భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గోవా మహిళా మూర్తులు (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గోవా మహిళా మూర్తులు (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

గోవాలో 1926 మే నెల 26 న ఆంటోనియో ఆలివర్ డీ సెల్వజార్ పోర్చుగల్ లో అధికారం లోకి రావటం తో రిపబ్లిక్ పాలనఅంతమైంది ..వాస్కోడి గామా ,ఆల్బు కెర్క్ లతర్వాత ఇతనితో క్రూరపాలన అంతమైంది పోర్చుగీసు అధికారం తో పెత్తనం చెలాయిస్తున్న సాలాజార్ కబంధ హస్తాలనుండి విడుదలై భారత దేశ విముక్తి కోసం పోరాడుతున్న యావద్భారత దేశం తోపాటు గోవా కూడా కలిసి అడుగులు వేయాలని నిశ్చయించింది .సాలాజార్ ప్రజల నోరు నొక్కి బహిరంగ సమావేశాలకుకాని ,భావప్రకటనకు కానీ అవకాశం ఇవ్వకుండా పౌరహక్కులకు తీవ్ర విఘాతం కలిగించాడు .అన్ని హక్కులను నిషేధించి తన క్రూర పైశాచిక నియంతృత్వాన్ని చెలాయించాడు .రాజకీయ సమావేశం జరపాలంటే గవర్నర్ దగ్గర ముందు అనుమతి పొందాల్సి వచ్చేది . 1933 కలోనియల్ యాక్ట్ ద్వారా ప్రజల సర్వ హక్కులు నిషేధానికి గురయ్యాయి . స్వేచ్చాప్రియులైన గోవన్లు దీన్ని జీర్ణించుకోలేక తిరుగుబాటు చేయాల్సి వచ్చింది’ అంతకంటే వారికి గత్యంతరం కనిపించలేదు .
క్రమంగా సంస్థలు ఏర్పడి ,జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు .ఈ ఉద్యమం లో మహిళలు తామేమీ పురుషుల కు వెనుకబడిలేమని తెలియజేస్తూ ముందుకు దూకి స్వాతంత్రేచ్ఛతో రగిలిపోయారు .గోవా ,డయ్యు డామన్ ల విముక్తికి సంఘటిత0గా నడుం కట్టి కదిలారు .
.అందులో పౌరహక్కుల ఉద్యమ ప్రధమమహిళా నాయకురాలుగా ప్రమీలా కాంత్ జంబోలికర్ అగ్ర శ్రేణిలో నిలిచింది .గోవా సేవా సంఘం ఆధ్వర్యం లో ఆమె అనేక కార్యక్రమాలు నిర్వహించి మహిళా చైతన్యాన్ని ద్విగుణీకృతం చేసింది . 1946లో ఆమె గోవా జాతీయ కాంగ్రెస్ సభ్యురాళ్ళలో ప్రధమ స్థానం పొందింది . 21.-7-1946 న ఆమె మడగావ్ లో ”ప్రభాత భేరి ”ఉద్యమానికి నాయకత్వం వహించింది .పోర్చుగీస్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టి హింసించింది .కస్టడీ లో ఉండగా పోలీస్ కమాండెంట్ అడిగిన ప్రశ్నలకు అత్యంత ధై ర్యం గా సమాధానాలు చెప్పి దిమ్మ తిరిగేట్లు చేసింది .మళ్ళీ ఉద్యమాలు చేస్తే బాలిక అనికాని మహిళఅనికాని చూడకుండా బట్టలు విప్పించి బాదేస్తానని భయపెట్టాడువాడు . వదిలేశాక ఆమె రెట్టించిన ఉత్సాహం తో మళ్ళీ ఉద్యమం చేసి అరెస్ట్ అయి ఏడాదిపాటు జైల్లో ఉంది
మహిళా కార్య కర్తల ఉద్యమపోరాట0 18-6-1946 న రామ మనోహర్ లోహియా మార్మగోవాలో ప్రసంగించిన సభతో తీవ్ర రూపం దాల్చింది .గోవన్ల పౌరహక్కుల కోసం ప్రభుత్వం తో పోరాటం చేయాలని లోహియా తీవ్ర స్వరం తో ఉద్రేకంగా మాట్లాడి గొప్ప ప్రేరణ కలిగించాడు .అప్పటిదాకా గోవాలోనియంతృత్వసాలజార్ పోర్చుగీసు పాలనలో ఎవరూ ఏ మార్పును తేలేరు అనుకొన్న నమ్మకాన్ని బద్దలు చేశాడు లోహియా . ఆయన కాలు పెట్టటం తో అంతా ఒక్క సారిగా మారిపోయింది .అంత గొప్ప ప్రేరణ కలిగించాడాయన .స్వాతంత్ర పిపాస విజృంభించింది .అన్ని నిషేధాలను ఉల్లంఘించి గోవా నాలుగు చెరగులా ఉన్న గోవన్లు వెల్లువగా ఉద్ధృతప్రవాహంలా దూసుకొచ్చి సభలో పాల్గొని ఆత్మ విశ్వాసాన్ని చాటి చెప్పారు .చేసేదేమీలేక ప్రభుత్వం లోహియాను అరెస్టుచేసింది .ఆయనతోపాటు వత్సలా పాండురంగ కీర్తనీ అనే యువతి కూడా ఉపన్యాసం ఇవ్వటానికి ముందుకు రాగా అరెస్ట్ అయింది .పోలీస్ కమాండెంట్ ఫిగారేడో ఆమెను ”ఎందుకు జై హింద్ అని అరిచావు ?”అని అడిగితే ఆమె ”జై హింద్ నినాదం మాలో స్వాతంత్రేచ్ఛ ,దేశభక్తి కలిగించి ధైర్యాన్నిస్తుంది ”అని భయపడకుండా చెప్పింది .ఈమె అరెస్ట్ అయ్యాక 40 మంది మహిళలు ఊరేగింపుగా వెళ్లి జై హింద్ నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ను చుట్టు ముట్టి వత్సలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేకపోతె తమనుకూడా అరెస్ట్ చేయమని డిమాండ్ చేశారు . అత్యంత నాటకీయంగా జరిగిన దీనికి కమాండెంట్ గుక్క తిప్పుకోలేక ఆమెను విడుదల చేశాడు . కానీ ఆమె మాత్రం లాకప్ నుంచి బయటకు రానని భీష్మించింది .అప్పుడు ఆఫీసర్ ఆమెను పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా బయటికి నేట్టేసి ఊపిరి పీల్చుకున్నాడు .
గోవా జాతీయ కాంగ్రెస్ ,గోవా సేవా సంఘం ,గోమంతకీయ తరుణ సంఘం మొదలైన రాజకీయ సంస్థలు గోవాలోని బాలికలను స్త్రీలను పౌరహక్కుల కోసం బా గా ప్రభావితం చేశాయి .వీరందరూకలిసి ఎన్నో ప్రభాత భేరీలు సత్యాగ్రహాలు ,మూడురంగుల జండా ఎగరేయటాలు ,కరపత్రాలు పంచటాలు తో ఉద్యమానికి గొప్ప ఊపు తెచ్చారు . జూన్ 18 ఉద్యమంలో లలితా కాంటక్ ,(లలితామాధవ్ ,వెలింగకార్ )కూడా ముఖ్యపాత్ర పోషించింది . ఆమె మార్ గోవాలో మీటింగులపై నిషేధాన్ని ఎత్తేయాలని రోజూ ప్రభాతభేరి నిర్వహించేది . 1946 జులై 21 న ప్రమీలాబాయ్ జమ్బోల్కర్ ,లలితా కాంటక్ ల ఆధ్వర్యం లో భారత జాతీయ జెండాను ఎగర వేసే ప్రయత్నం చేస్తూండగా పోలీసులు అడ్డుకొని వాళ్ళ చేతుల్లోని జెండాను బలవంతంగా లాగేసి వాళ్ళనుచితకబాదారు .
పౌరహక్కుల ఉద్యమం లో వీరితో పాటు చేతులు కలిపినమహిళలలో కృష్ణ హెగ్డే ,వితా హెగ్డే ,,కృష్ణ లోతిల్కర్ ,ముక్తా ఖరాపుర్కర్ ,ఉమాబాయి శ్రీరాలి ,ఇందిరా భైసే ,జీవన్ కరపుర్కర్ వంటి త్యాగ-శీల మహిళా మాణిక్యాలెందరో నిరంకుశ సాలాజార్ పోర్చుగీస్ పాలననుండి విముక్తికై అవిశ్రాంతంగా ఉద్యమించి చరితార్ధులయ్యారు .ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు వారిని ఒకసారి స్మరించి ప్రేరణ పొంది ధన్యులమవుదాం .

-గబ్బిట దుర్గా ప్రసాద్

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.