‘’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి

‘’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి

మాయాధర్ మాన్ సిన్హా ఇంగ్లీష్ లో రాసిన దానిని శ్రీమతి సి.ఆన౦దారామం తెలుగులోకి అనువదించిన ‘’ఫకీర్ మోహన్ సేనాపతి ‘’పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడెమి 1979లో ప్రచురించింది .వెల-రూ .2-50.

1-మల్లికాషార్ మల్లులు

ఫకీర్ మోహన్ ఒరిస్సాలోని ‘’పైక్ ఖందాయత్ ‘’తెగ కు చెందినవాడు .ఈ వంశం వారు స్వతంత్ర హిందూరాజులవద్ద సేనాధిపతులుగా ఉంటూ ,పదవులనుబట్టి మల్ల ,సింహ ,భుజబల ,బలయరి సింహా ,శత్రుసాల ,దళ బెహరా  వంటి గౌరవ బిరుదులు పొంది అవే వంశనామాలుగా చేసుకొన్నారు .

  సేనాపతులు

ఫకీర్ మోహన్ పూర్వీకులు మొదట మల్లురు మాత్రమె .వీరు కటక్ జిల్లా కేంద్రపారా ప్రాంతం నుంచి బాలాశోర్ పట్టణ ప్రాంతానికి ,మల్లికాపూర్ ప్రాంతానికి చేరి సేనాపతులయ్యారు .ఫకీర్ పూర్వీకులలో అయిదవ తరం వాడు’’ హనుమల్లు’’ కేంద్ర పారా లో తండ్రి తాత ల కొద్దిపాటి జమీన్ భూములు అనుభవిస్తూ ఉండేవాడు .దురదృష్టవశాత్తు అతడి ఆస్తిపాస్తులు కరిగిపోగా ,యోధుడు కావాల్సి వచ్చింది .శివాజీ తలిదండ్రులు అహ్మద్ నగర సుల్తానుల సేనలలో ఉద్యోగాలు సంపాది౦చు కొన్నట్లు ,హనుమల్లుకూడా ,ఆప్రాంతాలను ఆక్రమించే మరాఠీల వద్ద ఉద్యోగం పొంది శక్తి సామర్ధ్యాలతో ఎదిగి అత్యున్నత స్థాయి పొందాడు  .అతని సేవలకు ప్రీతి చెందిన మరాఠీ గవర్నర్ అతడికి ‘’సేనాపతి ‘’బిరుదునిచ్చి గౌర వించి బెంగాల్ ,ఒరిస్సా సరిహద్దు లో ఉన్న ఒకసైనిక దుర్గం సంపూర్ణ బాధ్యతలు అప్పగించాడు .అతని తర్వాత ఆవంశం వారంతా వరుసగా సేనాపతు లయ్యారు .కానీ వారి ఇళ్ళలో జరిగే వివాహాది కార్యక్రమాలలో మాత్రం ‘’మల్ల ‘’అనే వంశ నామాన్నే వాడుతారు .

  నానమ్మ

మరాఠా ల నుండి బ్రిటిష్ వారు ఒరిస్సాను స్వాధీనం చేసుకోకపూర్వం 1803లో హనుమల్లు కు తర్వాత మూడవ తరం వాడైన కుశామరా ,అతడి ఇద్దరుకొడుకులు  భార్య ను వదిలి తక్కువ వయసులోనే చనిపోయాడు .ఆ వితంతువు పేరే ‘’కుచిలాదే’’.ఈమె ప్రభావం ఫకీర్ మోహన్ పైన ఎక్కువ .ఫకీర్ రచనలలో ఆమె నిస్వార్ధ సేవా పరాయణిగా కనిపిస్తుంది .ఆమె నిరాడంబరత వల్లనే బాలాసోర్ జిల్లాలోని తాతల నాటి ఆస్తులన్నీ కోల్పోయినట్లు ఫకీర్ పేర్కొన్నాడు .కుచిలాదే ఇద్దరు కొడుకులలో పెద్దవాడు పురుషోత్తం. చిన్నవాడు లక్ష్మణ్ చరణ్ .ఇతడి కుమారుడే ఫకీర్ మోహన్ సేనాపతి .కానీ పూరీ యాత్రకు వెళ్లి తిరిగి వస్తూ  భువనేశ్వర్ లో  లక్ష్మణ్ కలరాసోకి చిన్నతనం లోనే చనిపోయాడు . అప్పటికి ఫకీర్ వయసు ఏడాది ,అయిదు నెలలు మాత్రమె .అతని తల్లి తులసీ దే భర్త అకాల మరణం తట్టుకోలేక మంచమెక్కి ,మరో ఏడాదికి చనిపోయింది .బాధ్యత నిస్సహాయురాలైన  వితంతువైన నానమ్మ మీదనే పడింది.

2-అశ్రద్ధ చేయబడిన శిశువు

ఆస్తులన్నీ హారతి కర్పూరమై పోగా ,బీదరికం లో మగ్గుతూ నాయనమ్మ తండ్రిలేని కొడుకులిద్దర్నీ ఎలా పెంచిందో దేవుడికే తెలియాలి .జీవితమంతా వాళ్ళకే ధార పోసి ఉంటుంది .యవ్వనం రాగానే వాళ్లకు పెళ్ళిళ్ళు చేసింది .కోడళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉంటె ఆమె మనోవ్యధ కొంత తగ్గి ఉండచ్చు .కానీ ఈ ఆనందం కూడా ఎక్కువ కాలం లేదు ఆమె చిన్న కొడుకు ,కోడలూ కూడా అకస్మాత్తుగా చనిపోయి ఆమెకు భరించరాని శోకం కలిగించారు .అన్నిటికి తట్టుకొని బతికి బట్ట కట్టిన ఈ శిశువు ఫకీర్ మోహన్’’ ఉత్కళ వ్యాసుని’’గా కీర్తి పొందాడు .

  దేవత

‘’మా అమ్మా నాన్న చనిపోయిన ఏడెనిమిదేళ్ళ వరకు నేను రక్త విరేచనాలు ,నీళ్ళ విరేచనాలు ,మూల శంక మొదలైన రోగాలతో ఇరవైనాలుగు గంటలూ బాధ పడేవాడిని .మంచమే నాకు గతి .రాత్రిం బవళ్ళు నాయనమ్మ నా ప్రక్కనే కూర్చుని జాగ్రత్తగా చూస్తూ నన్ను కాపాడింది .అన్నేళ్ళు ఆమె నిద్రాహారాలు మాని మంచం పక్కనే కూర్చుని కంటికి రెప్పలాగా కాపాడి నన్ను బతికించింది ఆమె లేకపోతె నేను లేనే లేను ‘’అని ఆత్మకధ లో రాసుకొన్నాడు ..

  వ్రజ్ మోహన్ –ఫకీర్ మోహన్

  మనవాడి ఆరోగ్యం కోసం మామ్మ గారు మొక్కని దేవీ దేవత లేనే లేరు .కానీ ఫలితం కనిపించలేదు .ఆకాలం లో బాలాసోర్ లోని ముస్లిం ఫకీర్లు ఆర్తుల బాధలు నివారిస్తారనే పేరు బాగా ఉండేది .నిరాశలో ఉన్న బామ్మ మనవడిని ఆ ఫకీర్ లను ఆశ్రయించి తనమనవడిని వారికి  బానిసగా చేస్తానని మొక్కుకొన్నది .ఆతావీజు మహిమో ఏమోకానీ మనవాడి రోగం కుదిరి ఆరోగ్యం చేకూరింది .అప్పటిదాకా ఉన్న వ్రజ్ మోహన్ అనే అసలు పేరును ఫకీర్లకు కృతజ్ఞతగా ఆమె ఫకీర్ మోహన్ అని మార్చేసింది .అయితే ఆమెకు తన మనవడిని పీర్లకు  సమర్పించే దిటవు మాత్రం లేకపోయింది .మొహర్రం పండుగ ఎనిమిది రోజులు మాత్రం అతడిని రంగురంగుల చొక్కాలతో ,టోపీ, చేతికర్ర ,భుజం పై వ్రేలాడే రంగుల సంచి లతో అసలైనముస్లిం ఫకీర్ గా చేసి కొంత సంతృప్తి పడేది బామ్మ.ముఖానికి వీబూది పూసుకొని ఆఫకీరు వేషం తో పొద్దున్నే ఇల్లు వదిలి బయటికి వచ్చి వీధుల్లో తిరిగి సాయంత్రానికి మళ్ళీ ఇల్లు చేరేవాడు .తన జోలె లో పడిన దనం, ధాన్యం తో బామ్మ పీర్లకు పూజా తంత్రాలు చేసి నైవేద్యాలు పెట్టేది ఆ ఎనిమిది రోజులు .

 ఎవరికీ పట్టని బిడ్డ

 తండ్రి చనిపోవటంతో కుటుంబ బాధ్యత పెదతండ్రి పురుషోత్తం మీద పడింది .అతడే మల్ల వంశానికి అప్పుడు పెద్ద .రోగిష్టి మారి తమ్ముడిని సాకటం పురుషోత్తం దంపతులకు ఇష్టం లేకపోయింది .తిరస్కారం తో ఈస డించేవారు .ఈ స్థితిలో చిన్ననాటి చదువు సరిగా సాగలేదు .రోగం కుదిరి తొమ్మిదో ఏడు వచ్చేదాకా అక్షరాభ్యాసమే లేదు .పాతకాలపు వీధిబడిలో చేరి చదువు అయ్యాక పంతులుగారికి ఇంటిపని వంటపని వగైరాలలో సాయం చేసి ,ఇంటికి వచ్చినా పెత్తండ్రి రాతి గుండె కరిగేదికాదు .పంతులు చేతిలో తన పిల్లల్లాగా  ఫకీర్ దెబ్బలు తినటం లేదని బాధ పడేవాడు .పంతులుకు గొడ్డు చాకిరీ చేస్తూ సగం జేతమే ఇవ్వాల్సి వచ్చినా అతడు అదికూడా ఇచ్చేవాడు కాదు .పంతులు కూడా చేసేది లేక ఫకీర్ ను కారణం లేకుండానే ఒక రోజు బెత్తంతో విరగబాది పెత్తండ్రి సంతోషానికి కారకుడయ్యాడు. సాడిస్ట్ పెదనాన్న కు అప్పుడుకానీ ఈగో సంతృప్తిచెందలేదు .ఈ విషయం బామ్మకు తెలిసి ఆఘమేఘాలమీద బడికి వెళ్లి పంతుల్ని మాటలతో ఎడా పెదా వాయి౦ చేసింది  .

  చదువుపై మహా కోరిక ఉన్న ఫకీర్ సాయంకాలాలో మరో పంతులు దగ్గరకు వెళ్లి పర్షియన్ భాషలో నిష్ణాతుడయ్యాడు .దీన్నికూడా సహించలేక పోయారుపెత్తండ్రి దంపతులు. అసూయ బాగా వారిలో పెరిగిపోయింది .వీడిని ఎలాగైనా వదిలి౦చు కోవాలనుకొన్నా కుదరటం లేదు .తమ సంతానాన్ని మిషినరి స్కూళ్ళ  లోచదివిస్తూ ,ఇతడిని గాలికి వదిలేశారు ఆ దౌర్భాగ్యులు .ఆ కర్కోటకులు ఈ పదేళ్ళ పసివాడిని బాలాశోర్ రేవులో కూలివాడిగా కుదిర్చారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-1-23-ఉయ్యూరు   

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.