మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -371

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -371

· 371-మల్లయోధుడు ,టైగర ప్రొడక్షన్ అధినేత ,రేచుక్క పగటి చుక్క లో సినీ ఎంట్రీ ,కిమ్మీర ఘటోత్కచ పాత్రధారి ,అసాధ్యుడు ఆకహందుడు సినీ నిర్మాత –నెల్లూరు కాంతారావు

· నెల్లూరు కాంతారావు చలన చిత్ర నటుడు, వస్తాడు, సినిమా నిర్మాత. అనేక సినిమాలలో ప్రతినాయక పాత్ర పోషించాడు. టైగర్ ప్రొడక్షన్స్ అనే చిత్రనిర్మాణ సంస్థను ఎస్.హెచ్.హుసేన్ అనే వ్యక్తితో కలిసి స్థాపించి కొన్ని చిత్రాలను నిర్మించాడు. ఇతనికి నెల్లూరులో కనకమహల్ అనే సినిమా ప్రదర్శనశాల ఉండేది.

జీవిత విశేషాలు
ఇతడు నెల్లూరులో 1931, జనవరి 24న జన్మించాడు. నెల్లూరు వి.ఆర్.కాలేజిలో ఇంటర్‌మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇతనికి ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. చిన్నతనం నుండే శరీరవ్యాయామం చేస్తూ, దేహధారుఢ్యాన్ని పెంచుకున్నాడు. 1948 నుండి 1956 వరకు ఆంధ్ర, ఉమ్మడి మద్రాసు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో కుస్తీ పోటీల్లో పాల్గొంటూ ఎందరో వస్తాదులను ఓడించి అనేక బిరుదులు, బహుమతులు, ఛాంపియన్‌షిప్‌లు సంపాదించాడు. ‘ఆంధ్రా టైగర్’ అనే బిరుదును పొందాడు.1952లో ఇండియా ఒలింపిక్ గేమ్స్‌కు ఉమ్మడి మద్రాసురాష్ట్ర ప్రతినిధిగా, 1956లో పోలాండ్ దేశం వార్సాలో జరిగిన వరల్డ్ యూత్ ఫెస్టివల్‌కు భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నాడు[1]. 1955 ప్రాంతాల్లో నెల్లూరుకు మల్లయుద్ధ యోధులను పిలిపించి నెల్లూరు వి .ఆర్క.కళాశాల మైదానంలో పోటీలు నిర్వహించాడు. కింగ్ కాంగ్ , దారాసింగ్ వంటిప్రసిద్దుల కుస్తీపోటీలు నెల్లూరివారికి చూచే అవకాశం కలిగింది. కొన్ని కుస్తీపోటీలలో కాంతారావు కూడా పాల్గొన్నాడు. ఆత్మీయులు ‘కాంతం’ అనే పిలిచేవారు. నెల్లూరులో ఉన్న కనకమహల్ థియేటర్‌లో ఇతడు, ఉమ్మడి కుటుంబంలో ఇతరులు కూడా భాగస్వాములు . కనకమహల్ వెనక భాగంలో వ్యాయామశాల, కుస్తిగరిడి ఎర్పాటుచేసి స్థానికులకు వ్యాయామం చేసుకొనే వీలు కల్పించాడు. 1959లో రేచుక్క-పగటిచుక్క సినిమాలో వస్తాదు పాత్ర ద్వారా చిత్రసీమలో ప్రవేశించి నటుడిగా, నిర్మాతగా మారాడు. టైగర్ ఫిలింస్ బ్యానరు మీదనే సినిమాలు తీసాడు. ఇతణ్ణి సినిమాల్లో ప్రవేశపెట్టింది ఎన్.టి,ఆర్.కు సంబంధిచిన నిర్మాణసంస్థ స్వస్తిశ్రీ ఫిలిమ్స్. పరిశ్రమకు వచ్చిన కొత్తలోనే ఇతడు ఎందరికో స్నేహపాత్రుడైనాడు. నెల్లూరు కాంతారావు తోకలిసి హుస్సేన్ అనే మరొక వ్యక్తి టైగర్ ఫిలింస్.లో భాగ స్వామిగా ఉండేవాడు. కొన్ని హిందీ సినిమాలలో కూడా కాంతారావు నటించాడు. అంతగా అనుభవం లేకున్నా కేవలం తన మంచితనంతోనే నిర్మాతగా మారి అసాధ్యుడు, అఖండుడు లాంటి సినిమాలను నిర్మించాడు.

కాంతారావు నెల్లూరు వామపక్ష రాజకీయాలకు అండదండగా ఉన్నాడు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలినపుడు మార్క్సిస్టు కమ్యూనిస్టుపార్టీవైపు వెళ్ళాడు. ఇతడు 1970, అక్టోబరు 8వ తేదీ నూజివీడులో ఆసుపత్రిలో మరణించాడు[2].

చిత్రరంగం
నటుడిగా

  1. బొబ్బిలి యుద్ధం (1964) – మల్లయోధుడు
  2. అంతస్తులు (1965)
  3. జమీందార్ (1965) – మూర్తి
  4. జ్వాలాద్వీప రహస్యం (1965)
  5. నర్తనశాల (1965) – మల్లయోధుడు
  6. పాండవ వనవాసం (1965) – కిమీరుడు
  7. వీరాభిమన్యు (1965) – ఘటోత్కచుడు
  8. గూఢచారి 116 (1966)
  9. అసాధ్యుడు (1967)
  10. ఇద్దరు మొనగాళ్లు (1967)
  11. కంచుకోట (1967)
  12. నిలువు దోపిడి (1968)
  13. నేనంటే నేనే (1968)
  14. వింత కాపురం (1968) – పులి
  15. ప్రేమ మనసులు (1969)
  16. అఖండుడు (1970)
  17. అగ్నిపరీక్ష (1970)
  18. రౌడీరాణి (1970)
  19. అల్లుడే మేనల్లుడు (1970)
  20. అందరికీ మొనగాడు (1971)
  21. భలేపాప (1971)

నిర్మాతగా

  1. సర్వర్ సుందరం (1966)
  2. నువ్వే (1967)
  3. అసాధ్యుడు (1967)
  4. అఖండుడు (1970)

372-కవి ,పఠాభిపంచాంగం ఫిడేలు రాగాలు డజన్ ఫేం ,తెలుగు,కన్నడ సినీ నిర్మాత .సంస్కార దర్శకుడు, స్వర్ణకమల విజేత –పఠాభి
తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి ప్రముఖ తెలుగు కవి, తెలుగు, కన్నడ సినిమా నిర్మాత, దర్శకుడు. పఠాభిగా అతను ప్రసిద్ధుడు. ఫిడేలు రాగాల డజన్‌, పఠాభి పన్‌చాంగం అనేవి అతను ప్రసిద్ధ రచనలు. అతను తెలుగులో పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, భాగ్యచక్రం సినిమాలు నిర్మించాడు. కన్నడ సినిమా రంగానికి తొలి స్వర్ణ కమలం సాధించిపెట్టిన సంస్కార చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు. చండ మారుత, శృంగార మాస, దేవర కాడు అనే కన్నడ సినిమాలను నిర్మించాడు. అతను బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యం, సినిమాలేగాక రాజకీయ, సామాజిక రంగాల్లో కూడా కృషి చేసాడు.
జీవిత విశేషాలు
పఠాభి 1919 ఫిబ్రవరి 19 న నెల్లూరులో జన్మించాడు. తండ్రి పేరు రామిరెడ్డి. భూస్వామి. మహాత్మా గాంధీ వారి ఇంటికి వచ్చినపుడు, అతను స్ఫూర్తితో అంతా స్వాతంత్ర్య సమరంలోకి దూకారు. రవీంద్రనాధ టాగూరు స్ఫూర్తితో పఠాభి శాంతినికేతన్‌కు వెళ్ళి చదువుకున్నాడు. పట్టభద్రుడయ్యాక కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చదివాడు. 1938లో కలకత్తా నుండి తిరిగివచ్చి కొన్నాళ్ళు గూడూరులో కుటుంబ వ్యాపారమైన అభ్రకం ఎగుమతి వ్యాపారం చేసాడు. తరువాత అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో గణితం చదివాడు. అమెరికా వెళ్లేముందే ఫిడేలు రాగాల డజన్‌ రచించాడు. తెలుగు ఆధునిక కవిత్వంలో ఇది కొత్త పుంతలు తొక్కింది. ఇప్పటికీ దానికి ఆదరణ ఉండడం గమనార్హం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యంలో చేరాలని అమెరికా బలవంతపెట్టింది. బ్రిటిషువాళ్లు భారతీయుల్ని జైళ్లలో నెట్టినందుకు నిరసనగా సైన్యంలో చేరేందుకు నిరాకరించారు. సాహసోపేత యాత్రతో అమెరికా వదిలి దక్షిణ అమెరికా, ఆఫ్రికాల మీదుగా నౌకలో భారత్‌ చేరుకున్నాడు.

దేశంలో అడుగుపెట్టాక 1947లో స్నేహలతా పావెల్‌ అనే మహిళను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆమె నటి. సామాజిక కార్యకర్త కూడా. 1925 హేడెన్లో జన్మించిన స్నేహలతా పావెల్ పూర్తిపేరు స్నేహలతా జాయిస్ పాట్రిషియా పావెల్. తల్లి లీలావతీ ఘోష్ అనే బెంగాలీ మహిళ, తండ్రి జేమ్స్ ఎబనైజర్ తంగరాజ్ పావెల్ అనే తమిళుడు. ఆమె కోసం అపారమైన ఐశ్వర్యాన్ని సైతం వదులుకున్నాడు. దంపతులిద్దరూ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్నారు. పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్ వ్యవస్థాపక సభ్యుల్లో అతనుొకడు. సోషలిస్టు పార్టీలో పనిచేశాడు. వీరికి ఇద్దరు సంతానము. కుమారుడు కోణార్క్ రెడ్డి ప్రముఖ ఫ్లెమెంకో గిటార్ వాద్యకారుడు. కూతురు నందనారెడ్డి కార్మిక న్యాయవాది, సామాజిక సేవా కార్యకర్త. 1947లో మదరాసులో ఫోకస్ అనే ఆంగ్ల వారపత్రిక నెలకొల్పి 36 వారాలు వెలువరించాక నిలిచిపోయింది. దీనికి స్నేహలత ప్రచురణకర్తగా వ్యవహరించగా, టి.పి.ఉన్నికృష్ణన్ సంపాదక బాధ్యతలు నిర్వర్తించాడు.

కె.వి.రెడ్డితో కలిసి జయంతి పిక్చర్స్‌ను స్థాపించి తెలుగు చిత్రాలు తీశారు. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అవార్డు దక్కించుకుంది. 1971లో సంస్కార చిత్రం రాష్ట్రపతి నుంచి స్వర్ణకమలం అందుకుంది. ఈ సినిమాలో అతను భార్య స్నేహలత ఒక ప్రధాన పాత్ర ధరించింది. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం అనుభవించి, అనారోగ్యంతో స్నేహలత 1977లో మరణించింది.

87 ఏళ్ళ వయసులో 2006 మే 6న పఠాభి బెంగుళూరులో మరణించాడు.

పఠాభి గురించి
· పఠాభి పంచాంగంలోని పసిడి పలుకుల విటమిన్‌-బి గుళికలను రోజుకొకటి చొప్పున సేవిస్తే తెలుగువాడి మనస్సుకి ఆరోగ్యము, ఉల్లాసము సిద్ధిస్తాయని నేను గ్యారంటీగా చెప్పగలను. ఏ సిద్ధ మకరధ్వజానికి, వసంత కుసుమాకరానికీ లేని పునరుజ్జీవన శక్తి ఈ మాత్రలకుంది. – అని మహాకవి శ్రీశ్రీ అతనుకు కితాబిచ్చాడు.

· భావ కవిత్వం మీద పనిగట్టుకుని దండయాత్ర చేసినవాడు పఠాభి. ఫిడేలు రాగాల డజన్ భావకవిత్వ హేళన ప్రతిభావంతంగా చేసిన కావ్యం. శుక్లపక్షంలా జడ దృక్పథంతో భావకవిత్వాన్ని హేళన చేసిన కావ్యం కాదిది. భావకవిత్వం వల్ల ఏర్పడిన జడత్వాన్ని తొలగించే దృక్పథంతో చేసిన ప్రాణవంతమైన హేళన ఇది. – వెల్చేరు వారాయణరావు [1]

· 1930-40ల మధ్య భావ కవిత్వం మీద తిరుగుబాటు చేసి క్రొత్త ప్రయోగాలు చేసిన కవులు … భావ ప్రధానంగా తిరుగుబాటు చేసినవారు శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు. ఛందస్సు ప్రధానంగా తిరుగుబాటు చేసినవారు శిష్ట్లా, పఠాభి. – రావి రంగారావు[2]

· 2000 సంవత్సరానికి అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి అవార్డును పఠాబికి ఇచ్చారు.

· తెలుగులో ముద్రింపబడ్డ తొలి తెలుగు వచనకవితల సంపుటి “ఫిడేలు రాగాల డజన్”

· 1973లో నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయం పఠాభి ఫిడేలు రాగాల డజన్, కయిత నా దయిత పుస్తకాలను పునర్ముద్రణ చేసింది.

· మనసు ఫౌండేషన్, (బెంగుళూరు) పఠాభి శతజయంతి సందర్భంగా, 2019 ఫిబ్రవరి 19న పఠాభి లభ్య సమగ్ర రచనల సంపుటాన్నినెల్లూరులో జరిగిన శతజయంతి సభలో విడుదల చేసింది. ఈ సంపుటానికి డాక్టర్ ఆర్.వి.సుందరం, డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, పారా అశోక్ సంపాదకులు.

రచనలు
· ఫిడేలు రాగాల డజన్

· కయిత‌ నా దయిత

· పఠాభి పన్‌చాంగం

ఉదాహరణగా కొన్ని కవితలు

పఠాభి కథలు, వ్యాసాలు, ఇంగ్లీషు కవితలు, జాబులు,

గణిత సమస్యలను సాధించేందుకు చేసిన కృషి,

తదితరాలు పఠాభి లభ్య సమగ్ర రచనల సంపుటంలో

చేర్చబడినవి.

నా యీ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో
పద్యాల నడుముల్ విరగ దంతాను
చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని
చాల దండిస్తాను…
అనుసరిస్తాను నవీన పంథా, కానీ
భావకవిన్ మాత్రము కాను నే
నహంభావకవిని.

మహానగరము మీద మబ్బుగమ్మి
గర్జిస్తున్నది
దేవుని ఏరోప్లేనుల్ భువికి దిగుచుననటుల

క్రాస్వర్డు పజిల్ లాగున్న
నీ కన్నులను సాల్వుజేసే మహాభాగ్యం
ఏ మానవునిదోగదా!

వాకు విచిత్రంబగు భావాలు కలవు
నా కన్నులందున టెలిస్కోపులు
మయిక్రాస్కోపులున్నవి

సినిమాలు
· సంస్కార (1970)

· చండమారుత (1977)

· నిమజ్జనం (1979)

· శృంగార మాస (1984)

· దేవర కాడు (1993)

· పెళ్లినాటి ప్రమాణాలు

· శ్రీకృష్ణార్జున యుద్ధం

· భాగ్యచక్రం

సశేషం
శ్రీ హనుమద్వ్రతం శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-5-12-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.