శ్రీ కోదండ రామ శతకం
విద్వాన్ ఎ.కే.వరప్రసాద కవి స్వతంత్ర నెల్లూరుకు చెందినవారు .శ్రీ కోదండ రామ శతకం లఘు టీకా సహితంగా రచించి ,1940 లో ప్రచురించారు .వెల-రెండున్నర అణాలు .విన్నపం లో కవి గారు తాను నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట నుంచి బుచ్చి రెడ్డి పాలెం కు ఉన్నత పాఠ శాల ఆంధ్ర పండితునిగా బదిలీ అయి పని చేయటానికి వస్తుంటే వర్షాకాలం కనుక పెన్నానది వరదలు వచ్చి తన శకటం తలక్రిందులై ,తన వద్ద ఉన్న అనేక అమూల్య గ్రంధాలు ,తన రచనలు వరద పాలైనాయని ,కొత్త ఇంట్లో చేరాక దొంగలవలన కొన్ని నష్టమయ్యాయని ,కాని ఇక్కడి అంబర చుంబిత గోపురంతో విరాజిల్లుతున్న శ్రీ కోదండరామ స్వామి దేవాలయం, స్వామి తనకు మానసిక ప్రశాంతి కల్పించాయని ,కనుక వెంటనే శుభ ప్రాప్తికోసం ,నూట ఎనిమిది కంద పద్యాలతో 1940 లో ఈ శతకం రాసి ,ఆలయం నిర్మించిన శ్రీ దొడ్ల వారి ద్రవ్యసాయంతో ముద్రించానని ,తనను’’ అజ్ఞాత కవి’’గా పరిచయం చేసిన శ్రీ ఎన్.సత్య ప్రకాశ రాయ లకు నమస్కారాలు అన్నారు .ఆట వెలది పద్యం లో –‘’పొడము నార్తి వలన మూలను బడి యున్న –చిలుము బట్టినట్టి కలము బట్టి –రామనామ శిలకు వ్రాసితి ,మెరుగెక్కి-తురగలించు కైత గరుదు జూప’’అని చక్కగా చెప్పారు .చన్నపురికి చెందిన శ్రీ ఎస్ సత్యప్రకాశ రావు కవిగారిని ‘’అజ్ఞాత కవి ‘’గా గద్య పద్యాలతో పరిచయం చేశారు .అందులోని ముఖ్యవిషయాలు –పదహారు వయసులో కలం పట్టి శతకం రాశారు .కవితో నాకు మద్రాస్ లోని ఎస్ప్లనేడ్ లో ఉన్న హోటల్ లో మొదటి పరిచయం .ఇక్కడే కవి రెండేళ్లు హోటల్ కూడు తిన్నారు .అప్పటికి మద్రాస్ పచ్చయప్ప కాలేజి హై స్కూల్ లో తాత్కాలిక తెలుగు పండిట్ .మొదట్లో ఇతడిని కాలేజి స్టూడెంట్ అనుకొన్నాను .ట్రాం బండిలో ప్రయాణం ,యూనివర్సిటి లైబ్రరీ లో తరచూ కనిపించేవాడు అప్పుడు వయసు సుమారు 20.అప్పుడు అతనిపై బాగా అభిమానం ఉన్నవారు దివాన్ బహాద్దర్ చీమ వాగు పల్లి రంగా రెడ్డి గారు .ఈయన కర్నూల్ జిల్లా బోర్డ్ అధ్యక్షులు తర్వాత ,మద్రాస్ ఎండో మెంట్ బోర్డ్ ప్రెసిడెంట్ .1930లో చనిపోయారు .రంగారెడ్డి గారి మరణం తర్వాత విరక్తితో కవిగారు నెల్లూరు మండలం లో బామ్మర్ది ఇంట్లో కొంతకాలం గడిపి ,నెల్లూరు జిల్లాబోర్డ్ అధ్యక్షులు శ్రీ బెజవాడ రామ చంద్రారెడ్డి గారి ఔదార్యం తొ 1930జులై లో తెలుగు పండిత పదవి పొందారు .రెడ్డి గారి ఋణం ఎలా తీర్చుకోవాలో అని నాతొ చాలా సార్లు అన్నారు .ప్రస్తుతం నెల్లూరు మండలం లో నెలకు యాభై రూపాయల వేతనం తొ పండితుడుగా పని చేస్తున్నారు 1922నుంచి రచనలు చేస్తూ వివాహం చేసుకొని ,మళ్ళీ నాకు 1930 లో కన్పించారు .దరిద్రం ప్రోత్సాహం లేకపోవటం ప్రక్కవారి అసూయాదు లతో కవిత్వ రచన స్తంభించి పోయింది .ఇవాల్టికీ కవి అజ్ఞాతుడే .చాలారచనలే చేశారు అందులో ఎక్కువ బాల్య కృతులే ..19 వ ఏటనే రాసిన ఈ శతకం పై మహామహులు శ్రీ దోమా వెంకటస్వామి గుప్తా ,ఉమర్ ఆలీషా ,శతావధాని శ్రీ కొమ్మూరి సంగమేశ్వర కవి ,కవిరాజు మల్లాది విశ్వనాధ శర్మ ,ఆశుకవి శిరోమణి శ్రీ పోకల నరసింహం మొదలైన వారు ప్రశంసించిన అభినందన పద్యాలే వందకు పైగా ఉన్నాయి .శతకం మాత్రం 240 కందాలలో ఉంది.ఈ కవి బాలచంద్రిక అనే మూడు వందలపద్యాల కృతి రచించారు .వెంకటేశ్వర శతకం ,ప్రకీర్ణ శతకం, ద్వయి ,చంద్రహాస,-అభిమన్యు వధ ఏకాంకిక లు ,చాలా చాటువులు ,ఖండకావ్యాలు ,లేఖలు ,వ్యాసావలి రాసిన ఘనుడు ఈకవి .1935లో నాటకాలు రాసి బాలబాలికల చేత ప్రదర్శింప జేశారు .కడపలోనూ ప్రదర్శించి పేరు ప్రఖ్యాతులు పొందారు ,సర్ యదునాధ సర్కార్ రాసిన శివాజీ చరిత్రను వచనం లో బృహత్తర గ్రంధంగా రాసి చరిత్ర సృష్టించారు .’’అభినవ ఆంధ్ర కవీంద్రుల జీవితములు ‘’ రచించిన సాహసి .శ్రీ సురవరం ప్రతాప రెడ్డిగారి ప్రోత్సాహం పొందిన శేముషీ ఈ కవిది. తోడికవులు పత్రికలూ ఈసడించి నిరుత్సాహ పరచారు .కవిగారిది అతి స్వతంత్రమైన జీవితం .వ్యసనాలు ,అహంకారం లేని పండిత ప్రకాండు డైన సత్కవి .ఒక్కమాటలో చెప్పాలంటే ఇరవై వ శతాబ్దపు కవిరాజులలో ఈ కవి ఒకడు .’’అని కవిగారి కవిత్వ మనో వృత్తులను చక్కగా వివరించారు పెద్దాయన . ఈ శతకం కంద పద్య శతకం .’’రామా కోదండ రామ రవి శత ధామా ‘’అనేది శతక మకుటం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-5-23 –ఉయ్యూరు

