రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -2
దారిద్ర్యం లో పుట్టిన శ్రీనివాస్ కు సునిసిత మేధ మంచి వ్యక్తిత్వం అబ్బాయి .పుట్టిన ఊరు నది గట్టున ముత్తాత తండ్రి ,ముత్తాత, తాత ల మూడు పవిత్ర సమాధులున్నాయి .ఈ ముగ్గురు గృహస్థాశ్రమాన్ని నిర్విఘ్నంగా గడిపి చివరి దశలో సన్యాసం స్వీక రించి ప్రాపంచిక సుఖాలకు దూరమైన వారే .శ్రీనివాస్ తండ్రి కూడా చివరికి సన్యాసం తీసుకోవాలనే అనుకొన్నాడు ,కానీ అనుకోకుండా హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు .పూజారి కుటుంబం .భక్తీ శ్రద్ధలతో భగవత్ సేవ చేసే వాడు .కానీ విపరీతమైన కోప దారి కోపం వస్తే నిప్పు మీద కోతి అనిపించేవాడు .దుర్భాషలాడేవాడు .తండ్రి విపరీత గుణాలను చూసి శ్రీనివాస్ చాలా జాగ్రత్తగా మసలు కొనేవాడు.తల్లి సాధుస్వభావం అతడికి గొప్ప ప్రేరణ కలిగించింది .తల్లిని గురించి రాస్తూ ‘’మ అమ్మ సెక్యులర్ కుటుంబం లో పుట్టింది .ఉన్నత భావాలతో విరాజిల్లింది అవే నాకు వచ్చాయి .పురాణాలన్నీ ఆమెకు వచ్చు. నాకు హాయిగా మనస్పూర్తిగా నేర్పించేది ‘’అన్నాడు .కనుక బాల్యం లోనే పుణ్యపాపాలు స్వర్గ నరకాలు తప్పు చేస్తే పడే శిక్ష సుఖ సంతోషాలు అన్నీ అవగతమయ్యాయి .రాత్రులు నిద్ర లో భూతాలూ పిశాచాలు కనిపించి భయ పెట్టేవి. ఉదయం కాగానే హాయి గా ఉండేది .కొన్ని సుఖ స్వప్నాలు కూడా వచ్చేవి. వాటి గురించి ‘’ఒకసారి మహా విష్ణువు కలలో మహా ప్రకాశమానంగా కరుణా కటాక్షాలతో దేవతలతో ,మహర్షుల తో కన్పించి క్రమంగా విపరీతంగా పెరిగిపోయి వర్ణించలేని విధంగా మహా స్వరూపంగా దర్శన మిచ్చాడు .నా కళ్ళు అర్జునుడి కంటే స్పష్టంగా ఆ విశ్వ రూపాన్ని చూశాయి ధన్యుడనయ్యాను .తర్వాత ఇలా చాలా సార్లు కలలు వచ్చాయి.భగవద్గీతలో పన్నెండవ అధ్యాయం లో వర్ణింపబడిన విశ్వ రూప సందర్శన భాగ్యం అది’’అని చెప్పాడు .
ఇలాంటి విషయాలు స్నేహితులకు చెప్పేవాడు .మనసంతా పవిత్రంగా ఉండేది .తల్లి తండ్రికంటే ఎక్కువకాలం జీవించింది .సెల్ఫ్ గవర్నమెంట్ విషయం లో ఇంగ్లాండ్ వెళ్లి అక్కడి వారితో చర్చించాల్సి ఉన్నా శ్రీనివాస్ ,తల్లితో ఉండటానికే ఇష్టపడ్డాడు .ఆమె అతడి చేతుల్లోనే ప్రాణాలు విడవాలని పెద్ద కొడుకు గా అన్త్యక్రియలన్నీ యదా విధిగా నిర్వర్తించి బాధ్యత నెరవేర్చాలనుకొన్నాడు శ్రీనివాస శాస్త్రి .కానీ 1919లో ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లాడు .ఏడెన్ చేరకముందే తల్లి మరణించిన వార్త తెలిసి జీవితాంతం కుంగి కుమిలి పోయాడు .ఆమె అంత్యక్రియలు యధావిధిగా నిర్వర్తించ లేని తన దౌర్భాగ్యాన్ని తలచుకొని వ్యధ చెందాడు .తల్లి అంటే అంతటి అభిమానం ఆరాధ్యం అతడికి .
కుంభ కోణం లో చదివి మెట్రిక్ పాసయ్యాడు .అ స్కూల్ లో అతడికి మహా దేశ భక్తుడు ,గొప్ప వ్యక్తిత్వం ఉన్న రావు బహదూర్ అప్పుస్వామి అనే ఆ స్కూల్ సంస్థాపక హెడ్ మాస్టర్ ప్రభావం పడి,శాస్త్రిలోని సకల నిగూఢ శక్తులు పురి విప్పుకొన్నాయి .మేధస్సు పరిపక్వమైంది .శాస్త్రి జీవితాన్ని తీర్చి దిద్దిన మహాగురువే అప్పు శాస్త్రి .తన గురువు’’సమకాలీన పరిస్థితులన్నీ అవగాహన కలవారు .యువ విద్యార్ధులను ఎలా అభి వృద్ధి మార్గం లో శక్తిస్వరూపులుగా కార్యోన్ముఖులుగా మలచాలో బాగా తెలిసిన వారు .నేను అంటే విపరీతమైన అభిమానం ఉన్న వారు .క్లాస్ రూం లోకి వార్తాపత్రికలు ,పార్లమెంటరి రికార్డ్ లు ,చరిత్ర పుస్తకాలు మేగజైన్స్ లు తెచ్చి అందులో పార్లమెంటరి విధానాలన్నీ చదివించి మనసుకు పట్టించేవారు .ఒక రోజు గురువుగారు కలకత్తాలోని ప్రముఖ న్యాయవాది ,ఇంగ్లీష్ లో మహా వక్త లాల్ మోహన్ ఘోష్ పై రాయబడిన వ్యాసాన్ని చదివి వినిపించారు .అది యూరోపియన్లు ,ఆంగ్లో –ఇండియన్స్ ‘’ఇల్బెర్ట్ బిల్ ‘’ను వ్యతిరేకిస్తున్న కాలం .అంటే యూరోపియన్ లపై ఉన్న కేసులను యూరోపియన్ జడ్జి లు మాత్రమె విచారించాలి అనేది .ఈ బిల్ ఇంగ్లీష్ ,ఆంగ్లో ఇండియన్ లను కలవర పరచింది .వైస్ రాయ్ రిప్పన్ ,లా మినిష్టర్ కర్త్నీ ఇల్బర్ట్ లకు కూడా బాధ కలిగించింది .కలకత్తాలో యూరోపియన్లు ,ఆంగ్లో ఇండియన్లు పెద్ద రాలీలు నిర్వహించారు ,మీటింగ్ లు పెట్టారు .బారిష్టర్ బ్రాన్సన్ ‘’ఈ నేటివ్ విమర్శ జాక్ –యాస్ కికింగ్ ది లయన్ ‘’అని కూశాడు .దీనికి దీటుగా మరింత పెద్ద బహిరంగ సభ ఏర్పరచి లాల్ మోహన్ ఘోష్ కుక్కకాటుకు చెప్పు దెబ్బగా దిమ్మ తిరిగే సమాధానం చెప్పాడు. దానినే అప్పు శాస్త్రి క్లాస్ లోకి తెచ్చి తమకు చదివి వినిపించారని శ్రీనివాస శాస్త్రి చెప్పాడు .’’అప్పుడు నేను ఇంకా కుర్రాడినే అయినా నారక్తం మరిగిపోయింది ‘’అని రాశాడు శాస్త్రి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-23-ఉయ్యూరు

