గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
434 -విషాద లహరి కర్త -కవి చక్రవర్తి ద్విభాష్యం విజయ సారధి (1936
10-3-1936 న శ్రీ భాష్యం నరసింహాచార్య ,గోపమాంబ దంపతులకు శ్రీ విజయ సారధి వరంగల్లు లో జన్మించారు .తల్లి ,అమ్మమ్మ గానం చేసే జయదేవుని అష్టపదులు సంస్కృత శ్లోకాలను వింటూ ఆభాషపై అభి రుచి సంగీతం పై మమకారం పెంచుకొన్నారు .వరంగల్ శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో చదివి ఉత్తీర్ణులై అక్కడే ఉపన్యాసకులుగా చేరి విద్యా బోధనచేశారు .వీరి ముఖ్య శిష్యులు శ్రీ అష్టకాల నరసింహ శర్మ ,డా శ్రీ కె. కోదండ రామాచార్యులు .విద్యార్థిగా ఉన్నప్పుడే ‘’మనోరమ ‘’నవల రాసి తోటి విద్యార్థులకు చదివి వినిపిస్తూ విశ్లేషణ చేసి చెబుతూ బెనారస్ లోని ముకుంద భట్టాచార్య ,మల్లావఝల సుబ్బరామశాస్త్రి కారపాత్ర స్వామి ,పశుపతినాథ శాస్త్రి వేదాల తిరువెంగళా చార్య వంటి సంస్కృత ప్రకాండుల మన్ననలు అందుకొన్న ప్రజ్ఞానిది .కాశీ ,కాశ్మీర్ విద్యా పీఠ పండిత ప్రశంసలూ పొందారు .వాగ్వాదినీ సరస్వతి వీరికి సుప్రసన్నురాలు
1980 లో కలకత్తా సంస్కృత విద్వత్సభలో విజయసారధి గారు ‘’ఆకతి మందాకినీ ,చకతి మందాకినీ-తకతి మందాకినీ మధురేణ పూరేణ -చలతి మందాకినీ ,జలతి మందాకినీ
సలతి మందాకినీ విమలేన సలిలేన’’అంటూ కావ్యగానం చేసి దాతు ప్రయోగవైచిత్రికి భావజాలానికి పండితప్రకాండులను మంత్ర ముగ్ధులను చేసి మందాకినీ నదిసోయగాలను కనుల ముందు నిలబెట్టారు .దీనికి పరవశించి మహా మహోపాధ్యాయ తర్క వాగీశ భట్టా చార్య –
‘’యుగ కర్తా -యుగో ద్ధర్తా -చక్రవర్తీ యుగస్యచ -సరస్వతీ సుతోత్తంసః -జీయాత్ విజయ సారథిహ్ ‘’అని మనః పూర్వకంగా ఆశీర్వదించి విజయ సారధిగారు రాసే ప్రతి రచనలోనూ ఈ ఆశీర్వాద శ్లోకాన్ని ముద్రించమని అనునయ శాసనం చేశారు .సభలోని పండిత వరేణ్యులు కరతాళ ధ్వనులతో ఆ ఇద్దరినీ అభినందించారు .
శ్రీ భాష్యం వారు జ్యోతిష ,వాస్తు అలంకార ,వైదిక మంత్రార్ధ వివరణ లపై గొప్ప గ్రంథాలు రాశారు .రాజకీయ నాయకులపై ‘’విషాద లహరి ‘’రాశారు .అందులో
‘’సాధూన్ దీన దరిద్ర భారత జవాన్ మాయావినో నాయకాః -సమ్మే ళేషు మృషాదయోక్తి కుశలాస్తాన్ పఞ్చయిత్వా పరం ‘’
‘’సంచిస్వంతి లోక రాజ్య పరిషత్ స్థానాన్య నూనాని భోహ్ -కష్టం ప్రాప్త మనన్యవార్య మధునా శంభాలాయైనాన్ ప్రభో ‘’
భారత్ సైనికుల త్యాగనిరతిని -’’యస్య శక్తి ర్మహా కాళరాత్రి -విభీత భారత పాలన దీక్షితౌ బభూవ
పరమ భారత స్వాతంత్య్ర సమరవీర -వివిధ సైనిక నికురంబ మానతోస్మి ‘’అని శ్లోకం తో వారి త్యాగానికి జేజేలు పలికారు
‘’రూప సూక్తం ‘’లో రూపాయ మహిమ వర్ణిస్తూ -’’అక్షరాన జ్నోపి ,సేవ్యాయతే కోపి -అక్షరాభి జ్నోపి సేవకీయతి కోపి ‘’అని చమత్కరించారు -అంటే అక్షరజ్ఞానం లేకపోయినా డబ్బూ ,పదవీ ఉంటె మనిషి పూజింపబడుతున్నాడు /అక్షరజ్ఞాని ఉద్యోగం లో సేవాకా వృత్తి చేస్తున్నాడని వ్యంగ్యం .
భగద్రామానుజా చార్యుల సుందర రూపం మధురమానసం ,మాట వైదగ్ధ్యాలను వర్ణిస్తూ –
‘’జయతి భువన దీప సంహృతార్తాను తాపాహ్ -నియమ ధృత వికారో నిశ్చి ఠామ్నాయ సారః –
ప్రియా వచన వితానః ప్రీత సూరి ప్రతాపః -స్మయహర యతి వర్యస్వామి యతి రామానుజార్యహః ‘’అని శ్లోకం చెప్పారు . భావ జాలం తరుముకొస్తూ ఉంటె కొన్ని వేల శ్లోకాలు రాసి సరస్వతీ కంఠాభరణం చేశారు శ్రీ భాష్యం విజయ సారధిగారు .
మనోరమ తోపాటు సుశీల నవల ,దంభ యుగం ప్రహసనం ,ఆర్ష భారతి ఏకాంకిక ,అమర సందేశహ్ నాటకం ,రామ ,రామానుజ ,రఘునాధ దేశిక ఉదాహరణ కావ్యాలు ,11 సుప్రభాతాలు ,ప్రహేళికలు వంటివి ఎన్నో రాశారు .అముద్రిత గ్రంధాలూ చాలా నే ఉన్నాయి .
శ్రీ బొమ్మ వెంకటేశ్వర్ ఇచ్చిన స్థలం లో ‘’సర్వ వైదిక సంస్థానం ‘’అనే సంస్థను స్థాపించి యజ్ఞ వరాహ స్వామి ,రత్నగర్భ గణపతి ,రమాసహిత సత్యనారాయణ స్వామి,అనంత నాగేంద్ర స్వామి ,వసుధా లక్ష్మి నవ దుర్గ ,వాగ్వాదిని సరస్వతి ,అభయ ఆంజనేయస్వామి లతో ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించి ‘’సంగచ్చ్ధధ్వగమ్ ,సంవద ధ్వగమ్ ‘’అంటూ సర్వమత సామరస్యాన్ని ప్రబోధించారు శ్రీ భాష్యంవారు . ఈ పుణ్య ప్రాంగణం లో శ్రీరామాయణ మహా క్రతువు ,చతుర్వేద హవనం ,ప్రజాపత్య విజయం ,సారస్వత ,రక్షోఘ్న వంటి ఇష్టులు ,క్రతువులు ఎన్నెన్నో నిర్వహించి ఆస్తిక జనములకు మార్గ దర్శనం చేస్తున్నారు
వీరి సాహిత్య ధార్మిక సేవకు సాహిత్య అకాడెమీ ,తెలుగు విశ్వ విద్యాలయం బిర్లా ఫౌండేషన్ వంటి ప్రసిద్ధ సంస్థలు పురస్కారాలు అందజేసి సన్మానించాయి .తమ విద్వత్తుకు నీరాజనంగా ‘’కవి చక్రవర్తి ‘’,మహాకవి ,వాచస్పతి ,వైదిక కర్మానుష్టాపనా చార్య మొదలైన బిరుదులూ అందుకున్నారు . ఈ ఏడాది ఆగస్టు 15 న భారత స్వాతంత్ర దినోత్సవం నాడు సరస్వతీ సమార్చనా తత్పరులు జ్ఞా వయో వృద్ధులు శ్రీ భాష్యం విజయ సారధి మాన్య మహోదయులను తెలంగాణా ప్రభుత్వం ఘనంగా సత్కరించి గౌరవించింది .
‘’కవి మూర్ధన్యుడు పండిత ప్రముఖుడై కావ్యాశు సంక్రీడ ,వాగ్భవ కూలంకష గీష్పతి ప్రతిభుడున్ గైర్వాణ వాణీ ప్రభా –
ప్రవరుండవ్యయ భావుడున్ విజయ సారధ్యాహ్వయు డున్నేడు తా-స్టవ నీయు0 డయె ముఖ్య మంత్రి కర కంజ స్నాతుడై వెల్గెడున్ ‘’(అష్టకాల నరసింహ శర్మ )
సశేషం
ఆధారం -20 17 సెప్టెంబర్ దర్శనం -మాసపత్రికలోడా. శ్రీ కె .కోదండ రామాచార్యుల ‘’సంస్కృత విజయ కేతనం శ్రీ భాష్యం ‘’వ్యాసం
వినాయక చవితి శుభా కాంక్షలతో
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -24-8-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—

