నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి .రామారావు
రచన –గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -9989066375
ఇంతింతై ఎదిగిన యశస్వి ఎస్వి
కృష్ణా జిల్లా గుడివాడ లో వడ్రంగం లో అద్భుతాలు సృష్టించిన శ్రీ శిరందాసు గంగయ్య ,శ్రీమతి లక్ష్మమ్మ దంపతుల కు 1936 లో శ్రీ రామారావు.జన్మించారు .చిన్నతనం నుండే బొమ్మలు వేస్తూ ,తొలిగురువు శ్రీ.కే వేణుగోపాల్ గారి గురుత్వం లో13 వ ఏడు వరకు బాగా రాణించారు . గుడివాడ ఎ.యెన్ ఆర్ కాలేజీ లో ఇంగ్లీష్ బోధించిన వైస్ ప్రిన్సిపాల్ శ్రీ యడవల్లి సన్యాసి రావు గార౦టే ఎస్వి గారికి వీరాభిమానం .ఎకనామిక్స్ ,కామర్స్ లలో డబుల్ గ్రాడ్యుయేట్ అయి ,1955 నాటికే ఆర్ట్ లో 4 డిప్లమాలు సాధించారు .తండ్రిగారే ఆయన కు స్పూర్తి ప్రదాత .మద్రాస్ వెళ్లి ప్రముఖ చిత్రదర్శకుడు, కదా రచయితా, స్నేహితుడు మాధవ పెద్ది గోఖలే సలహా పై మద్రాస్ ఆర్ట్ కాలేజ్ లో చేరారు . ప్రిన్సిపాల్ శ్రీ దేవీ ప్రసాద్ రాయ్ చౌదరిని తన కళా ప్రదర్శనతో మెప్పించి 6ఏళ్ళ కోర్సు గా ఉన్నదానిలో సరాసరి 3 సంవత్సరం కోర్స్ లో చేరారు ..ఫణిక్కర్ ,ధనపాల్, రాం గోపాల్ సంతాన రాజ్ ,మునిస్వామి వంటి ప్రముఖుల చిత్రాలు పరిశీలిస్తూ ఎంతో నేర్చారు. 1960 లో డ్రాయింగ్ లో డిప్లొమా పొందారు. భారత ప్రభుత్వ స్కాలర్ షిప్ వరుసగా మూడేళ్ళు పొందారు .కామన్వెల్త్ ఫెలోషిప్ కు భారత దేశం మొత్తం మీద 315మంది పోటీ పడితే ,రామారావు ఒక్కరే ఎంపికైన ఏకైక వ్యక్తిగారికార్డ్ సృష్టించారు .అప్పుడు ఆయన వయసు కేవలం 23 మాత్రమే.
కళా నిష్ణాత -శైలీ నిర్మాత
1962 లో లండన్ వెళ్లి అత్యున్నత ప్రమాణాలకు నిలయమైన’’ స్స్లేడ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్’’ లో చేరి, సర్ విలియం కోల్డ్ స్ట్రీం ,విలియం రోజర్స్ ,బెర్నార్డ్ కోహెన్ వంటి లబ్ధ ప్రతిష్టులవద్ద కళా విద్యా రహస్యాలు గ్రహించారు.ఆయన చిత్రాలు ప్రచురించని ప్రసిద్ధ పత్రిక ఉండేదికాదు .తన చిత్రాలపై ‘’ఆర్య దేవ’’అని సంతకం చేసేవారు .‘’అక్కడ ఈయన గీసినచిత్రాన్ని ప్రిన్సిపాల్ ఇండియాలో గొప్ప ఆర్ట్ క్రిటిక్ శ్రీ రామన్ కు ఎస్వి పేరుకనిపించకుండా చేసి ‘’ఇది ఎవరు గీసింది ?’’అని అడిగితే‘’పికాసో ‘.అని చెబితే ‘’కాదు –మీ దేశ చిత్రకారుడు ఎస్వి రామారావు చిత్రించినది ‘’అని చెప్పగానే ఆశ్చర్య పోయాడు రామన్.సమకాలీనుడైన పికాసో తో పోటీపడాలని భావించి బోర్డ్ మీదనే ఆసియా కళ ఆధారంగా బొమ్మలు వేస్తూ ,తనదైన స్వంత శైలికోసం తపిస్తూ ,మ్యూజియం లో బొమ్మల్ని చూస్తూ లైబ్రరీలలో అధ్యయనం చేస్తూ, ప్రపంచ చిత్ర కళా రీతులను అవగాహన చేసుకొన్నారు .వివిధ దేశాల చిత్రకళా రీతులనుండి తనకు కావలసిన అంశాలు ఎన్నుకొని తనదైన చిత్ర ప్రవాహాన్ని సృష్టించుకొన్నారు .ఆఫ్రికా జానపదుల మాస్క్ లనుండి పికాసో ముడి సరుకు తీసుకొన్నట్లు ,రామారావు గారు మొఘల్ ,రాజపుట్ కళ నుంచి అలంకరణ రీతిని ,జపాన్ చిత్రకళ నుండి రేఖలను తీసుకొని వాటి మేళ వింపు తో చిత్రాలు గీశారు. రామారావు గారి చిత్రకళపై వ్యాఖ్యానిస్తూ’ ఇలస్ట్రే టెడ్ వీక్లీఆఫ్ ఇండియా ‘’ ‘’సంపాదకుడు శ్రీ ఏ.ఎస్.రామన్’’For as artist ,in his style ,idiom and technique Rama Rao is as Western as any of his Western counterparts ,in spite of his passion for basic Indian values ‘’అన్నాడు .
1966 లో’’ మోస్ట్ అవుట్ స్టాండింగ్ లితోగ్రాఫర్ ‘’’’గా గుర్తింపు పొందారు. 1965 కు కోర్సు పూర్తి చేసి ‘’వర్ణ చిత్ర రచనలో నూతన శైలీనిర్మాత ‘’ ఇన్వెంటర్ ఆఫ్ స్టైల్ ఇన్ ఆయిల్ పెయింటింగ్ ‘’అని కీర్తి పొందారు .’1965లోవిఖ్యాతమైన ‘’ లార్డ్ క్రాఫ్ట్స్ అవార్డ్ ‘’అందుకొన్నారు .
పికాసో సరసన
కామన్ వెల్త్ ఆర్ట్ ఎక్సి బిషన్ లో చిత్ర ప్రదర్శన నిర్వహిస్తూ ,లండన్ కౌంటి కౌన్సిల్ లో పెయింటింగ్ డ్రాయింగ్ లను 1965నుండి -69 వరకు బోధించారు .
లండన్ లోని ‘’న్యు విజన్ సెంటర్ గాలరీ వారు ‘’ఆల్ఫబెట్ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ‘’పై నిర్వహించిన ఎక్సి బిషన్ లో శ్రీ రామారావు పాల్గొన్నారు. ఆనాటి ప్రముఖ ఆర్టిస్ట్ లైన పాబ్లో పికాసో,బ్రాక్ ,మీరో, డాలి, మాక్స్ ఎర్నెస్ట్ జాక్సన్ పొలాక్ వంటి హేమా హేమీ ఆర్టిస్ట్ లచిత్రాల సరసన రామారావు గారి చిత్రాలు చోటు చేసుకొన్నాయి అంటే అద్భుతః అనిపిస్తుంది . . . ఆసియా మొత్తం మీద ఎస్వి ఒక్కరికే ఈ అరుదైన అవకాశ౦ లభించటం ఆయన ప్రతిభకు తగిన పురస్కారం . లండన్ లో జరిగిన .ప్రతిష్టాత్మకమైన ‘’బ్రిటిష్ ఇంటర్నేషనల్ ప్రింట్ బైన్నియల్ ‘’ప్రదర్శనకు పికాసో చిత్రాలతో పాటు ఇండియన్ పికాసో ఎస్వి గారి చిత్రాలు కూడా ఎంపికయ్యాయి .ఇది తన అదృష్టం అని వినయంగా చెప్పారు ఎస్వి .ఈ ఎంపిక ను చిత్రకారులు నోబెల్ బహుమతి తో సమానంగా భావిస్తారని రామారావు గారు అన్నారు .ఎన్నో దేశాలలో తన చిత్రాలను ప్రదర్శించారు .అధిక ధరలకు అవి అమ్ముడయ్యాయి .
కళా బోధన- పద్మశ్రీ పురస్కార౦
శ్రీ ఎస్వి 1969 లో అమెరికా వెళ్లి టఫ్త్స్ ,బోస్టన్ ,సిన్సినాటి, వెస్ట్ కెంటకి యూని వర్సిటీలలో1978 వరకు బోధించారు డాక్టర్ శ్రీమతి సుగుణ గారిని వివాహమాడి చికాగోలో ఉంటున్నారు .వీరి కుమార్తె శ్రీమతి పద్మావతి భరత నాట్యం లో గొప్ప నర్తకీమణి అల్లుడు డా హర్షవారధి .
రామారావు గారికి 2001 లో బారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని నాటి రాష్ట్ర పతి శ్రీ కె ఆర్ నారాయణగారి చేతులమీదుగా ప్రదానం చేసింది .పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ,గౌరవ డాక్టరేట్ అంద జేసింది.
. తిరుపతి లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల లో రాష్ట్రపతి శ్రీప్రణబ్ ముఖర్జీ గారి చేత సత్కార సన్మానాలు అందుకొన్నారు. అమెరికాలోని నార్త్ టెక్సాస్ తెలుగు సంస్థ మొదలైన ప్రసిధ సంస్థలచేత సత్కారం పొందారు . శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అవనిగడ్డలో ఏర్పాటు చేసిన నేతాజీ శత జయంతికి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన ప్రపంచ సభలకు హాజరై సన్మానాలు అందుకొన్నారు .
రామారావు గారి కి తెలుగు సాహిత్య కళా రంగాలలో లబ్ధ ప్రతిస్టుల౦దరి తోను గాఢమైన పరిచయం ఉంది ..ఆయన ఏనాడూ మూలాలను విస్మరించలేదు. శ్రీ ఆచంట జానకిరాం ,శ్రీ కొడవటి గంటి కుటుంబరావు ,శ్రీమతి కె రామ లక్ష్మి ,శ్రీ సొంఠి సదాపూర్ణ ,శ్రీ శివలెంక శంభు ప్రసాద్ శ్రీ వాకాటి పాండురంగారావు వంటి దిగ్గజాలతో ఆయనకున్నఆత్మీయత మరువ లేనిది .వీరంతాఎస్విగారి సృజనశీలతను బహుధాప్రశంసించినవారే .ఆంద్రపత్రిక, భారతి,లసంపాదకులు శ్రీశివలెంకశంభుప్రసాద్ గారికోరికపైశ్రీరామారావుకళారహస్యాలపైప్రత్యేకమైనవిశ్లేషణాత్మకవ్యాసాలు భారతికి ,రాసి,తెలియనిఎన్నోవిషయాలను లోకానికిఎరుకపరచారు .వీటినిచదివిఅబ్బురపడినఅమెరికాలోబెర్కిలీలోని కాలి ఫోర్నియా యూనివర్సిటిఇంగ్లీష్ ప్రొఫెసర్ వీటిలో ముఖ్యమైన వాటినిఇంగ్లీష్ లోకి అనువాదంచేసిరామారాగారి భావాలకువిశ్వవ్యాప్తికలిగించారు.
మూర్తీభవించిన మానవీయత
ప్రపంచ ప్రఖ్యాతచిత్రకారులైన శ్రీ రామారావుగారు వ్యక్తిగాఅతిసున్నిత మనస్కులు .ఎవరికి యే బాధా,ఆపదా కలిగినా తనది గానే భావించి, వెంటనే స్పందించి,స్నేహహస్తంచాఛి,ఆదుకొనే సహృదయత ఉన్నసంస్కారంవారి విశిష్టలక్షణం .మానవతమూర్తీభవించిన ఉత్తమ కళాకారులాయన .1977 కృష్ణా జిల్లా దివిసీమనుఅల్లకల్లోలంచేసిన ఉప్పెన విషయం తెలిసి,ఇక్కడిబాధితులనుఆదుకోవటానికి అమెరికాలోతెలిసినవారందరివద్దస్వచ్చందంగావిరాళాలుసేకరించి పంపించినమానవతామూర్తిశ్రీ రామా రావు ‘ఆనేక కవితలుఆంగ్లం లోను తెలుగు లోను రాసి పుస్తకాలుగా తెచ్చారు ఎస్వి .
నైరూప్య చిత్రకళా యశస్వి
రామారావు గారి నైరూప్య చిత్రాల ప్రత్యేకత గురించి తెలుసుకొనే ముందు అసలు నైరూప్య చిత్రాలు అంటే ఏమిటో తెలియాలి .’’ఆకారాలలో కనిపించేది అబద్ధం, అశాశ్వతం కనుక వస్తు రూపమే మిధ్య ‘’అనే భావన కిందటి శతాబ్దం మధ్యలో పుట్టి అదే ఒక రూపం గా ఎదిగింది .ఈ భావన మొదట చిత్రకళలో ,తర్వాత శిల్పం,సంగీత ,సాహిత్యాలలో ప్రవేశించి విలక్షణమైన భావోద్రేకాలను ప్రకటించే విధానంగా రూపొందింది .సహజ రూపాన్ని వదిలేసి ,అందులోని ప్రాధమిక రూపాన్ని విశ్లేషించే బొమ్మలు గీసే విధానమే నైరూప్య చిత్రకళ.అంటే చిత్రకళలో ఒక విలక్షణ ప్రక్రియ నైరూప్య చిత్రకళ.వాస్తవాన్ని వదిలిపెట్టి కళ లోని ఊహల వర్ణనలను సూచిస్తు౦దన్నమాట .మనకు వచ్చే కలలలో నైరూప్య చిత్రాలు అంటే ఆబ్స్ట్రాక్ట్ ఇమేజెస్ ఉంటాయి .ఆ కలల స్వభావాన్నీ ,వాటికీ నిజ జీవితానికీ ఉన్న సంబంధాన్ని మనం అన్వయించుకొంటాం . ఈ చిత్రాల్లో మనకు పరిచయమున్న రూపాలేవీ కనిపించవు .అంతా రేఖల ,రంగుల ఇంద్రజాలంగా అనిపిస్తుంది .ఇందులో ప్రసిద్ధుడైన వాడు ఫ్రెంచ్ చిత్రకారుడు పాబ్లో పికాసో .ఎస్వి రామారావు గారు ఈ నైరూప్య చిత్ర కళలో కొత్త శైలిని అలవరుచుకొని ‘’ఇండియన్ పికాసో ‘’గా విఖ్యాతులయ్యారు .
. డాక్టర్ రామారావు చిత్ర లేఖన ప్రతిభ క్రమంగా స్వీయ వ్యక్తిత్వాన్నిఏర్పరచుకొని ,ఎన్నో దశల ప్రయోగాలు దాటి నైరూప్య –ఆబ్స్ట్రాక్ట్ చిత్రకళా రూపం లో పతాక సదృశ౦ గా నిలిచింది .కవి ,రచయిత విమర్శకులు అయిన రామారావు బహుముఖ ప్రజ్న అనితర సాధ్యమని పిస్తుంది ‘’అన్నారు డా సి నారాయణ రెడ్డి గారు .ఆధునిక చిత్రకళా ప్రపంచం లో ఫ్రెంచ్ చిత్రకారుడు పాబ్లో పికాసో ధ్రువతార .ఇవాళ ఎస్వి గారిచిత్రకళా విశ్వరూపాన్ని దర్శించిన వారు ఆయనను ‘’ఇండియన్ పికాసో ‘’ అంటారు .కాని ఆయనమాత్రం ‘’నేనుపికాసో కు వీర అభిమానిని .ఆయనే నాకు మార్గ దర్శి ’అని సగర్వంగా చెప్పుకున్నారు .అది ఆయన సంస్కారానికి నిదర్శనం .’
నేటి నవ్య కళ ఎన్నో యుగాలకిందటి నీగ్రో మూర్తి కళలో కన్పిస్తుంది .ఈనీగ్రో మూర్తికళ నుంచే ‘’ఫాదర్ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ‘’అనిపిలువబడే పికాసో స్పూర్తి పొందాడు.సహజ రూప చిత్రణ కంటే అసహజ రూప చిత్రణకు ప్రతిభను పదునుపెట్టి నవ్య చిత్రకళా నిష్ణాతు డైనారుశ్రీ రామా రావు . నవ్య చిత్రకళ విశ్వజనీనమై తైల వర్ణ చిత్రాలలో ఒదిగి పోయింది .ఇందులో రూపం కంటే రంగుకే ప్రాధాన్యం ఎక్కువ .రంగుల ఇంద్రజాలందీని విలక్షణత్వం అన్నారు సంజీవ దేవ్ ..
క్యూబిజం ఇంప్రెషనిజం ఎక్స్ప్రెష నిజం సర్రియలిజం లోనూ అనేక ప్రయోగాలు చేసి ఎస్వి ,చిత్రాలలో మంచి టెక్చర్ అంటే స్పర్శి౦చదగిన పైభాగం సృష్టించటం లో మహా నిష్ణాతులయ్యారు .తాను మనో చక్షువులతో చూసే రూపాన్ని చర్మ చక్షువులకు అందించే నేర్పు అద్వితీయం .స్వయంగా చిత్రకళా మర్మజ్ఞులు కూడా అయినందున , కళావిమర్శకులకు అందని లోతులు ఆయన అందుకోగలిగారు . ’సామాన్యంగా నైరూప్య చిత్రాలు ఏదో ఒక వ్యక్తికో వస్తువుకో, స్థలానికో చెంది ఉండవు .కాని ఎస్విగారి నైరూప్య చిత్రాలు విషయాలకు సంబంధించినవిగా ఉంటాయి . ‘’లండన్ లో మొదటి చిత్ర ప్రదర్శనకు’’ కృష్ణానది’’ని వస్తువుగా తీసుకొని ‘’ఆప్టికల్ ఇల్యూజన్ తో ధారావాహిక చిత్రాలు గీసి అద్భుతం అనిపించారు . కృష్ణానది మనకు తెలిసినా ఆయన చిత్రించిన కృష్ణానది మనకు తెలియదు .అంటే ఆనదీ ప్రవాహం ,ఒడ్డు, కెరటాలు ,వేగం వంటి స్థూల రూపాలు కాకుండా, సూక్ష్మ రూపం, దాని నైరూప్య రూపాన్ని చిత్రిస్తారన్నమాట.ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి వారు దీనిపై కవిత్వం రాశారు . ‘’లేపాక్షి, ఉషోదయం చిత్రాలూ పెద్ద పేరు తెచ్చుకోన్నాయి .
’ తర్వాత పూర్తిగా అమెరికాలో స్థిరపడి ప్రయోగ శీలతతో తైల, నీటి రంగుల చిత్రాలలో కోమలత్వ,మార్దవత్వాలేకాకవిశిష్టమైన వర్ణ సంగీతాన్ని సృష్టించారు .నీటి రంగుల్లో మాత్రచే కనిపించే పార దర్శక వాష్ పద్ధతిని ,ఆయిల్ పెయింటిం గ్ లో తెచ్చి అబ్బురపరచారు .పేలట్ నైఫ్ కాని , కుంచె కాని వాడకపోవటం ఎస్విగారి మరో ప్రత్యేకత .వీటిబదులు గుడ్డ పీలికలతో రంగులు పట్టిస్తారాయాన .దీనివలన పాలరాతి నునుపుదనం రావటమేకాక మేఘాల తెరలలాంటి వాయు నీయత ప్రత్యక్ష మౌతుంది అన్నారు సంజీవ దేవ్ .‘’భారతీయ దృశ్య కవితా సారాన్ని 20 వశతాబ్దపు నైరూప్య చిత్రాలలో చూపటం పై దృష్టిపెట్టారు .ఇది విలక్షణ కృషి . .ప్రాక్ పశ్చిమాలకు ఒక దృఢమైన సేతువు అయ్యారు రామారావు . ఆయన చిత్రం ‘’వసంత ఋతువు ‘’లో అమెరికాలోని ప్రాణస్పందన ,ఉల్లాసం ,మధుర రసానందం, నైసర్గిక శోభ అన్నీ కూడా ఆధునిక నైరూప్య వాయునీయ వర్ణాలలో ప్రదర్శితమౌతుంది. ‘’ఉషోదయం ‘’చిత్రం లో ఉష్ణ వర్ణాలతో చిత్రింప బడి ,వెచ్చని పశ్చిమ పవనాలతో మృదువర్ణ లయతో తాండవించే చెట్లూ కొండలు పూత పూస్తున్నట్లు ఉంటాయి.
శ్రీ ఎ .కృష్ణా రెడ్డి, శ్రీ ఎస్వి రామారావు లు ఇద్దరే ఇద్దరు తెలుగు చిత్రకారులు ఇతర దేశాలలో స్థిరపడ్డ వారు . .ఇండియాలో ఉండగానే ఎస్వి చిత్రకళ వాస్తవంనుండి కల్పనకు ఎదిగి పాశ్చాత్య దేశాలలో నైరూప్యానికి విస్త రించింది. వర్ణ చిత్రకారు లైన శ్రీ రామారావు వర్ణ వ్యతిరేకతలనూ వర్ణాల ఐక్యతనూ సమతూకంగా చిత్రించారు . ఆయనది అమెరికన్ నైరూప్యాకలకు అనుకరణకాదు’’ప్రాచ్య రీతులున్న నైరూప్య కళ ‘’అన్నారు విశ్లేషకులు. తెలిసిన రూపాన్ని తెలియని రూపాల లో చిత్రి౦చటమే రామారావు గారి కళాసృస్టి’’అన్నారు చిత్రకళలో పండిపోయినశ్రీ సంజీవ దేవ్ .
.శ్రీ రామారావు గారిని ‘’ An important color-based non-figurative artist.అంటారు
’కుండలిని మేలు కొలుపు ,సాగర మధనం, ఎర్ర మట్టిలో నదీ ప్రవాహం, వెన్నెలలో నది ,నల్లడవిలో నీలి నది వంటి చిత్రాలలో రంగులు మహావేగం గా ప్రవహించేట్లు చేశారు .ఆయన చిత్రాలను ‘’పొయేమ్స్ ఇన్ పిగ్ మెంట్స్ అంటే వర్ణ ద్రవ్య కవిత్వం ‘’అంటారు. పంచ భూతాలలో నీరు, గాలి ,అగ్ని అనే మూడింటిని చక్కగా ఉపయోగించుకొన్నారు శ్రీ రామారావు.నీరు ఆవిరై మేఘాలను చేరి కుంభ వృష్టి కి కారణ మౌతుందని ,తానెప్పుడూ తెలుపు రంగును ఉపయో గించ నేలేదని, అదే తన పేపర్ నియంత్రణకు కారణమయిందని నలుపు రంగు ఉపయోగించటమూ చాలా కష్టమే నని, కాని మిగిలినరంగులకు డెప్త్ ను ఇవ్వటానికే వాడతానని, పెర్షియన్ బ్లూ ,క్రి౦సన్ లేక్ రంగులు వాడి సూర్యాస్తమయ సమయం లో బంగారు మేఘాల ను సృష్టిస్తానని వివరించారు. రెండవదైన గాలిని గూర్చి చెబుతూ మనచుట్టూ ఉండి ఉచ్చ్వాస నిశ్వాసాలకు కారణమైన గాలి , అదే ప్రళయ జంఝ గా ,ప్రశాంతమలయానిలం గా ఉండే రీతిని వర్ణిం చానని చెప్పారు మూడవదైన అగ్ని హిందూ పురాణాలకు సంబంధించినదని ,పృద్విని రక్షించే ఎనిమిది మూలకాలలో అతి ముఖ్యమైనదని ,అది శాశ్వతత్వానికి, తాత్కాలికానికి చిహ్నంగా తన చిత్రాలలో జ్వాలలుగా కనిపిస్తుందన్నారు.
భారతీయతకై ఆరాటం
ఇంతగా ప్రపంచ ప్రసిద్ధి పొందినా, తనను భారతీయులు మనస్పూర్తిగా ఆదరించ లేదని భావించి గత కొన్నేళ్లుగా ఢిల్లీ లో ఉంటూ, స్వదేశీయులకోసం 80 చిత్రాలు గీశానని ,మరో 20 పెయి౦టింగ్ లు వేస్తానని ఎస్వి అన్నారు .ఇప్పుడు తన చిత్రాలు భారతీయ స్పిరిట్ ప్రకారం కొత్త రూపాన్ని దాల్చాయని అంటారు .ఆర్ట్ లోని ప్రక్రియలు తెలియని వాళ్ళనూ ఆకర్షించేలా ప్రతిదీ వైవిధ్యంగా రూపొందించారు . ‘’నేచర్స్ ఆబ్ స్ట్రాక్ట్ గ్లోరీ ‘’పేరిట ఢిల్లీ లో దూమిమల్ ఆర్ట్ గాలరీలో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసి ఆకట్టు కొన్నారు . భారతమాజీ రాష్ట్ర పతి, భారత రత్న డా ఎ.పి.జె ‘అబ్దుల్ కలాం గారు ఎస్వి గారి ‘’సోలో ఎక్సిబిషన్ ప్రారంభించారు .ఈసందర్భంగా డా కలాం తమ తదుపరి రచన ముఖ చిత్రం పై శ్రీ ఎస్వి రామారావు గారి పెయింటింగ్ ను ముద్రి౦చుకొంటానని సగర్వంగా తెలియజేశారు.నిరంతర ప్రయోగ శీలి అన్వేషకులు పద్మశ్రీ ఎస్ వి.రామారావు గారి కళ .భారతీయులకు ,భారతీయతకు దగ్గరవ్వాలన్న వారి ఆకాంక్ష నెర వేరు తున్నందుకు అందరం సంతోషం తో అభినందిద్దాం .
గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-16 –ఉయ్యూరు –9989066375
2-405 శివాలయం వీధి –ఉయ్యూరు -5 21165
విశ్వ విఖ్యాత నైరుప్య చిత్ర కళాయశస్వీ పద్మశ్రీ రామారావుకు -2-9-16 న ఉయ్యూరులో ఘన సత్కారం
-నేటి విద్యార్ధులు చదువుతోపాటు కళలపట్ల మక్కువ చూపాలని, నైరుప్యంగా ఎదగాలని విశ్వ విఖ్యాత చిత్ర కళాయశస్వీ పద్మశ్రీ ఎస్వీ రామారావు అన్నారు. గురువారం నాడు సరసభారతి మరియు శ్రీశ్రీనివాస విద్యాసంస్థల సంయుక్త అధ్వర్యంలో నిర్వహించిన సత్కర సభలో రామారావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నాటి భారతీయులైన రవీంద్రనాథ్, హరగోవింద్ ఖురానా , రాధాకృష్ణ, చంద్రశేఖర్లకు నోబుల్ అందినాయని నేటి యువత దానిని అందిపుచ్చుకోవడంలో వెనుకంజలో ఉన్నారని తెలిపారు. విద్యార్ధులు తమ సమయాన్ని గ్రంధలయలల్లో ఎక్కవ సేపు గడిపితే జీవితం తెలుస్తుందని, కానీ యువత ఉద్యోగాలకోసం ఉపయోగపడే విద్యనే అభ్యసిస్తున్నరన్నారు.
సభలో శాసన మండలి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రామారావు లాంటి పెద్దలను చూసి
–
యువత కళల పట్ల అధ్యయనం చేయాలనీ, చదువుతో పాటు విద్యార్ధులకు కళలను విద్యాసంస్థలు ప్రోత్సాహం అందించాలని సూచించారు.
రియో ఒలింపిక్స్ లో రజిత,కా0 స్య పతకాలు సాధించిన సింధు, సాక్షిలను ఆదర్శంగా తీసుకోవాలని, అలాంటి క్రీడలు, కళలు జోలికి నేటి విద్యార్ధులు ఆసక్తి కనబరచడం లేదని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సరసభారతి అధ్యక్షులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రామారావు లాంటి చిత్రకారులు మన కృష్ణాజిల్లా, రాష్ట్రానికి దేశానికి తమ చిత్రలేఖనం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించడం గొప్ప విషయమని అన్నారు. అనతరం పద్మశ్రీ రామరావుని శాసనమండలి సభ్యులు రాజేంద్రప్రసాద్, సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్, శ్రీ శ్రీనివాస విద్యాసంస్థల చైర్మన్ పరుచూరి శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన రావు. ఎం పి టి సి ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాసరనేని మురళి ఘనంగా సత్కరించారు









అమెరికాలో ఉంటూ ఉయ్యూరు ,సరసభారతి పట్ల విశేష అభిమానం కల శ్రీ మైనేని గోపాలకృష్ణగారు నగదు కానుక గా పంపిన 11 ,116 రూపాయలు సరసభారతి అధ్యక్షులు దుర్గాప్రసాద్ పద్మశ్రీ శ్రీ ఎస్వీ రామారావు గారికి సభా ముఖంగా అందజేశారు .




