శ్రీ కోదండ రామ శతకం -2(చివరిభాగం )
శ్రీ ఎ వికే ప్రసాద రాయ కవి రాసిన శ్రీ కోదండరామ కంద శతకం లో మొదటి ఖండం మొదటిపద్యం –‘’శ్రీ మద్దివ్య పదాంబుజ –ధామాంతర నటన శీల ధన్యతర రమా-రామా రాజిత ధామా –రామా కోదండ రామ రవి శత ధామా’’ .దామాంతర అంటే మధ్య ఇంట్లో ,రమారామా అంటే లక్ష్మీ దేవి అనే స్త్రీ చేత అని టీక చెప్పాడు కవి .’’మామక కవితా కామన-కామన కాంతి ప్రహసిత కామా కామ-స్తోమ సురాగా రామా –‘’ –నా కవిత్వం అంటే ఇష్టమున్నవాడా –గొప్పకాంతి చే ప్రకాశించే వాడా ,కల్ప వృక్ష తోట కలవాడా .సౌమిత్రిని భూ పుత్రుని ప్రేమించావు నన్ను ఎందుకు దూరం పెట్టావ్ అని ఇంకో పద్యం.’’అంకుడ శంకా౦త కుండ-సంకట పధ నటన శీల కలం కుడ,మొహా౦కుడ ,మంకుడ ‘’అని తనను తానె తిట్టుకొని కాపాడమన్నాడు .ఇందులో చివర –ఉన్న మదంచిత శిరమున –సన్నుత మార్గంబున ,సుఖ సంఘాంతర మం –దెన్నడు సంచరించ గలనో ?’’అని విచారించాడు.
ద్వితీయ ఖండం లో –‘’శృతి భూషణ నామా విశ్రు –తగుణ కలనాభి రామ ,క్షోణి తనయా –స్తుత వల్యాశ్రయ సదృశ ‘’అని స్తుతించాడు .పాపాన్ని ప్రతి షేధించు,సుఖాన్ని ప్రతిపాదించు ,భక్తీ ప్రసాది౦చు అని ఆర్తిగా కోరాడు .పతి వనీ పిత వనిగతి వని అతి కరుణా రతి వని జలజాయత నా సంగత మతి వని’’అని ధూపం బాగానే వేశాడు .మూడవ ఖండం లో –దండ మజాండా ధీశా –దండ మనంత మహిమాస్పద కళా వేశా-దండము కరుణా వేశా’’అంటూ మనసారా దండాలు పెట్టాడు భక్త కవి.నుతితొ నతితొ అతి వేడుకతో నిన్ను కొలిస్తే హర్షాశ్రువులు తతగతి రాల్తాయి అని పరవశంతో చెప్పాడు
భద్ర చరిత్రాత్మక య-ముద్రిత కృతులిన్ని నాళ్ళు మూలను నుండన్ –నిద్రం గూరితివా ని-ర్నిద్రా కోదండరామ ప్రియ తమ రామా ‘’అని రాముడే ఆలశ్యం చేశాడు పుస్తకం ముద్రణ పొందటానికి అని భలేగా నెపం తాను నమ్మినదైవం మీదనే నెట్టిన నెరజాణ భక్తుడు ఈ కవి .చివరి 36 వ పద్యం –‘’ఏమో వ్రాసితి నిన్నే –మో యడిగితిని తండ్రి ,హితమెటు లటులన్ -గామిత మిడి గావుము శ్రీ –రామా కోదండ రామ రవిశత ధామా ‘’
మంచి కవిత్వం ధారాపాత పదప్రయోగం ,భక్తి కలకండ పానకం గా ప్రవహించిన గొప్ప శతకం .మన మహాకవుల ,పండితుల విద్వద్వరేణ్యుల మెప్పు పొందిన శతకాన్ని పరిచయం చేయటం నా అదృష్టం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-5-23.-ఉయ్యూరు

