—
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
443-నడయాడే సంస్కృత సర్వస్వము -పండిట్ ముఫ్తి మొహమ్మద్ సర్వార్ ఫరూకీ (1968)
వేదాలనూ ,ఖురాన్ నూ ,హిందూ మతాచార్యుల సిద్ధాంతాలను ,మహమ్మద్ ప్రవక్త సూక్తులను అనర్గళంగా ,సభా రంజకంగా చెప్పగలిగే సమర్ధుడు ,సంస్కృత పండితుడు ,లక్నో లోని నద్వతుల్ ఉలేమా లేక నద్వా మదరసా పండితుడు .1968 లో జన్మించాడు . వారణాసి లోని ‘’విశ్వ సంస్కృత ప్రతిష్టాన్ ‘’ జనరల్ సెక్రెటరీ .మహా రాష్ట్ర ప్రభుత్వ సంస్కృత ష్టాండింగ్ కమిటీ సభ్యుడు కూడా .భారత దేశం లో ముస్లిం సంస్కృత పండితులలో దస్తగిరి ,ఫరూకీ ,బిరాజ్ దార్ వంటి ఉద్దండులు వ్రేళ్లమీద లెక్కింప దగిన సంఖ్యలో మాత్రమే ఉన్నారు .
ఫత్వా లలో ప్రసిద్ధుడైన ఫరూకీ సంపూర్ణానంద్ యుని వర్సిటీ నుండి సంస్కృతం లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు .అన్ని భాషలూ నేర్వాలన్న ఖురాన్ వాక్యాన్ని ఆయన తరచూ చెబుతాడు . ఈ మధ్యనే ఘాజీపూర్ లో అతిపెద్ద హిందూ సమ్మేళనం లో ఫరూకీ ప్రసంగించి ప్రేరణ కలిగించాడు .మొదట్లో శ్రోతలు ‘’ఈయన్ని పిలిచారేమిటి ?ఏమి మాట్లాడగలడు ?’’అనుకొన్నారు కానీ ఉపన్యాసం అయ్యాక ‘’అసలైన సమర్ధుడైన వక్త వచ్చి మనకు మార్గ దర్శనం చేశాడు ‘’అని ఎంతో సంతృప్తి చెందారు .ఖురాన్ పైనా ,మరెన్నో విషయాలపైనా ఫరూకీ చాలా పుస్తకాలు హిందీలో రాశాడు . ఫరూకీ ని ‘’నడయాడే సంస్కృత సర్వస్వము ‘’అని గౌరవిస్తారు . ”నమాజ్ అంటే నమోనమః ”అని గొప్ప అర్ధం చెప్పాడు .
ఫరూకీ లాగానే మిరాజ్ దార్ అనే ఆయననూ ‘’నడిచే సంస్కృత సర్వస్వము ‘’అంటారు .ఈయన మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందినవాడు .1934 లో పుట్టాడు . పగటిపూట పొలాలలో పని చేసి రాత్రివేళ రాత్రిపాఠశాలలో చదువుకున్నాడు .తన చుట్టూ ఉన్న పిల్లలు సంస్కృత మంత్రాలు వల్లే వేస్తుంటే ముచ్చటపడి శ్రర్ధగా విని కంఠస్తం చేసేవాడు .బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే పరిమితమైన ఆ పాఠశాల ఉపాధ్యాయుడు మిరాజ్ కోసం రూల్స్ ను ప్రక్కకు పెట్టి చేర్పించి నేర్పించాడని గర్వంగా కృతఙ్ఞతటా తో చెప్పుకొన్నాడు మిరాజ్ .హిందువులు ఆయనతో వివాహాది శుభకార్యాలు ,పూజా పునస్కారాలు అంత్యక్రియలు చేయించమని కోరుతారు కానీ అవి పూర్తిగా మత సంబంధమైనవి కనుక తాను అందులో వేలుపెట్టనని వినయంగా తిరస్కరిస్తాడు . కానీ ఆసక్తి ఉన్నవారికి ఆ విధానాలు నేర్పిస్తాడు . 75 ఏళ్ళ మిరాజ్ దార్ ఇంట్లో బీరువాలన్నీ వేద ఉపనిషత్తులు శాస్త్ర ఇతిహాస పురాణ గ్రంధాలు ,ఖురాన్ దానిపై వ్యాఖ్యానాలతో నిండి ఉంటాయి .
ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ సంస్కృత శాఖ అధ్యక్షుడు రామనాధ్ ఝా ‘’భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక చాలామంది ముస్లిం నాయకులు, పెద్దలు సంస్కృతం అధికార భాషగా ఉండాలని సమర్ధించారని ,కానీ హిందీ గెలిచిందని తెలియ జేశాడు .ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుండి 20 మంది సంస్కృతం లో పి హెచ్ డి ,12 మంది ఏం ఫీల్ పొందారు అని దాని సంస్కృత హెడ్ డా. ఖలీద్ బిన్ యూసఫ్అన్నాడు .మొహమ్మద్ ఖాన్ దురాని భారత దేశం లో సంస్కృతం లో మొట్టమొదట డాక్టరేట్ పొందిన ముస్లిం సంస్కృత విద్యావేత్త .
ఉత్తర ప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ ముస్లిం సంస్కృత విద్యావేత్త ఆశబ్ ఆలీ వేదాలను,రామాయణ ,భారతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇప్పుడు వేదాలను ఖురాన్ ను తులనాత్మకం గా పరిశోధిస్తున్నాడు .ఇస్లా0 కు వేదం హిందూమతానికి మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉంది .రెండిటిలో ఏకేశ్వరోపాసనే ఉన్నదని ఇస్లా0 లో లాగానే వేదాలలో కూడా పునర్జన్మ లేదని ఇలాంటి భావాలే తనను బాగా ఆకర్షించాయి ‘’అన్నాడు 61 ఏళ్ళ గోరఖ్ పూర్ యూనివర్సిటీ సంస్కృత శాఖాధ్యక్షుడు ఆశబ్ ఆలీ .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -30-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

