పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -8

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -8

ఆర్ధికం గా ఎప్పుడూ సంతృప్తి లేని జీవితం హుగ్లీలో చిన్నిల్లు కావాల్సిన సామగ్రి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది నజ్రుల్.కలకత్తానుంచి ఎప్పుడూ అతిధులు వరదలా వచ్చేవారు వారికి స్వాగత సత్కారాలు ఆతిధ్యానికి లోటు చేసేవాడు కాదు .1925చివర్లో ఆయన ఆర్ధిక స్థితి బాగా క్షీణించింది .చేతిలో డబ్బులు ఆడటం లేదు చాలాసార్లు మలేరియా కు గురయ్యాడు .ఆయన మిత్రులు ఇంకా జైల్లోనే ఉన్నారు .హేమంత సర్కార్ నజ్రుల్ ను ఒప్పించి ఆయన కుటుంబాన్ని కృష్ణ నగర కు 3-1-1926 న తీసుకొని వెళ్లాడు .హుగ్లీలో ఆర్ధిక యాతనలలో ఉన్నా ,కవిత్వ రచనకు లోపం లేదు .గాంధీజీని మొదటి ,చివరి సారి ఆయన బెంగాల్ పర్యటనలో అక్కడే కలిశాడు .రాట్నం పై  పాటరాసి గానం చేసి వినిపిస్తే సంతోషించి మెచ్చాడు బోసినవ్వులాయన .

  22-6-1925 న చిత్తరంజన్ దాస్ అకస్మాత్తుగా మృతి చెందాడు .బెంగాల్ శోక సముద్రంలో మునిగిపోయింది నజ్రుల్ కు ఇది పెద్ద దెబ్బ అనిపించింది .ఆయన మృతిపై అనేక గీతాలు రాసి స్మృత్యంజలి ఘటించాడు .అవన్నీ ‘’చిత్తనామా ‘’పేరిట పుస్తకరూపం దాల్చాయి .అప్పుడే ‘’తుఫాన్ ‘’ అనే దీర్ఘకవిత రాస్తే ‘’విషెర్ బన్సీ విష వేణువు లో చోటు చేసుకున్నది .జాతీయ దేశభక్తి కవితలెన్నో రాశాడు కాంగ్రెస్ లోని మజ్దూర్ స్వరాజ్య పార్టీ  అనే కమ్యూనిస్ట్ లను సమర్ధించే పార్టీలో చేరాడు.ఆపార్టీ పత్రిక   ‘’లాంగల్ ‘’మొదటి సంచికలో  టాగూర్ కవిత అచ్చయింది.నజ్రుల్ ‘’సర్వ హారా ‘’శీర్షికతో   ఈశ్వరుడు మనిషి ,పాపం ,వేశ్య మొదలైన  చాలా కవితలు రాశాడు .ఒకరకం గా ఈయనే సంపాదకుడు .  నిరుపేదలైన శ్రామిక గౌరవార్ధం ‘’కూలి వాళ్ళు ‘’కవిత రాశాడు  ‘’.ఇదే బెంగాల్ సాహిత్యం లో నిరుపేదల గౌరవార్ధం మొట్టమొదటి కవితగా చరిత్ర ప్రసిద్ధమైంది ..సర్వ హారా అంటే ఏమీ లేని వాళ్ళు అని సార్ధకమైన పేరు పెట్టాడు .కృష్ణ నగర్ కు వెళ్ళే ముందు ‘’కృషి కేర్ గాన్ ‘’-రైతులపాట రాశాడు .సవ్యసాచి కూడా రాశాడు ఈరెండూ ప్రచురితాలే .ధూమ కేతు లాగా రెపరెప లాడకపోయినా లాంగల్ పత్రిక రైతుల ,పేదల, బడుగు వర్గాల పక్షాన నిలిచిన పత్రికగా గుర్తుండి పోయింది .   కృష్ణ నగర్ లో భావ పరిపక్వత గల హేమంత సర్కార్ లాంటివారు రాజకీయ నాయకులు  నజ్రుల్ రాక కోసం ఎదురు చూస్తున్నారు .సర్కార్ నేతాజీ  కి మంచి మిత్రుడు .అప్పుడు బోస్ మాండలే జైలు లో ఉన్నాడు .స్వరాజ్య పోరాటాన్ని సోషలిస్ట్ దృక్పధంతో నడపాలనే కోరికున్నవాడు సర్కార్ .కృష్ణ నగర్ లో ‘’అఖిల  బెంగాల్  రైతు కాంగ్రెస్  ‘’ను కృష్ణ నగర్ లో సర్కార్ నజ్రుల్ కలిసి ఏర్పాటు చేశారు .బెంగాల్ చరిత్రలో ఇదే మొదటి రైతుకాన్గ్రేస్.మంచి వైద్య సదుపాయం ఉండటం తో నజ్రుల్ త్వరగా ఆరోగ్యవంతుడై ఉత్సాహంగా పాల్గొన్నాడు .ఈ సభకు ప్రారంభ గీతంగా నజ్రుల్ ‘’శ్రమికేర్ గానే ‘’-శ్రామికుల గీతం రాశాడు .దీని తర్వాత బెంగాల్ లో రైతుకూలీ కాంగ్రెస్ ఏర్పడింది .మీరట్ కమ్యూనిస్ట్ కేసు వీరికి బాగా అంది వచ్చింది .దానితో లాంగల్ పత్రిక ‘’గణ వాణి’’గా 25—9-1926nనుంచి సార్ధకం గా పేరు మార్చారు .ఇది మొదటి మార్క్సిస్ట్ వాదపత్రిక గా గుర్తింపు పొందింది .కానీ సాహిత్య ప్రియం భావుకు డైన నజ్రుల్ కు తగిన పత్రిక కాదు . పెద్దకొడుకు బుల్ బుల్ పుట్టాడుకాని కొద్దికాలానికే చనిపోయాడు.

   1926ఏప్రిల్ లో కలకత్తాలో హిందూ -ముస్లిం కలహాలు అకస్మాత్తుగా మొదలయ్యాయి .ఇది భయంకర దారుణ క్రూర విషయం .కొంతకాలం జరిగి ఆగి మళ్ళీ మొదలయ్యాయి .హిందువులఒకటి  ముస్లిం ల మరోటి ప్రెస్ లు స్వార్ధం కోసం కలహాలకు ఆజ్యం పోసి జ్వాలలు బాగా రగిలించాయి .ఈ నష్టం అన్ని నష్టాలకంటే తీవ్రమైనది .మత ఉద్వేగాలు వద్దని కవితలతో నజ్రుల్ నిత్యం మొత్తుకొంటూనే ఉన్నాడు .ఎవరూ లెక్క చేయటం లేదు .అంతమాత్రాన ఆయన ఆగలేదు .వ్యంగ్యం క్రోధం ఆక్రోశం దేశభక్తి తో కవితలు రాసి ప్రబోదిస్తూనే ఉన్నాడు .కృష్ణనగర్ కు కూడా ఈ విషజ్వాలలు వ్యాపించాయి .నజ్రుల్ వీటికి అతీతంగా దేశభక్తి తో జాతీయ దృక్పధంతో ఉన్నత ఉదాత్త భావాలతో శరపరంపరగా కవితలు గేయాలు రాస్తూనే ఉన్నాడు .కృష్ణనగర్ లో జరిగిన అనేక సాహితీ కార్యక్రమాలు ఆయన రాసిన ఇలాంటి గీతాలాపనలతోనే ప్రారంభమయ్యేవి .అందులో అత్యంత ఉత్కృష్ట గేయం –‘’కందరీ హోషియార్ ‘’.ఇది జనాన్ని  కదిపి కుదిపి కుదిపి ఉద్రేకపరచి రెచ్చగొట్టి ఆకర్షించింది –‘’దుర్గమాలు అడవులు కొండలు –దుస్తరాలు పారావారాలు –పథికులారా పారాహుషార్ –అర్ధరాత్రి అంధకారం లో అధిగమించాలి –పారాహుషార్ ‘’.

  విద్రోహాత్మక ధ్వని ఉన్న మరో రెండు గీతాలు కూడా రాశాడు నజ్రుల్..ఒక దాన్ని విద్యార్ధి సమ్మేళనం ప్రారంభోత్సవం లో  ఆలపించారు .నజ్రుల్ ఎప్పట్లా స్వయంగా నేతృత్వం  వహించాడు .విద్యార్ధుల బృందగానమైన ఒక ప్రష్ఠాన  గేయం –‘’మా బలం –మా శక్తి –మా విద్యార్ధి దళం ‘’తో మొదలౌతుంది .అనువాదానికి లొంగని భావోద్వేగం మాటల పటాసులు కర్తవ్యబోధన జాతీయత వెల్లి విరిసే గీతం ఇది –‘’అదిగో అదిగో పిలుస్తోంది –గగనాన మద్దెల దరువు-దిగువున ధరణీ తలాన వినిపిస్తోంది తాళం –అరుణారుణ ప్రాతః కాలపు నవయువకుల్లారా –పదండి ముందుకు పదండి ముందుకు ‘’.ఇలా ఆయన కృష్ణనగర్ లో రాసిన మూడు గీతాలు చాలు నజ్రుల్ జాతీయకవి అనటానికి .అవి చిరస్మరణీయమైనవి .దారిద్ర్యం కవిత కూడా ఇప్పుడే రాశాడు .  ఇందులో దిగులు విద్రోహం రెండూ ఉన్నాయి .దరిద్రం గడ్డ కట్టకుండా ఉండటానికి తిరుగుబాటు గొంతు విప్పాడు .అక్కడే ఒక పాఠశాల నెలకొల్పాడు ‘’కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ‘’ను ఇక్కడే బెంగాలీలోకి అనువదించాడు .కమ్యూనిస్ట్ ఇంటర్ నేషనల్ రాగాలు తెలియక పోవటం వలన ఇది పాడుకోవటానికి వీలుగా ఉండదు .

  రెండున్నర ఏళ్ళ తర్వాత కృష్ణనగర్ వదిలి ,మళ్ళీ కలకత్తాకు 1928చివరలో చేరాడు కుటుంబం తో .మొదట్లో పాన్ బజార లో ఉన్నా ,ఇప్పుడు ఉత్తరంలోని శ్యాం బజార ,1960లో క్రిష్టఫర్ రోడ్డులో చిన్న కొడుకుతో సహా ఉన్నాడు  .1929 తర్వాత ఆయన జీవితం కొత్త ప్రపంచం అంటే సంగీత ప్రపంచం లోకి ప్రవేశం జరిగింది .అంతకు ముందే ఆయన కవితా ,గద్య ,పాటల సంకలనాలు అన్నీ ముద్రణ పొందాయి .చక్రవాక తో సహా 14 సంకలనాలు వెలువరించాడు నజ్రుల్ .1955,1957లలో అచ్చు అయిన సంచయన ,మరుభాస్కర్ ముద్రణలో ఆయన ప్రత్యేకంగాశ్రమపడాల్సిన అవసరం కలగలేదు .ఆయన మరణం తర్వాత వచ్చిన సంధ్య ,ప్రళయ శిఖా 1929,1939లలో వచ్చాయి .

 1929 కాలం లో నజ్రుల్ ఎన్నో  కష్ట నష్టాలు దారిద్ర్యం అనుభవిస్తూనే ఉన్నాడు .మర్చిపోలేని  కవితలు గేయాల సంపుటులను కేవలం మూడు వేల రూపాయలకే అమ్మేశాడు .అప్పటికి ఆయన వయస్సు 30మాత్రమె .సంచిత అమ్మకం వలన వచ్చిన డబ్బు ఆయనకు రాలేదు .ముద్రాపకులకే దక్కింది .అవన్నీ ఆయన సృజనాత్మక ఔన్నత్యపు రోజులు . .తాను  ఏది అమ్ముతున్నాడో ముందూ వెనక్కి చూడకుండా అమ్మాడు .ఇదంతా పశ్చాత్తాపం పదాల్సినంత అవివేకంగాచేసిన పని .ఇదే ఆఖరిది కూడా .

  సశేషం

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -20-2-23-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.