రైటానరబుల్ ‘’శ్రీని వాస శాస్త్రి -8
తనకు భార్యకు ట్రిప్లికేన్ గరల్స్ హై స్కూల్ లో మీడియం విషయంలో వచ్చిన భేదాభిప్రాయాన్ని వివరిస్తూ శాస్త్రి –‘’ట్రిప్లికేన్ గరల్స్ హై స్కూలో ఆడపిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదవక్కరలేదన్నారటమీరు /వాళ్లకు ఆహక్కు లేదా విడ్డూరం కాకపొతే ?’’అని ప్రశ్నించిందని రాసుకోన్నాడు .కౌన్సిల్ కూడా మాట్లాడుతూ శాస్త్రి ‘’ఏదో ఒకరోజు మన దేశ ప్రజలు ఇంగ్లీష్ వద్దు అంటారు చూడండి ‘’అని మాట్లాడితే
హౌస్ రిజెక్ట్ చేసింది .క్రమంగా తన భావాలను మార్చుకొని ఇంగ్లీష్ మన స్కూళ్ళు ,కాలేజీలలో ముఖ్య పాత్ర వహిస్తుంది .ఇంగ్లీష్ సాహిత్యాన్ని ఉత్తమ భావాలను రానీకుండా తలుపులు మూసిన రోజు దేశానికి దుర్దినం ‘’అన్నాడు .ఉపాధ్యాయులహక్కులకోసం జీతాలపెంపు కోసం నిరంతరం పోరాటం చేసేవాడు .జీతాలు బాగా ఉంటేనే ప్రతిభగల టీచర్లు వచ్చి విద్యాబోధన మెరుగు పరుస్తారు అనే వాడు .సహకార ఉద్యమ వ్యాప్తికి ,మునిసిపాలిటీలు గ్రామ పంచాయితీలు సమర్ధంగా పని చేయటానికి కృషి చేశాడు .పరిపాలనలో అన్ని దశలలో అనధికార వ్యక్తుల ప్రభావం ఉండరాదు అనే వాడు .కౌన్సిల్ లో చాలా బాగానే చర్చలు జరిగి తనకు సంతృప్తినిచ్చిందని చెప్పాడు .మద్రాస్ ఆడ్వో కేట్ జనరల్ హెచ్ .ఎం .కార్బెట్’’’లెజిస్లేటర్ గా శాస్త్రిని అందరూ అభినందించే వారు .ఆయన సభకు గొప్ప గౌరవం తెచ్చారు .ఆయన లేచి నిలబడి మాట్లాడుతుంటే ఆ వాగ్ధాటికి ఆలోచనా స్రవంతికి అభ్యుదయ భావాలకు ముచ్చట పడే వాళ్ళం సభా గౌరవాన్ని పెంచింది శ్రీనివాస శాస్త్రియే .ఒకవేళ ఓడిపోయినా ఆయన పెదవులపై చిరునవ్వు చెరగక పోవటం మహా విశేషం .ఆయన్ను చూస్తె’’ ఆబాల్య లెజిస్లేటర్ ‘’అంటే పుట్టుకతోనే లెజిస్లేటర్ అయ్యారేమో అనిపించింది ‘’అని రాశాడు.
1915 ఫిబ్రవరి 19 న గోఖలే నిర్యాణం తర్వాత దేశమంతా దుఖాక్రాన్తమై తండ్రిని కోల్పోయినట్లు రోదించింది .సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సోసైటీ దిక్కు లేనిదైపోయింది .గోఖలే చివరి రోజుల్లో ఆయన ముఖ్య అనుచరుడు దావే ‘’మీతర్వాత ఎవరిని సొసైటీకి అధికారిగా నియమిస్తారు ?’’అని అడిగితె ,ఎవరిపేరూ చెప్పటానికి తిరస్కరించారు .సోసైటీ మెంబర్స్ అందరూ సమావేశమై శ్రీనివాస శాస్త్రి ని ఏకగ్రీవగా ప్రేసిడెంట్ గా ఎన్నుకొన్నారు .అక్కడి వారందరికి ఏమని అనిపించింది అంటే గోఖలే గారే శాస్త్రిని నామినేట్ చేశారని .సి ఎఫ్ ఆండ్రూస్ ఎప్పుడూ శాస్త్రిని ‘’Gokhale ‘s own chosen successor ‘’అని పిలిచేవాడు ..
శాస్త్రి సొసైటి ప్రెసిడెంట్ అయ్యాక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది .గోఖలే అంటే గాంధీకి చాలాగౌరవం కొన్ని విషయాలలో భేదిన్చినా .గాంధీని ఒక ఏడాది ఇండియా అంతా తిరిగి చూసి ప్రజల స్థితి గతులు మనోభావాలు తెలుసుకొని రమ్మని సలహ ఇచ్చాడు గోఖలే .అప్పుడే రాజకీయంలో అడుగు పెట్టమన్నాడు .దురదృష్టవశాత్తు గోఖలే ఆ వెంటనే చనిపోయాడు .గాంధీ సొసైటీ మెంబర్స్ తో కలిసి మాట్లాడే వాడు .ఇరువైపులా బాగా తీవ్రంగా లోతుగా చర్చలు జరిగేవి .ఆ సంఘటన ను గుర్తు చేసుకొంటూ శాస్త్రి ‘’గాంధీ వచ్చి ఎక్కడ కూర్చునే వారో నాకు ఇంకా బాగా జ్ఞాపకం ఉంది.మాతోకలవకుండా ఒంటరిగా ఉండేవారు .వెటకారంగా ,మాజీవితాలను నిందిస్తూ ,సొసైటీకి ఏమాత్రం త్యాగం చేయని వారిమిగా సూటిగా స్పష్టంగా నిర్దుష్టంగా సామాన్య భాషలో –‘’ఇండియాకు సేవకులుగా మీరు గర్విస్తున్నారు .దరిద్రంతో బాధపడుతున్న అక్షర జ్ఞానం లేని హరిజనులను కూలీలను మీరు లెక్క చేయటం లేదు .అలాంటి జీవితమే ఇక్కడ మీరు గడుపుతున్నారా ?వారుతినేది తింటున్నారా ,వాళ్ళ బాధలు అనుభవిస్తున్నారా వారికి తోడూ నీడగా నిలబడుతున్నారా ?మీ వలన ఎవరికీ లాభం ?.వాళ్ళ వ్యధలు బాధలు పేరుకొని పోతుంటే ప్రేక్షకుల లాగా ఉంటారా ?వారి నిరాశా నిస్పృహలను అర్ధం చేసుకొని అండగా నిలబడ లేరా?’’అని సూటిగా ఉద్బోధించారు .యువతకు ప్రతినిధిగా శాస్త్రి లేచి నిలబడి ‘’మాపై కోపం వద్దు కనికారం చూపండి .మీరు మూడో తరగతిలో రైలు ప్రయాణం మొదలు పెట్టి రెండు మూడేళ్ళు మాత్రమె అయిందేమో ?మేము ఇంకా నేర్చుకొంటాం .మమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకోకండి ప్లీజ్ ‘’అన్నాడు .గాంధీ తాను అతిగా ప్రవర్తిచానేమో అనుకొన్నారు .ఆయన వెంటనే ‘’నా మాటలు పరుషంగా మీ మనసులను గాయపరచి ఉండచ్చు క్షమించండి ‘’అన్నారు.గోఖలేకు గాన్దీపైఉన్న గౌరవం స్వయంగా దగ్గరుండి తెలుసుకొన్న శాస్త్రి గాంధీని సొసైటీలో సభ్యునిగా చేర్చు కోవాలని భావించి ,ఆ తర్వాతే ఎలాంటి ఇబ్బందులు వచ్చి మీద పడినా తట్టుకోవాలను కొన్నాడు .గాంధీజీ ఒక ఏడాది దేశ పర్యటన పూర్తీ కావచ్చింది .ఇక ఇప్పుడు ఆయనను సభ్యుడిగా తీసుకోవాలి .ఆవిషయం పైశాస్త్రి ‘’మాసభ్యులందరం చాలాఆత్రుతతో చర్చిస్తున్నాం .ఆయనకు మాకు అభిప్రాయాలలో తీవ్ర భేదాలున్నాయి కానీ వాటిని వివరించి చెప్పలేక పోతున్నాం .కానీ ఆయన రాజకీయ పరిణామ౦ మా మధ్య ఇంకా అగాధాన్ని పెంచుతుంది .చివరికి బాధా తప్త హృదయాలతో ఆయనతో’’ మీ దారి మీది .మా దారి మాది. ఎవరి దారిలో వాళ్ళం నడుద్దాం ‘’అని చెప్పలేక చెప్పాల్సి వచ్చింది .ఈ అభిప్రాయాన్ని గాంధీ చాలా స్పోర్టివ్ గా తీసుకొని శాస్స్త్రికి ఒక ఉత్తరం రాస్తూ –‘’మీ సభ్యులు నన్ను మెంబర్ గా తీసుకోవటానికి ఇష్టపడక పోవటం లో తప్పేమీ లేదు .మీరూ నేనూ కలిసి పని చేయటంలో ఇబ్బందులు రావచ్చు .నా అభిప్రాయాలకు మీ సొసైటీ అభిప్రాయాలకు హస్తి మశకాంతరం తేడా ఉంది.మహాత్మా గోఖలే మార్గాన్ని మీరో విధంగా, నేనొక విధంగా అనుసరిస్తున్నాం .పరిస్తితులను అర్ధం చేసుకొన్న గాంధీ తన అప్లికేషన్ ను వాపస్ తీసుకొని హుందాగా ప్రవర్తించారు .గాంధీజీ తన Experiments with truth లో ‘’The withdrawal of my application made me truly a member of the Society ‘’అని రాశారు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-6-23-ఉయ్యూరు

