రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -6
తన గురువు గోఖలే లాగా శ్రీనివాస శాస్త్రి ఉపాధ్యాయ పదవికి గుడ్బై చెప్పి ,ప్రజాజీవిత రంగం లో చేరిపోయాడు .పూనాలోని ఫెర్గూసన్ కాలేజి ని వదిలి ‘’సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ‘’స్థాపించటానికి గోఖలే ఎలాంటి బాధను అనుభవించాడో ,అలాంటి బాధ శాస్త్రి మద్రాస్ లోని ట్రిప్లికేన్ హైస్కూల్ ను విద్యార్ధులను సహోద్యోగులను వదిలి పెట్టినప్పుడు అనుభవించాడు .ఉపాధ్యాయ వృత్తి పరమ పవిత్రం ,మహా ఇష్టం అయినా విద్యాబోధనపై ఎంతో మక్కువ ఉన్నా ,విద్యార్ధులను తీర్చిదిద్దటం లో ఎంతో ఆపేక్ష ఉన్నా ,చివరికి దేశ సేవలో అంతకంటే సంతృప్తి ఉందని భావించి చేరాడు .తనకు మార్గ దర్శకుడు భగవంతుడే అని నమ్మాడు .వీడ్కోలు సభలో ‘’నా అంతరాత్మ చెప్పినట్లు నడుస్తున్నాను .రామాయణం లో వాల్మీకి రాముని తల్లి కౌసల్య చే చెప్పించిన ఉపదేశం -‘’యాం పాలయాసి ధర్మం త్వం ద్రిష్ట్యా చ నియమేన ఛా –సా వై రాఘవా శార్దూల ధర్మ సత్వం అభి రక్షస్తు ‘’అంటే ధర్మం నిన్ను అపాయం నుంచి కాపాడుతుంది .ఆధార్మాన్నే నువ్వు దృఢం గా ,అనుమానం లేకుండా అనుసరిస్తే మేలు కలుగుతుంది .’’అని చెప్పాడు .పై శ్లోకం అతడిని చాలాసార్లు చాల సందర్భాలలో మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేయిన్చిందని స్వయంగా రాసుకొన్నాడు .నమ్మిన దాన్ని ఆత్మ సాక్షిగా అనుసరించాలని సారాంశం .
గోఖలే గారి ఆదేశం తో శాస్త్రి 1906 డిసెంబర్ లో దాదాభాయ్ నౌరోజీ మూడవ సారి అధ్యక్షత వహించిన కలకత్తా కాంగ్రెస్ సభకు హాజరయ్యాడు. .గోఖలే మహాశయుడు శాస్స్త్రిని అతని బృందాన్ని నౌరోజికి సొసైటీ సభ్యులకు పరిచయం చేశాడు .ఇది సభ పూర్తి అవగానే జరిగినా 1907 జనవరి 15కు కానీ శాస్త్రి ని సభ్యుడిగా తీసుకోలేదు .ఈ విషయం గుర్తు చేసుకొంటూ శాస్స్త్రి ‘’బాలీ గంజ్ లో రోలాండ్ రోడ్ లో ఉన్న ఒక ఇంటి పై భాగం లో ఉదయం పూట జరిగింది .స్నానం చేసి నిరాహారంగా కార్యక్రమం అంతా అయ్యేదాకా ఉండమన్నారు .అంతకు ముందు రాత్రి విజిల్ శబ్దం కాని ,ప్రార్ధనలు కానీ నాకేమీ విని పించలేదు .గోఖలే గారి ప్రవర్తన పరమ ప్రశాంతంగా మనోహరంగా ,సంభ్రమం గా అనిపించి గౌరవం మరింత పెరిగింది .ఆయనతో పాటు ప్రతిజ్ఞా వాక్యాలను పలికాను .అవి నేను సంతృప్తిగా అనుసరించ గలనా అనే భయం కలిగింది .’’అని రాసుకొన్నాడు .
సొసైటీ సభ్యునిగా చేరిన తర్వాత మర్నాడు ఉదయమే శాస్త్రి విభజన విషాదం పొందిన తూర్పు బెంగాల్ ను ,జరిగిన నష్టాలను ప్రజల కడ గండ్లను తిరిగి చూసి తెలుసుకొన్నాడు .అస్సాం మణిపూర్ లు కూడా అక్కడి నాయకులలాగానే ఆకర్షణీయం అని పించాయి .’’బారిసాల్ రాజు ‘’అని గౌరవంగా పిలువబడే అశ్విని కుమార్ దత్తా ను ఆయన వ్యక్తిత్వాన్ని చూసి మురిసిపోయాడు .గోఖలే గారి శిష్యరికం లో అయిదేళ్ళు శ్రీని వాస శాస్త్రి ప్రజోపయోగమైన విధులను నిర్వహించగా ఆయన శాస్త్రిని అత్యంత అనుభవం ఉన్న వ్యక్తిగా భావించి మరింత దగ్గరకు చేర్చుకొన్నాడు .సొసైటీ సభ్యులకు ఉపన్యాసాలు ,రాతపని కోర్ట్ వ్యవహారాలూ క్షణం తీరిక లేకుండా అయిదేళ్ళు నిర్వహించాడు .1907లో సూరత్ కాంగ్రెస్ సభకు వెళ్లి ,మితవాదులకు అతివాదులకు మధ్య జరిగిన ‘’సూరత్ స్ప్లిట్ ‘’కు ప్రత్యక్ష సాక్షి గా ఉన్నాడు .తిలక్ పాల్, అరబిందో అతివాదులకు ,మెహతా ,రాస బిహారీ ఘోష్ గోఖలే మితవాదులకు నాయకత్వం వహించారు .మహారాష్ట్ర లో తయారైన లోహపు చెప్పును ఫిరోజ్ షా మేహతాపై ఎవరో విసిరారు .అది బెనర్జీని తాకి మేహతాగడ్డానికి బలంగా దెబ్బ కొట్టింది .గందరగోళం చెలరేగి అసలేం జరుగుతోందో తెలియని భయానక పరిశ్థితి ఏర్పడగా సభను వాయిదా వేశారు .శాస్త్రి గబగబా వేదిక ఎక్కి అక్కడి పెద్దలకు హాని కలగకుండా కాపాడాడు .కుర్చీలు ఒకరిపై ఒకరు విసిరేసుకొంటున్నారు .ఒక యువకుడు ఒక కుర్చీని శాస్త్రిపై విసిరాడు .కొద్దిలో తప్పింది .తేరిపార చూడగా వారిలో తన హిందూ హైస్కూల్ విద్యార్ధులు కనిపించగా ఆశ్చర్య పోయాడు .అందులో కొందరు శాస్త్రి దగ్గరకు వచ్చి హింసాకాండ జరిగినందుకు క్షమించమని కోరుతూ తమిళం లో ‘’సార్ మీరా ?మా హెడ్ మాష్టారా ??’’అన్నారు .వేదికపైన ఉన్న బాలగంగాధర తిలక్ ను రక్షించటానికి గోపాల కృష్ణ గోఖలే రెండు చేతులు చాచి రక్షక కవచంగా అడ్డు పెట్టటం కిందికి జాగ్రత్తగా తీసుకు రావటం శాస్త్రి ప్రత్యక్షం గా చూశాడు .రాజకీయంగా తనకు వ్యతిరేకి అయిన తిలక్ మహాశయుని ప్రేమ ,ఆదరణ ,వ్యక్తిత్వాలను గురించి గోఖలే ఎప్పుడూ పొగుడుతూనే ఉండేవాడని శాస్త్రి చెప్పాడు .శాస్త్రి బొంబాయిలో చివరి మూడు రోజులు ఉండి తిలక్ గారి కేసు విచారణ ప్రత్యక్ష౦గా చూశాడు .జస్టిస్ డవార్ శిక్ష ను ప్రకటిస్తూ పడుతున్న మానసిక క్షోభను ,ఆవేదనను కూడా ప్రత్యక్షంగా చూశాడు .తీర్పును జస్టిస్ అతి ప్రశాంతంగా నెమ్మదిగాక్షోభిస్తున్న హృదయం తో చదివాడు అప్పుడు కోర్ట్ అంతా స్మశాన నిశ్శబ్దం ఆవరించు కొన్నది .ఆసంఘటనపై శాస్త్రి ఒక ఉత్తరం లో –‘’ఆ దెబ్బకు పూనా ఆయనకు వంగి సలాం చేసింది .ఆబాద ప్రతిఇంటి వారి బాధ అయింది .తిలక్ వంటి మహోన్నత నాయకులు మళ్ళీ మాకు కనిపిస్తారా అని పించింది ‘’అని రాశాడు .శాస్త్రి గుండె నిండా అతివాద భావనలున్నా ,గోఖలే దాన్ని మెత్తని మాటలతో తగ్గించేవాడు .1907లో మరో ఉత్తరంలో శాస్త్రి –‘’రాబోయే తరాలు మరింత వ్యక్తిత్వం ,పౌరుషం ,పట్టుదల తీవ్రవాదుల యెడ చూపిస్తారేమో .చరిత్ర నిష్పక్ష పాత౦గా జరిగిన సంఘటనలు రికార్డ్ చేయాలి .వాళ్ళ అజాగ్రత ,సాహసం ధైర్య శౌర్యాలు మన దేశ విముక్తికి కారణాలు అవవచ్చు .’’extremist is a moderate in a hurry ‘’అన్నాడు శాస్త్రి .శాస్త్రికూడా ఎక్స్ట్రీమిస్ట్ యే కాని అగ్నిని మూటకట్టుకొన్న వాడు .ఆ రోజులలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సోసైటీ పైనా,సభ్యుఅలపైనా పోలీసు నిఘా ఉండేది .శాస్త్రిని సి. ఐ. డి .చాలా జాగ్రత్తగా గమనించేవాడు .
సాశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-6-23-ఉయ్యూరు

