవా పరిమళం కూడా బాగా వ్యాప్తి చెంది సార్ధక నామం అయింది ..
చిన్నప్పుడే తండ్రికి మసూచికం సోకి మరణించాడు .. మాతామహుడి ఇంటనే తల్లీ కొడుకు ఉండేవారు . తాత చండ శాసనుడు .ఆంగ్ల చదువులు ఇష్టం లేనివాడు . కానీ తల్లిప్రోత్సాహం తో అదే చదివాడు .ఆకాలం లో కొచ్చిన్ రాజు తమరాజ్యం లో బ్రాహ్మణులెవరూ తిండిలేకుండా ఉండరాదని రాజధానిని కొచ్చిన్ నుంచి త్రిపునిత్తురకు మార్చి అక్కడ అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు .తల్లి ,కస్తూరిని అక్కడ హై స్కూల్ లో చేర్పించింది .చదువుకు తిండికి ఇబ్బంది లేకుండాపోయింది .ఫిఫ్త్ ఫారం లో ఉండగా కుమార్ అనే విద్యార్థి నాయకుడి ఆధ్వర్యం లోఒక డిబేట్ ‘’శ్రమ లేకుండా ఉచిత భోజనం అందించరాదు ‘’ను నిర్వహించి రిజల్యూషన్ రాజుకు పంపారు .కానీ ఆయన దీన్ని ‘’లైట్ తీసుకొని ‘’అన్నసత్రాన్ని కొనసాగించాడు . 1903 లో చేరి 1914 వరకు కస్తూరి చదివిన స్కూల్ రాష్ట్రం లోనే నంబర్ వన్ .ఉపాధ్యాయలనుప్రతిభ ప్రాతిపదికపై ఎంపిక చేసేవారు .రాజుగారి పిల్లలు గుర్రబ్బండిలో స్కూల్ కు వచ్చేవారు .వాళ్లకు కుర్చీలు డెస్క్ లు ఉండేవి . మిగిలినవారికి’’ తొడలే’’ డెస్క్ లు ..యువరాజు గోపాల మారార్ కస్తూరి క్లాస్ మేట్ .అప్పుడప్పుడు అతనితో రాజ అంతఃపురానికి వెళ్ళేవాడు ..అప్పుడు క్లాసుకు 30 మందిమాత్రమే విద్యార్థులు .ఉపాధ్యాయులు నిష్ఠగా బోధించేవారు ..హెడ్ మాస్టర్ గోపాలకృష్ణ అయ్యర్ రాజావారి పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు ..యెన్ ఆర్ సుబ్బ అయ్యర్ బ్రిటిష్ హిస్టరీ చెప్పేవాడు . అప్పుడు ‘’రూల్ ఆఫ్ బ్రిటాన్నియా ‘’అందరు తప్పక నేర్వాల్సి వచ్చేది . అప్పుడే అన్నన్ రాసిన ‘’పార్లమెంటరీ ప్రాక్టీస్’’ అనే పుస్తకాన్ని ప్రచురింపబడగా కస్తూరి కొని చదివేశాడు . 1921 లో మైసూర్ కాలేజియేట్ హై స్కూల్ లో హిస్టరీ బోధిస్తూ కస్తూరి విద్యార్థుల చేత ‘’స్తూడెంట్ పార్లమెంట్ ‘’అంటే మోడల్ పార్లమెంట్ నిర్వహింప జేశాడు .స్పీకర్ ప్రధాని,ప్రతిక్షానాయకుడు బిల్లు ప్రవేశ పెట్టటటం చర్చ పాసవటం సవరణల ప్రతిపాదన వంటి తంతు అంతా విద్యార్థుల చేత చేయించి శెభాష్ అనిపించుకున్నాడు కస్తూరి .ఇలా అక్కడ పని చేసిన కాలం అంటే 1928 వరకు ఏడేళ్లు ప్రతిఏడాది 20 ఆదివారాలలో ఈ కార్యక్రమం చేయించాడు ..సుబ్బ అయ్యర్ ‘’వారన్ హేస్టింగ్ ఇంపీచ్ మెంట్ ‘’ను విద్యార్థులతో చేయిస్తే కస్తూరి ,ఎడ్మ0డ్ బర్క్ ఆంగ్ల ప్రసంగాలు విద్యార్థులచే చేయించేవాడు . వాగ్ధాటికి బర్క్ నే ముందు పేర్కొంటారని మనకు తెలుసు .
స్టూడెంట్ అసోసియేషన్ లో వక్తృత్వ పోటీలు ,నిర్వహించేవాడు . వచ్చేవారం చర్చించబోయే అంశాన్ని ముందే తెలియజేసి విద్యార్థుల అవగాహనకు అవకాశమిచ్చేవాడు ..ఒక విద్యార్థి ని 1913 లో తరువాతవారానికి విషయం ఏమిటి అని అడిగితె ‘’The dippressed classes and the supression of the oppression practised on them ‘’అని చెప్పగానే అందరూ అందరూ అభినందనగా చప్పట్లు కొట్టారు .డిబేటింగ్ రసవత్తరంగా అర్ధవంతంగా జరిగి మంచి ఫలితాన్నిచ్చింది అని కస్తూరి గుర్తు చేసుకొన్నాడు .
పాఠశాల గ్రంథా లయం లోని విలువైన పుస్తకాలు చదివాడు . స్కాట్ రాసిన ‘’టాలిస్మన్ ‘’బాగా ఇష్టం .తనతోపాటు స్కాట్ మనల్నీ తీసుకు వెడతాడు అంటాడు . 1913లో ఇన్స్పెక్షన్ లో అధికారి ఏ పుస్తకం చదువుతున్నావని అడిగితె ‘’లెస్ మిజరబుల్స్ ‘’అని చెబితే దాన్ని ‘’లా మిజరబుల్స్ ‘’అని పలకాలని సరిదిద్దాడని .నిజాయితీగా చెప్పాడు . ఇంటిదగ్గర తాతగారు కూడా కథల పోగు .రోజూ ఏదోఒకటి చెప్పేవాడు .. ఈ తాత మామూలోడు కాదు బలే ముదురు .ఇంట్లో పిల్లి లేవటానికి ఎన్నో ఉపాయాలు పన్నేవాడు .పెద్ద సంసారం .ఎంతవచ్చినా చాలేదికాదు .అందుకని తీర్ధయాత్రలు అని చెప్పి డబ్బున్నవాళ్ళదగ్గర డబ్బు దండుకొని ,యాత్ర చేసివచ్చి మిగిలిన డబ్బును రెండు మూడు నెలలు కొంప గడవటానికి ఉపయోగించేవారు ..
కొచ్చిన్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్త పరీక్ష పెట్టి అందులో కస్తూరితోపాటు అయిదుగురిని సెలెక్ట్ చేసి నెలకు 5 రూపాయల స్కాలర్షిప్ మూడేళ్లు ఇచ్చింది .దీనితో అతని నాలుగు అయిదు ఆరు ఫారం ల చదువు గట్టెక్కింది .మూడు నెలలకొకసారి హెడ్ మాస్టర్ పిలిచి పారితోషికం గా విక్టోరియా రాణి బంగారునాణెం అంటే 15 రూపాయల విలువకలది ఇచ్చేవాడు .దీన్ని తాత కిస్తే వెండి నికెల్ రాగి నాణాలు గా మార్చి నాకి పారేసేవాడు అని చమత్కరించాడు కస్తూరి . పెద్ద కుటుంబాన్ని మోయటానికి తాత కు మరో గొప్ప ఆలోచనవచ్చి 7 వ ఏటఉపనయనం చేశాడు .ఒక రోజు పూర్ణా నదిలో కస్తూరి ఈదటం చూసి బాలశంకరులను మొసలి పట్టుకున్నట్లు మనవడిని పట్టుకొని సన్యాసం తీసుకొంటాడేమోనని భయపడి గీసి గీసి బేరమాడి 600 రూపాయల కట్నం తో పెళ్లి కుదిర్చి నాలుగు రోజులు పెళ్లి చేయించాడు ..ఈ డబ్బు నొక్కేద్దామని ముసలాడి ముదురుఆలోచన . కస్తూరి తల్లి బ్రేకే వేసి ఆడబ్బు జాగ్రత్త చేసి తన చదువుకు ఉపయోగించిందని చెప్పాడూకస్తూరి .ఎర్నాకుల0 లో స్కూల్ ఫైనల్ పరీక్షరాసి మలయాళం సాహిత్యం హిస్టరీలలో రాష్ట్రం లో మొదటిమార్కు మొత్తం మీద 5 వ రాంకు సాధించి కాలేజీ చదువుకు నెలకు 10 రూపాయల రెండేళ్ల స్కాలర్ షిప్ కు అర్హత పొందాడు . ఎర్నాకుల0 లో లో ఇంటర్ కు చేరి సత్ర భోజనం చేస్తూ గడపచ్చుఅనుకొన్నాడు .కానీ సమయాలు కుదరక ఒక విధవరాలింట్లో చిన్నగది తీసుకొని ఆమె వండిపెట్టింది తింటూ చదువుకున్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-17-కాంప్-షార్లెట్ -అమెరికా

