ముస్లిం మహిళల విజయం-భూమి

ముస్లిం మహిళల విజయం

ముమ్మారు ‘తలాఖ్’ చెప్పడం ద్వారా భర్త భార్యకు విడాకులిచ్చే సంప్రదాయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు చెప్పడం చారిత్రక శుభ పరిణామం. పురుషాధిక్య దుష్ప్రభావగ్రస్తులైన ముస్లిం మహిళలకు విముక్తి కలిగించగల సామాజిక విప్లవం! ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న అనేక ఇతర దేశాల్లో సైతం మత విరుద్ధమైన ఈ ‘ముమ్మారు తలాఖ్’- ట్రిపుల్ తలాఖ్- సంప్రదాయం సర్వమత సమభావ వ్యవస్థ కల మనదేశంలో ఇంతకాలం కొనసాగడం సామాజిక, జాతీయ వైపరీత్యం. ఈ వైపరీత్యాన్ని మంగళవారం నాడు తొలగించడం ద్వారా సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం సభ్యులు సామాజిక సమానత్వాన్ని మరోసారి ధ్రువీకరించారు. ఈ సామాజిక సమానత్వం ఇస్లాం మతస్థులలో స్ర్తి, పురుష వివక్షను దూరం చేయడానికి దోహదం చేయగలదు, సామాజిక న్యాయసాధనకు మార్గం కాగలదు. ధర్మాసన స్థితులైన న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, ఆర్‌ఎఫ్ నారీమన్, యుయు లలిత్ ‘ట్రిపుల్ తలాఖ్’ పద్ధతి తక్షణం రద్దు కావాలని చెప్పిన తీర్పుతో ధర్మాసన అధ్యక్షుడైన ప్రధాన న్యాయమూర్తి జెఎస్ కేహర్, ఎస్ అబ్దుల్ లతీఫ్ కొద్దిగా విభేదించడం దురదృష్టకరం. ఆరునెలల వరకూ యథాతథస్థితి కొనసాగాలని ఈలోగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై సమగ్రమైన చట్టం చేయాలన్నది ‘విభేదించిన’ న్యాయమూర్తుల అభిప్రాయం. కానీ అల్పసంఖ్యాక మతవర్గాలకు రాజ్యాంగం కల్పిస్తున్న ప్రత్యేక అధికారాల దృష్ట్యా ఇన్నాళ్లుగా ప్ర భుత్వాలు ఇలాంటి చ ట్టాలను చేయలేకపోవడం ముస్లిం మహిళలకు శాపంగా మా రిందనడం నిరాకరింపజాలని నిజం. రాజ్యాంగం ని ర్దేశిస్తున్న ‘ఉమ్మడి పౌరస్మృతి’ని ఇంతకా లం రూపొందించలేక పోవడానికి కారణం ప్ర భుత్వ రాజకీయ నిర్వాహకుల ఘోరమైన నిర్లక్ష్యం. ‘ఉమ్మడి పౌర స్మృతి’నే రూపొందించలేని వారు ముస్లిం వ్యక్తిగత, మత సంప్రదాయాలలోని లోపాలను సవరించే సాహసం చేయలేరన్నది బహిరంగ రహస్యం! అందువల్ల న్యాయ ప్రమేయం ద్వారా తప్ప ప్రభుత్వాల చొరవ వల్ల ఇస్లాం మహిళలకు న్యాయం జరగదన్నది ధ్రువపడిన వాస్తవం. దశాబ్దుల తరబడి వేలాది ముస్లిం మహిళలు ఈ ఘోరమైన ‘ట్రిపుల్ తలాఖ్’ అన్యాయానికి బలైపోయారు. ప్రభుత్వాలు వౌన ప్రేక్షకపాత్ర వహించడం తప్ప చేసింది లేదు. మహిళల హక్కుల ఉద్యమ నేతలు, మహిళా సాధికార సాధన సంస్థలు, సామాజిక దురాచార వ్యతిరేక సంఘర్షణలు- వీరందరికీ కూడా ముస్లిం మహిళలకు జరిగిన అన్యాయం గురించి పట్టకపోవడం ‘నకిలీ సర్వమత సమభావాని’కి సాక్ష్యం, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. ఇస్లాం మత వౌలిక సూత్రాలకే విరుద్ధమని పలువురు విద్వాంసులు ప్రచారం చేసిన ‘ట్రిపుల్ తలాఖ్’ స్వతంత్ర భారత్‌లో ఏడు దశాబ్దుల పాటు ఇస్లాం మహిళలను ఏడిపించడం మానవీయతకే కళంకం! ఈ కళంకం ఇప్పుడు గతం, ముగిసిన పీడకల..
‘ట్రిపుల్ తలాఖ్’ ద్వారా ఇస్లాం మతస్థురాలైన మహిళకు ఆమె భర్త విడాకులివ్వడం ఆ మహిళల ప్రాథమిక రాజ్యాంగ అధికారాల- ఫండమెంటల్ రైట్స్-కు భంగకరమన్నది సర్వోన్నత న్యాయ నిర్ణయం. ఈ హక్కులకు డెబ్బయి ఏళ్లుగా భంగం కలగడం ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటైన కఠోర వాస్తవం. స్ర్తి, పురుష సమానత్వం గురించి మహిళల సాధికారత గురించి ఉద్యమకారులు, ఉద్యమకారిణులు చేసిన దశాబ్దుల పోరాటాల ఆర్భాటాల పరిధిలో ఇస్లాం మహిళలు లేరు. సర్వోన్నత న్యాయస్థానం 2015 అక్టోబర్ 16న ఈ ‘ఇస్లాం మత వ్యతిరేక’ ట్రిపుల్ తలాఖ్‌లోని ఔచిత్యం పట్ల అనుమానాలు వ్యక్తం చేసే వరకూ సమాజంలో కదలిక రాలేదు! ‘ట్రిపుల్ తలాఖ్’ పద్ధతిని సమీక్షించడానికై సర్వోన్నత న్యాయస్థానం తనంతట తానుగా- సూయోమోటో- ప్రజాహిత వ్యాజ్యాన్ని నమోదు చేసింది, విచారణ చేపట్టింది. దీని తరువాత మాత్రమే ఉద్యమకారులకు ధైర్యం వచ్చింది, ‘టిపుల్ తలాఖ్’ను వ్యతిరేకించాలన్న ధ్యాస కలిగింది. ‘ట్రిపుల్ తలాఖ్’కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వాదించడం కూడ రాజకీయాల్లో వచ్చిన విప్లవ పరివర్తన- రెవల్యూషనరీ ఛేంజ్-కు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ విధానం మంగళవారం నాటి సుప్రీం కోర్టు తీర్పు వల్ల న్యాయమైనదని, సమంజసమైనదని ధ్రువపడింది. తీర్పు వెలువడిన తర్వాత సుప్రీం కోర్టుకు మాత్రమే కాక, కోర్టులో ‘ట్రిపుల్ తలాఖ్’ను వ్యతిరేకించిన ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ముస్లిం మహిళా సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు చెప్పడం పరివర్తన క్రమంలో వర్తమాన ఘట్టం..
సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చెప్పిన తీర్పు ఇంతకాలం ‘అక్రమ సంతుష్టీకరణ రాజకీయాల’ను నిర్వహించిన అనేక జాతీయ, ప్రాంతీయ రాజకీయ పక్షాలకు కనువిప్పు! షాబానో అనే ముస్లిం మహిళకు విడాకులిచ్చిన ఆమె భర్త ఆమెకు జీవనభృతి చెల్లించాలని 1980వ దశకంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ తీర్పును వమ్ము చేయడానికి అ ప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నాయకత్వంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి ఇస్లాం మతస్థులను అక్రమంగా సంతృప్తి పరిచే రాజకీయాలలో భా గం! ఇలా ‘అక్రమ సంతుష్టీకరణ’కు పా ల్పడిన, పాల్పడుతున్న రాజకీయ వే త్తలు, రాజకీయ పక్షాలు ఇస్లాం మతం జనాభాలో సగమైన మహిళలకు ఘోరమైన అన్యాయం చేశారనడానికి చరిత్ర ప్రత్యక్ష సాక్షి! ‘ట్రిపుల్ తలాఖ్’ ఇన్నాళ్లపాటు కొనసాగడానికి అధికార రాజకీయ పక్షాల అన్యాయం ప్రధాన కారణం. ఈ అన్యాయ విధానాన్ని విడనాడి ‘ట్రిపుల్ తలాఖ్’ను వ్యతిరేకించిన భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అభినందనీయం. తీర్పు చెప్పిన సుప్రీం ధర్మాసనం వందనీయం!
పురుషాధిక్యపు పంజరంలో బందీలుగా అలమటించిన ఇస్లాం మహిళలకు ఈ తీర్పు నైతిక విజయం, సమానత్వదాయకమైన సామాజిక విజయం. ధైర్యంగా అన్యాయాన్ని ఎదిరించగలిగిన, సుప్రీం కోర్టులో వినతిపత్రాలను, న్యాయ యాచికలను దాఖలు చేయగలిగిన ముస్లిం మహిళలు సాధికార పథంలో దారిచూపుతున్న కరదీపికలు. షయారా బానో అనే ముప్పయి ఐదేళ్ల మహిళ ఈ న్యాయ సంఘర్షణలో అగ్రగామి, అన్యాయంగా ‘ట్రిపుల్ తలాఖ్’కు గురైన మరో నలుగురు మహిళలు ఆఫ్రీన్ రెహమాన్, గుల్షన్ ఫర్‌వీన్, ఇస్రాత్ జహా, అతియా సబ్రీ కూడ ఈ దుష్ట సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకెక్కడం మహిళా చైతన్యానికి నిదర్శనం. ‘స్పీడ్‌పోస్ట్’ ద్వారా ‘తలాఖ్.. తలాఖ్.. తలాఖ్’ అని పత్రం పంపడం, దూరవాణి సంభాషణల ద్వారా ముమ్మారు తలాఖ్ చెప్పడం వంటి దుశ్చర్యలకు పాల్పడి భార్యను కడగండ్ల పాలుచేసే ధూర్తులకు సర్వోన్నత న్యాయ నిర్ణయం చెంపపెట్టు! ‘ఉమ్మడి పౌరస్మృతి’ని రూపొందించడం అనివార్యం అన్న దానికి ఇది తొలిమెట్టు..

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.