శ్రీ లక్ష్మీ నారాయణ శతకం

శ్రీ లక్ష్మీ నారాయణ శతకం

 కృష్ణా జిల్లా నందిగామ తాలూకా వత్సవాయి దగ్గర దబ్బాకు పల్లి గ్రామం లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిపై ,ఆ గ్రామ కాపురస్తుడు ‘’శ్రీ లక్ష్మీ నారాయణ చరణారవింద మరంద పానే౦ది౦దిరాయ మాన మానసుండు శ్రీ సందడి నాగయాభి ధానన భాక్తాగ్రేసరుని చే రచించబడిన శ్రీ లక్ష్మీ నారాయణ శతకం ను ,ఆ గ్రామ కాపురస్తులు శ్రీ సందడి శ్రీరామదాసు గారి సంపాదకత్వం లో 1938లో విజయవాడ  ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షర శాలలో ముద్రింప బడింది .వెల తెలుప బడ లేదు .శతకానికి ముందుమాట రాసిన రామదాసు గారు –తన తండ్రిగారు శ్రీనాగదాస దేశికులు  ఈ శతకాన్ని బాల్యం లోనే సీస పద్యాలుగా 1886లోనే రచించి ముద్రించారని ,,కానీ దాని ప్రతులు అలభ్యంగా ఉన్నందున ద్వితీయ ముద్రణ కోసం ప్రయత్నిస్తుంటే అందులో 8పద్యాలు పూర్తిగా శిదిలమైనట్లు గుర్తించి తనకు తెలిసిన మిత్రులు శిష్యులు ,శతక పాఠకులను విచారించగా ,వారెవ్వరికీ ఈ శిధిలపద్యాలు జ్ఞప్తిలో లేనందున ,వేరెవరితోనైనా రాయించే ప్రయత్నం చేయగా ద్వితీయ ముద్రణకు తోడ్పడిన శ్రీమతి వినగంటి లక్ష్మా౦బ గారు త్వర పెట్టటం వలన ఆప్రయత్నం విరమించి ఉన్న పద్యాలతోనే శతకాన్ని పునర్ముద్రించినట్లు తెలియజేశారు .శతకం మకుటం –‘’లక్ష్మీ నారాయణాబ్జాక్ష లలిత వక్ష ‘’.

అన్త్యప్రాసాష్టకం తో మొదటి సీసపద్యం రాశారుకవి –‘’శ్రీకర దివ్య లక్ష్మీ వక్ష మురశిక్ష –దానవ గర్వ విదార దక్ష –మౌని రాడ్హృదయ దుర్మలమోక్ష నిటలాక్ష –గణన సద్గుణ సుధీ కల్ప వృక్ష

యధిక కిల్బిష గజహర్యక్ష నిరపేక్ష –సాత్విక భక్తపోషణ సుదీక్ష –యమర వందిత త్రిభువనాధ్యక్ష కనకాక్ష –మర్దన సర్ధర్మ మనుజ పక్ష

నుతకర యక్ష బాలిశ తతి పరోక్ష –యోగి హృత్ప్రేక్ష  విదళితయుగ్ర కక్ష

నతజన సురక్ష ఘన కరుణా కటాక్ష –లక్ష్మీ నారాయణాబ్జాక్ష లలిత వక్ష ‘’.

  తర్వాత స్తోమ భీమ దామకామ సీమ లలామ ,పరంధామ ,భూమ రామ లతో చక్కని పద్యం అల్లారు .తర్వాత పాత్ర గాత్ర చారిత్ర మొదలైన పదాలతో స్వామికి కీర్తించారు .ఎనిమిదవ పద్యంలో గానవినోద సంగర రిపుమద –మహిత లోక విలాస మందహాస ‘’అంటూ ప్రారంభించి –‘’అతుల రత్నకిరీట భణిత నిశాట-వందిత విధాత కవిజన పారిజాత –నత జన సురక్ష ఘన కరుణా కటాక్ష ‘’అని ముగించారు .ఆతర్వాత అంత్య ద్విప్రాస సీసం కరిగించి పోతపోశారు .పిమ్మట నామ స్తోత్రత్రయం గా ‘’వామనాదోక్షజ,వైకుంఠ మాధవ కేశవ-కేశవాచ్యుత హృషీకేశ శౌరి ‘’అని ప్రారంభించి ‘’విశ్వమూర్తి మహామూర్తి వినుతకీర్తి –దీప్తమూర్తి రమూర్తిమాన్  దివ్యమూర్తి –నతజన సురక్ష ఘన కరుణా కటాక్ష ‘’అని పూర్తీ చేశారు .విష్ణు సహస్ర నామాలను   పద్యాలలో పొందు పరచారు .ఆద్యంత ప్రాసిక సీసం కూర్చారు

   పునః పునరుక్తి నామ స్తోత్రత్రయంగా –‘’పరిపూర్ణ పరమేశ ,పరమ పరంధామ –పరమాత్మ మాధవ పరమ పురుష —‘’ఆది మధ్యా౦త శూన్య సర్వాంతరాత్మ –నతజన సురక్ష ఘన కరునాకటాక్ష ‘’రాశారు ఆతర్వాత దశావ తార దశకం రాశారు .ఆతర్వాత ప్రార్ధనా అష్టదశపద్యాలు కూర్చారు .అన్నిట్లోనూ శ్రీహరినామాలు మారుమోగించారు .నామ ప్రభావ ద్వయంగా రెండు పద్యాలు రచించారు .దృష్టా౦ తైక వింశతిలో –‘’తల్లిదండ్రులు పుత్రు దందించ  దలచిన పరులు వలదని అడ్డగించరాదు’’అని నీతులు బోధించి, మట్టిగణపతిని పూజించిన గాణాపత్యులకు ద్రవిణం కలిగిందని ,వీరులను గొలిచిన పేద తురకలకు ధన సమృద్ధి కలిగిందని ,శాంభవిని కొలిచే శాక్తేయులకు భోగభాగ్యాలు కలిగాయని ,రాతిలింగాన్ని చేతిలో పట్టుకొని పూజించే శైవులు శాశ్వతంగా ఐశ్వర్య వంతులయ్యారనీ ‘’ఎన్నివిధలుగా నిన్ను కొలిచే భక్తులే కదయ్యా దరిద్రంలో మగ్గుతున్నారు ‘’అని ఒక చురక అంటించారు కవి .మరోపద్యంలో సుగుణ విహీనుడైన విద్వాంసుని కంటే ‘’నిను భజించేడు బాలిశ జనుడు మేలు ‘’అని ధైర్యం చెప్పారు .

 తర్వాత చెప్పిన ‘’వైరాగ్య త్రయో దశ ‘’పద్యాలలో –సంసారాన్ని నమ్మి సంతోషిద్దాం అంటే భార్య పిల్లలు కలిసిరారు ,డబ్బు సంపాదిద్దామంటే పూర్వజన్మ సుకకృతంకావాలి .శరీరం చూసి పొంగిపోదామంటే పుట్టేడురోగాలతో కునారిల్లి పోతున్నాను .ఎక్కడ చూసినా సుఖం లవ లేశం కూడా లేదు నారాయణ ప్రభో నువ్వే అన్నిటికీ దిక్కు అని దిక్కులు పిక్కటిల్లెట్లు మొరపెట్టుకొన్నారు .బాల్యంలో ఆటలపై లౌల్యం యవ్వనం లో మన్మధ బాణాలతో సతమతం ,ముసలితనం లో చీకూ చింత తో సరిపోయింది ‘’స్థిర చిత్తం తో ఒక్క నిమిషమైనా నీస్మరణ చేయలేకపోయాను ఇప్పుడు అన్నీ వదిలి నిన్నే శరణుకోర్తున్నాను. కాపాడు నృసింహా .

 ‘’నువ్వూ నేనూ వేరు అనే భేదాన్ని వదిలి ‘’సమస్త కళేబరాలలో ఉన్నది ఒకే పరమాత్మ ‘’అని గుర్తించాలి .నిన్ను సేవిస్తూ నువ్వే నేను అనే భావం పొందాలి

image.png
image.png

 99 వ పద్యంలో భక్తాగ్రగాన్యులైన ప్రహ్లాద నారద పరాశర భీష్మ ,గుహ విభీషణాదులను కీర్తించారు .102వ పద్యంలో తారణ నామ సంవత్సరం మార్గశిర శుద్ధ తదియనాడు శతకాన్ని పూర్తీ చేశానని ,లక్ష్మీ నారాయణస్వామికి అ౦కిత మిచ్చానని చెప్పారు కవి ..

 సందడి నాగదాస కవి గొప్ప హరి భక్తులు .ప్రతిపద్యంలోనూ భక్తీ ప్రవాహం పొర్లి పొరలింది .పద్యాలు మహావేగంగా పరిగెత్తాయి. సర్వ వేదాంత రహస్యాలు చొప్పించారు .నీతులు బోధించారు .సర్వమత సహనం పాటించారు .శైలి అమోఘం .ద్రాక్షా పాకం తో శతకం మనల్ని భక్తి,ప్రపత్తులతో వోలలాడిస్తుంది .

 సుమారు 136 ఏళ్ళ క్రిందటి భక్తి శతకం .మేలిమి బంగారం గా విలసిల్లిన శతకం .కవి ధన్యులు .నిలువెల్లా భక్తి తో నిండి పరమాత్మ కై౦కర్యంగా రాసి సమర్పించిన సీస మాలిక ఇది .

 నా అదృష్టం వలన ఈకవినీ శతకాన్ని పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-22-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.