డా.ఉప్పలధడియం మొలిపించిన హైకూ’’ విత్తనం’’
తెలుగు ఇంగ్లిష్ హిందీ లలో ఎం .ఎ. ,మద్రాస్ లో తెలుగు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ అనేకానేక పుస్తకాలు రచించి ,తెలుగు పుస్తకాలను హిందీలోకి అనువదించిన,సరస భారతి పురస్కార గ్రహీత డా .ఉప్పలధడియం వెంకటేశ్వర ఇటీవల రాసి ప్రచురించిన హైకూ ల సంపుటి ‘’విత్తనం ‘’మె 22 న పంపగా నాకు 24 అందగా, వెంటనే మెయిల్ ద్వారా ఆయనకు తెలియ జేశాను .ఇవాళ చదివి స్పందిస్తున్నాను .మనవి మాటలలో కవి ‘’’’ప్రాచీనాంధ్ర కవిత్వం లో హైకూల రూపం ఉన్న కవిత్వ పాదాలున్నాయి .చంద్రుడిని ‘’కుముదంబుల చక్కిలి గింత ‘’గా నంది తిమ్మన వర్ణిస్తే ,నేను –జాబిల్లి చక్కిలిగింత కలువలకు ‘’అని రాశాను .హర విలాసం లో శివుని తపస్సు ఘట్టంలో శ్రీనాధుడు రాసినదాన్నిప్రేరణగా ‘’ఘన దృష్టి -భ్రూ రేఖ పై –శివోహం ‘’అన్నాను .కృష్ణ దేవరాయల గ్రీష్మ వర్ణన ఆలంబనగా –పేరెండ-దేహలతపై –విరి బొబ్బ ‘’అన్నాను .ఎవరైనా ప్రాచీన ఆంధ్ర కవిత్వం నుంచి పద్యపాదాలు గ్రహించి హైకూలుగా వెలువరిస్తే సముచితంగా ఉంటుంది’’ ‘అని సూచన కూడా చేశారు .ఇప్పుడు ఈ విత్తనాలలో నా కంటికి మనసుకు నచ్చిన మేలిరకం విత్తనాలుఎంపిక చేసుకొని విత్తనన మర్మజ్ఞుడను కాకపోయినా మీ ముందుంచుతున్నాను .
‘’ప్రయాణం – పొలమమారింది –దారిలో’’ తొ మొదలుపెట్టి ‘’దర్శనం –ఆర్ద్రమయింది- కనుదోయి’’హైకూ తొ ముగించారు సంపుటిని .ఇది మద్రాస్ లోని సాహిత్య సంస్థ ‘’జనని ‘’ప్రచురణ .’’జడివాన –లేవట్లేదు –పోయిపిల్లి ‘’,చిరుజల్లు –రైతు కంట్లో –హరివిల్లు ‘’,జ్ఞాపకం –చూరట్టుకు –నిలిచింది ‘’లో ‘’చూరట్టుకు జారుతోంది సురుక్కు సురుక్కు వాన చినుకు ‘’అనే జాలాది సినీ గీతం జ్ఞాపకం చేసింది ,’’బడిగంట –రెక్కలొచ్చాయ్ –బాట లకు ,’’దిగుతోంది –ఊయల నుంచి –దినబాల ,’’రైల్బండి-ఆషాడాన్ని-మోస్తోంది ‘’,చంద్రాగ్ని –దగ్ధముతూ –విరహ నిశి ,’’’’చాళ్ళలో –మొలకెత్తింది –కన్నీరు ‘’,పెనువాన –పడ గెత్తింది –సముద్రం ‘’,పొద్దున్నే –మరోజాబిలి –వంటింట ‘’,అదాటున –కనుగీటింది –మొయిలు చెలి ‘’,పిల్లలే –జీవితానికి –భరోసా ,పొగమంచు –తడబడుతోంది –రహదారి .,’’రహదారి విశాలమైంది –ఇళ్ళిరుకు’’ .
‘’కవి యాత్ర –మాట ,మౌనం –పట్టాలు ‘’, విరిపాప –ఆకువీవన –మెత్తగా ‘’,తడిమబ్బు –పిడుగు రాళ్ళను –విసిరింది ,’’జుర్రాను –ఏకాంతాన్ని –గుండెతో ‘’,మృదు వంశీ –కనిపించడెం-కన్నయ్య ?’’,క్రొమ్మొలక –సర్దు కొన్నది –శతాంకుర’’,’’నిశి గాధ-ఊకోడుతోంది –భూ బాల ‘’,’’కెరటాలు –రాసి రాసీ –తుడిపాయి ‘’,ఉత్తరం –తుడిపేసింది –కన్నీరు ‘’,హిమ కణం –సూర్యకిరణం –హరివిల్లు ‘’,రేకడలి –దూకాడు రవి –మునుగీత ‘’,’’జూన్ కదా –మురిపిస్తోంది –పుస్తకం ‘’,’’చదలేరు –విరబూసింది –తెలి కలువ ‘’,’’క్రికేటాట –ఆవులిస్తూ –పట్టణం ‘’, ‘’వాలింది –ఇంద్ర ధనుసు –పూవుపై ‘’,’’విత్తనం –స్వప్నిస్తోంది –వృక్షాన్ని ‘’అద్భుతం –భూమి లాస్యం –వాన లో ‘’విరిజల్లు –కురుస్తున్నది –రోడ్డుపై ‘’
ఇవన్నీ గొప్ప ఊహలు ,దర్శించి స్పందించే హృదయాలకు గిలిగింతలు .చదివి కాసేపు ఆలోచిస్తే కవి హృదయం తెలుస్తుంది .భావుకుడైన’’ వెంకటేశ్వర వచనాలు ‘’ఈ హైకూలు .చదవండి .ఆన౦దించండి అభినందించండి .ప్రతి హైకూ హై లైట్ అనే అనుకొన్నాను .వెల అమూల్యం కనుక సంప్రదించి విత్తనం అందుకొని,హాయిగా చదివి ఆనందించి , మీ హృదయాలలో మొలకింప జేయండి .సెల్ -9566198368.
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-23-ఉయ్యూరు

