రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -4
మాయవరం లో మూడేళ్ళు హాయిగా ఆడుతూ పాడుతూ టీచర్ గా ఉద్యోగించి శ్రీనివాస శాస్త్రి 1891లో మద్రాస్ సైదాపేట టీచర్స్ ట్రెయినింగ్ కాలేజిలో చేరాడు .ప్రశాంతంగా ఉన్న మాయవరం వదిలి కాంక్రీట్ జంగిల్ మద్రాస్ వెళ్లటం తలి దండ్రులకు ,హెడ్ మాస్టర్ నారాయణ స్వామి అయ్యర్ కి ఇష్టం లేదు .కానీ విద్యా బోధకుడికి శిక్షణ అవసరమని తాను విద్యా వేత్తగా రాణించాలని అనుకొన్నాడు శాస్త్రి .ఒక ఏడాది హాయిగా సైదాపేట లో గడిపాడు .అక్కడ అందరూ ఆయనను ‘’సీనియర్ మోస్ట్ ప్యూపిల్ టీచర్’’ గా గౌరవించారు .క్లాస్ లో కంటే వేదికలమీద ఆట స్థలం లో తన ప్రతిభ చాటుకున్నాడు .అప్పుడప్పుడు మాత్రం క్లాస్ లో ఉన్న స్పృహ ఉండేది .ఒక రోజు కాలేజి ప్రిన్సిపాల్ మిస్టర్ ఎ .ఎ. హాల్ విద్యార్ధులకు వక్తృత్వం ,ఖచ్చితమైన ఉచ్చారణ బోధిస్తూ మూడు ఇంగ్లీష్ పదాలను తప్పు ఆక్సేంట్ తో మాట్లాడాడు .అప్పటికే ఆక్సేంట్ పై మాస్టరి సాధించిన శాస్త్రి ఆమూడు పదాల ఉచ్చారణ తప్పుగా ప్రిన్సిపాల్ పలికాడని తెలియ జేశాడు.ఆమూడుమాటలు –magnificient ,formidable ,execrable .ప్రిన్సిపాల్ తాను కరెక్ట్ గానే పలికానన్నాడు .వెంటనే డిక్షనరి తెప్పించి శాస్త్రి వాటిని పలికే విధానం వివరించగా తప్పు ఒప్పుకొన్నాడు ప్రిన్సిపాల్..శాస్త్రిపై ఎలాంటి అసూయ పడక నిజాయితీగా వ్యవహరించాడు ప్రిన్సిపాల్ హాల్.శ్రీనివాసన్ తో చాలా చనువుగా వ్యవహరించాడు .
1892లో శాస్త్రి మళ్ళీ మాయవరం వచ్చి మునిసిపల్ హైస్కూల్ లో టీచర్ గా చేరాడు .మళ్ళీ తలిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా 1893లో సేలం మునిసిపల్ కాలేజి లో ఫస్ట్ అసిస్టెంట్ గా చేరాడు .ఇరుకు ప్రపంచం నుంచి విస్తృత లోకం లోకి కాలు పెట్టిన అనుభూతి పొందాడు ఈ విషయాన్ని స్నేహితుడు డి.వి .గుండప్ప కు రాస్తూ –‘’మాయవరం లో ఉన్న ఏడేళ్ళు నువ్వు చెప్పినట్లు డిప్రెషన్ లో ఉన్నానని పించింది .అక్కడి వాతావరణం నన్ను కిందికి లాగేదిగానే ఉందికాని ఎదగటానికి తోడ్పడ లేదు .మంచి సదవకాశాలన్నీ జారిపోతున్నాయని వ్యధ ఎక్కువైంది .నా బదిలీ నాన్నకు హెడ్ మాస్టర్ కూ ఇష్టం లేదు .ఆ అననుకూల పరిస్థితుల నుంచి బయటపడి సేలం లో చేరినందుకు కాస్త ఊపిరి పీల్చు కొన్నట్లు అనిపించింది ‘’అని రాశాడు .సేలం కాలేజిలో రెండేళ్లు ఇంగ్లీష్ టీచింగ్ తో అందరినీ మెప్పించాడు .తనకు సాటి ఎవరూ లేరని పించుకొన్నాడు .
సేలం లో గొప్ప దేశ భక్తుడైన సి విజయరాఘవా చారియార్ ప్రభావం లో పడ్డాడు .ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలలో ఇండియాలో ,ఇతర చోట్ల ఒకే సారి పరీక్షలు జరగాలి అన్న అభిప్రాయంతో భేదాలున్నాయి వీరిద్దరికి .అప్పుడు ఐ సి ఎస్ పరీక్షలకు ఇంగ్లాండ్ లో మాత్రమె పరీక్షలు జరిగేవి .సర్ ఫిరోజ్ షా మెహతా వంటి వారు ఇండియాలోకూడా అదే సమయం లో పరీక్షలు జరగాలని కోరారు .కానీ ఒకవేళ ఇండియా పరీక్షలలో పాసైనా ,ఇంగ్లాండ్ లో ఒక ఏడాది ట్రేయింగ్ పొంది అప్పుడు ఇండియాలో ఉద్యోగం చేయాలి అన్నారు .విజయరాఘవాచారి దీన్ని వ్యతిరేకించాడు .శాస్త్రిమాత్రం ఫిరోజ్ షా ను సమర్ధించాడు .దీనిపై మీటింగ్ లో కూడా తన అభిప్రాయం వ్యక్త పరచాడు . శాస్త్రి నే అందరూ సపోర్ట్ చేయటంతో రాఘవాచారి అతడి తెలివి తేటలకు సామర్ధ్యానికి చాక చక్యానికి అబ్బుర పడ్డాడు .శాస్త్రిపై మక్కువ ఏర్పడి అతడినితీర్చి దిద్దే పనిలో పడ్డాడు .సేలం మునిసిపాలిటిలో నాన్ అఫీషియల్ చైర్మన్ ను తొలగించి అధికార వ్యక్తిని నియమించటం పై రాఘవాచారి వ్యతిరేకించి ,పెద్ద నిరసన సభ నిర్వహించాడు .శ్రీనివాస శాస్త్రిని వార్తాపత్రికలలో ఆర్టికల్స్ రాయటానికి ,హిందూ పేపర్ లో ఎడిటోరియల్స్ రాయటానికి సహాయం కోరి పని చేయిన్చుకొన్నాడు .రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేని శాస్త్రి తన సీనియర్ ఆచారి మాటలను గౌరవించేవాడు .ఆయన వద్దే రాచకీయాలలో ఎబిసిడి లు నేర్చాడు .
1885లో శాస్త్రి సేలం వదిలి మద్రాస్ పచ్చయప్ప కాలేజి హైస్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా చేరాడు .1886లో భార్య పార్వతి మరణించింది .అప్పటికి వారికొడుకు శంకరన్ చాలా పసివాడు .దీనిపై ‘’పార్వతి ఫోటో ను కూడా తీయించి దాచుకోలేని దౌర్భాగ్యుడిని ‘’అని రాసుకొన్నాడు .1897లో లక్ష్మి ని ద్వితీయం చేసుకొన్నాడు .క్రమంగా దుఖం మింగుకొంటూ బాధ్యతగల భర్తగా నిలదొక్కుకున్నాడు .1899లో శాస్త్రి ట్రిప్లికేన్ హై స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యాడు .విద్యావేత్త గా గొప్ప పేరు సంపాదించాడు .క్రమ శిక్షణకు మారుపేరుగా ఆ విద్యాలయాన్ని తీర్చి దిద్దాడు .స్కూల్ గౌరవం పెంచాడు క్లాస్ లో కఠినంగా ఉన్నా క్లాస్ బయట విద్యార్ధులతో చనువుగా ఉండేవాడు .విహార యాత్రలకు ఫీల్డ్ ట్రిప్స్ కు వారితో వెళ్ళేవాడు .వారితోకలిసి ఈతకోట్టేవాడు ఆటలు ఆడేవాడు .ఇక్కడి విద్యాబోధన మహత్తరంగా పరమ సంతోషంగా ఉండేది ఆయనకు .దాదాపు విద్యార్ధుల వయసు వాడే అవటంతో వారితో చాలా ఫ్రెండ్లీ గా ఉండేవాడు వారి తప్పులు సరిచేసేవాడు .బాగా చదివినవారికి ప్రోత్సాహక బహుమతులిచ్చేవాడు .కానీ ఈ విద్యా బోధనా సంతోషం చాలదని పి౦చాయి .తన వ్యక్తిత్వం ద్వారా వాళ్ళను మరింత ప్రభావితులను చేయాలని పించేది .అప్పుడే ఆయనకు వి. కృష్ణస్వామి అయ్యర్,జి ఎ నటేశన్ ,ప్రొఫెసర్ కే బి రామ నాధన్ వంటి ఉత్తములతో గొప్ప పరిచయాలేర్పడ్డాయి .బహిరంగ చర్చలలో పాల్గొనే వాడు .1943లో శాస్త్రి ట్రిప్లికేన్ లిటరరీ సొసైటీ లో పాల్గొన్న ఒక చర్చ ను చూసి సర్ ఎన్ .గోపాలస్వామి అయ్యంగార్ ‘’శాస్రి భావనలు నిత్యనూతనాలు అతడి విజ్ఞానం అనంతం అతడి వాడనాపటిమ అసాధారణం ‘’phrasing and enunciation which later made him one of the worlds’ great orators in the English language ‘’అని పరవశంతో దాదాపు నలభై ఏళ్ళ క్రితం జరిగిన దాన్ని గుర్తుంచుకొని శ్లాఘించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-6-23-ఉయ్యూరు

