’పద్య తేకువ ‘’గల కవి డా. టేకుమళ్ళ ఖండకావ్యం

’పద్య తేకువ ‘’గల కవి డా. టేకుమళ్ళ ఖండకావ్యం
డా టేకుమళ్ళ వెంకటప్పయ్య నాకు మంచి మిత్రులు .రాజమండ్రిలో నాకు విహంగ వెబ్ మహిళా మాసపత్రిక వారు పురస్కారం అందించినప్పుడు పరిచయమయ్యారు .ఆయనతోపాటే శ్రీ గౌరి నాయుడుకూడా .టేకుమళ్ళ వారి పరిచయం క్రమ౦గా వర్ధిల్లింది .సరసభారతి కవిసమ్మేళనాలలో,కృష్ణా జిల్లా రచయితల సంఘ సమావేశాల్లో ,శ్రీసువర్చలాన్జనేయస్వామి దేవాలయంలో జరిపే సంగీత సద్గురు త్యాగ రాజస్వామి ఆరాధనలలో  ఈ సాహితీ బంధం మరింత బలపడింది .పొట్టిగా ,అమాయకంగా కనిపించే ఆయన ఒక విద్యార్ధి అనుకొన్నా .రెండేళ్ళ క్రితమే తెలిసింది ఆయన డాక్టరేట్ అని ,బహు గ్రంథ  కర్త అనీ  .అప్పటిదాకా ‘’ఏమయ్యా’’ అని పిలిచినవాడిని సిగ్గు తెచ్చుకొని’’ ఏమండీ’’అని గౌరవంగా స౦బోధిస్తున్నాను ..వారి శ్రీమతి శ్రీమతి చిదంబరి గారు గొప్పసంగీత విదుషీ మణి.మా త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలలో పాల్గొని పంచ రత్నకీర్తనలను  అన్నమయ్య పదాలను  శ్రావ్యంగా గానం చేసి అలరిస్తారు. ఆజంట ‘’సాహిత్య సంగీత  జంటస్వరం’’ .
  ఈ మధ్య టేకుమళ్ళ కవి నాకు వారు రాసిన  కొన్ని పుస్తకాలు ఇచ్చారు .వాటి జోలికి ఇప్పటిదాకా పోలేదు .ఇప్పుడు కంటికి ఆయన ఖండకావ్యం ‘’సామాజిక సమస్యలు ‘’కనిపించింది .దానిపై స్పందించే ప్రయత్నం చేస్తున్నాను .కంటి నుంచి కన్నీరు కారుతున్న అర్ధవంతమైన ముఖ చిత్రం ,వెనుక ఈ కావ్యంపై సర్వశ్రీ బేతవోలు ,చక్రాల ,పాలపర్తి ,పూర్ణచంద్ ల అభిప్రాయాలు అందంగా కూర్చారు .ఇందులో అష్టాదశ  శీర్షికలున్నాయి కాదు కాదు సమస్యలున్నాయి .ఈపుస్తకం 2017 డిసెంబర్ లో వెలువడింది .ప్రతి శీర్షిక లో ఆసమస్యపై  ఉపోద్ఘాతం కూడా రాశారు కవి .చక్రాలవారు మా సరసభారతి పురస్కారం గ్రహించినప్పుడు వెంకటప్పయ్యగారు మాఇంటికి వచ్చి వారితో పరిచయం పెంచుకొని పద్య మెళకువలు అన్నీ తెలుసుకొన్నానని వినయంగా నాతో అన్నారు .
మొదటిది –కార్మిక సంక్షేమం –మా దేశం లో ఫాక్టరీలు పెట్టండి అని ప్రాధేయ పడి పెట్టించే ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం పై శ్రద్ధ పెట్టటం లేదని కవి బాధపడ్డారు ‘’-నేత లందరి లక్ష్యమ్ము మేతకాగ –దేశమేగతి కేగునో తెలియరాదు ‘’అన్నారు .హక్కులున్నాయి లొంగకు అని హితవు చెప్పారు కార్మికులకు .కృషికి ఫలితం తప్పక దక్కుతుంది .’’కృషి యే రక్ష’’అని  భరోసా ఇచ్చారు .తర్వాత జలవనరుల గురించి చెబుతూ ‘’జలము వ్యర్ధంబు జేయంగ జాతి నలిగి-కష్టనష్టముల పాలగు కరవు హెచ్చు ‘’అని ప్రబోధించారు .వృద్ధాప్యం లో తల్లి కొడుకు కోసం ఎదురు చూస్తూ కొడుకు జపమేచేస్తూ ,చివరికి డాలర్ మత్తు లో ఉన్న కొడుకుసమయానికి రాక కట్టే  గా మారి పొతే ,కడ చూపుకు  దక్కక ,ఊరి జనం ఆమె కొంగున దాచిన డబ్బు ఇవ్వగా కుప్పకూలాడు వాడు –‘’కోట్లకు లభించునే తల్లి దీవెనల్ ‘’అన్నారు కవి .అన్నదాత ఆత్మహత్యలు చేసుకొంటే ‘’భావితరపు జనుల బ్రతుకు లుడుగు ‘’అని ఏలినవారిని నిలదీశారు.యుక్త వయసులో ఉక్తంకాని నిర్ణయాలతో పెళ్ళిళ్ళు చేసుకొని ,చిక్కుల వలయాలలో చిక్కి చిన్న గొడవలే పెద్ద గాలివానలై కాపురాలు కూలి పోతున్నాయి ఇప్పుడు .ఎవరిపంతం వారిది –‘’మిన్నగు దారిలో మిగుల మెలగు తీరున సర్ది చెప్పరే ‘’అని పెద్దలకు సూచించారు .యువత చెడు అలవాట్లకు బానిసలై భవిష్యత్తు పోగొట్టుకొంటున్నారు .దీనితో జాతి నిర్వీర్యమౌతోంది –‘’భారత ఖండంపు పరువంత భంగ మవదా?అని ప్రశ్నించారు .
  సమాజ శ్రేయస్సే తన కర్తవ్యమ్ అన్నారు ‘’చిన్ననా మనసు చిగురించు    వేళలో –చెత్త నాటదగదు చిత్తమందు –పరుల కష్టమందు బాగును గొరెడు –బుద్ధి నేర్పవలయు ‘’అని పెద్దలకూ సుద్దులు చెప్పారు .తెలుగు పరిరక్షణచేయమని యువతను ఉద్బోధించారు .బుల్లి తెరకు సెన్సారు బోర్డ్ లేదు ‘’అందుకేదేశ సంస్కృతితిక్లేశం చెందుతోంది ‘’అని మాధనపడ్డారు .భారత ఖండం అంటే భాగ్యాలమూట.చీర సొగసు చూడ తరమా అని మెచ్చి ‘’చీర కురి పోసి యుసురును చెడి వదలు ‘’ అనీ అభాగ్య చావుకు నిట్టూర్చారు .జడ అల్లటం నేర్పు .-జడ యల్లినయపుడే దాని ‘’జాణ’’ న సబబౌ ‘’అన్నారు .ధనుర్మాస విశిష్టపై పద్యాలు రాసి మనకవి ప్రథమ బహుమతి పొందిన పద్యాలూ ఇందులో శోభతో చోటు చేసుకొన్నాయి .పోలవరం –పుణ్య వరం అంటూ ‘’నదుల సంధాన కర్తగా నాందిపలికి –
  భరత ఖండంబు నెల్లను భవ్యరీతి –కొత్త పుంతలు ద్రొక్కించె గూర్మి మీర –పోలవరమేను మనకెల్ల పుణ్యవరము ‘’.ఒకే అక్షరం గురువుగా ఉండే ‘’వ్యాసేంద్ర ఛందస్సులో వ్యాస వైభవం వర్ణించారు .చివరగా వివేకాన౦దుడు యువతకు చేసిన కర్తవ్య బోధను తెలియజేస్తూ –‘’మాత పితల సేవె మహితాన్వితంబని –చాటి చెప్పవలయు జగతి యందు –ధనము కన్న ఘనము తల్లిదండ్రులనుచు –విశద పరచ  వలయు విశ్వ మెల్ల ‘’అని అర్ధవంతంగా ఖండకావ్యాన్ని  ముగించారు .
పద్యాలు  ధారాపాతంగా ప్రవహించాయి .ఆలోచనామృతాన్ని పంచాయి .కంద గలపద్యకవిత్వంతో ఈ ఖండకావ్యం కలకండ కావ్యమైంది .
  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-1-23-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.